ఆమె... దుర్గం ఆమే దుర్గమ్మ | Nine Phases of a Womans Life Mirroring the Nine Forms of Durga | Sakshi
Sakshi News home page

ఆమె... దుర్గం ఆమే దుర్గమ్మ

Oct 20 2026 4:03 AM | Updated on Oct 20 2026 4:03 AM

Nine Phases of a Womans Life Mirroring the Nine Forms of Durga

సృష్టికి మూలం స్త్రీ శక్తి. ఆ శక్తికి రూపమే నవరూప దుర్గ. నాడు మహిషాసురుణ్ణి సంహరించడానికి ప్రతిచోటా ప్రత్యక్షమైంది దుర్గ. నేడు తన పురోగతికి అడ్డంకి ఉన్న
ప్రతిబాటా తనదిగా చేసుకుంది ఆధునిక మహిళ. బడిలో, పైరుమడిలో, కార్ఖానాలోటెక్‌ సంస్థల్లో, అంతరిక్ష కేంద్రాల్లో చదువు, విజ్ఞానం, ఆత్మవిశ్వాసం అనే ఆయుధాలతో ఆమె జయకేతం. పల్లెలు, చిన్న చిన్న పట్టణాల్లో సహస్ర చిహ్నాల సమస్త వృత్తుల్లో స్త్రీలు నవ దుర్గలుగా రాణిస్తున్నారు. ఈ విజయదశమి వేళ తెలుగు నేలపై నవశక్తికి విజయమాల.

‘నా ఆత్మవిశ్వాసమే నా ప్రథమ ఆయుధం’... ఇదీ నేటి మహిళ అంటున్న మాట. తన విజయాలతో చాటుతున్న మాట. నిజమే. ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం లేదు. దానిని చేతబట్టి ముందుకు సాగేకొద్దీ స్త్రీలకు దారులు తెరుచుకుంటున్నాయి. కొత్త ఆయుధాలు చేతికి చిక్కుతున్నాయి. అలనాడు ముక్కోటి దేవతలు తమ శక్తులన్నింటినీ దారబోసి ఆయుధాలుగా మలిచి ఇస్తే అమ్మవారు మహిషాసురుడిని వధించిందట. 

కానీ, నేటి అమ్మాయిలు ఎవరి నుంచో ఆయుధాలు ఆశించడం లేదు. వారు సంహరించాల్సిన మహిషాసురుడూ ఒక రూపంలో లేడు.  వివక్ష, అభద్రత, అసమానత, హింస, దురాచారం...  ఈ మహిషాసురందరినీ సంహరించాలి. అందుకని స్త్రీలు తమ ఆయుధాలను తామే సమకూర్చుకోవాలి. ఈ విజయదశమి వేళ, మన చుట్టూ ఉన్న మహిళలను పరికిస్తే కాలంతో పాటు మారిన వారి అస్త్రధారణ, ఆ ఆయుధాలతో వారు సాధిస్తున్న విజయాలు స్పష్టంగా కనిపిస్తాయి.

కలం పట్టిన సరస్వతులు
వరంగల్‌కు చెందిన అనురాధ (32) సివిల్స్‌ కోచింగ్‌ తీసుకుంటూ, పార్ట్‌ టైమ్‌గా పిల్లలకు పాఠాలు చెబుతోంది. ‘మా నాన్న నన్ను పెళ్లి చేసుకోమన్నప్పుడు నా చేతిలో ఉన్న పెన్నే నన్ను కాపాడింది. ఆ చదువే నాకు ధైర్యాన్ని ఇచ్చింది. నా దృష్టిలో అజ్ఞానాన్ని, అణచివేతను ఎదిరించే అసలైన అస్త్రం ఈ పెన్నే’ అంటుందామె. ఒకప్పుడు ఆడపిల్ల చేతికి పుస్తకం అందడమే గగనం. కానీ ఇవాళ అదే పుస్తకం, పెన్ను ఆమె చేతిలో అత్యంత పదునైన ఆయుధాలుగా మారాయి.  తరగతి గదుల నుంచి కోర్టు హాల్స్‌ దాకా స్త్రీలు తమ మేధోశక్తితో, కలం బలంతో సరికొత్త చరిత్ర రాస్తూ విజయం వైపు అడుగులు వేస్తున్నారు.

