నాన్న కల నెరవేర్చింది | Trisha Gongadi scores first ever century in U19 Women World Cup history | Sakshi
Sakshi News home page

నాన్న కల నెరవేర్చింది

Jan 29 2025 1:58 AM | Updated on Jan 29 2025 9:58 AM

Trisha Gongadi scores first ever century in U19 Women World Cup history

‘కలలు కనడం కష్టం కాదు. కాణీ ఖర్చు కాదు’ లాంటి వెటకారాల మాట ఎలా ఉన్నా.... ఆ కలలే భవిష్యత్తుని నిర్దేశిస్తాయి.వందమందిలో ఒకరిగా ప్రత్యేకతతో వెలిగిపోయేలా చేస్తాయి. ‘నా కూతురు ఆడితే పరుగులు వెల్లువెత్తాల్సిందే’ ‘మ్యాచ్‌ గెలవడానికి ప్రధాన కారణం... అంటూ నా కూతురు గురించి అందరూ ఘనంగా చెప్పుకోవాలి’... ఇలాంటి కలలు  ఎన్నో కనేవాడు భద్రాచలానికి చెందిన రామిరెడ్డి.

అయితే ఆయన కలలకు మాత్రమే పరిమితం కాలేదు. నిరంతరం తన కలల సాకారానికి ప్రయత్నించాడు. ఆ ఫలితమే స్టార్‌ క్రికెటర్‌... త్రిష గొంగడి(Trisha Gongadi). మలేషియాలో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ విమెన్  అండర్‌ 19, టీ 20 వరల్డ్‌ కప్‌(Women World Cup)లో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.

భద్రాచలం పట్టణానికి చెందిన గొంగడి రామిరెడ్డి క్రికెట్‌లో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశించినా పరిస్థితుల ప్రభావం వల్ల ఆ కల నెరవేరలేదు. దీంతో ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా పనిచేస్తూనే పట్టణంలో జిమ్‌ సెంటర్‌ నిర్వహించేవాడు. ‘మా అమ్మాయిని బాగా చదివించాలి’... అనేది సగటు తండ్రి కోరిక.రామిరెడ్డి మాత్రం అలా కాదు... ‘మా అమ్మాయిని బాగా ఆడించాలి. క్రికెట్‌లో స్టార్‌ని చేయాలి’ అనుకునేవాడు. సినిమాలు, కామేడీ షోలు కాకుండా టీవీలో క్రికెట్‌ మ్యాచ్‌ హైలెట్స్‌ ఎక్కువగా చూపించేవాడు. చిన్నప్పుడే ఇలా చేయడం వల్ల బ్రెయిన్, మజిల్స్‌ ఆటకు తగ్గట్టుగా మౌల్డ్‌ అవుతాయని ఫిటెనెస్‌ ట్రైనర్‌గా ఆయన బలంగా నమ్మాడు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ చిన్నతనం నుంచే త్రిష క్రికెట్‌లో ప్రతిభ కనబరిచేది. 

దీంతో తన కల విషయంలో మరింత పట్దుదల పెరిగింది. కూతురిని ప్రోఫెషనల్‌ క్రికెటర్‌గా చూడాలనే లక్ష్యంతో కుటుంబంతో సహా హైదరాబాద్‌కు మకాం మార్చాడు రామిరెడ్డి. అప్పుడు త్రిష వయసు ఏడేళ్లు. సికింద్రాబాద్‌లోని ‘సెయింట్‌ జాన్ ్స క్రికెట్‌ అకాడమీలో కోచింగ్‌ తీసుకునేది.

ఎంతో ఆశ... చివరికి నిరాశ!
్రపోఫెషనల్‌ ట్రైనింగ్‌లో ఆరితేరిన త్రిష పన్నెండేళ్ల వయస్సులో హైదరాబాద్‌ అండర్‌ 19 జట్టుకు ఎంపికైంది. ఆ తర్వాత అండర్‌ 19 ఇండియా తరఫున సౌత్‌ ఆఫ్రికాలో జరిగిన టోర్నమెంట్‌లో పాల్గొంది. ఆ టోర్నీలో భారత్‌ విశ్వవిజేతగా నిలిచింది. బ్యాటింగ్‌తో పాటు లెగ్‌ స్పిన్నర్‌గా టోర్నీ గెలుపులో త్రిష తనవంతు పాత్ర పోషించింది. అయితే త్రిషకు ఈ టోర్నీలో ప్రత్యేక గుర్తింపు దక్కలేదు. ఆ ఫలితం ఆ తర్వాత జరిగిన ఐపీఎల్‌ వేలంలో స్పష్టంగా కనిపించింది. విమెన్  ఐపీఎల్‌ వేలంలో త్రిషాను తీసుకునేందుకు ఐపీఎల్‌ యాజమాన్యాలు ఆసక్తి చూపించలేదు. దీంతో గత ఐపీఎల్‌ సీజన్ కు ఆమె దూరంగా ఉండాల్సి వచ్చింది. అ గెలుపులో తాను ఒకరిగా ఉండటం కంటే ‘గెలుపుకు మూలం’ అనిపించేలా ప్రదర్శన చేయాలనే పట్టుదల త్రిషలో పెరిగింది.

ఇక చూస్కోండి
విమెన్  ఐపీఎల్‌లో ఎదురైన చేదు అనుభవం ‘పవర్‌ హిట్టింగ్‌’పై పట్టు సాధించేందుకు త్రిషకు తోడ్పడింది. గత డిసెంబరులో జరిగిన అండర్‌ 19, టీ 20 ఏషియా కప్‌ టోర్నమెంట్‌లో వరుసగా 58 నాటౌట్, 32, 52 పరుగులు సాధించింది. ఆ టోర్నీ ఫైనల్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’తో పాటు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’ అవార్డులు సొంతం చేసుకుంది. ప్రస్తుత వరల్డ్‌ కప్‌లో ఐదు మ్యాచ్‌లలో బ్యాటింగ్‌ చేసిన త్రిష 230 పరుగులు సాధించింది. ఇందులో స్కాట్‌లాండ్‌పై చేసిన 110 నాటౌట్‌ సెంచరీ కూడా ఉంది. ఇందులో 13 ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి. ఈ సెంచరీతో అండర్‌ 19 టోర్నీలో తొలి సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. బౌలింగ్‌లోనూ రాణించి మూడు వికెట్లు తీసింది.

అందనంత ఎత్తులో...
టోర్నీలో మిగతా అమ్మాయిలకు అందనంత ఎత్తులో బ్యాటింగ్‌ యావరేజ్‌ 76.77తో త్రిష కొనసాగుతోంది. ఆమె తర్వాత రెండోస్థానంలో ఇంగ్లాండ్‌ ప్లేయర్‌ డావినా పేరిన్  ఉంది. ఈ టోర్నీలో రెండుసార్లు త్రిష 40కి పైగా స్కోర్లు సాధించింది. అయితే అప్పటికే ప్రత్యర్థి జట్లు ముందుగా బ్యాటింగ్‌ చేయడంతో భారీ స్కోరు సాధించే అవకాశం త్రిషకు దక్కలేదు. కానీ స్కాట్‌ల్యాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేయడంతో త్రిష బ్యాట్‌ నుంచి ఫాస్టెస్ట్‌ సెంచరీ (53 బంతుల్లో) జాలువారింది. బ్యాటింగ్‌ యావరేజ్‌తో పాటు మోస్ట్‌ రన్స్, హయ్యెస్ట్‌ స్కోర్‌ విభాగంలోనూ త్రిష టాప్‌లో కొనసాగుతోంది. ఇప్పటికే భారత్‌ మహిళల అండర్‌ 19 జట్టు సెమీస్‌కు చేరుకుంది.ఏజెన్సీప్రాంతం నుంచి మొదలైన త్రిష విజయపరంపర అంతర్జాతీయ స్థాయిలో అప్రతిహతంగా కొనసాగుతోంది. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. – తాండ్ర కృష్ణగోవింద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

విమెన్  వరల్డ్‌ కప్‌లో ఇండియాకు ఆడాలి 
అండర్‌ 19, విమెన్  టీ20లో తొలి సెంచరీ చేయడం ద్వారా వరల్డ్‌ రికార్డు సాధించినందుకు ఆనందంగా ఉంది. విమెన్  అండర్‌ 19 టోర్నీలో మంచి పెర్‌ఫార్మెన్స్ చూపించి ఇండియా మహిళల జట్టుకు ఎంపిక కావాలి. రాబోయే వరల్డ్‌ కప్‌ టీమిండియా స్క్వాడ్‌లో నా పేరు ఉండాలనే లక్ష్యంతోనే ఈ టోర్నీకి వచ్చాను. నా లక్ష్యానికి తగ్గట్టుగా ఆడుతున్నాను. – గొంగడి త్రిష

Advertisement
 
Advertisement
Advertisement