తల్లి కష్టం | Special Story About Varahala Reddy And Laxmi Prabhavathi From West Godavari | Sakshi
Sakshi News home page

తల్లి కష్టం

Sep 29 2020 6:30 AM | Updated on Sep 29 2020 6:30 AM

Special Story About Varahala Reddy And Laxmi Prabhavathi From West Godavari - Sakshi

ఆ తల్లి ఇల్లు కదిలి ఇరవై ఏళ్లు అయిపోతోంది. ఎక్కడకు వెళ్లినా కాసేపట్లోనే ఇంటికి చేరుకోవాలి. ఇంట్లో ఇద్దరు కూతుళ్లున్నారు. కదల్లేరు. మెదల్లేరు. తల్లి రెక్కల బలం మీదే లేచి కూచుంటూ ఉంటారు. మనిషిని జీవచ్ఛవం చేసే కండరాల వ్యాధి ఒకరికి వస్తేనే తట్టుకోవడం కష్టం. ఆ ఇంట ఇద్దరు తోబుట్టువులకు వచ్చింది. ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, కాని తోడు సమాజం ఉందన్న ఆశే వారిని పోరాడేలా చేస్తోంది.

దాదాపు ఆరువందల గడపలు ఉండే అయినపర్రు గ్రామం అది. పశ్చిమ గోదావరి జిల్లా, ఇరగవరం మండలం లో ఉంది. తణుకు నుంచి 20 కిలోమీటర్ల దూరం. చుట్టూ వరి పొలాలతో, చేపల చెరువులతో ప్రశాంతంగా ఉండే ఆ ఊరిలో ఆ ఇల్లు మాత్రం ఒక నిశ్శబ్ద పోరాటం చేస్తోంది. బతుకు కోసం పోరాటం. ఆశ కోసం పోరాటం. ఆరోగ్యం కోసం పోరాటం. కష్టాలను దాటి ఆవలి తీరానికి చేరాలనే పోరాటం. ఆ పోరాటం చేస్తున్నది వరహాల రెడ్డి, లక్ష్మి ప్రభావతి అనే తల్లిదండ్రులు. వారి ఇద్దరు కుమార్తెలు.

మా అమ్మాయికి ఏమైంది?
వరహాల రెడ్డి, లక్ష్మీ ప్రభావతిల పెద్ద కుమార్తెగా నాగలక్ష్మి శారదా దేవి 35 ఏళ్ల క్రితం పుట్టింది. హుషారైన అమ్మాయి. చదువు కోసం బడిలో చేరింది. కూతురు పుట్టింది కదా బాగా చూసుకోవాలి అని ఏదో ఒకటి సంపాదించుకొని రావడానికి వరహాల రెడ్డి గల్ఫ్‌ వెళ్లాడు పని వెతుక్కుంటూ. అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు. కాని నాగలక్ష్మికి పదేళ్లు వచ్చే సరికి నడుస్తూ నడుస్తూ పడిపోయేది. ఏమైందో తల్లిదండ్రులకు అర్థమయ్యేది కాదు. అమ్మాయి కూడా ఎందుకు తాను పడిపోతోందో చెప్పలేకపోయేది. అప్పటికే గల్ఫ్‌ వదిలేసి వచ్చిన వరహాల రెడ్డి భార్యతో పాటు కూతురిని తీసుకొని హాస్పిటల్స్‌కు తిరగడం మొదలుపెట్టాడు. తణుకు వాళ్లు ఏమీ చెప్పలేకపోయారు. హైదరాబాద్‌ నిమ్స్‌ తీసుకు వస్తే తొడ నుంచి కొంత కండరం తీసి పరీక్ష చేయించి ‘మస్క్యులర్‌ డిస్ట్రఫీ’ (కండరాల క్షీణత) అని చెప్పారు. దీనికి మందు లేదని కూడా చెప్పారు.

కాలక్రమంలో ఒక్కో అంగం చచ్చుబడిపోతుందన్న పెద్ద బండరాయి వంటి వార్తను గుండెల మీద పెట్టారు. అప్పటికి ఆ తల్లిదండ్రులు మరో సంతానం గురించి ఆలోచించలేదు. ఇప్పుడు పెద్దమ్మాయికి ఇలా అవడం చూసి ఇక సంతానమే వద్దనుకున్నారు. కాని బంధువులు వినలేదు. మీది మేనరికం కాదు, చుట్టరికం కూడా ఏమీ లేదు.. ఒకమ్మాయికి ఇలా అయితే మళ్లీ పుట్టేవారికి కూడా అవుతుందా.. ఇంకొకరిని కనండి అన్నారు. పెద్దమ్మాయి పుట్టిన సరిగ్గా పన్నెండేళ్లకి జయ సాయిశ్రీ పుట్టింది. ఆ అమ్మాయి కూడా పుట్టినప్పుడు హుషారు పిల్లే. కాని కచ్చితంగా ఐదో క్లాసుకు వచ్చేసరికి అక్కలాగే ఉండి ఉండి నడుస్తూ పడిపోయేది. తల్లిదండ్రుల పై ప్రాణాలు పైనే పోయాయి. మళ్లీ డాక్టర్ల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. మళ్లీ అదే వ్యాధిని నిర్థారించారు. మస్క్యులర్‌ డిస్ట్రఫీ. ఇద్దరు బంగారు తల్లులు పుడితే ఇద్దరి జీవితం ఇలా ప్రమాదంలో పడితే కన్నవారి పరిస్థితి ఎలా ఉంటుంది?

