నడుము నొప్పి ఎందుకు వస్తుందంటే.. | Spinal Stenosis: What It Is Causes, Symptoms And Treatment | Sakshi
Sakshi News home page

నడుము నొప్పి ఎందుకొస్తుందంటే..? వ్యాయామాలతో అధిగమించొచ్చా..?

May 27 2025 8:57 AM | Updated on May 27 2025 9:34 AM

Spinal Stenosis: What It Is Causes, Symptoms And Treatment

ప్రతి వ్యక్తి జీవిత కాలంలో అతడు / ఆమె ఏదో ఓ సమయంలో నడుము నొప్పితో బాధపడతారు. అందునా జనాభాలోని 75 – 85 శాతం మందిలో... ఒక వయసు తర్వాత...మరీ ముఖ్యంగా నడి వయసు తర్వాత నడుము నొప్పి తప్పక కనిపించే అవకాశాలే ఎక్కువ.దీనికి అనేక కారణాలున్నప్పటికీ అందులో ఒక కారణమేమిటంటే... వెన్నుపూసల మధ్య భాగంలో ఉండే స్థలం సన్నబడటం.వైద్య పరిభాషలో దీన్నే ‘లంబార్‌ కెనాల్‌ స్టెనోసిస్‌’ అంటారు. ఇటీవల ఈ సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే మొదట్లోనే ఈ నొప్పి గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ఫిజియోథెరపీ వ్యాయామాలు చేసుకుంటే సమస్యను అదుపులో పెట్టవచ్చు. ఇంత విస్తృతంగా వచ్చే ఈ నొప్పి గురించి అవగాహన పెంచుకోవడం కోసమే ఈ కథనం. 

ప్రతి వ్యక్తిని నిటారుగా నిలబెట్టే వెన్నెముక నిర్మాణమే ఓ అద్భుతం. ఇందులో 32 నుంచి 34 పూసలు వరసగా ఉంటాయి. ఇంగ్లిష్‌ అక్షరమైన ‘ఎస్‌’ను దాదాపుగా ΄ోలి ఉంటే ఈ వరస పూసలు ఇంత సమన్వయం తో ఉంటాయంటే... దారం దండలోని పూసల్లా... ఈ ఎముకలన్నీ వరస లో కలిసి ఉంటాయి కాబట్టి వాటిని పూసలుగా చెబుతుంటారు. ఇక పూసల్లోని మధ్యనుండే ఖాళీ స్థలంలోంచి దారం ఉన్నట్టే... ఈ వెన్నుపూసల ఖాళీ స్థలంలోంచి ‘వెన్నుపాము’ ఒక తాడులా వెళ్తుంది. 

అయితే ఇది తాడు కాదు.... అనేక నరాలు పెనవేసుకున్న సంక్లిష్ట నిర్మాణం. ఆయా నరాలన్నీ వెన్నుపూసల మధ్యనుండే ఖాళీల నుంచి బయటకు వస్తూ... ఆయా అవయవాలకు వెళ్తూ వాటిని పనిచేయిస్తూ ఉంటాయి. ఈ నరాల ఆదేశాలతో పనిచేసే ఆ అవయవాలు... చేతులూ, కాళ్లూ, వేళ్తూ, కీళ్లూ కాగా... ఇవన్నీ సమన్వయంతో పనిచేస్తుండటంతోపాటు... మరికొన్ని ఇతర అవయవాలనూ సమన్వయ పరుస్తూ, వాటినీ పనిచేయిస్తాయి. 

ఈ 32 నుంచి 34 పూసలన్నింటితో పాటు... లోపల ఉన్న  వెన్నుపాము మొత్తం నిర్మాణమంతటినీ కలుపుకుని దాన్ని ‘వెన్ను’ (స్పైన్‌)గా చెబుతారు. ఈ స్పైన్‌లోని... మెడ దగ్గర ఉండే భాగంలో ఏడు (సర్వేకల్‌ ఎముకలు) పూసలుండగా, ఛాతి, కడుపు భాగంలో పన్నెండూ (థోరాసిక్‌), అలాగే నడుం భాగంలో ఉండేవి ఐదు (లంబార్‌), ఇక మిగతావి ఒకదానితో మరోటి కలిసి΄ోయి ఉండే శాక్రల్‌ ఎముకలన్నీ కలిసి వెన్ను నిర్మాణాన్ని పూర్తి చేస్తాయి. 

