మామూలుగానైతే భార్య మొబైల్ నంబరును సేవ్ చేసుకోడానికి ‘జానూ’, ‘సోనా’ అనో లేదా ‘బంగారం’ అనో... ఇలా రకరకాల ముద్దు పేర్లు పెట్టుకుంటుంటారు. మరికొందరు శిరీషకు ‘సిరి’ అనీ, దీపికకు ‘దీపూ’ అంటూ షార్ట్‌కట్‌లో షార్ట్ పేర్లూ పెట్టుకోవడం మనకు తెలిసిన విషయమే.
కాపురంలో కొద్దికాలం గడిచాక ఆమెలో నచ్చని అంశాలేవైనా కనిపించినా సదరు ముద్దుపేర్లకు బదులుగా తన కోపాన్నీ, కసినీ సైలెంటుగా వెల్లడించుకునేలా ‘దెయ్యం’ అనో, ‘రాక్షసి’ అంటూ వయొలెంటు పేర్లు పెట్టుకోవాలనుకున్నా అలా చేయకపోవడమే మంచిదంటూ టర్కీలో జరిగిన ఓ ఉదంతం తెలుపుతోంది.
టర్కీలో ఓ ప్రబుద్ధుడికి భార్య మీద కోపం వచ్చింది. ఆమె కాస్తంత లావుగా ఉండటంతో ఆమె పేరును ‘టాంబిక్’ అంటూ సేవ్ చేసుకున్నాడు ఆ మహానుభావుడు. అంతే... ఆ అంశం మీద అతడికి జరిమానా విధిస్తూ... అతడి వల్ల తన భార్యకు కలిగిన మనోవేదనకు గాను పరిహారం, విడాకులూ మంజూరయ్యాయి.
ఇంతకీ ‘టాంబిక్’ అంటే టర్కీలో స్థూలకాయాన్ని (ఛబ్బీ) తెలిపే పదం. ఇది కేవలం స్థూలకాయాన్ని సూచించే పదం మాత్రమే కాదు... ఏ ‘బండ’దనో, ‘మొద్దు’దనో, ‘లడ్డు’దనో... ఇలా కాస్తంత దురర్థమో, నిందార్థమో ఇచ్చేలాంటి వాడుక మాట కావడంతో... అలా సేవ్ చేసుకున్న ఆ భర్తకు కోర్టులో మొట్టికాయలు తప్పలేదు. పైగా ఓ అమ్మాయి స్థూలకాయాన్ని ఎగతాళి చేసేలా ఆమె పేరును అభ్యంతరకరమైన పదాలతో సేవ్ చేసుకున్నందుకు ఆ భర్తకు భారీ జరిమానా విధించింది అక్కడి కోర్టు.
అంతేకాదు.. పరోక్ష దూషణే అయినా... ఫోన్‌లో అలాంటి అభ్యంతరకరమైన మాటతో భార్యపేరు సేవ్ చేసుకున్నందున ఆమెకు కలిగిన మనోవేదనను పరిగణనలోకి తీసుకుని వెంటనే విడాకులు సైతం మంజూరు చేసింది టర్కీ కోర్టు.
(చదవండి: మందు పెట్టడం, కక్కించడం... రెండూ అపోహలే!)