మౌస్‌ క్లిక్‌తో మార్కెట్‌ వేట 
పండుగ హడావిడిలో ఇల్లంతా పిండివంటల వాసనలు వస్తుంటే డ్రాయింగ్‌ రూమ్‌లో కూర్చుని ల్యాప్‌టాప్‌లో సీరియస్‌గా కోడింగ్‌ చేస్తోంది 24 ఏళ్ల లాస్య. ‘మా అమ్మమ్మ కాలంలో దసరా అంటే కొత్త బట్టలు, పిండి వంటలు.... నాకు మాత్రం ఈ దసరా పండుగ నా ఐటీ కెరీర్‌లో సాధించిన విజయానికి గుర్తు. ఈ ల్యాప్‌టాప్‌ నా చేతిలో లేకపోతే నేను ఇక్కడిదాకా వచ్చేదాన్ని కాదు‘ అంటుంది తను. ‘నా ల్యాప్‌టాప్‌ నా ఖడ్గం, నా గుర్రం, నా రాజ్యం అన్నీ ఇదే’ అంది నవ్వుతూ. 

మరోవైపు హైదరాబాద్‌కు చెందిన సుజాత (42) గృహిణిగా ఉంటూనే తన స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ సాయంతో ఇంట్లోనే తయారుచేసిన ఆర్గానిక్‌ ప్రోడక్ట్స్‌ను ఆన్ లైన్‌ వేదికగా అమ్ముతూ సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ ఉమెన్ గా మారుతున్నారు. ‘ఒకప్పుడు నా ప్రపంచం వంటిల్లే. కానీ ఒక మంచి బిజినెస్‌ ఐడియా, నా చేతిలోని ఫోన్‌ నా ప్రపంచాన్ని మార్చేశాయి. ఇవాళ వేలాది మంది కస్టమర్లు నన్ను నమ్ముతున్నారు. నా ఫోనే నా బిజినెస్‌ అస్త్రం‘ అని గర్వంగా చెబుతున్నారామె. కోడింగ్‌ స్క్రీన్ల మీద కదిలే ఐటీ ఉద్యోగినుల వేళ్ల నుంచి, సోషల్‌ మీడియాలో బిజినెస్‌ చేసే గృహిణుల దాకా... ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్ లు నేడు మహిళల ఆర్థిక స్వేచ్ఛకు అజేయమైన ఆయుధాలుగా మారాయి. ఇంకా చె΄్పాలంటే ఎవరి దగ్గరైతే మంచి ఐడియా ఉందో వారి చేతిలో ఒక గాండీవం ఉన్నట్టే భావించాల్సి వస్తోంది.

స్టీరింగ్‌ వీల్‌ నుంచి మైక్రోస్కోప్‌ దాకా
ఆర్థిక స్వేచ్ఛతో పాటు తమ రాకపోకలపై స్వీయ నియంత్రణ నేటి స్త్రీలకు అసలైన రక్షణ కవచం. విజయవాడకు చెందిన రమ్య (28) ప్రతిరోజూ ఉదయాన్నే తన స్కూటీపై ఆఫీస్‌కు బయల్దేరుతుంది. ‘నాకు టూ వీలర్‌ నడపడం వచ్చాకే నాలో భయం పోయింది. ఎవరిపైనా ఆధారపడకుండా నా ప్రయాణాన్ని నేనే నిర్ణయించుకుంటున్నాను. ఈ స్టీరింగ్‌ వీల్‌ నా చేతిలో ఉంటే నా జీవితపు పగ్గాలు నా చేతిలో ఉన్నట్టే‘ అందామె. 

స్వయంగా డ్రైవ్‌ చేసే ఉద్యోగినులే కాదు రీసెర్చ్‌ ల్యాబ్స్‌లో మైక్రోస్కోప్‌లు పట్టి కొత్త ఆవిష్కరణలు చేస్తున్న శాస్త్రవేత్తలుగా, సరికొత్త స్టార్టప్‌ కంపెనీలను విజయవంతంగా నడిపిస్తూ మేనేజ్‌మెంట్‌ రంగానికి కొత్త పాఠాలు నేర్పుతున్న లీడర్లుగా, అంతరిక్షాన్ని గాలించే వ్యోమగాములుగా మహిళలు తమ రూపాన్ని మార్చుకున్నారు. నిర్ణయాలు తీసుకునే అధికారం, రిస్క్‌ తీసుకునే ధైర్యమే ఈ తరం నారీమణుల ప్రధాన ఆయుధాలుగా మారాయి.

