Anjali Sood: అత్తెసరు మార్కులు వచ్చే అమ్మాయి నుంచి సీఈఓగా.. లాభాల బాటలో..

USA: Anjali Sood Inspirational Journey Loss Making Company To Profits - Sakshi

అంజలి చెప్పిన సమాధానం

పరీక్షల్లో అత్తెసరు మార్కులు వచ్చే అమ్మాయి... మాస్టర్‌ ప్రశ్న అడిగితే బిత్తరచూపులు చూసే అమ్మాయి... క్లాసురూమ్‌లో కూర్చొని పాఠం వినడాన్ని భారంగా భావించే అమ్మాయి ‘భవిష్యత్‌ ఎలా ఉండబోతుంది?’ అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం ఎవరికైనా కష్టం కాకపోవచ్చు. మరి అదే అమ్మాయి చదువుపై శ్రద్ధ చూపితే...సమాధానం చెప్పడం అంజలి సూద్‌కు మాత్రమే సాధ్యమవుతుంది. 

అంజలి సూద్‌ అమెరికాలోని ఫ్లింట్‌ నగరం(మిచిగాన్‌)లో పుట్టింది. తల్లిదండ్రులు పంజాబ్‌ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. చిన్నప్పుడు పరీక్షలలో అంజలి చాలా పొదుపుగా తెచ్చుకునే మార్కులను చూసి‘ఈ అమ్మాయి హైస్కూల్‌ దాటి కాలేజీ గడప తొక్కడం కష్టమే’ అనుకునేవారు పెద్దలు.

క్లాస్‌రూమ్‌లో టీచర్‌ ఎప్పుడైనా పాఠానికి సంబంధించిన ప్రశ్న ఏదైనా వేస్తే ఆమె జవాబు చెప్పిన సందర్భం అంటూ లేదు.
అలాంటి అమ్మాయి కాస్తా కాలక్రమంలో మారింది,

చదువు మీద శ్రద్ధ పెట్టింది. మార్కులు పెంచుకుంటూ పోయింది.
‘బాగా చదువుతున్నావు’ అనే ప్రశంస ఆమెకు మరింత బలాన్ని ఇచ్చి ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా చేసింది.
‘వార్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ ది యూనివర్శిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా’లో ఫైనాన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ చదువుకున్న అంజలి హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో ఎంబీఏ చేసింది.

చదువు పూర్తయిన తరువాత ఫైనాన్స్, మీడియా, ఇ–కామర్స్‌కు సంబంధించిన సంస్థల్లో పనిచేసింది. అంజలి ప్రతిభ గురించి ఆ నోటా ఈ నోటా విన్న ఆన్‌లైన్‌ వీడియో మార్కెటింగ్‌ సంస్థ ‘విమియో’ తమ సంస్థలోకి ఆహ్వానించింది. ‘హెడ్‌ ఆఫ్‌ గ్లోబల్‌ మార్కెటింగ్‌’ ‘జనరల్‌ మేనేజర్‌’ (కోర్‌ క్రియేటర్‌ బిజినెస్‌) హోదాల్లో పనిచేసింది. విమియో బిజినెస్‌ (మార్కెటింగ్, బ్రాండ్స్‌కు మెంబర్‌షిప్‌ ప్లాన్‌)లాంటి ఎన్నో కార్యక్రమాలను లాంచ్‌ చేసి సక్సెస్‌ అయింది.

అంజలి సృజనాత్మక ఆలోచనలు, వ్యాపార ఎత్తుగడలు నచ్చి సంస్థ ఆమెను ‘సీయీవో’ స్థానంలో కూర్చోబెట్టింది. సీఈవోగా కొత్త స్ట్రాటజీతో ముందుకు దూసుకు వెళ్లింది. వీడియో క్రియేటర్స్‌ కోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను, టూల్స్‌ను ప్రవేశ పెట్టింది.

‘మనం చేస్తున్న బిజినెస్‌ మాత్రమే’ అన్నట్లుగా కాకుండా చుట్టుపక్కల ఏం జరుగుతోందో గమనించడం అంజలి అలవాటు.
వీడియో ఎడిటింగ్‌ అండ్‌ వీడియో మార్కెటింగ్‌ సంస్థ ‘మాజిస్టో’ను కొనుగోలు చేయడం ‘విమియో’కు కలిసొచ్చింది. 34 ఏళ్ల వయసులోనే సీయీవోగా బాధ్యతలు చేపట్టి ‘విమియో’ను వరల్డ్స్‌ లార్జెస్ట్‌ ఆన్‌లైన్‌ యాడ్‌–ఫ్రీ వీడియో ప్లాట్‌ఫామ్‌గా ఉన్నతస్థానంలో నిలిపింది అంజలి.

‘నేను ఈ స్థాయికి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. చేసిన పనికి గుర్తింపు లభిస్తే చాలు అనుకునేదాన్ని. ఆ గుర్తింపే నన్ను ఇక్కడ వరకు తీసుకువచ్చింది. ఒక పెద్ద బాధ్యత మనల్ని వెదుక్కుంటూ వచ్చినప్పుడు నేను చేయగలనా? అని భయపడడం కంటే ఎందుకు చేయలేను అని అనుకోవడంలోనే సక్సెస్‌ మంత్ర దాగి ఉంది’ అంటుంది అంజలి. చిన్న వయసులోనే కెరీర్‌లో ఉన్నత శిఖరాలకు చేరిన అంజలి మహిళలకు స్ఫూర్తిదాయకం.

చదవండి: Meenakshi Gadge: ఇది మీనాక్షి ఊరు.. సినిమాల్లోనే ఇలాంటి పల్లె ఉంటుందా? అదేం కాదు..
వైకల్యాన్ని జయించి, స్పూర్తిగా నిలిచిన గీతా ఎస్‌ రావు
  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top