అధర్మం ఎంత బలంగా ఉన్నా.. అంతిమ విజయం ధర్మానిదే అని చాటిచెప్పే రోజే విజయదశమి.
పూజా విధానం... దసరా రోజు ఉదయాన్నే లేచి స్నానం చేయాలి. ఇంటి గుమ్మాలను మామిడి తోరణాలు, బంతిపూల మాలలతో అందంగా అలంకరించాలి. పూజా మందిరంలో దుర్గాదేవి లేదా రాజరాజేశ్వరి దేవి ప్రతిమను ప్రతిష్టించి, దీపాన్ని వెలిగించి అమ్మవారికి ప్రీతికరమైన కదంబ పుష్పాలు, కనకాంబరాలు, మందారాలు లేదా నల్లకలువలతో అష్టోత్తర శతనామ పూజలు చేసి, హారతి ఇచ్చి పులిహోర, గారెలు, పొంగలి, పాయసం నివేదించాలి.
శమీ పూజ...దసరా పండుగలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఘట్టం శమీ పూజ (జమ్మి చెట్టు పూజ). సాయంత్రం వేళ లేదా విజయ ముహూర్త సమయంలో ఊరిలో లేదా గుడిలో ఉండే జమ్మి చెట్టు వద్దకు గ్రామస్తులంతా చేరుకుంటారు.
‘శమీ శమయతే పాపం శమీ శత్రువినాశినీ
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ’ అనే శ్లోకాన్ని పఠిస్తూ చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. కొందరు తమ కోరికలను చీటిలపై రాసి, చెట్టు కొమ్మలకు కడతారు. అలా చేయడం వల్ల ఆ కోర్కెలు శీఘ్రంగా నెరవేరతాయని నమ్మకం. పూజ అనంతరం జమ్మి ఆకులను ‘బంగారం‘ గా భావించి, ఇంట్లోని పెద్దలకు ఇచ్చి వారి కాళ్ళకు నమస్కరించి ఆశీస్సులు తీసుకుంటారు. స్నేహితులకు, బంధువులకు ఆ ఆకులను పంచిపెట్టి ఆలింగనం చేసుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
విజయదశమి రోజున వచ్చే ‘విజయ ముహూర్తానికి’ ఎటువంటి తిథి, వార, నక్షత్ర దోషాలు ఉండవు. ఇది స్వయంసిద్ధ ముహూర్తం. ఈ రోజున ఏ పని ప్రారంభించినా విజయం సిద్ధిస్తుందని నమ్ముతారు. అందుకే చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయడానికి, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, సంగీతం, నృత్యం లేదా ఏదైనా సరికొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం ప్రారంభించడానికి ఈ రోజు అత్యంత అనుకూలమైనది. బాహ్య ప్రపంచంలోని రాక్షసుల సంగతి పక్కన పెడితే.. మనలోని అహంకారం, కోపం, బద్ధకం అనే అంతర్గత శత్రువులను (రాక్షసులను) సంహరించి.. సత్యం, ధర్మం వైపు అడుగులు వేయడమే ఈ విజయదశమి మనకు ఇచ్చే అసలైన సందేశం.
– డి.వి.ఆర్.


