Spinal canal problem
-
నడుము నొప్పి ఎందుకు వస్తుందంటే..
ప్రతి వ్యక్తి జీవిత కాలంలో అతడు / ఆమె ఏదో ఓ సమయంలో నడుము నొప్పితో బాధపడతారు. అందునా జనాభాలోని 75 – 85 శాతం మందిలో... ఒక వయసు తర్వాత...మరీ ముఖ్యంగా నడి వయసు తర్వాత నడుము నొప్పి తప్పక కనిపించే అవకాశాలే ఎక్కువ.దీనికి అనేక కారణాలున్నప్పటికీ అందులో ఒక కారణమేమిటంటే... వెన్నుపూసల మధ్య భాగంలో ఉండే స్థలం సన్నబడటం.వైద్య పరిభాషలో దీన్నే ‘లంబార్ కెనాల్ స్టెనోసిస్’ అంటారు. ఇటీవల ఈ సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే మొదట్లోనే ఈ నొప్పి గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ఫిజియోథెరపీ వ్యాయామాలు చేసుకుంటే సమస్యను అదుపులో పెట్టవచ్చు. ఇంత విస్తృతంగా వచ్చే ఈ నొప్పి గురించి అవగాహన పెంచుకోవడం కోసమే ఈ కథనం. ప్రతి వ్యక్తిని నిటారుగా నిలబెట్టే వెన్నెముక నిర్మాణమే ఓ అద్భుతం. ఇందులో 32 నుంచి 34 పూసలు వరసగా ఉంటాయి. ఇంగ్లిష్ అక్షరమైన ‘ఎస్’ను దాదాపుగా ΄ోలి ఉంటే ఈ వరస పూసలు ఇంత సమన్వయం తో ఉంటాయంటే... దారం దండలోని పూసల్లా... ఈ ఎముకలన్నీ వరస లో కలిసి ఉంటాయి కాబట్టి వాటిని పూసలుగా చెబుతుంటారు. ఇక పూసల్లోని మధ్యనుండే ఖాళీ స్థలంలోంచి దారం ఉన్నట్టే... ఈ వెన్నుపూసల ఖాళీ స్థలంలోంచి ‘వెన్నుపాము’ ఒక తాడులా వెళ్తుంది. అయితే ఇది తాడు కాదు.... అనేక నరాలు పెనవేసుకున్న సంక్లిష్ట నిర్మాణం. ఆయా నరాలన్నీ వెన్నుపూసల మధ్యనుండే ఖాళీల నుంచి బయటకు వస్తూ... ఆయా అవయవాలకు వెళ్తూ వాటిని పనిచేయిస్తూ ఉంటాయి. ఈ నరాల ఆదేశాలతో పనిచేసే ఆ అవయవాలు... చేతులూ, కాళ్లూ, వేళ్తూ, కీళ్లూ కాగా... ఇవన్నీ సమన్వయంతో పనిచేస్తుండటంతోపాటు... మరికొన్ని ఇతర అవయవాలనూ సమన్వయ పరుస్తూ, వాటినీ పనిచేయిస్తాయి. ఈ 32 నుంచి 34 పూసలన్నింటితో పాటు... లోపల ఉన్న వెన్నుపాము మొత్తం నిర్మాణమంతటినీ కలుపుకుని దాన్ని ‘వెన్ను’ (స్పైన్)గా చెబుతారు. ఈ స్పైన్‌లోని... మెడ దగ్గర ఉండే భాగంలో ఏడు (సర్వేకల్ ఎముకలు) పూసలుండగా, ఛాతి, కడుపు భాగంలో పన్నెండూ (థోరాసిక్), అలాగే నడుం భాగంలో ఉండేవి ఐదు (లంబార్), ఇక మిగతావి ఒకదానితో మరోటి కలిసి΄ోయి ఉండే శాక్రల్ ఎముకలన్నీ కలిసి వెన్ను నిర్మాణాన్ని పూర్తి చేస్తాయి. కాక్సిక్ అనేది చివరన తోకలాగా ఉండే ఎముక. సంక్లిష్టమైన ఈ వెన్ను నిర్మాణంలోని మరో అద్భుతమైన నిర్మాణ ప్రక్రియ ఏమిటంటే... వెన్నుపూసలోని ఎముకకూ ఎముకకూ మధ్య నుంచి ఒక్కోనరం చొప్పున మొత్తం 31 నరాలు బయటకు వస్తాయి. ఈ నరాలే కాళ్లూ, చేతులతోపాటు వివిధ అవయవాలను కదిలిస్తూ, వాటితో పనులు చేయిస్తూ ఉంటాయి.నిర్ధారణకు ఉపయోగపడే ప్రధాన లక్షణం ఏమిటంటే... కదులుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు కాళ్లు అకస్మాత్తుగా పట్టేస్తాయి. అటు తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే మళ్లీ నడవగలుగుతారు. వ్యాధి తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఇలా నడవగలిగే దూరాలు క్రమంగా తగ్గుతూపోతాయి. విశ్రాంతి వ్యవధులు క్రమంగా పెరుగుతాయి. ఉదాహరణకు తొలుత 600 మీటర్ల తర్వాత కాళ్లు బిగుసుకుపోతే అటు తర్వాత అలా బిగుసుకుపోవడం అన్నది 400 మీటర్లకే జరగవచ్చు. అటు పిమ్మట 200 మీటర్లకే బిగుసుకుపోవచ్చు. ఇలా దూరాలు తగ్గుతూ... విశ్రాంతి సమయపు వ్యవధి పెరుగుతూ ΄ోతుంది. ఇలా జరగడాన్ని ‘క్లాడియేషన్ డిస్టాన్సెస్’ అంటారు. ఇది లాంబార్ కెనాల్ స్టెనోసిస్ తాలూకు అత్యంత ప్రధాన లక్షణమని చెప్పవచ్చు. నిర్ధారణ ఇలా... బయటికి (క్లినికల్‌గా) కనిపించే నొప్పి లక్షణాలతో ‘లంబార్ కెనాల్ స్టెనసిస్’ను స్పష్టంగా అనుమానించవచ్చు, కొంతవరకు గుర్తించవచ్చు. అయితే దీని నిర్ధారణ కోసం ఎక్స్‌రే, సీటీ స్కాన్, ఎమ్మారై వంటి ఇమేజింగ్ ప్రక్రియలు బాగా ఉపయోగపడతాయి. ఈ సమస్యతో పాటు ఒకవేళ వెన్నుపూసకీ వెన్నుపూసకీ మధ్యనున్న డిస్క్‌లు అటు ఇటు జరిగితే... అలాంటి డిస్ప్లేస్మెంట్ కూడా సీటీ స్కాన్, ఎమ్మారై వంటి ఇమేజింగ్ ప్రక్రియల్లో కనిపిస్తుంది. డిస్క్‌లు ఇలా స్థానభ్రంశమై కదలి΄ోవడాన్ని ‘హెర్నియేటెడ్ డిస్క్’ అని కూడా పిలుస్తారు. సీటీ స్కాన్ కంటే ఎమ్మారై చాలా ముఖ్యం.వెన్ను నొప్పికి ఒక ప్రధాన కారణం లంబార్ స్టెనోసిస్... నడుము భాగంలోని వెన్నుపూసల మధ్య స్థలం తగ్గడంతో నడుము నొప్పి వస్తుంటుంది. ఇలా ఖాళీ తగ్గినప్పుడు ఈ పూసలు... వాటి మధ్యనుంచి బయటకు వచ్చే నరాలను నొక్కేస్తుంటాయి. నరం తీవ్రంగా నొక్కుకుపోవడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. అయితే నొప్పికి కారణమయ్యేలా వెన్నుపాము ఉండే ‘లంబార్ కెనాల్’లో ఖాళీ తగ్గడాన్ని, తత్ఫలితంగా లంబార్ కెనాల్ ఇరుకుగా మారడాన్ని వైద్య పరిభాషలో ‘లంబార్ కెనాల్ స్టెనోసిస్’ అంటారు. లంబార్ అనేది నడుము దగ్గర ఉండే పూసలు కాబట్టి... అక్కడి ఖాళీ తగ్గింది కాబట్టి నొప్పి ‘నడుము ప్రాంతం’లో వస్తుంటుంది. అయితే ఇది కేవలం నడుము వరకే పరిమితం కాదు. కొన్ని సందర్భాల్లో నడుముకు ఇరువైపులా పిరుదులు, తొడలు, కాళ్లలోనూ నొప్పి కనిపిస్తుంది. చాలాసేపు నడిచినా లేదా ఒకేచోట చాలాసేపు నిలబడ్డా నొప్పి, అలసట ఎక్కువవుతాయి. గతంలో చాలా దూరాలు శ్రమలేకుండా నడిచేవారు కూడా ఇప్పుడు అంతగా నడవలేకపోతున్నామనీ, నడుము లేదా పిరుదులు, తొడలు, కాళ్లలో నొప్పి వస్తుందంటూ కంప్లెయింట్ చేస్తుంటారు. ఇక నడుముతో పాటు కొందరికి నేరుగా వెన్నులోనే నొప్పి కనిపించవచ్చు.వెన్నుపూస సన్నబడ్డట్టు తెలిసేదిలా... వెన్నుపాముని కలిగి ఉండే వెన్నుపూసల మధ్యనుండే ఖాళీ స్థలం ఒకే గది ఉన్న ఇంటి స్థలంలా ఉంటుంది. కిందనుండే డిస్క్ ఫ్లోరింగ్ అనుకుందాం. అప్పుడు పైన ఉండేది కప్పు అవుతుంది. వెన్నుపూస ఖాళీ తగ్గుతున్న కొద్దీ పైనా కిందా ఉండే ఎముక భాగాలు ఉబ్బుకొచ్చినట్లుగా బయటికి వస్తాయి. వీటినే ‘ఆస్టియోఫైట్స్’ అంటారు. ఇవి ఇలా ఉబ్బుకుని వచ్చి లోపలికి పెరుగుతాయి కానీ... ఒకసారి పెరిగినవి మళ్లీ తగ్గే అవకాశం దాదాపుగా ఉండదు. ఇలా పొడుచుకొచ్చినట్లుగా ఉండే ఎముకభాగాల (బోనీ స్ట్రక్చర్స్)కు తోడుగా అక్కడి కణజాలం, మెత్తటి ఎముక (మృదులాస్థి) భాగాలు, లిగమెంట్లు... ఇవన్నీ వాపునకు (అంటే ఇన్ఫ్లమేషన్కు) గురవుతాయి. కేవలం ఎముక మధ్యలో ఉండే ఖాళీ స్థలమే కాకుండా... ఎముకకూ, ఎముకకూ మధ్యన ఉండే రంధ్రం (దీన్ని ఫొరామెన్ అంటారు) కూడా సన్నబారుతుంది. ఎముక మధ్య భాగం ఇంటి ఖాళీ స్థలం అనుకుంటే... దీన్ని ప్రవేశద్వారం అనుకోవచ్చు. అంటే ఇంటి మధ్యభాగంలో ఉన్న స్థలమే కాకుండా... ఇంట్లోకి వచ్చే ప్రదేశద్వారం కూడా సన్నబారిపోతుంది.సన్నగా అవడంతో జరిగేది ఇదీ...ఎముకలోని ఖాళీ భాగాలూ, ఎముక ప్రవేశద్వారం లాంటి ఫొరామెన్ అన్నీ సన్నబడటంతో... ఎన్నెన్నో నరాలు పెనవేసుకుని΄ోయి ఉండే వెన్నుపాము ఒత్తిడికి గురవుతుంది. నడుము భాగం (లంబార్) ప్రాంతం నుంచి కిందికి అంటే శాక్రల్, కాకిక్స్ అనే ప్రాంతాల నుంచి దాదాపు కనీసం 11 నరాల వరకు ఒత్తిడికి గురికావడంతో ఆయా భాగాలకు సప్లై అయ్యే నరాలు బాగా ఒత్తుకు΄ోయి నడుము వెనక భాగం, నడుము కిందిభాగం, పిరుదులు, వెన్ను కిందిభాగం పరిసరాల్లో నొప్పి వస్తుంటుంది. ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ నొప్పి తీవ్రతరమవుతుంటుంది. అందుకే ఈ నరాలు ఒత్తిడికి గురయ్యేందుకు అవకాశమున్న కదలికల్లో... అంటే వ్యక్తులు అకస్మాత్తుగా ముందుకు ఒంగినా, కుర్చీ నుంచి ఒక్కసారిగా లేచినా, అకస్మాత్తుగా కదిలినా తీవ్రమైన నొప్పి వస్తుంది. అంతేకాదు... ఆ నొప్పి... అక్కడికే పరిమితమైపోకుండా... పక్కనుండే పరిసరాల్లోకి పాకినట్లుగా అవుతుంది. దాంతో అవయవం చుట్టుపక్కల ప్రాంతాలూ నొప్పికి గురవుతాయి. అంటే అసలు భాగంలోని కాకుండా ఇలా పక్కలకు నొప్పి పాకడాన్ని ‘రిఫర్డ్ పెయిన్’ అంటారు. ఇలాంటి రిఫర్డ్ పెయిన్ కారణంగా ఈ నొప్పులు ఒక్కోసారి ‘సయాటికా నొప్పి’లాగానే అనిపించవచ్చు. ఇది నొప్పిని అనుకరిస్తున్నట్లుగా ఉండటంతో దీన్ని ‘సయాటికా మిమికింగ్ పెయిన్’ అని కూడా అంటారు. పుట్టుకతో వచ్చే... కంజెనిటల్ స్టెనోసిస్...కొంతమందికి పుట్టుకతోనే వెన్నుపూసల్లోని ఖాళీ స్థలం ఇరుగ్గా ఉండవచ్చు. అయితే వారు పెద్దయ్యాక వెన్నుపూసల మధ్యభాగం ఇరుగ్గా మారి... ఆ వయసులో లక్షణాలు బయటపడవచ్చు. ఇలా పుట్టుకతోనే వెన్నుపూసల మధ్యభాగం సన్నగా ఉండటాన్ని ‘కంజెనిటల్ స్టెనోసిస్’గా పేర్కొంటారు. వీళ్లలోనూ నొప్పి, ఇతర లక్షణాలన్నీ మామూలుగా లంబార్ స్టెనోసిస్తో బాధపడేవారిలాగే ఉంటాయి. కాక΄ోతే వీళ్లది చాలావరకు అనువంశీకంగా వచ్చే సమస్య. కొన్ని అసాధారణమైన ఇతర రకాల నడుము నొప్పులు...ఓ వయస్సు దాటాక (ముఖ్యంగా మధ్యవయస్కుల్లో) నడుం నొప్పి రావడం చాలా సాధారణం. అయితే మరి కొంతమందిలో అసాధారణంగా నడుం నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇందుకు అనేక కారణాలుంటాయి. అవి... పుట్టుకతోనే వెన్నెముకలో లోపాల వల్ల, వెన్నుకు అయ్యే గాయాల వల్ల, ఇన్ఫెక్షన్లు, గడ్డలు, మహిళల్లో మెనోపాజ్, వృద్ధుల్లో ఆస్టియోపోరోసిస్ వల్ల,స్టెరాయిడ్స్ వాడేవారిలో ఎముకలు మెత్తగా అయిపోవడం వల్ల, కొందరిలో స్పైన్ విరగడం, డిస్క్ పక్కకు తొలగడం వల్ల... ఇలా వెన్నుకు వచ్చే నొప్పులకు కారణాలు ఎన్నెన్నో ఉంటాయి. నివారించుకోవడమిలా...స్ట్రెచింగ్‌తో బాలెన్స్నూ, ఇతర ఎక్సర్‌సైజ్‌లతో శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం. రోజూ ఉదయాన్నే వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయడం.వార్మప్ తర్వాతనే ఎక్సర్సైజ్ మొదలుపెట్టడం. (అకస్మాత్తుగా మొదలుపెడితే నడుము పట్టేయడం వంటి అనర్థాలతో వెన్నునొప్పులు మరింత పెరిగే అవకాశం. ఒకే పొజిషన్లో ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్త తీసుకోవడం. (తరచూ అంటే... ప్రతి 20 నుంచి 30 నిమిషాలకు ఓసారి కాసేపటి కోసమైనా సరే... పొజిషన్ మారుస్తూ ఉండటం. నిల్చున్నప్పుడు అవకాశం ఉంటే... స్టూలు వంటి చిన్న ఎత్తుపైనో– కాసేపు ఓ కాలు, ఇంకాసేపు మరో కాలు ఆనిస్తూ నిలబడటం. యోగా వంటివి చేస్తున్నప్పుడు శిక్షణ పొందిన ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో మాత్రమే చేయడం. (తమ బరువుకు తగని ఆసనాలు సొంతంగా వేయడం మంచిది కాదు). ఏదైనా వస్తువును ఎత్తేప్పుడు దానికి సాధ్యమైనంత దగ్గరగా వెళ్లి కూర్చుని ఎత్తడం. (కేవలం నడుం మాత్రమే వంచి, తానే వంగి ఎత్తకుండా మోకాళ్లు కూడా వంచి కూర్చున్న భంగిమలోకి వెళ్లి ఎత్తడం మంచిది. కింది వస్తువులు ఎత్తేటప్పుడు నడుము మీద కాకుండా... తుంటి, మోకాలు భాగాలను వంచి వాటిమీద మాత్రమే ఒత్తిడి పడేలా ఎత్తడం మంచిది. అంతే తప్ప నిలబడ్డవారు ముందుకు ఒంగి ఏదైనా ఎత్తడం సరికాదు)అపోహవెన్నునొప్పి వచ్చినప్పుడు గట్టిగా ఉండే ఉపరితలంపైన పడుకోవాలన్నది ఇప్పటివరకూ ఉన్న ఓ అపోహ. వాస్తవం మరీ మెత్తగా ఉండే పరుపు మీద తప్ప...సౌకర్యంగా(కంఫర్టబుల్)గా ఉన్న ఏ పరుపు మీదైనా పడుకోవచ్చు.చికిత్స...నడుము నొప్పి ఏదైనా మొదట డాక్టర్లు ఫిజియోథెరపీ వ్యాయామాలను సూచిస్తారు. ఇక నొప్పి ఉపశమనం కోసం వేణ్ణీళ్ల కాపడం లేదా ఐస్‌తో కాపడం పెట్టడంతోపాటు అల్ట్రాసౌండ్ తరంగాల చికిత్స, ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ థెరపీ ఇస్తారు. వెన్నుపూసల్లో స్థలం తగ్గి ఆ ఒత్తిడి నరంపై పడుతున్నప్పుడు ఆ నొప్పి భరించలేనిదిగా ఉన్నప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు ఇస్తారు. తట్టుకోలేనంత నొప్పి ఉన్నవారికి కొద్దికాలంపాటు నొప్పినివారణ మందులూ ఇవ్వవచ్చు. (ఇది డాక్టర్లు సూచించిన నిర్ణీత వ్యవధి మేరకే వాడాలి. ఆ తర్వాత కూడా అలా కొనసాగించడం సరికాదు). ఇక తప్పని సందర్భాల్లో చివరి ప్రయత్నంగా శస్త్రచికిత్స అవసరం పడవచ్చు. అయితే ఇప్పుడు మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలతో ఈ తరహా శస్త్రచికిత్సలు మరింత తేలిగ్గా, సులువుగా చేయడం సాధ్యమవుతోంది. -
రూ.16 కోట్ల ఇంజక్షన్.. గుండెల్ని పిండేసే కథ
చిత్రంలో పచ్చటి పచ్చికపై ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులను చూస్తే ముచ్చటేస్తుంది కదా.! కానీ ఆ నవ్వుల వెనుక గుండెల్ని పిండేసే వ్యథ దాగి ఉంది. తప్పటడుగులు కూడా వేయలేని ఆ చిన్నారుల పరిస్థితిని తలుచుకుంటూ వారి తల్లిదండ్రులు మౌనంగా రోదిస్తున్నారు. ‘ఈ బాధ ఇంకెన్నాళ్లు.. అందరం కలిసి ఆత్మహత్య చేసుకుందాం’ అని నిర్ణయించుకున్నారు. కానీ వారిలో ఎక్కడో ఓ ఆశ.. పిల్లలకు వైద్యం చేయించాలన్న తపన.. ఆత్మహత్య ఆలోచనను విరమించుకునేలా చేశాయి. సాక్షి, ఒంగోలు: ఒంగోలుకు చెందిన దండే వినయ్‌కుమార్ బిల్డర్, ఇంటీరియర్ డెకరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈయన భార్య వేదవతితో కలిసి ఉపాధి కోసం హైదరాబాద్ మకాం మార్చారు. అక్కడ వీరికి లాసిత్ అయ్యన్ జన్మించాడు. ఆరు నెలలు గడిచినా కదలిక లేదు. పెద్దల సూచనతో ఏడాది వరకు వేచి చూశారు. కనీసం పక్కకు కూడా పొర్లకపోతుండటంతో ఆస్పత్రుల చుట్టూ తిప్పారు. అయినా ఫలితం లేదు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని రెయిన్ బో ఆస్పత్రిలో జెనెటిక్ పరీక్షలు చేయించగా స్పైనల్ మస్క్యులర్ ఏట్రోఫీ(ఎస్ఎంఏ)–టైప్ 2గా నిర్ధారణ అయింది. ప్రపంచంలో ఎక్కడా మందు లేదని వైద్యులు స్పష్టం చేశారు. బతికినన్నాళ్లు చూసుకోవడమే తప్ప మరో మార్గం లేదని చెప్పడంతో హతాశులయ్యారు. రెండో కుమారుడికీ అదే జబ్బు వినయ్, వేదవతి దంపతులకు మరో కుమారుడు మోక్షిత్ జన్మించగా ఆ చిన్నారికీ ఎస్ఎంఏ టైప్–2 సోకింది. మోక్షిత్ పరిస్థితి తన అన్న కంటే కొంత ఫర్వాలేదు. కొద్దిసేపు కూర్చోగలడు. ఈ చిన్నారులిద్దరూ ఆరోగ్యంగా కనిపిస్తారు కానీ ఏదైనా వస్తువు ఇస్తే చేయి చాచి అందుకోలేరు. కూర్చున్న కాసేపటికే నేలమీద వాలిపోతారు. అసలే బలహీనమైన కండరాలు.. రోజురోజుకూ శక్తి క్షీణిస్తుండటంతో ఆ పిల్లల వ్యధ వర్ణణాతీతం. బిడ్డల్ని బతికించుకోవాలన్న తాపత్రయంలో