కాక్సిక్‌ అనేది చివరన తోకలాగా ఉండే ఎముక. సంక్లిష్టమైన ఈ వెన్ను నిర్మాణంలోని మరో అద్భుతమైన నిర్మాణ ప్రక్రియ ఏమిటంటే... వెన్నుపూసలోని ఎముకకూ ఎముకకూ మధ్య నుంచి ఒక్కోనరం చొప్పున మొత్తం 31 నరాలు బయటకు వస్తాయి. ఈ నరాలే కాళ్లూ, చేతులతోపాటు వివిధ అవయవాలను కదిలిస్తూ, వాటితో పనులు చేయిస్తూ ఉంటాయి.

నిర్ధారణకు ఉపయోగపడే ప్రధాన లక్షణం ఏమిటంటే... 
కదులుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు కాళ్లు అకస్మాత్తుగా పట్టేస్తాయి. అటు తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే మళ్లీ నడవగలుగుతారు. వ్యాధి తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఇలా నడవగలిగే దూరాలు క్రమంగా తగ్గుతూపోతాయి. 

విశ్రాంతి వ్యవధులు క్రమంగా పెరుగుతాయి. ఉదాహరణకు తొలుత 600 మీటర్ల తర్వాత కాళ్లు బిగుసుకుపోతే అటు తర్వాత అలా బిగుసుకుపోవడం అన్నది 400 మీటర్లకే జరగవచ్చు. అటు పిమ్మట 200 మీటర్లకే బిగుసుకుపోవచ్చు. ఇలా దూరాలు తగ్గుతూ... విశ్రాంతి సమయపు వ్యవధి పెరుగుతూ ΄ోతుంది. ఇలా జరగడాన్ని ‘క్లాడియేషన్‌ డిస్టాన్సెస్‌’ అంటారు. ఇది లాంబార్‌ కెనాల్‌ స్టెనోసిస్‌ తాలూకు అత్యంత ప్రధాన లక్షణమని చెప్పవచ్చు. 

నిర్ధారణ ఇలా..
బయటికి (క్లినికల్‌గా) కనిపించే నొప్పి లక్షణాలతో ‘లంబార్‌ కెనాల్‌ స్టెనసిస్‌’ను స్పష్టంగా అనుమానించవచ్చు, కొంతవరకు గుర్తించవచ్చు. అయితే దీని నిర్ధారణ కోసం ఎక్స్‌రే, సీటీ స్కాన్, ఎమ్మారై వంటి ఇమేజింగ్‌ ప్రక్రియలు బాగా ఉపయోగపడతాయి. 

ఈ సమస్యతో పాటు ఒకవేళ వెన్నుపూసకీ వెన్నుపూసకీ మధ్యనున్న డిస్క్‌లు అటు ఇటు జరిగితే... అలాంటి డిస్‌ప్లేస్‌మెంట్‌ కూడా సీటీ స్కాన్, ఎమ్మారై వంటి ఇమేజింగ్‌ ప్రక్రియల్లో కనిపిస్తుంది. డిస్క్‌లు ఇలా స్థానభ్రంశమై కదలి΄ోవడాన్ని ‘హెర్నియేటెడ్‌ డిస్క్‌’ అని కూడా పిలుస్తారు. సీటీ స్కాన్‌ కంటే ఎమ్మారై చాలా ముఖ్యం.

వెన్ను నొప్పికి ఒక ప్రధాన కారణం లంబార్‌ స్టెనోసిస్‌...  
నడుము భాగంలోని వెన్నుపూసల మధ్య స్థలం తగ్గడంతో నడుము నొప్పి వస్తుంటుంది. ఇలా ఖాళీ తగ్గినప్పుడు ఈ  పూసలు... వాటి మధ్యనుంచి బయటకు వచ్చే నరాలను నొక్కేస్తుంటాయి. నరం తీవ్రంగా నొక్కుకుపోవడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. అయితే నొప్పికి కారణమయ్యేలా వెన్నుపాము ఉండే ‘లంబార్‌ కెనాల్‌’లో ఖాళీ తగ్గడాన్ని, తత్ఫలితంగా లంబార్‌ కెనాల్‌ ఇరుకుగా మారడాన్ని వైద్య పరిభాషలో ‘లంబార్‌ కెనాల్‌ స్టెనోసిస్‌’ అంటారు. లంబార్‌ అనేది నడుము దగ్గర ఉండే పూసలు కాబట్టి... అక్కడి ఖాళీ తగ్గింది కాబట్టి నొప్పి ‘నడుము ప్రాంతం’లో వస్తుంటుంది. అయితే ఇది కేవలం నడుము వరకే పరిమితం కాదు. 

కొన్ని సందర్భాల్లో నడుముకు ఇరువైపులా పిరుదులు, తొడలు, కాళ్లలోనూ నొప్పి కనిపిస్తుంది. చాలాసేపు నడిచినా లేదా ఒకేచోట చాలాసేపు నిలబడ్డా నొప్పి, అలసట ఎక్కువవుతాయి. గతంలో చాలా దూరాలు శ్రమలేకుండా నడిచేవారు కూడా ఇప్పుడు అంతగా నడవలేకపోతున్నామనీ, నడుము లేదా పిరుదులు, తొడలు, కాళ్లలో నొప్పి వస్తుందంటూ కంప్లెయింట్‌ చేస్తుంటారు. ఇక నడుముతో పాటు కొందరికి నేరుగా వెన్నులోనే నొప్పి కనిపించవచ్చు.

వెన్నుపూస సన్నబడ్డట్టు తెలిసేదిలా..
వెన్నుపాముని కలిగి ఉండే వెన్నుపూసల మధ్యనుండే ఖాళీ స్థలం ఒకే గది ఉన్న ఇంటి స్థలంలా ఉంటుంది. కిందనుండే డిస్క్‌ ఫ్లోరింగ్‌ అనుకుందాం. అప్పుడు పైన ఉండేది కప్పు అవుతుంది. వెన్నుపూస ఖాళీ తగ్గుతున్న కొద్దీ పైనా కిందా ఉండే ఎముక భాగాలు ఉబ్బుకొచ్చినట్లుగా బయటికి వస్తాయి. వీటినే ‘ఆస్టియోఫైట్స్‌’ అంటారు. ఇవి ఇలా ఉబ్బుకుని వచ్చి లోపలికి పెరుగుతాయి కానీ... ఒకసారి పెరిగినవి మళ్లీ తగ్గే అవకాశం దాదాపుగా ఉండదు. 

ఇలా పొడుచుకొచ్చినట్లుగా ఉండే ఎముకభాగాల (బోనీ స్ట్రక్చర్స్‌)కు తోడుగా అక్కడి కణజాలం, మెత్తటి ఎముక (మృదులాస్థి) భాగాలు, లిగమెంట్లు... ఇవన్నీ వాపునకు (అంటే ఇన్‌ఫ్లమేషన్‌కు) గురవుతాయి. కేవలం ఎముక మధ్యలో ఉండే ఖాళీ స్థలమే కాకుండా... ఎముకకూ, ఎముకకూ మధ్యన ఉండే రంధ్రం (దీన్ని ఫొరామెన్‌ అంటారు) కూడా సన్నబారుతుంది. ఎముక మధ్య భాగం ఇంటి ఖాళీ స్థలం అనుకుంటే... దీన్ని ప్రవేశద్వారం అనుకోవచ్చు. అంటే ఇంటి మధ్యభాగంలో ఉన్న స్థలమే కాకుండా... ఇంట్లోకి వచ్చే ప్రదేశద్వారం కూడా సన్నబారిపోతుంది.