దసరా అంటే కేవలం పూజ గదిలో పాత వస్తువులను పెట్టి దండం పెట్టడం మాత్రమే కాదు. మన ఇంట్లో ఉంటూ నిత్యం అస్త్రధారణ చేసి, ఆయుధాలకు పదునుపెట్టుకుంటూ జీవితాల్ని గెలుస్తున్న మహిళల ప్రతిభను గుర్తించడం. వారి ఆత్మవిశ్వాసానికి సమాజం గౌరవమిచ్చినప్పుడే నిజమైన పండుగ శోభ. ఆయుధాలు ఇంటిని మాత్రమే కాదు దేశాన్ని నిర్మిస్తున్నాయి. ఆయుధాలు పట్టుకున్న ప్రతి మహిళే ఈ కాలపు దుర్గ.

1 ఎవరి మీదా ఆధారపడకుండా! 
తెలంగాణలోని మేడ్చల్‌ ఆర్టీసీ కాలనీ, కృపాకాలనీ, వినాయక్‌నగర్‌... తదితర కాలనీలలో ఆటో సుజాత అంటే తెలియని వారుండరు. సెలవు రోజంటూ లేకుండా రోజూ ఆటో నడుపుతూ ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరిస్తుంది. ఆ చెత్తను డంప్‌ యార్డ్‌కు తరలిస్తుంది. మేడ్చల్‌ సర్కిల్‌లో పెయిడ్‌ ఆటో ట్రాలీ నడిపే కార్మికురాలు సుజాత. ఎనిమిదేళ్లుగా ఉదయం నాలుగు గంటలకే దినచర్యను మొదలుపెట్టే సుజాత, చెత్త సేకరణ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఇద్దరు పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలన్న తపనే కాదు, ‘ఎవరి మీదా ఆధారపడకుండా రెక్కల కష్టాన్ని నమ్ముకునే బతుకే సంతృప్తిని ఇస్తుంది’ అని చెబుతుంది.

2. చిన్నారిని వెంట తిప్పుతూ విధులు
తెలంగాణలోని మేడ్చల్‌ పోస్టాఫీస్‌లో సౌమ్య పోస్ట్‌ ఉమన్‌గా నాలుగేళ్ల నుంచి విధులు నిర్వర్తిస్తోంది. నగరంలోని మౌలాలి ఆర్టీసీ కాలనీలో ఉండే సౌమ్య నిత్యం ట్రైన్‌లో మేడ్చల్‌కు వస్తూ స్టేషన్‌ నుంచి పోస్టాఫీస్‌కు యాక్టివాపై వస్తుంది. ఆమెకు 10 నెలల కుమారుడు ఉన్నాడు. కుమారుడిని ఇంట్లో వదిలే పరిస్థితి లేకపోవడంతో ఆమె తన ద్విచక్రవాహనాన్ని మేడ్చల్‌ రైల్వే స్టేషన్‌లో పార్క్‌ చేసి ఇంటికి రైలు ద్వారా ప్రయాణం చేస్తుంది. కుమారుడిని ఇంటి నుంచి మేడ్చల్‌ వరకు చంకలో పెట్టుకొని, స్టేషన్‌లో దిగాక బాబును బేబీ క్యారియర్‌ బెల్ట్‌లో పెట్టుకొని తన విధులు నిర్వర్తిస్తోంది. రెండు చేతుల్లో బండి, ఓ బ్యాగులో లెటర్లు, ముందు భాగంలో కుమారుడు.. ఇంత కష్టం ఉన్నా ద్విచక్రవాహనంపై ఇంటింటికి వెళ్లి తపాలాను సకాలంలో అందజేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది.

3. మోటార్‌ మెకానిక్, బావుల మోటార్లు...
మోత్కూరుకు చెందిన గుగ్గిల్లపల్లి అరుణ డెభ్లై ఏళ్ల వయస్సులో మోటార్‌ మెకానిక్‌ రిపేరింగ్‌ను అలవోకగా చేస్తుంది. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తెలు. ఐటీఐ చదివిన భర్త పాపిరెడ్డి ఎలక్ట్రికల్‌ మోటార్‌ వైండింగ్‌ షాపు నిర్వహిస్తున్నాడు. భర్త ఒక్కరి కష్టంపైనే పిల్లల చదువు, పోషణ సాధ్యం కాదని ఆలోచన చేసిన అరుణ మెకానిక్‌గా మారింది. వ్యవసాయ ఎలక్ట్రిక్‌ మోటార్లు, స్టార్టర్లు, రీవైండింగ్, స్ప్రేచేసే పంపులు, వంట గ్యాస్‌ స్టౌల రిపేర్‌లో నైపుణ్యం పెంచుకుంది. యాభైఏళ్లుగా ఈ పనులు చేస్తున్నాను అని చెప్పిన అరుణ బావుల్లోని మోటార్ల రిపేరింగ్, రీవైండింగ్‌ పనులు చేసేటప్పుడు కాలిపోయిన కాపర్‌ వైరు మార్చడం మొదట్లో కష్టంగా ఉండేదని, ప్రాక్టీస్‌ మీద తర్వాత çసులువుగా మారిందని తెలిపింది. పిల్లల పెళ్లిళ్లు చేసి, బాధ్యతలు తీరినా ‘మమ్మల్ని బతికించింది ఈ మెకానిక్‌ పనే’ అంటూ రోజుకు పది గంటలు రిపేర్‌ పనులు చేస్తుంటుంది అరుణ.

4. ఉపాధి మాత్రమే కాదు సేవ కూడా!
మచిలీ పట్నంలోని ప్రైవేట్‌ హాస్పిటల్‌లో ఎనిమిదేళ్లుగా ఆయాగా పనిచేస్తోంది సరోజనమ్మ. భర్త పదిహేనేళ్ల క్రితం మరణించాడు. భర్త తల్లితో పాటు, తను, తన కూతురు బతకడానికి ఊళ్లోనే భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ, గేదెలను మేపుతూ, వాటి పాలు అమ్ముకుంటూ జీవించేది. కూతురుకు మంచి చదువు చెప్పించాలంటే ఆ కష్టం సరిపోదనిపించేది. తెలిసిన వాళ్లు హాస్పిటల్‌లో పని ఇప్పిస్తే ఆయాగా చేస్తున్నాను. ఇప్పుడు నా కూతురు చదువుకుని, ఉద్యోగం చేస్తోంది’ అని ఆనందంగా వివరించింది సరోజనమ్మ. హాస్పిటల్‌లో ఫ్లోర్‌ ఊడ్వడం, తుడవడం.. వంటి పనులే కాదు స్వచ్ఛందంగా రోగులకు సేవ కూడా చేస్తూ అందరి మెప్పు పొందుతోంది.

5. యువతకు స్ఫూర్తి 
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం సజ్జన్‌పల్లి గ్రామానికి చెందిన నాగయ్య, సాలవ్వల కూతురు పుట్టి గంగవ్వ. పక్క ఊరు శెట్పల్లి సంగారెడ్డికి రోజూ సైకిల్‌ మీద వెళ్లి పదో తరగతి వరకు, ఆ తర్వాత లింగంపేట మండల కేంద్రానికి వెళ్లి ఇంటర్మీడియట్‌ చదివింది. బైకు, ట్రాక్టర్, లారీ .. నడపడం నేర్చుకుంది. ఇంటి దగ్గరే ఉంటూ వ్యవసాయ పనులకు, అలాగే ట్రాక్టర్, కారు, లారీ డ్రైవర్‌గా వెళుతుండేది. నాలుగేళ్ల పాటు రైస్‌మిల్‌లో ఆపరేటర్‌గా పనిచేసింది. ఎనిమిదేళ్ల కిందట పంచాయతీలకు ప్రభుత్వం ట్రాక్టర్లు, ట్యాంకర్లు సరఫరా చేయడంతో గ్రామంలో డ్రైవింగ్‌ లైసెన్సు ఉన్న గంగవ్వను ట్రాక్టర్‌ డ్రైవర్‌గా నియమించారు. 

దీంతో ట్రాక్టర్‌ నడుపుతూ చెత్త సేకరణ పనులు చూసుకుంటుంది. నిచ్చెన సాయంతో స్తంభాలు ఎక్కి విద్యుత్‌ దీపాలను సరిచేస్తుంది. తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకుంది. అనారోగ్యంతో ఎనిమిదేళ్ల కిందట తండ్రి నాగయ్య ఏడాది కిందట తల్లి సాలమ్మ మరణించారు. గంగవ్వ డ్రైవర్‌గా చేస్తూనే వ్యవసాయ పనులు కూడా చేస్తుంది. లింగంపేట మండల కేంద్రానికి వెళ్లాలన్నా, ఎల్లారెడ్డి పట్టణానికి వెళ్లాలన్నా గంగవ్వ బైకు తీసుకుని వెళ్లి పనులు చేసుకుని వస్తుంది. సొంతంగా ఎదిగి, గ్రామ యువతకు స్ఫూర్తిగా నిలిచింది.

6. తండా నుంచి నగరానికి... కష్టంతో సొంతింటి వరకుఆమె పేరు లఖావత్‌ కమల. జనగామ జిల్లా స్టేషన్  ఘన్ పూర్‌ సమీపంలోని తిమ్మంపేట తండావాసి లఖావత్‌ కమలకు 16 ఏళ్ల వయసులో పెళ్లైంది. పెళ్లయిన కొంతకాలానికే భర్త మోహన్ తో కలిసి ఊరిని వదిలి నగరానికి వచ్చింది. భర్త మోహన్  కూలి పనులకు వెళ్లేవాడు. ఇద్దరు పిల్లలు పోషణతో పాటు హనుమకొండలోని దర్గా శాస్త్రినగర్‌లో స్థలం కొనుగోలు చేసి సొంతింటిని నిర్మించుకున్నారు. ఒకప్పుడు అద్దె ఇంట్లో ఉంటూ రేపటి జీవితం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందిన కుటుంబం.. నేడు సొంతింట్లో గౌరవంగా జీవిస్తోంది. పుట్టి పెరిగిన తండాలో రెండెకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ట్రాక్టర్, బైక్‌ సమకూర్చుకున్నారు. క్రమంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి సొంతింటిని నిర్మించుకుంది. పని మనిషిగా మొదలైన ఆమె ప్రయాణం.. ఇంటి మనిషిగా ఎదిగే స్థాయికి చేరింది.

7. బతుకు బండికి ఆత్మాభిమానమే చక్రం
మహిళలు అంతగా ఆసక్తి కనపరచని స్వచ్ఛ ఆటోడ్రైవర్‌గా అవతారమెత్తి కుటుంబ పోషణలో తానూ సగమై నిలిచింది కంది మమత. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లికి చెందిన కంది మమత కుటుంబ పోషణ నిమిత్తం స్వచ్ఛ ఆటో డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌ స్కీంలో చేరి తానే స్వయంగా ఆటోను నడిపిస్తూ, సమీపంలోని కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్  పరిధిలో ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తోంది. భర్త సంతోష్‌ గర్రెపల్లి గ్రామంలోనే విగ్రహాల తయారీతో ఉపాధి పొందుతున్నాడు. ఆదాయం సరిపోక ఇబ్బందులను ఎదుర్కొంటుండంతో సొంతంగా స్వచ్ఛ ఆటో డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌గా మారింది. 

రోజూ తెల్లవారు జాము 4.30 గంటలకే గర్రెపల్లి నుంచి కరీంనగర్‌కు 18 కిలోమీటర్ల దూరం ఆటోను నడుపుకొంటూ వచ్చి, తనకు కేటాయించిన 25వ డివిజన్ లో తానే స్వయంగా ఇంటింటికి తిరుగుతూ సేకరించిన చెత్తను మధ్యాహ్నం 12 గంటలకు డంప్‌యార్డ్‌కి తరలించి, తిరిగి ఇంటికి వెళుతుంది.  ఇలా రోజూ కనీసం 50 కిలోమీటర్ల మేర ఆటో నడిపి మధ్యాహ్ననికి ఇంటికి చేరుతుంది. ‘ఆడోళ్లు ఆటో నడుపుడేంది’ అంటూ వినిపిస్తున్న వ్యాఖ్యలు పట్టించుకోకుండా... ‘అమ్మాౖయెనా ఆటో నడుపుతోంది చూడు’...అంటూ పోత్సహించే మాటలే తాను వింటానంటూ చిరునవ్వుతో తన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తోంది.  