ఎస్ఎంఏపై వినయ్‌కుమార్ ఎంతో స్టడీ చేశాడు. దేశవ్యాప్తంగా ఈ వ్యాధితో బాధపడుతున్న 400 మందితో ‘‘క్యూర్ ఎస్ఎంఏ ఇండియా’’ అనే సంస్థను స్థాపించి సమాచారం పంచుకుంటున్నారు. అన్నీ అమ్మే.. చిన్నారులిద్దరూ పాఠశాలకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తల్లి వేదవతే విద్యాబుద్ధులు నేర్పుతోంది. వారి తెలివితేటలకు అబ్బురపడుతూ మానసిక క్షోభను మరిచిపోతోంది. ఆరు, ఏడేళ్ల వయసున్న వీరు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడడమే కాదు, జనరల్ నాలెడ్జ్‌పైనా పట్టు సాధించారు. వివిధ అంశాల గురించి వివరంగా చెప్పగల నేర్పు వీరి సొంతం. 2017లో మందులు అందుబాటులోకి.. 2017 డిసెంబర్లో అమెరికాకు చెందిన బయోజిన్ కంపెనీ స్పిన్రజా అనే మెడిసిన్‌ను అందుబాటులోకి తెచ్చింది. తొలి ఏడాది ఐదు ఇంజక్షన్లకు అయ్యే ఖర్చు రూ.5 కోట్లు కాగా.. ఎస్ఎంఏ బాధితులు జీవించినంత కాలం ఇంజక్షన్లు వేసేందుకు మరో రూ.3 కోట్లు వెచ్చించాలి. కొద్దికాలం క్రితం రోచె అనే కంపెనీ రిస్డీ ప్లామ్ అనే ఓరల్ డ్రగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. రోజు ఒక్కో సాచెట్ పిల్లవాడికి ఇవ్వాలి. దీని ఖరీదు రూ.80 వేలు. కానీ జీవితకాలం ఈ సాచెట్లు ఇస్తూనే ఉండాలి. ఇదిలా ఉండగా అవాక్సిస్ కంపెనీ జోల్జెన్ ఎస్ఎంఏ అనే ఇంజక్షన్ అందుబాటోకి తెచ్చింది. ఒక్కసారి ఈ ఇంజక్షన్ చేస్తే వ్యాధి నయమవుతుందని చెబుతున్నారు. దీని ఖరీదు ఏకంగా రూ.16 కోట్లు. అదృష్టవశాత్తు అమెరికాలోని డైరెక్ట్ రిలీఫ్ ఫండ్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఎస్ఎంఏ సోకిన 360 మందిని గుర్తించి జీవితాంతం ఉచితంగా వైద్యం అందించేందుకు ముందుకు వచ్చింది. అందులో మోక్షిత్ ఒకడు. దీంతో త్వరలోనే ఆ చిన్నారి కోలుకుంటాడనే నమ్మకం కలిగింది. సాయం చేసే దాతలు 7799373777, 8977274151ను సంప్రదించవచ్చు. లేదా ఐడీబీఐ బ్యాంక్ అకౌంట్ నం.0738104000057169, ఒంగోలు బ్రాంచ్, ఐఎఫ్ఎస్సీ కోడ్: ఐబీకేఎల్ 0000738కు నగదు అందించాలని చిన్నారుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాయం చేసి ఆదుకోండి నా బిడ్డల ఆరోగ్యం బాగుండుంటే నేనే పది మందికి అండగా ఉండేవాడిని. కానీ ఇటువంటి అరుదైన జబ్బులకు వైద్యం చేయించాలంటే కష్టసాధ్యం. నా ఆస్తి మొత్తం అమ్ముకున్నా తొలి ఏడాది ఒక ఇంజెక్షన్ కూడా వేయించలేను. అందుకే ఇటీవల క్రౌడ్ ఫండింగ్‌కు సంబంధించి ఇంపాక్ట్ గురూలో యోగేష్ గుప్తాకు లభించిన ఆదరణ చూసి ఆన్లైన్లో అప్రోచ్ అయ్యాను. వారు పరిశీలించి ఫండింగ్ సేకరించడం మొదలుపెట్టారు. ఒంగోలుకు చెందిన ఆసిఫ్, అన్వేష్ స్మైల్ ఎగైన్ అనే సంస్థను స్థాపించి సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే మేము ఒక సంస్థ ద్వారా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కలిశాం. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల స్థాయిలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. – దండే వినయ్ కుమార్, వేదవతి చదవండి: విషాదం: రూ.16 కోట్ల ఇంజక్షన్.. ఆ పాప ఇక లేదు 62,400 మంది దాతలు.. రూ.16 కోట్లు.. బాలుడికి పునర్జన్మ -
మిత్రుడి కోసం భిక్షాటన
భువనేశ్వర్ : ఆపదలో ఆదుకున్న వాడే మిత్రుడు అనే ఆంగ్ల సూక్తి తరచూ మన చెవిన పడుతుంటుంది. వాస్తవంగా ఇటువంటి మిత్ర బృందం రాష్ట్రంలో అందరి మన్ననల్ని పొందుతోంది. ప్రమాదవశాత్తు మంచాన పడిన అలోక్ మిత్రులు తోటి మిత్రుని చికిత్స కోసం డబ్బుల కొరత నివారించేందుకు నడుం బిగించారు. పూరీ జిల్లాలోని కృష్ణ ప్రసాద్ సమితి గోపాల్పూర్ గ్రామస్తుడు అలోక్ చిలికా పర్యటనకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా ఇటీవల ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతని వెన్నెముక దెబ్బతింది. చికిత్స కోసం భారీగా వెచ్చించాల్సి ఉంటుందని వైద్యులు ప్రకటించారు. కుటుంబీకులకు ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే. డబ్బు లేకుంటే చికిత్స ముందుకు సాగని దయనీయ పరిస్థితి. స్నేహితుడు మంచాన పడ్డాడు. లేచి తిరుగాడాలంటే ముందుగా డబ్బు పోగు చేయాలి. ఆ తర్వాతే వైద్యం, చికిత్స వగైరా. స్నేహితుడి కోసం భిక్షాటన తప్పు కాదు అలోక్ కుటుంబీకుల మాదిరిగానే స్నేహితుల ఆర్థిక స్తోమత çకూడా అంతంత మాత్రమే. మునుపటిలా మిత్రుడిని తమతో కలిసి తిప్పుకోవాలంటే ఏదో ఒకటి చేయాల్సిందే. చివరికి మిత్రులంతా కలిసి భిక్షాటనకు సిద్ధమయ్యారు. వీధి వీధి తిరుగుదామని నిశ్చయించుకున్నారు. వైద్యుల సలహా మేరకు చికిత్సకు కావలసినంత సొమ్ము పోగు అయ్యేంత వరకు నిరవధికంగా భిక్షాటన చేద్దామని బయల్దేరారు. భిక్షాటన కోసం కాగితంతో ఓ డబ్బా తయారు చేసి వీధిన పడ్డారు. 15 రోజుల పాటు ఊరూ వాడా.. 15 రోజులపాటు వీధులే కాదు ఊరూరా తిరిగారు. నిరవధికంగా భిక్షాటన చేశారు. దాదాపు 15 పైబడి ఇరుగుపొరుగు గ్రామాల్లో తిరిగి చికిత్సకు కావలసినంత సొమ్ము పోగు చేసి మిత్రుని కుటుంబీకులకు అప్పగించారు. ప్రమాదానికి గురైన వెంటనే అలోక్‌ను తొలుత బరంపురం ఎమ్కేసీజీ వైద్య కళాశాలలో చికిత్స కోసం భర్తీ చేశారు. ఉన్నతమైన చికిత్స అవసరం కావడంతో భువనేశ్వర్‌లో పేరొందిన ఆస్పత్రికి తరలించారు. అదే ఆస్పత్రిలో చికిత్స చేసేందుకు తాము పోగుచేసిన నగదును అలోక్ తల్లిదండ్రులకు అతని మిత్రులు అందజేశారు. మొత్తం మీద మిత్రుని వెన్నెముక చికిత్స కోసం అలోక్ మిత్ర బృందం సాయశక్తులా శ్రమించింది. వీరి అంకిత భావంపట్ల భగవంతుడు కరుణించి మిత్రుడు అలోక్ పూర్తి ఆరోగ్యంతో కోలుకుని తిరుగాడతాడని ఆశిద్దాం. -
మనిషి వెన్ను సమస్యలకు బల్లితోకతో పరిష్కారం!!
టొరంటో: తోక తెగిన బల్లులను మనం చాలాసార్లు చూసే ఉంటాం. అలా ఎందుకు తెగుతుందో కూడా మనకు తెలిసిందే. కేవలం శత్రువుల నుంచి తనను తాను కాపాడుకునేందుకే బల్లి తన తోకను తెంపుకుంటుందట. ఈ విషయాన్ని కాసేపు పక్కనబెడితే.. తెగిన తోక మళ్లీ ఎలా పుట్టుకొస్తుంది? బల్లి వెన్నెముక తోక వరకు విస్తరించి ఉంటుంది కదా? మరి వెన్నెముక కూడా కొత్తగా ఎలా పుట్టుకొస్తుంది? ఈ విషయమై పరిశోధన జరిపిన కెనడాలోని గెల్ఫ్ యూనివర్సిటీ పరిశోధకులు.. అందుకు కారణం స్టెమ్సెల్సేనని గుర్తించారు. తెగిపోయిన బల్లి తోక ఎలా పెరుగుతోందో తెలుసుకునే విషయమై ఇప్పటిదాకా జరిగిన పరిశోధనలేవీ కచ్చితమైన సమాధానాన్ని ఇవ్వలేకపోయాయని, అయితే తోకవరకు విస్తరించిన వెన్నుపూసలోని రేడియల్ గ్లియా అనే ప్రత్యేక కణాలు స్టెమ్సెల్స్గా మారి, తోక పునరుత్పత్తికి సహకరిస్తున్నాయని తమ పరిశోధనలో గుర్తించామని పరిశోధకుల్లో ఒకరైన మాథ్యు వికారియస్ వెల్లడించారు. తోక తెగిన వెంటనే ఈ రేడియల్ గ్లియా కణాలు క్రియాశీలకంగా మారి, తోక పెరగడానికి కారణమవుతాయని చెప్పారు. అయితే ఈ పరిశోధనతో మానవ వెన్ను సమస్యలను కూడా పరిష్కరించవచ్చని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. -
నడుము నొప్పికి ఆపరేషన్ ఒక్కటే మార్గమా?
