వెండి గాజుల కోసం.. కొడుకు కాదు! | Son lies for silver bangles and halts mother cremation in Jaipur | Sakshi
Sakshi News home page

వెండి గాజుల కోసం.. కొడుకు కాదు!

May 16 2025 5:17 PM | Updated on May 19 2025 12:35 PM

డబ్బుకోసం ఎంత నీచానికైగా దిగజారిపోతున్నాడు మనిషి.  తప్పు చేస్తున్నామన్న భయం, పాపభీతి, ఆందోళన ఇలాంటివన్నీ కనుమరుగై పోతున్నాయి. అందుకే మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు అనిఅంటూ ఏనాడో ఆవేదన వ్యక్తం చేశాడు కవి అందెశ్రీ. కనీస మానవ విలువల్ని మంట గలుపుతూ కన్న బిడ్డలే తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు ఇటీవల కోకొల్లలుగా చూస్తున్నాం. చనిపోయిన తరువాత కూడా తల్లి నగలకోసం ఒక కొడుకు అతి హీనంగా ప్రవర్తించిన ఉదంతం నెట్టింట హృదయ విదారకంగా నిలిచింది. జైపూర్‌లో  జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వెండి ఆభరణాల కోసం  తన సొంత తల్లి దహన సంస్కారాలను అడ్డుకున్నాడో  కొడుకు.  అవి తనకు దక్కేదాకా  అంత్యక్రియలు జరిగేదే లేదంటూ నానా యాగీ చేశాడు. చివరికి ఆమె చితిపై పడుకుని, నన్ను కూడా తగలబెట్టండి అంటూ గొడవ చేశాడు. దీంతో   ఆమె అంతిమ సంస్కార కార్యక్రమాలు రెండు గంటలు నిలిచిపోయాయి. ఈ సంఘటన జైపూర్ గ్రామీణ ప్రాంతంలోని విరాట్‌నగర్ ప్రాంతంలో జరిగింది. దీన్ని  అక్కడున్నవారు వీడియో తీసి సోషల్‌ మీడియలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

ఈ నెల 3న, 80 ఏళ్ల వృద్ధురాలు క​న్నుమూసింది. ఆమె కుమారులు, బంధువులు ఆమె మృతదేహాన్ని అంత్యక్రియల కోసం సమీపంలోని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. మృతురాలిని చితిపై ఉంచే ముందు, కుటుంబ పెద్దలు ఆమె వెండి గాజులు ,ఇతర ఆభరణాలను ఆమె పెద్ద కుమారుడు గిర్ధారి లాల్ కు అప్పగించారు.ఆమె బ్రతికి ఉన్నప్పుడు పెద్ద కుమారుడే ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాడు. అంత్యక్రియలకు సన్నాహాలు జరుగుతుండగాచిన్న కుమారుడు ఓంప్రకాష్ వాగ్వాదానికి దిగాడు. చితిపై పడుకుని, వెండి గాజులు ఇవ్వకపోతే దహన సంస్కారాలు కొనసాగించడానికి వీల్లేదంటూ పట్టుబట్టాడు.

బంధువులు, గ్రామస్తులు  అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయినా వినలేదు పైగా తనను తాను దహనం చేసుకుంటానని బెదిరించాడు. చివరికి, చిర్రెత్తుకొచ్చిన  స్థానికులు   అతన్ని బలవంతంగా చితిరి దూరంగా లాగి కార్యక్రమాన్ని పూర్తిచేశారు. అయినా అతగాడు పక్కనే కూర్చుని తన నిరసనను కొనసాగించాడు. గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం, ఓంప్రకాష్ , అతని సోదరుల మధ్య చాలా కాలంగా ఆస్తి వివాదం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement