సమాజ సేవే.. విద్యార్థి ధర్మం: భగవాన్‌ శ్రీసత్యసాయిబాబా | Sri Sathya Sai Central Trust Educational Institutions | Sakshi
Sakshi News home page

సమాజ సేవే.. విద్యార్థి ధర్మం: భగవాన్‌ శ్రీసత్యసాయిబాబా

Nov 23 2025 4:06 AM | Updated on Nov 23 2025 4:06 AM

Sri Sathya Sai Central Trust Educational Institutions

భారతదేశంలో ప్రాచీనకాలంలో వర్ధిల్లిన గురుకుల వ్యవస్థకు ప్రతిరూపంగా శ్రీ సత్యసాయి విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. ఉపాధి కోసం కావలసిన భౌతిక జ్ఞానం సంపాదించుకుంటే సరిపోదు. విద్యార్థి జీవితంలో నిజమైన ఆనందం పొందాలంటే, జ్ఞానాన్ని సమాజ సేవకు వినియోగించాలని మన ప్రాచీన గురువులు తెలుసుకున్నారు. అందుకే వారు విద్యాబోధనతో పాటు ధార్మికత, బాధ్యత, నైతిక విలువలతో విద్యార్థుల సౌశీల్యాన్ని పెంపొందించడమే విద్యకు గల పరమలక్ష్యంగా భావించేవారు. ఈ ప్రాచీన విలువల ప్రాతిపదికనే శ్రీ సత్యసాయి విద్యా సంస్థలను భగవాన్‌ శ్రీ సత్యసాయిబాబా ఏర్పాటు చేశారు.

‘సా విద్యా యా విముక్తయే’ అని వేదోక్తి. అంటే, విద్యతోనే మనిషికి విముక్తి సాధ్యం. మనిషిని విముక్తి వైపు నడిపించేదే నిజమైన విద్య. నేటికాలంలో విద్య వాణిజ్యంగా మారింది. సమాజం భౌతికంగా అభివృద్ధి చెందుతున్నా, నైతికంగా పతనమవుతోంది. సత్యం, ధర్మం, కృతజ్ఞత, భక్తి వంటి ఉన్నత విలువలు వెనుకబడిపోయి; ధనాసక్తి, అధికారదాహం పెచ్చుమీరుతున్నాయి. విద్యార్థులలో పెరుగుతున్న అశాంతి, నిరాశ, ఆందోళన– విద్యా వ్యవస్థ తన లక్ష్యాన్ని కోల్పోయిందనేందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

ఎడ్యుకేర్‌ – బాబా ఆవిష్కరించిన విద్యా సూత్రం
విద్యారంగంలో విలువలను పునరుద్ధరించాలనే సంకల్పంతో శ్రీ సత్యసాయిబాబా ‘ఎడ్యుకేర్‌’ భావనను ప్రవేశపెట్టారు. ‘ఎడ్యుకేర్‌’ లాటిన్‌ పదం. దీని అర్థం ‘మనలో దాగి ఉన్నదానిని వెలికి తీయడం’. శ్రీ సత్యసాయి విద్యాసంస్థల్లో ఈ విధానం విద్యార్థుల్లో ఉన్న అంతర్గత జ్ఞానాన్ని వెలికితీసి, వారిలో ఉన్నత విలువలను పాదుకొల్పడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఇది కేవలం అకాడమిక్‌ విద్య కాదు, మనసు, హృదయం, చేతులు అనే మూడు కోణాల సమగ్రాభివృద్ధి.

శ్రీ సత్యసాయి విద్యాసంస్థల ఆవిర్భావం
శ్రీ సత్యసాయిబాబా 1981లో అప్పటికే అనంతపురం, వైట్‌ఫీల్డ్, పుట్టపర్తిలలో ఉన్న కళాశాలలన్నింటినీ ఏకీకృతం చేసి, శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ (డీమ్డ్‌ యూనివర్సిటీ) నెలకొల్పారు. ఆ తర్వాత రెండేళ్లకు శ్రీ సత్యసాయి హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ ప్రారంభించారు. ఈ సంస్థల్లో ప్రైమరీ స్థాయి నుంచి పోస్ట్‌ డాక్టరల్‌ స్థాయి వరకు విద్యాబోధన జరుగుతుంది. ఈ సంస్థల్లో విద్య పూర్తిగా ఉచితం. విద్యార్థులు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన పని ఉండదు. శ్రీ సత్యసాయి విద్యాసంస్థల విశిష్టతకు ఇదే నిదర్శనం.