8. ప్రయాణికుల రక్షణ కోసం నిలబడి...
లక్ష్మీ కళ్యాణి మొదట గృహిణిగానే ఉండేది. కుటుంబ పోషణ, పిల్లల చదువుల్లో తనూ భాగం అవ్వాలంటే సంపాదన తప్పదు అనుకుంది. డిగ్రీ వరకు చదువుకుంది. ‘కానీ, ఏ పనిని ఎంచుకోవాలో మొదట తెలిసేది కాదని, ఏ ఉద్యోగం చేయాలా అని ఆలోచించినప్పుడు పేపర్‌లో మహిళా కానిస్టేబుళ్ల నియమాకం ప్రకటన కనపడడంతో అప్లై చేయడం, అర్హత సా«ధించడమే కాదు, ఉద్యోగంలో చేరి పదమూడేళ్లు అయ్యింది. పండగల సమయంలో సొంత ఊళ్లకు వెళ్లేవారితో బస్టాండ్లు రద్దీగా ఉంటాయి. ప్రస్తుతం విజయవాడ బస్టాండ్‌లో డ్యూటీ చేస్తున్నాను. పిల్లలను, వృద్ధులను అలెర్ట్‌ చేయడం, ఎవరూ ప్రమాదాల బారిన పడకుండా, వారు సురక్షితంగా వెళ్లేలా.. ట్రావెల్‌ ఎస్కార్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. రోజుకు ఎనిమిది గంటల డ్యూటీ. వీటి తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలని, ఊరేగింపు, సభలు.. వంటి సమయాల్లోనూ మా విధులు ఉంటాయి. రద్దీని తట్టుకుంటూ జనాల రక్షణ కోసం మేం నిలబడాలి. షిఫ్ట్‌ల వారీగా చేసే ఈ పనిలో సవాళ్ల కన్నా, జీవితం నేర్పిన పాఠాలు, వాటి నుంచి అందిన శక్తి అత్యుత్తమైనదిగా భావిస్తాను’ అంటుంది.

9. పరిశీలనతోనే మెకానిక్‌ పనులు
మోత్కూరు పట్టణానికి చెందిన పెద్ది మంగమ్మ, కృష్ణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. భర్త కృష్ణ గత 40 సంవత్సరాల నుంచి విద్యుత్‌ మోటార్‌ మెకానిక్‌ షాపు నిర్వహిస్తున్న ఉపాధి పొందుతున్నాడు. కృష్ణ వద్ద మోటార్‌ మెకానిక్‌ నేర్చుకున్న పలువురు యువకులు బయటకు వెళ్లి సొంతంగా పనులు చేసుకుంటున్నారు. దీంతో షాపు నిర్వహణ భారం భర్తపై పడుతున్న తీరును గమనించింది. భర్తకు మెకానిక్‌ పనులను రోజూ పరిశీలిస్తూ ఉండేది. చిన్న చిన్న మోటారు మెకానిక్‌ పనులు చేస్తూ చేదోడు వాదోడుగా ఉండేది. ‘విద్యుత్‌ మోటార్ల రీవైండింగ్, స్టాటర్ల స్యాండ్లు పనులు జాగ్రత్తగా చూస్తు నేర్చుకున్నాను.

 రోజురోజుకు టెక్నాలజీ పెరగడంతో సబ్‌మెర్సిబుల్‌ మోటార్ల వినియోగం ఎక్కువ కావడం అయ్యింది. దీంతో సబ్‌మెర్సిబుల్‌ మోటర్ల మెకానిజం కూడా నేర్చుకున్నాను. ఫ్యాన్లు, స్టాటర్లు, కాలిపోయిన బాగాలను వైండింగ్‌లను ఇప్పి, తిరిగి రీ వైండింగ్‌ చేయడం, క్లీనింగ్‌ చేసి పేపర్‌ సెట్‌ చేసేదాన్ని. ఇలా విద్యుత్‌ మోటార్ల రీవైండింగ్‌ .. పనులలో మంచి నైపుణ్యం వచ్చింది. దీంతో 20 ఏళ్లుగా మోటార్‌ మెకానిక్‌ పనులు సులువుగా నిర్వహిస్తున్నాను. మావారికి పని భారం తగ్గింది. ఆదాయం పెరిగింది. పిల్లలను మంచిగా చదివించుకున్నాం. మా అబ్బాయి పోలీస్‌ కానిస్టేబుల్, ఒక కూతురు నర్సు, మరో కూతురు టీచర్‌గా పనిచేస్తూ గౌరవంగా జీవిస్తున్నారు. ఇదంతా పని నేర్చుకొని, కుటుంబానికి అండగా నిలవడం వల్లనే. నాకెందుకు అనుకుంటే ఈ రోజు ఈ విధంగా ఉండేవాళ్లం కాదు’ అని తెలిపింది మంగమ్మ.

– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి
ఇన్‌పుట్స్‌: సాక్షి నెట్‌వర్క్‌ నుంచి ∙మురళీధర్, మేడ్చల్‌ 
– వెలిమినేటి జహంగీర్, మోత్కూర్‌ 
– సాయిరాం, హనుమకొండ, 
– ఎస్‌.వేణుగోపాలచారి, కామారెడ్డి
– ఆది వెంకట రమణా రావు, కరీంనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement