బాబు పరీక్షలు మాకు పరీక్ష పెడుతున్నాయి | Support Your Child With Exam Preparation And Help These Tips | Sakshi
Sakshi News home page

బాబు పరీక్షలు మాకు పరీక్ష పెడుతున్నాయి

Jan 30 2025 10:38 AM | Updated on Jan 30 2025 11:23 AM

Support Your Child With Exam Preparation And Help These Tips

మా అబ్బాయి ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో ఉన్నాడు. స్వతహాగా మంచి తెలివైనవాడే. కానీ ఇటీవల పరీక్షలకు సరిగా ప్రిపేర్‌ కావడంలేదు. మొదటినుండి చదవకుండా పరీక్షలకు ముందు, తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నాడు. దాంతో మార్కులు బాగా తగ్గుతున్నాయి. బాబు పరీక్షలు మాకు ఒక గండంలాగా అనిపిస్తున్నాయి. బాబు విషయంలో నాకు, మా ఆయనకు మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య నలిగిపోతున్నాను. ఈ విషయంలో ఏం చేయమంటారో సలహా ఇవ్వండి. 
– రాజ్యలక్ష్మి, హైదరాబాద్‌

బాబు విషయంలో మీరెంత టెన్షన్‌కు గురవుతున్నారో అర్థమవుతోంది. చదువు, పరీక్షల విషయంలో మీ బాబు ఎదుర్కొంటున్న సమస్య చాలా సాధారణమైనదే. ఎంత బ్రిలియంట్‌ స్టూడెంట్స్‌ అయినా, పరీక్షల ముందర కొంత ఒత్తిడిని తప్పకుండా ఎదుర్కొంటారు. 

ఈ ఒత్తిడి వల్ల మంచి తెలివితేటలు గల విద్యార్థులు కూడా పరీక్షలు సరిగా రాయలేక ర్యాంకు తగ్గి΄ోతుంది. ఇలాంటి విషయంలో, మీరు ఓపికతో బాబును దారిలో పెట్టే ప్రయత్నం చేయాలి. దీనికి మీవారి సహకారం కూడా చాలా అవసరం. టైమ్‌ మేనేజ్‌మెంట్, నోట్స్‌ సరిగా రాసుకోవడం, మెమరీ టెక్నిక్స్‌ లాంటివి ఇలాంటి విద్యార్థులకు చాలా అవసరం. 

బాబు చదువుకోవడానికి రోజూవారి ఒక టైమ్‌ టేబిల్‌ తయారు చేసి, చదవవలసిన సబ్జెక్ట్స్‌ను చిన్న చిన్న పోర్షన్స్‌గా విభజించి, వాటిని క్రమంగా పెంచుతూపోవడం లాంటివి బాగా పనిచేస్తాయి. అతని ఏకాగ్రతకు భంగం కలగకుండా ఇంట్లో టి.వి. పెట్టడం, ఫంక్షన్స్‌ పెట్టుకోవడం, ఇతరుల ఇళ్లలో జరిగే ఫంక్షన్స్‌కు వెళ్లడం లాంటివి లేకుండా చేయండి. వీలైతే బాబుకు తోడుగా మీరు కూడా పక్కన ఉండి ధైర్యం చెప్పండి. 

ధ్యానం, జాకబ్‌ సన్స్‌ రిలాక్సేషన్‌ అనే టెక్నిక్, ఈ పరీక్షల భయాన్ని బాగా తగ్గిస్తాయి. ఫలితంపై కాకుండా అతని ప్రయత్నం పైన దృష్టి పెట్టమని చెప్పండి. ఇంకా అవసరమైతే మంచి సైకియాట్రిస్ట్‌ లేదా క్లినికల్‌ సైకాలజిస్ట్‌కు చూపించి, కౌన్సిలింగ్‌ ఇప్పించండి. 

మీ బాబు భవిష్యత్తు కోసం, మీరు మీ వారు చక్కగా చర్చించుకొని, ఒక టీమ్‌ లాగా ముగ్గురూ కలిసి పని చేయండి. ఆశావాదంతో మీరు, మీ అబ్బాయి ముందుకెళితే, బాబు తన పరీక్షల భయాన్ని పూర్తిగా అధిగమించగలడు. ఆల్‌ ది బెస్ట్‌! 
ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ. 
(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన  మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com)

(చదవండి: సింగిల్‌ పేరెంటింగ్‌ సవాలుని సులభంగా అధిగమించండిలా..!)

Advertisement
 
Advertisement
Advertisement