శ్రీ సత్యసాయి విద్యావాహిని 
దేశంలోని ప్రతి విద్యార్థికి సమగ్ర విద్యను అందించాలనే సంకల్పంతో భగవాన్‌ శ్రీ సత్యసాయిబాబా 2010 నవంబర్‌ 23న ‘శ్రీ సత్యసాయి విద్యావాహిని’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ సత్యసాయి విద్యా సంస్థలు విలువలతో కూడిన విద్యను, ప్రావీణ్యాన్ని అందించడంలో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. ఈ సంస్థల్లో విజయవంతమైన విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడానికి సత్యసాయి విద్యావాహిని కార్యక్రమాన్ని చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని, సత్యసాయి విద్యావిధానాన్ని ప్రతి పాఠశాలకు, ప్రతి గురువుకు, ప్రతి విద్యార్థికి చేరవేయడానికి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.

ఉన్నతమైన నైతిక విలువలు, ఆధ్యాత్మిక దృక్పథం, సామాజిక సేవా సంసిద్ధత కలిగిన సచ్ఛీలురైన భావి పౌరులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా శ్రీ సత్యసాయి విద్యావాహిని కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా తయారయ్యే విద్యార్థులు కేవలం విద్యార్హతలు మాత్రమే కలిగిన వారిగా కాకుండా; దేశసేవ పట్ల తపన, బాధ్యతాయుతమైన పౌరచైతన్యం, సమగ్రత, ప్రేమ, దయ, సహానుభూతితో కూడిన సమగ్ర వ్యక్తులుగా ఎదగాలనేదే దీని సంకల్పం. విలువలతో కూడిన సార్వత్రిక విద్యను ఉచితంగా అందించడమే శ్రీ సత్యసాయి విద్యావాహిని మూలసిద్ధాంతం. ఈ కార్యక్రమం కింద ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, మానవీయ విలువలతో కూడిన పాఠ్యాంశాలను సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి  ఉచితంగా అందిస్తుంది.

సాంకేతిక సహకారంతో సేవ 
సత్యసాయి విద్యావాహిని కార్యక్రమంలో ఉన్నత విద్య, శిక్షణ, సాంకేతిక నైపుణ్యం, అనుభవం కలిగిన స్వచ్ఛంద సేవకులు అంకితభావంతో సేవలు అందిస్తున్నారు. ‘అందరికీ సమీకృత విద్య’ అనే బాబా ఆశయాన్ని సాకారం చేయడానికి నిస్వార్థంగా కృషి చేస్తున్నారు. ఇది సాధారణమైన విద్యా కార్యక్రమం కాదు, భారతీయ విద్యా వ్యవస్థను సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి అనే విలువలతో పునరుజ్జీవింపజేసే మహాయజ్ఞం. ‘విద్య అనేది కేవలం ఉపాధి కోసమే కాదు, అది దైవత్వానికి, సేవకు, సమగ్రతకు దారి చూపాలి’ అనే ప్రాచీన భారతీయ మౌలిక సూత్రానికి ఆధునిక కార్యాచరణ ప్రస్థానం.

శ్రీ సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ విద్యాసంస్థలు
పుట్టపర్తి, అనంతపురం, నందిగిరి, బెంగళూరులలో శ్రీ సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ ఉచిత రెసిడెన్షియల్, నాన్‌ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలను నిర్వహిస్తోంది. మానవీయ విలువలు, నైతికతలకు ప్రాధాన్యమిస్తూ ఈ విద్యాసంస్థల్లో బోధన కొనసాగుతోంది. పాఠ్యాంశాల బోధన మాత్రమే కాకుండా, పాఠ్యేతర కార్యకలాపాల ద్వారా విద్యార్థులలో క్రమశిక్షణ, త్యాగస్ఫూర్తి, సామాజిక సేవా నిబద్ధతలను పెంపొందించేలా ఈ సంస్థలు విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయి. వీటిలో చదువుకునే విద్యార్థులు తమ విద్యాసంస్థలకు సమీపంలో ఉన్న గ్రామాలను సందర్శించి, తప్పనిసరిగా అక్కడ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీ సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ను బోధిస్తారు. ఈ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పనిచేస్తున్న విద్యాసంస్థలు ఇవీ...

శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్, పుట్టపర్తి 
ఇది బాల బాలికల కోసం ప్రారంభించిన నాన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల. తొలుత దీనిని 1972లో తెలుగు మీడియం పాఠశాలగా బాబా తల్లి పేరిట ప్రారంభించారు. తర్వాత 2010లో సీబీఎస్‌ఈ సిలబస్‌ ప్రకారం ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలగా మార్చారు. ఇందులో ఇంగ్లిష్‌ మీడియం మొదటి బ్యాచ్‌ 2010 జూన్‌ 10న ప్రారంభమైంది. పుట్టపర్తి, చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకుంటుంటారు.

శ్రీ సత్యసాయి హయ్యర్‌ సెకండరీ స్కూల్, పుట్టపర్తి 
ఇది బాల బాలికల కోసం నెలకొల్పిన రెసిడెన్షియల్‌ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల. ఇందులో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు విద్యాబోధన జరుగుతుంది.
శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖ గుర్తింపు పొందిన స్వయంప్రతిపత్తి సంస్థ. ఇది పుట్టపర్తి, వైట్‌ఫీల్డ్‌–బెంగళూరు, నందిగిరి, అనంతపురం క్యాంపస్‌లలో పనిచేస్తోంది.

ఇది విద్యార్థులకు ఉచితంగా గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ కోర్సులను అందిస్తుంది. ఈ క్యాంపస్‌లలోని విద్యా వ్యవస్థ పూర్వకాలపు గురుకుల విద్యావ్యవస్థను పోలి ఉంటుంది. ఇక్కడ విద్యాబోధనతో పాటు వ్యక్తిత్వ వికాసానికి కూడా సమాన ప్రాధాన్యం ఉంటుంది. శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ పుట్టపర్తి క్యాంపస్‌లో సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఫెసిలిటీ (సీఆర్‌ఐఎఫ్‌) ఉంది. అధునాతన పరిశోధన వసతులు ఈ సంస్థ ప్రత్యేకత.  

శ్రీ సత్యసాయి మీర్పురి కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్, పుట్టపర్తి 
ఈ సంగీత కళాశాల 2000 సంవత్సరంలో ఏర్పాటైంది. ఇది వివిధ సంగీత విభాగాలలో ఫౌండేషన్, డిప్లొమా, బ్యాచిలర్స్, మాస్టర్స్‌ కోర్సులను అందిస్తుంది. దీనిని 2017లో సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌లోని ఒక విభాగంగా మార్చారు.

ఇతర రాష్ట్రాలలో శ్రీ సత్యసాయి పాఠశాలలు
శ్రీ సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలోని స్టేట్‌ ట్రస్టులు దేశంలోని వివిధ రాష్ట్రాలలో పాఠశాలలను నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్, ఇండోర్, ముంబై, దక్షిణ కన్నడ తదితర ప్రాంతాల్లో శ్రీ సత్యసాయి పాఠశాలలు నడుస్తున్నాయి. 

మీ తల్లిదండ్రులను గౌరవించండి.. 
గురువులను ఆరాధించండి..
సమాజానికి సేవ చేయండి..
ఇదే నిజమైన విద్యార్థి ధర్మం.

‘గురువు ఇచ్చేది జ్ఞానం మాత్రమే కాదు, 
జీవన మార్గం చూపే వెలుగు’ అనేది
విద్యార్థులకు భగవాన్‌ శ్రీ సత్యసాయిబాబా తరచుగా చేసే ఉద్బోధ.

రతన్‌ టాటా చేతుల మీదుగా శ్రీ సత్యసాయి విద్యా వాహిని ప్రారంభం
శ్రీ సత్యసాయిబాబా 2010లో తన పుట్టినరోజు సందర్భంగా శ్రీ సత్యసాయి విద్యావాహిని కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమ రూపకల్పనకు టాటా గ్రూప్‌ చైర్మన్‌ రతన్‌ టాటా ఇతోధికంగా సహాయ సహకారాలందించారు. శ్రీ సత్యసాయి విద్యావాహిని కార్యక్రమం కింద 2023 నవంబర్‌లో దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో నైపుణ్యాలను పంచుకోవడానికి ఎన్‌సీఈఆర్‌టీ, సీఐఈటీలతో సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement