నడుము నొప్పికి ఆపరేషన్ ఒక్కటే మార్గమా?

నడుము నొప్పికి ఆపరేషన్ ఒక్కటే మార్గమా?


స్పైన్ కౌన్సెలింగ్నా వయసు 38 ఏళ్లు. కంప్యూటర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. నేను గత కొంతకాలంగా నడుమునొప్పితో బాధపడుతున్నాను. సాధారణ నొప్పే కదా అని అంతగా పట్టించుకోలేదు. కానీ రోజురోజుకూ ఇది క్రమంగా పెరుగుతూ పోతోంది. కాళ్లలోకి పాకుతూ తిమ్మిర్లు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవాళ్లకు వెన్నెముక ఆపరేషన్ చేస్తారని మా బంధువులు కొందరు అంటున్నారు. వెన్నెముకకు ఆపరేషన్ చేస్తే కాళ్లుచేతులు పడిపోతాయని కూడా వారు భయపెడుతున్నారు. నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు.  - మాధురి, హైదరాబాద్

మీరు తెలిపిన వివరాలను బట్టి మీరు వెన్ను సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. బరువు ఎక్కువగా ఎత్తడం, ఒకే భంగిమలో గంటలతరబడి కూర్చొని పనిచేయడం, అలవాటు లేని పనిచేయడం లాంటి అనేక కారణాల వల్ల లిగమెంట్లు తెగిపోవడం లేదా కండరాలు టేర్ కావడంతో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాగే వయసుతో పాటు ఆస్టియోపోరోసిస్ వల్ల ఎముక సాంద్రత తగ్గి, బలహీనపడి ఫ్రాక్చర్ అవుతుంది. ఇలాంటి లక్షణాలు మహిళల్లో  ఎక్కువగా కనిపిస్తుంటాయి.


అంతేకాకుండా వెన్నెముకకు ఇన్ఫెక్షన్ సోకినా కూడా అది నొప్పికి కారణమవుతుంది. అయితే వెన్నెముక గాయపడితే తప్ప సాధారణ నడుము నొప్పికి ఎప్పుడు కూడా పూర్త్తిస్థాయి బెడ్‌రెస్ట్‌గానీ సర్జరీ గానీ అవసరం ఉండవు. మూడువారాల మందులతో పాటు ఫిజియోథెరపీ చేయించుకుంటే సాధారణ స్థితికి రావచ్చు. అంతేగానీ ఆపరేషన్ చేస్తారనే భయంతో మీరు వైద్యులను సంప్రదించకుండా వాయిదా వేస్తూపోతుంటే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకోండి. వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే వైద్యులు చికిత్స ప్రారంభిస్తారు. దాంతో సమస్య తీవ్రతరం కాకుండా నివారించగలుగుతారు. మీరు వైద్యులను సంప్రదించకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం సమస్య మరింత ముదిరే ప్రమాదం ఉంటుంది.
ఒకవేళ మీకు ఆపరేషన్ అవసరమైనా అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆపరేషన్ చేసే విధానాల్లో అత్యాధునికమైన మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీ వంటి వైద్య ప్రక్రియలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.  ఈ ప్రక్రియలతో సురక్షితంగా, సమర్థంగా, ఎలాంటి దుష్ర్పభావాలు లేకుండా వెన్నెముకకు ఆపరేషన్ చేయవచ్చు. ఈ విధానంలో చిన్న గాటుతోనే శస్త్రచికిత్స సాధ్యమవుతుంది. ఇది కేవలం ఒక అంగుళం లేదా అంతకన్నా తక్కువ పరిమాణంలో ఉంటుంది. దీనిద్వారా సురక్షితంగా ఆపరేషన్ నిర్వహిస్తారు. మినిమల్లీ ఇన్వేసిస్ స్పైన్ సర్జరీలో రోగి త్వరగా కోలుకుంటారు. శస్త్రచికిత్స జరిగిన రోజునే రోగిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారు. కాబట్టి మీరు ఇక ఏమాత్రం ఆందోళనపడకుండా మంచి నిపుణులైన స్పైన్ సర్జన్‌ను కలవండి.డాక్టర్ కిరణ్ కుమార్ లింగుట్ల

సీనియర్ స్పైన్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్


 


మింగుతుంటే గొంతునొప్పి.. ఎందుకిలా..?

హోమియో కౌన్సెలింగ్


మా పాప వయసు 12 ఏళ్లు. చల్లని వాతావరణం ఏర్పడితే తరచూ జలుబు చేస్తోంది. గొంతులో పుండులా ఏర్పడి, తీవ్రమైన గొంతునొప్పితో బాధపడుతోంది. మింగేప్పుడు ఇబ్బందిగా ఉంటోందని చెబుతోంది. మందులు వాడినప్పుడు సమస్య తగ్గినా, చల్లటి వాతావరణం ఏర్పడితే మళ్లీ సమస్య మామూలే. దీనివల్ల స్కూలుకు వెళ్లలేకపోతోంది. అసలు ఈ సమస్య ఎందుకు ఏర్పడుతోంది. హోమియో చికిత్స ద్వారా పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందా? - ప్రవీణ, భద్రాచలం

మీరు తెలిపిన వివరాలను బట్టి మీ పాప ఫ్యారింజైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గొంతు వెనక భాగాన్ని ఫ్యారింగ్స్ అంటారు. ఈ భాగానికి ఇన్ఫెక్షన్ రావడాన్ని ఫ్యారింజైటిస్ లేదా సోర్ థ్రోట్ అంటారు. చల్లటి వాతావరణంలో ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యలలో ఫ్యారింజైటిస్ కూడా ఒకటి. సాధారణంగా ఈ వ్యాధి ఒక వారం రోజలలో తగిపోతుంది. కానీ సరైన చికిత్స అందించకుండా తరచూ ఈ వ్యాధికి గురవుతున్నట్లయితే చెవి ఇన్ఫెక్షన్లు, సైనసైటిస్, కిడ్నీ సంబంధింత వ్యాధులు (గ్లోమరులోనెఫ్రైటిస్), రుమాటిక్ ఫీవర్ వంటి వాటికి దారితీయవచ్చు ఒక్కోసారి శరీరమంతా ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం కూడా ఉంది.


 

కారణాలు :  ఈ వ్యాధి 90 శాతం కేసుల్లో వైరస్ వల్ల కలుగుతుంది. జలుబు, ఫ్లూ, మీజిల్స్, మోనోనూక్లియోసిస్, చికన్‌పాక్స్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ సమస్యకు కారణం కావచ్చు. మరికొంత మందిలో ఇది బ్యాక్టీరియా వల్ల కూడా కావచ్చు. కోరింతదగ్గు, కొన్ని స్టెఫలోకోకస్ సూక్ష్మజీవులు, డిఫ్తీరియా వంటి బ్యాక్టీరియా వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.   ఈ ఇన్ఫెక్షన్‌కు గురైన వ్యక్తి దగ్గడం లేదా తుమ్ముడం చేసినప్పుడు ఆ తుంపిర్ల ద్వారా వైరస్ లేదా బ్యాక్టీరియా గాల్లోకి చేరి, తద్వారా ఇతర వ్యక్తులకు వ్యాపించే అవకాశం ఉంది.  పొగతాగడం, పరిశుభ్రత పాటించకపోవడం, వ్యాధికి గురైన వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వంటి అంశాల వల్ల ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని అలర్జీలు, గొంతుకండరాలు ఒత్తిడికి గురికావడం, గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్‌డీ), హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్లు, గొంతు, నాలుక లేదా లారింగ్స్‌లో కణుతులు ఏర్పడటం వల్ల కూడా గొంతు నొప్పి కలుగుతుంది.


 

లక్షణాలు
: ఫ్యారింజైటిస్ ముఖ్యలక్షణాల్లో గొంతునొప్పి, మింగేటప్పుడు నొప్పిగా ఉండటం చాలా ముఖ్యమైనవి. మిగతా లక్షణాలు ఇన్ఫెక్షన్‌కు కారణమైన బ్యాక్టీరియా లేదా వైరస్ మీద ఆధారపడి ఉంటాయి.


     

వైరల్ ఫ్యారంజైటిస్
: గొంతునొప్పితో పాటు గొంతులోపలి భాగం ఎర్రగా మారడం, ముక్కు కారణం లేదా ముక్కుదిబ్బడ, పొడిదగ్గు, గొంతు బొంగురుపోవడం, కళ్లు ఎర్రబారడం, చిన్న పిల్లల్లో విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్‌లలో నోటిలో, పెదవులపై పుండ్లలా ఏర్పడటం కూడా సంభవిస్తుంది.


బ్యాక్టీరియల్ ఫ్యారంజైటిస్ : దీనిలో కూడా గొంతు పచ్చిగా ఉండటం, మింగే సమయంలో నొప్పి కలగడం, గొంతు ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్‌లతో పోలిస్తే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లలో లక్షణాల తీవ్రత ఎక్కువ. పైన పేర్కొన్న లక్షణాలతో పాటు జ్వరం, ఒంటినొప్పులు, తలనొప్పి, టాన్సిల్స్ వాపు, వాటి చుట్టూ తెల్లటి పొర ఏర్పడటం, గొంతుకు ముందుభాగంలోని లింఫ్‌గ్రంథుల వాపు వంటి లక్షణాలు గమనించవచ్చు. కొంతమంది చిన్నపిల్లల్లో వికారం, వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలూ కనిపించవచ్చు.


 

చికిత్స : ఒంట్లోని రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు సూక్ష్మజీవుల వల్ల ఫ్యారింజైటిస్ వస్తుంది. జెనెటిక్ కన్‌స్టిట్యూషన్ పద్ధతిలో రోగి శరీర తత్వాన్ని బట్టి, వ్యాధి లక్షణాలు, కారణాలు, వాతావరణంలోని మార్పుల ఆధారంగా చికిత్స చేయవచ్చు. హోమియో విధానంలో చికిత్సతో ఈ వ్యాధిని సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ సమస్యకు  దీర్ఘకాలికంగా యాంటీబయాటిక్స్ వాడితే కొన్ని దుష్ర్పభావాలు ఉండవచ్చు. కానీ హోమియో విధానంలో అవేవీ లేకుండా, సమస్య మళ్లీ తిరగబెట్టకుండా చికిత్స చేయడం సాధ్యమవుతుంది.


డాక్టర్  శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి

హోమియోకేర్ ఇంటర్నేషనల్

హైదరాబాద్

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top