సన్నగా అవడంతో జరిగేది ఇదీ...
ఎముకలోని ఖాళీ భాగాలూ, ఎముక ప్రవేశద్వారం లాంటి ఫొరామెన్‌ అన్నీ సన్నబడటంతో... ఎన్నెన్నో నరాలు పెనవేసుకుని΄ోయి ఉండే వెన్నుపాము ఒత్తిడికి గురవుతుంది. నడుము భాగం (లంబార్‌) ప్రాంతం నుంచి కిందికి అంటే శాక్రల్, కాకిక్స్‌ అనే ప్రాంతాల నుంచి దాదాపు కనీసం 11 నరాల వరకు ఒత్తిడికి గురికావడంతో ఆయా భాగాలకు సప్లై అయ్యే నరాలు  బాగా ఒత్తుకు΄ోయి నడుము వెనక భాగం, నడుము కిందిభాగం, పిరుదులు, వెన్ను కిందిభాగం పరిసరాల్లో నొప్పి వస్తుంటుంది. ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ నొప్పి తీవ్రతరమవుతుంటుంది. అందుకే  ఈ  నరాలు ఒత్తిడికి గురయ్యేందుకు అవకాశమున్న కదలికల్లో... అంటే వ్యక్తులు  అకస్మాత్తుగా  ముందుకు ఒంగినా, కుర్చీ నుంచి ఒక్కసారిగా లేచినా, అకస్మాత్తుగా కదిలినా తీవ్రమైన నొప్పి వస్తుంది. 

అంతేకాదు... ఆ నొప్పి... అక్కడికే పరిమితమైపోకుండా... పక్కనుండే పరిసరాల్లోకి పాకినట్లుగా అవుతుంది. దాంతో అవయవం చుట్టుపక్కల ప్రాంతాలూ నొప్పికి గురవుతాయి. అంటే అసలు భాగంలోని కాకుండా ఇలా పక్కలకు నొప్పి పాకడాన్ని ‘రిఫర్‌డ్‌ పెయిన్‌’ అంటారు. ఇలాంటి రిఫర్‌డ్‌ పెయిన్‌ కారణంగా ఈ నొప్పులు ఒక్కోసారి ‘సయాటికా నొప్పి’లాగానే అనిపించవచ్చు. ఇది నొప్పిని అనుకరిస్తున్నట్లుగా ఉండటంతో దీన్ని ‘సయాటికా మిమికింగ్‌ పెయిన్‌’ అని కూడా అంటారు. 

పుట్టుకతో వచ్చే... కంజెనిటల్‌ స్టెనోసిస్‌...
కొంతమందికి పుట్టుకతోనే వెన్నుపూసల్లోని ఖాళీ స్థలం ఇరుగ్గా ఉండవచ్చు. అయితే వారు పెద్దయ్యాక వెన్నుపూసల మధ్యభాగం ఇరుగ్గా మారి... ఆ వయసులో లక్షణాలు బయటపడవచ్చు. 

ఇలా పుట్టుకతోనే వెన్నుపూసల మధ్యభాగం సన్నగా ఉండటాన్ని ‘కంజెనిటల్‌ స్టెనోసిస్‌’గా పేర్కొంటారు. వీళ్లలోనూ నొప్పి, ఇతర లక్షణాలన్నీ మామూలుగా లంబార్‌ స్టెనోసిస్‌తో బాధపడేవారిలాగే ఉంటాయి. కాక΄ోతే వీళ్లది చాలావరకు అనువంశీకంగా వచ్చే సమస్య.  

కొన్ని అసాధారణమైన ఇతర రకాల నడుము నొప్పులు...
ఓ వయస్సు దాటాక (ముఖ్యంగా మధ్యవయస్కుల్లో) నడుం నొప్పి రావడం చాలా సాధారణం. అయితే మరి కొంతమందిలో అసాధారణంగా నడుం నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇందుకు అనేక కారణాలుంటాయి. అవి... 

పుట్టుకతోనే వెన్నెముకలో లోపాల వల్ల, 
వెన్నుకు అయ్యే గాయాల వల్ల, 
ఇన్ఫెక్షన్లు, గడ్డలు, 
మహిళల్లో మెనోపాజ్,  
వృద్ధుల్లో ఆస్టియోపోరోసిస్‌ వల్ల,
స్టెరాయిడ్స్‌ వాడేవారిలో ఎముకలు మెత్తగా అయిపోవడం వల్ల, 
కొందరిలో స్పైన్‌ విరగడం, డిస్క్‌ పక్కకు తొలగడం వల్ల... ఇలా వెన్నుకు వచ్చే నొప్పులకు కారణాలు ఎన్నెన్నో ఉంటాయి. 