మందు కోసం
పిల్లలకు ఎలాగైనా బాగు చేయించాలని వరహాల రెడ్డి, లక్ష్మీ ప్రభావతి చేయని ప్రయత్నం లేదు. అల్లోపతిలో మందు లేదని చెబుతున్నా ఆశ కొద్ది ఆయుర్వేదం, హోమియోపతి అన్నీ వాడి చూశారు. తెలిసో తెలియకో హైడోస్‌ మందులు కూడా వాడేశారు. ఏమీ ప్రయోజనం లేదు. రకరకాల మందులు వాడటం వల్ల దుష్ప్రభావాలు కూడా మొదలయ్యాయి. ‘ఇక మందులు వాడకండి’ అని డాక్టర్లు గట్టిగా చెప్పాక మానేశారు. ఇప్పుడు పెద్దమ్మాయి నాగలక్ష్మి తల, కొద్దిగా చేతులు మాత్రమే కదల్చగలదు. శరీరంలోని అన్ని కండరాలు క్షీణించి పక్క మీద ఎప్పుడూ పడుకునే ఉంటుంది. రెండో అమ్మాయి జయ సాయిశ్రీ కొద్దిగా చేతులు కదల్చగలదు. కూచోపెడితే కూచోగలదు. వారు ఈ మాత్రమైనా ఉన్నారంటే తాము తీసుకున్న జాగ్రత్త వల్లేనని వరహాల రెడ్డి అంటారు. లేకుంటే కుమార్తెల పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని, దక్కి ఉండేవారు కాదని డాక్టర్లు చెప్పారని తెలిపాడు.

అన్నీ అమ్ముకుని
కుమార్తెల వైద్యానికి వరహాల రెడ్డి తనకున్న రెండెకరాల పొలం అమ్మేశాడు. అది చాలక ఉన్న పెంకుటిల్లును ఆడమానం (తాకట్టు) పెట్టి రెండున్నర లక్షల అప్పు చేశాడు. ఆ అసలు, వడ్డీ ఇప్పుడు నెత్తిమీదకు వచ్చి ఉన్నాయి. ఊళ్లో కొద్దిమంది సాయం చేస్తే చిన్న లేయర్‌ కోళ్ల ఫారమ్‌ వేసి గుడ్లు అమ్ముతూ రోజుకు ఐదారు వందల ఆదాయం మీద బతుకు వెళ్లదీస్తున్నాడు.
ఈ కష్టాలను తాము ఎదుర్కొనగలమనే ఈ నలుగురు నమ్ముతున్నారు. కాకుంటే ఆ పోరాటానికి కావలసిన శక్తి కోసం సమాజం వైపు చూస్తున్నారు. కావలసిందల్లా నేనున్నాను అని సమాజం చెప్పడమే. – గుమ్మడి ఆంజనేయులు సాక్షి ప్రతినిధి, ఇరగవరం, ప.గో.జిల్లా

అన్ని పనులు నేనే
నా ఇద్దరు కూతుళ్ల అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను. వారు టాయ్‌లెట్‌ దాకా కూడా వెళ్లలేరు. ఇంట్లో ఉన్న చోటనే వారి అవసరాలు చూస్తాను. స్నానం చేయిస్తాను. తల దువ్వడం, బట్టలు వేయడం అన్నీ నేనే. ఇల్లు కదిలి ఎక్కడికీ పోను. వెళ్లినా ఏమో ఎలా ఉన్నారో అని అరగంటలో వచ్చేస్తాను. నా పిల్లలు పడే కష్టం చెప్పనలవి కానిది. దేవుడు వారిద్దరికీ ఒకే రకమైన కష్టం తెచ్చినందుకు బాధ పడాలో ఆ కష్టం వల్ల ఒకరికొకరు తోడుగా ఉన్నారని సంతోషపడాలో తెలియడం లేదు. ఏనాటికైనా నా పిల్లలు బాగవుతారనే ఆశతోనే ఉన్నాను. – లక్ష్మీ ప్రభావతి, తల్లి

ప్రభుత్వం పెన్షన్‌ ఇస్తోంది
జగన్‌ ప్రభుత్వం నా ఇద్దరు కూతుళ్లకి చెరొక ఐదు వేల రూపాయలు పెన్షన్‌ ఇస్తుండబట్టి వారి అవసరాలకు, తిండికి జరిగిపోతోంది. నాలుగైదు నెలలుగా కోళ్లు గుడ్లు పెట్టే వయసుకు రావడంతో  వాటి మీద ఎంతోకొంత ఆదాయం వస్తోంది. పెన్షన్‌ రాకపోతే మా గతి ఏమయ్యేదో! – వరహాల రెడ్డి, తండ్రి

అమ్మానాన్నలు అప్పుల నుంచి బయటపడాలి
మా అమ్మానాన్నలకు మేము చేసి పెట్టాల్సిన వయసు. కాని మేము వారి చేత చేయించుకోవాల్సి వస్తోంది. మా ఇంట్లో టీవీ కూడా లేదు. ఎవరైనా దేవుని పుస్తకాలు తెచ్చిస్తే చదువుతుంటాను. మాకు ప్రభుత్వం ఇల్లు ఇస్తే ఆ ఇంట్లోకి మారి మా ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చుకుంటాము. ఇల్లు అమ్ముదామన్నా మేము ఖాళీ చేయలేము అనే భయంతో ఎవరూ కొనడానికి రావడం లేదు. మేం చాలా కష్టాల్లో ఉన్నాము. – నాగలక్ష్మి, పెద్ద కూతురు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement