Happy New Year: ప్రతి కుటుంబం వర్థిల్లు గాక!

Special Article About Happy New Year In Sakshi

కాలం చల్లటి నీడనిచ్చే చెట్టు కావాలి. వడగాడ్పు నుంచి, ఊపి కొట్టే వాన నుంచి, గడ్డ కట్టే చలి నుంచి అది మనుషులను కాయాలి. పంటలు సమృద్ధిగా పండాలి. తియ్యటి మామిడిపండ్లు బండ్ల కొద్దీ మండీలకు చేరాలి. పూలు సలీసుగా దొరకాలి. కొలనుల్లో చేపల వీపులను తామరతూడులు తడమాలి. నదులు ఒండ్రుమట్టిని ఒడ్డుకు తోస్తూ ప్రవహించాలి. సముద్రాలు శాంత వచనాలు పలకాలి.

మహమ్మారులు తోకలు ముడవాలి. ఒకటీ అరా మాత్రలతో తగ్గియే రోగాలే చలామణిలో ఉండాలి. నాలుగు గోడలు లేపినవాడు పైకప్పు వేసుకోగలగాలి. గూడే లేని వాడు ఇంత జాగా సంపాదించుకోవాలి. ఉద్యోగాలు ఇబ్బడి ముబ్బడిగా చేతికందాలి. కాయకష్టం చేసేవాడు బువ్వకు లోటెరగక ఉండాలి. పాలకులు పెద్ద మనసు చేసుకోవాలి. కట్నాలు, లాంఛనాల జంజాటాలు లేక అప్పుల బెంగ ఎరగని పెళ్ళిళ్లు జరగాలి. ఆడపిల్లలు సగౌరవంగా, సురక్షితంగా ఉండాలి. స్త్రీల గెలుపు గాథలు వినిపించాలి. యువతీ యువకుల సబబైన ఇష్టాలు చెల్లుబాటు కావాలి. రహదారులు క్షేమమార్గాలుగా విలసిల్లాలి. సమాజం శాంతితో నిండాలి. అశాంతి కొరకు ప్రయత్నించే ప్రతి చర్యా చతికిలపడాలి. హేతువుకు చోటు దక్కాలి.

ప్రతి ఇల్లు పాలు తేనెల సమృద్ధితో నిండాలి. తాతయ్య, నానమ్మలు కులాసాగా ఉండాలి. అమ్మ చెప్పినట్టు అందరూ వినాలి. నాన్న జేబు ఎప్పుడూ నిండుగా ఉండాలి. పిల్లలు సదా పకపకలాడాలి. చదువులెన్నో బుద్ధిగా చదవాలి. బంధువులందరూ బలగంగా ఉండాలి. స్నేహితులందరూ శక్తిగా మారాలి. కొత్త సంవత్సరం అందరికీ శుభాలు తేవాలి. ప్రతి కుటుంబం వర్థిల్లాలి. మంచిని తలుద్దాం. విశ్వం వింటుంది. గట్టిగా అనుకుందాం. తప్పక నెరవేరుతుంది. హ్యాపీ న్యూ ఇయర్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top