స్పైన్ కౌన్సెలింగ్ నా వయసు 38 ఏళ్లు. కంప్యూటర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. నేను గత కొంతకాలంగా నడుమునొప్పితో బాధపడుతున్నాను. సాధారణ నొప్పే కదా అని అంతగా పట్టించుకోలేదు. కానీ రోజురోజుకూ ఇది క్రమంగా పెరుగుతూ పోతోంది. కాళ్లలోకి పాకుతూ తిమ్మిర్లు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవాళ్లకు వెన్నెముక ఆపరేషన్ చేస్తారని మా బంధువులు కొందరు అంటున్నారు. వెన్నెముకకు ఆపరేషన్ చేస్తే కాళ్లుచేతులు పడిపోతాయని కూడా వారు భయపెడుతున్నారు. నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు. - మాధురి, హైదరాబాద్ మీరు తెలిపిన వివరాలను బట్టి మీరు వెన్ను సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. బరువు ఎక్కువగా ఎత్తడం, ఒకే భంగిమలో గంటలతరబడి కూర్చొని పనిచేయడం, అలవాటు లేని పనిచేయడం లాంటి అనేక కారణాల వల్ల లిగమెంట్లు తెగిపోవడం లేదా కండరాలు టేర్ కావడంతో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాగే వయసుతో పాటు ఆస్టియోపోరోసిస్ వల్ల ఎముక సాంద్రత తగ్గి, బలహీనపడి ఫ్రాక్చర్ అవుతుంది. ఇలాంటి లక్షణాలు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అంతేకాకుండా వెన్నెముకకు ఇన్ఫెక్షన్ సోకినా కూడా అది నొప్పికి కారణమవుతుంది. అయితే వెన్నెముక గాయపడితే తప్ప సాధారణ నడుము నొప్పికి ఎప్పుడు కూడా పూర్త్తిస్థాయి బెడ్రెస్ట్గానీ సర్జరీ గానీ అవసరం ఉండవు. మూడువారాల మందులతో పాటు ఫిజియోథెరపీ చేయించుకుంటే సాధారణ స్థితికి రావచ్చు. అంతేగానీ ఆపరేషన్ చేస్తారనే భయంతో మీరు వైద్యులను సంప్రదించకుండా వాయిదా వేస్తూపోతుంటే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకోండి. వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే వైద్యులు చికిత్స ప్రారంభిస్తారు. దాంతో సమస్య తీవ్రతరం కాకుండా నివారించగలుగుతారు. మీరు వైద్యులను సంప్రదించకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం సమస్య మరింత ముదిరే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ మీకు ఆపరేషన్ అవసరమైనా అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆపరేషన్ చేసే విధానాల్లో అత్యాధునికమైన మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీ వంటి వైద్య ప్రక్రియలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రక్రియలతో సురక్షితంగా, సమర్థంగా, ఎలాంటి దుష్ర్పభావాలు లేకుండా వెన్నెముకకు ఆపరేషన్ చేయవచ్చు. ఈ విధానంలో చిన్న గాటుతోనే శస్త్రచికిత్స సాధ్యమవుతుంది. ఇది కేవలం ఒక అంగుళం లేదా అంతకన్నా తక్కువ పరిమాణంలో ఉంటుంది. దీనిద్వారా సురక్షితంగా ఆపరేషన్ నిర్వహిస్తారు. మినిమల్లీ ఇన్వేసిస్ స్పైన్ సర్జరీలో రోగి త్వరగా కోలుకుంటారు. శస్త్రచికిత్స జరిగిన రోజునే రోగిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారు. కాబట్టి మీరు ఇక ఏమాత్రం ఆందోళనపడకుండా మంచి నిపుణులైన స్పైన్ సర్జన్‌ను కలవండి. డాక్టర్ కిరణ్ కుమార్ లింగుట్ల సీనియర్ స్పైన్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ మింగుతుంటే గొంతునొప్పి.. ఎందుకిలా..? హోమియో కౌన్సెలింగ్ మా పాప వయసు 12 ఏళ్లు. చల్లని వాతావరణం ఏర్పడితే తరచూ జలుబు చేస్తోంది. గొంతులో పుండులా ఏర్పడి, తీవ్రమైన గొంతునొప్పితో బాధపడుతోంది. మింగేప్పుడు ఇబ్బందిగా ఉంటోందని చెబుతోంది. మందులు వాడినప్పుడు సమస్య తగ్గినా, చల్లటి వాతావరణం ఏర్పడితే మళ్లీ సమస్య మామూలే. దీనివల్ల స్కూలుకు వెళ్లలేకపోతోంది. అసలు ఈ సమస్య ఎందుకు ఏర్పడుతోంది. హోమియో చికిత్స ద్వారా పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందా? - ప్రవీణ, భద్రాచలం మీరు తెలిపిన వివరాలను బట్టి మీ పాప ఫ్యారింజైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గొంతు వెనక భాగాన్ని ఫ్యారింగ్స్ అంటారు. ఈ భాగానికి ఇన్ఫెక్షన్ రావడాన్ని ఫ్యారింజైటిస్ లేదా సోర్ థ్రోట్ అంటారు. చల్లటి వాతావరణంలో ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యలలో ఫ్యారింజైటిస్ కూడా ఒకటి. సాధారణంగా ఈ వ్యాధి ఒక వారం రోజలలో తగిపోతుంది. కానీ సరైన చికిత్స అందించకుండా తరచూ ఈ వ్యాధికి గురవుతున్నట్లయితే చెవి ఇన్ఫెక్షన్లు, సైనసైటిస్, కిడ్నీ సంబంధింత వ్యాధులు (గ్లోమరులోనెఫ్రైటిస్), రుమాటిక్ ఫీవర్ వంటి వాటికి దారితీయవచ్చు ఒక్కోసారి శరీరమంతా ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం కూడా ఉంది. కారణాలు : ఈ వ్యాధి 90 శాతం కేసుల్లో వైరస్ వల్ల కలుగుతుంది. జలుబు, ఫ్లూ, మీజిల్స్, మోనోనూక్లియోసిస్, చికన్పాక్స్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ సమస్యకు కారణం కావచ్చు. మరికొంత మందిలో ఇది బ్యాక్టీరియా వల్ల కూడా కావచ్చు. కోరింతదగ్గు, కొన్ని స్టెఫలోకోకస్ సూక్ష్మజీవులు, డిఫ్తీరియా వంటి బ్యాక్టీరియా వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఈ ఇన్ఫెక్షన్కు గురైన వ్యక్తి దగ్గడం లేదా తుమ్ముడం చేసినప్పుడు ఆ తుంపిర్ల ద్వారా వైరస్ లేదా బ్యాక్టీరియా గాల్లోకి చేరి, తద్వారా ఇతర వ్యక్తులకు వ్యాపించే అవకాశం ఉంది. పొగతాగడం, పరిశుభ్రత పాటించకపోవడం, వ్యాధికి గురైన వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వంటి అంశాల వల్ల ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని అలర్జీలు, గొంతుకండరాలు ఒత్తిడికి గురికావడం, గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ), హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు, గొంతు, నాలుక లేదా లారింగ్స్లో కణుతులు ఏర్పడటం వల్ల కూడా గొంతు నొప్పి కలుగుతుంది. లక్షణాలు : ఫ్యారింజైటిస్ ముఖ్యలక్షణాల్లో గొంతునొప్పి, మింగేటప్పుడు నొప్పిగా ఉండటం చాలా ముఖ్యమైనవి. మిగతా లక్షణాలు ఇన్ఫెక్షన్కు కారణమైన బ్యాక్టీరియా లేదా వైరస్ మీద ఆధారపడి ఉంటాయి. వైరల్ ఫ్యారంజైటిస్ : గొంతునొప్పితో పాటు గొంతులోపలి భాగం ఎర్రగా మారడం, ముక్కు కారణం లేదా ముక్కుదిబ్బడ, పొడిదగ్గు, గొంతు బొంగురుపోవడం, కళ్లు ఎర్రబారడం, చిన్న పిల్లల్లో విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్లలో నోటిలో, పెదవులపై పుండ్లలా ఏర్పడటం కూడా సంభవిస్తుంది. బ్యాక్టీరియల్ ఫ్యారంజైటిస్ : దీనిలో కూడా గొంతు పచ్చిగా ఉండటం, మింగే సమయంలో నొప్పి కలగడం, గొంతు ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్లతో పోలిస్తే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలో లక్షణాల తీవ్రత ఎక్కువ. పైన పేర్కొన్న లక్షణాలతో పాటు జ్వరం, ఒంటినొప్పులు, తలనొప్పి, టాన్సిల్స్ వాపు, వాటి చుట్టూ తెల్లటి పొర ఏర్పడటం, గొంతుకు ముందుభాగంలోని లింఫ్‌గ్రంథుల వాపు వంటి లక్షణాలు గమనించవచ్చు. కొంతమంది చిన్నపిల్లల్లో వికారం, వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలూ కనిపించవచ్చు. చికిత్స : ఒంట్లోని రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు సూక్ష్మజీవుల వల్ల ఫ్యారింజైటిస్ వస్తుంది. జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతిలో రోగి శరీర తత్వాన్ని బట్టి, వ్యాధి లక్షణాలు, కారణాలు, వాతావరణంలోని మార్పుల ఆధారంగా చికిత్స చేయవచ్చు. హోమియో విధానంలో చికిత్సతో ఈ వ్యాధిని సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ సమస్యకు దీర్ఘకాలికంగా యాంటీబయాటిక్స్ వాడితే కొన్ని దుష్ర్పభావాలు ఉండవచ్చు. కానీ హోమియో విధానంలో అవేవీ లేకుండా, సమస్య మళ్లీ తిరగబెట్టకుండా చికిత్స చేయడం సాధ్యమవుతుంది. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్