నివారించుకోవడమిలా...
స్ట్రెచింగ్‌తో బాలెన్స్‌నూ, ఇతర ఎక్సర్‌సైజ్‌లతో శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం. 
రోజూ ఉదయాన్నే వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్‌ వంటి వ్యాయామాలు చేయడం.
వార్మప్‌ తర్వాతనే ఎక్సర్‌సైజ్‌ మొదలుపెట్టడం. (అకస్మాత్తుగా మొదలుపెడితే నడుము పట్టేయడం వంటి అనర్థాలతో వెన్నునొప్పులు మరింత పెరిగే అవకాశం. 

ఒకే పొజిషన్‌లో ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్త తీసుకోవడం. (తరచూ అంటే... ప్రతి 20 నుంచి 30 నిమిషాలకు ఓసారి కాసేపటి కోసమైనా సరే... పొజిషన్‌ మారుస్తూ ఉండటం. 

నిల్చున్నప్పుడు అవకాశం ఉంటే... స్టూలు వంటి చిన్న ఎత్తుపైనో–  కాసేపు ఓ కాలు, ఇంకాసేపు మరో కాలు ఆనిస్తూ నిలబడటం. 

యోగా వంటివి చేస్తున్నప్పుడు శిక్షణ పొందిన ఎక్స్‌పర్ట్స్‌ పర్యవేక్షణలో మాత్రమే చేయడం.  (తమ బరువుకు తగని ఆసనాలు సొంతంగా వేయడం మంచిది కాదు). 

ఏదైనా వస్తువును ఎత్తేప్పుడు దానికి సాధ్యమైనంత దగ్గరగా వెళ్లి కూర్చుని ఎత్తడం. (కేవలం నడుం మాత్రమే వంచి, తానే వంగి ఎత్తకుండా మోకాళ్లు కూడా వంచి కూర్చున్న భంగిమలోకి వెళ్లి ఎత్తడం మంచిది. కింది వస్తువులు ఎత్తేటప్పుడు నడుము మీద కాకుండా...  తుంటి, మోకాలు భాగాలను వంచి వాటిమీద మాత్రమే ఒత్తిడి పడేలా ఎత్తడం మంచిది. అంతే తప్ప నిలబడ్డవారు ముందుకు ఒంగి ఏదైనా ఎత్తడం సరికాదు)

అపోహ
వెన్నునొప్పి వచ్చినప్పుడు గట్టిగా ఉండే ఉపరితలంపైన పడుకోవాలన్నది ఇప్పటివరకూ ఉన్న ఓ అపోహ. 

వాస్తవం 
మరీ మెత్తగా ఉండే పరుపు మీద తప్ప...సౌకర్యంగా(కంఫర్టబుల్‌)గా ఉన్న ఏ పరుపు మీదైనా పడుకోవచ్చు.

చికిత్స...
నడుము నొప్పి ఏదైనా మొదట డాక్టర్లు ఫిజియోథెరపీ వ్యాయామాలను సూచిస్తారు. ఇక నొప్పి ఉపశమనం కోసం వేణ్ణీళ్ల కాపడం లేదా ఐస్‌తో కాపడం పెట్టడంతోపాటు అల్ట్రాసౌండ్‌ తరంగాల చికిత్స, ఎలక్ట్రికల్‌ స్టిమ్యులేషన్‌ థెరపీ ఇస్తారు. 
వెన్నుపూసల్లో స్థలం తగ్గి ఆ ఒత్తిడి నరంపై పడుతున్నప్పుడు ఆ నొప్పి భరించలేనిదిగా ఉన్నప్పుడు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు ఇస్తారు. తట్టుకోలేనంత నొప్పి ఉన్నవారికి కొద్దికాలంపాటు నొప్పినివారణ మందులూ ఇవ్వవచ్చు. (ఇది డాక్టర్లు సూచించిన నిర్ణీత వ్యవధి మేరకే వాడాలి. ఆ తర్వాత కూడా అలా కొనసాగించడం సరికాదు). ఇక తప్పని సందర్భాల్లో చివరి ప్రయత్నంగా శస్త్రచికిత్స అవసరం పడవచ్చు. అయితే ఇప్పుడు మినిమల్లీ ఇన్వేజివ్‌ సర్జరీలతో ఈ తరహా శస్త్రచికిత్సలు మరింత తేలిగ్గా, సులువుగా చేయడం సాధ్యమవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement