
ఆకుకూరల్లో అతిముఖ్యమైన గోంగూర అనగానే నోట్లో ఊరతాయి. పుల్లపుల్లగా ఉండే ఈ లీఫీ వెజిటబుల్‌తో పచ్చడి, పప్పు లాంటి వంటలతోపాటు, ఇతర కూరగాయలతో కలిపి వండుతారు. పచ్చళ్లు చేస్తారు. అంతేకాదు నాన్ వెజ్‌తో గోంగూర కలిసిందంటే దాని రుచేవేరు. గోంగూర మటన్, గోంగూర చికెన్, గోంగూర రొయ్యలు, గోంగూర బోటీఇలా చాలా వెరైటీలే ఉన్నాయి. ప్రధానంగా గోంగూర ఆకులే ఎక్కువ వాడతారు. కానీ గోంగూర పువ్వులతో కూడా అనేక రకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు తెలుసా? రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలుకూడా ఉన్నాయి. ఇవాల్టీ టిప్ ఆఫ్ ది డేలో భాగంగా గోంగూర పువ్వు / రోసెల్లా పువ్వు రెసిపీల గురించి తెలుసుకుందాం.
రోసెల్లా (Roselle) పువ్వులలో విటమిన్ సి, విటమిన్ డి, బి1 , బి2 ఉన్నాయి. ఇందులో మెగ్నీషియం, ఒమేగా 3, విటమిన్ ఎ, ఐరన్, పొటాషియం, బీటా కెరోటిన్ , ముఖ్యమైన ఆమ్లాలు కూడా ఉన్నాయి.
ఆరోగ్య ప్రయోజనాలు : శరీరంలోని రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు, యూరిక్ యాసిడ్ , కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని ప్రతీతి. దగ్గు, గొంతు నొప్పి , క్యాన్సర్ పుండ్లకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. మైగ్రేన్ నుంచి ఉపశమనం చేస్తుంది. నికోటిన్ ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇంకా విష ప్రభావాన్ని తగ్గిస్తుంది.
గోంగూర పూల పచ్చడి
తయారీ: గోంగూరు పూల రెక్కలను వలిచి, శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
ప్యాన్ పెట్టుకొని ఆయిల్‌వేసి, కొద్దిగా శనగపప్పు, పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి, చిటికెడు ధనియాలు, నువ్వులు వేసి వేగనివ్వాలి. ఇందులోనే కడిగి పెట్టుకున్న గోంగూర పువ్వుల రెక్కలను కూడా వేసి వేగనివ్వాలి. బాగా వేగాక, పచ్చివెల్లుల్లి పాయలు,కొద్దిగా జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు సరిచూసుకొని, ఎండిమిర్చి, ఆవాలు, తదితర పోపు దినుసులతో పోపుపెట్టుకోవాలి. కొత్తమీరతో జల్లుకుంటే పుల్ల పుల్లని గోంగూర పువ్వుల పచ్చడి రెడీ. దీన్ని అన్నం, ఇడ్లీ, దోసతో పాటుగా తినవచ్చు.
గోంగూర పువ్వు పింక్ టీ తయారీ
రెండు గోంగూర పూల రెక్కలను నీటి లో మరిగించి, కొద్దిగా తేనె కలుపుకుంటే రోసెల్లా టీ. ఇది మంచి పోషక విలువలు కలిగి ఉంటుంది. టీని మితంగా తాగితే శరీర బరువు అదుపులో ఉంటుంది.
గోంగూర పూలను కషాయంగా చేసుకుని తాగుతారు. దీని వల్ల నిద్రలేమి తొలగిపోతుంది. వీటితోపాటు గోంగూర పూలతో జామ్, జ్యూస్ తయారు చేయవచ్చు. పచ్చళ్ళు, సాస్‌లు, ఇతర డెజర్ట్‌లు కూడా తయారు చేసుకోవచ్చు.