స్నేహమంటే ఇదేరా..!  

Begging For Friendship In Orissa - Sakshi

ఆపదలో ఆదుకున్న వారే మిత్రులు

అలోక్‌ మిత్ర బృందం నిలువెత్తు తార్కాణం

భువనేశ్వర్‌ : ఆపదలో ఆదుకున్న వాడే మిత్రుడు అనే ఆంగ్ల సూక్తి తరచూ మన చెవిన పడుతుంటుంది. వాస్తవంగా ఇటువంటి మిత్ర బృందం రాష్ట్రంలో అందరి మన్ననల్ని పొందుతోంది. ప్రమాదవశాత్తు మంచాన పడిన అలోక్‌ మిత్రులు తోటి మిత్రుని చికిత్స కోసం డబ్బుల కొరత నివారించేందుకు నడుం బిగించారు. పూరీ జిల్లాలోని  కృష్ణ ప్రసాద్‌ సమితి గోపాల్‌పూర్‌ గ్రామస్తుడు అలోక్‌ చిలికా పర్యటనకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా ఇటీవల ప్రమాదానికి గురయ్యాడు.  

ఈ ప్రమాదంలో అతని వెన్నెముక దెబ్బతింది. చికిత్స కోసం భారీగా వెచ్చించాల్సి ఉంటుందని వైద్యులు ప్రకటించారు. కుటుంబీకులకు ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే. డబ్బు లేకుంటే చికిత్స ముందుకు సాగని దయనీయ పరిస్థితి. స్నేహితుడు మంచాన పడ్డాడు. లేచి తిరుగాడాలంటే ముందుగా డబ్బు పోగు చేయాలి. ఆ తర్వాతే వైద్యం, చికిత్స వగైరా. 

స్నేహితుడి కోసం భిక్షాటన తప్పు కాదు

అలోక్‌ కుటుంబీకుల మాదిరిగానే స్నేహితుల ఆర్థిక స్తోమత çకూడా అంతంత మాత్రమే. మునుపటిలా మిత్రుడిని తమతో కలిసి తిప్పుకోవాలంటే ఏదో ఒకటి చేయాల్సిందే. చివరికి  మిత్రులంతా కలిసి భిక్షాటనకు సిద్ధమయ్యారు. వీధి వీధి తిరుగుదామని నిశ్చయించుకున్నారు.   వైద్యుల సలహా మేరకు చికిత్సకు కావలసినంత సొమ్ము పోగు అయ్యేంత వరకు నిరవధికంగా భిక్షాటన చేద్దామని బయల్దేరారు. భిక్షాటన కోసం కాగితంతో ఓ డబ్బా తయారు చేసి వీధిన పడ్డారు.

15 రోజుల పాటు ఊరూ వాడా.. 

15 రోజులపాటు వీధులే కాదు ఊరూరా తిరిగారు. నిరవధికంగా భిక్షాటన చేశారు. దాదాపు 15 పైబడి ఇరుగుపొరుగు గ్రామాల్లో తిరిగి చికిత్సకు కావలసినంత సొమ్ము పోగు చేసి మిత్రుని కుటుంబీకులకు అప్పగించారు.  ప్రమాదానికి గురైన వెంటనే అలోక్‌ను తొలుత బరంపురం ఎమ్‌కేసీజీ వైద్య కళాశాలలో చికిత్స కోసం భర్తీ చేశారు. ఉన్నతమైన చికిత్స అవసరం కావడంతో భువనేశ్వర్‌లో పేరొందిన ఆస్పత్రికి తరలించారు.

అదే ఆస్పత్రిలో చికిత్స చేసేందుకు తాము పోగుచేసిన నగదును అలోక్‌ తల్లిదండ్రులకు అతని మిత్రులు అందజేశారు. మొత్తం మీద మిత్రుని వెన్నెముక చికిత్స కోసం అలోక్‌ మిత్ర బృందం సాయశక్తులా శ్రమించింది. వీరి అంకిత భావంపట్ల భగవంతుడు కరుణించి మిత్రుడు అలోక్‌ పూర్తి ఆరోగ్యంతో కోలుకుని తిరుగాడతాడని ఆశిద్దాం.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top