నల్గొండ జిల్లా గుండ్రపల్లిలోని మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నర్సిరెడ్డి గాయకుడిగానే కాదు, తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పార్టీల వెనక ఉన్న ఒక సౌండ్ ట్రాక్. ఆయన జానపదపాటలు రాజకీయ ప్రచారాలకు ఇంధనం.పార్టీల వారీగా అభ్యర్థుల సందేశాలను ప్రజల హృదయాలలో ప్రతిధ్వనిస్తుంటాయి. ఆయన ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. దుబాయ్‌లో జరిగిన గామా అవార్డ్స్‌లో గద్దర్ అవార్డు అందుకున్నారు.
‘ఎండలేసిన కోలా అది ఎండి కోలా ఓ నా రామయ్య... బాయిలేసిన కోలా అది బంగరు కోలా ఓ నా సీతమ్మ... కట్టరా కాలు గజ్జె.. కొట్టరా డప్పు దరువు..’ అంటూ నల్గొండ గద్దర్ నర్సన్న సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేసినపాట హుషారు గొలుపుతోంది. ‘సంక్రాంతి అనగానే ఎగరేసిన గాలిపటాలు, ముగ్గులు తొక్కి, తిట్లు తిన్న జ్ఞాపకాలు అన్నీ ముసురుకుంటాయి. ఇప్పటికీ ఆ సరదా నా నుంచి దూరం కాలేదు’ అంటారా యన. సంక్రాంతి సందర్భంగా ‘పాటే పండుగ..’ అంటూ తనపాటల ప్రయాణాన్ని‘సాక్షి’తో పంచుకున్నారు.
ఆ గొంతులో తిరుగుబాటు పలికితే ఎదురేలేదని మనకు అనిపిస్తుంది. ఆ గొంతులో ఆవేదన ధ్వనిస్తే మనకంట కన్నీళ్లు ఉబుకుతాయి.ఆ గొంతులో జానపదం వింటే ప్రతి గుండె జల్లుమంటుంది. నల్గొండ గద్దర్‌గా పేరు పొందిన నర్సన్న చెబుతున్న ముచ్చట్లివి...
‘‘మనస్ఫూర్తిగా పనిచేస్తే ఏదో ఒకరోజు ఆ పని మనల్ని పైకి తీసుకువస్తది. నాపాటే ఆ మాటను నిజం చేసింది. చిన్నప్పటి నుంచి ఏవో లల్లాయిపాటలుపాడుకుంటూ ఉండేవాడిని. ఊళ్లో వ్యవసాయం అంతంత మాత్రం. స్కూల్ చదువులోనే ఎండాకాలంలో ట్రాక్టర్ పనికి పోయేటోణ్ణి. హోటళ్లలో చాయ్ కప్పులు అందించేటోణ్ణి. ఏ చిన్న పని దొరికినా వదలిపెట్టలేదు. కష్టంలో నుంచిపాట తన్నుకు వచ్చేదేమో... ఆ తన్నుకులాటలో గద్దరన్న నా గొంతులో చేరిపోయిండు. ‘నను గన్న తల్లులారా.. తెలంగాణ పల్లెలారా..పాటనై వస్తున్నానమ్మో..’ అంటూపాడితే... విన్నవాళ్లు ‘గద్దర్ లెక్కనేపాడుతుండు’ అని తెగ మెచ్చుకునే వాళ్లు. ఇంతలో చకిలం శ్రీనివాసరావు సార్ దగ్గర 500 జీతంతో కారు డ్రైవర్ పని దొరికింది.
పాటమీద ఇష్టంతో ముందు టేపురికార్డర్ కొనుక్కొనిపాటలు వింటూ అదేపనిగా అవిపాడుతుంటే కొంతమంది విసుక్కున్న సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు ఏపాటపాడినా ‘నీ గొంతులో వందమందిపాటగాళ్లు ఉన్నారేమో’ అని చెబుతూ ఉంటారు. అందుకే అందరి గుండెకు చేరవయ్యానని అనుకుంటాను.పాతికేళ్ల ప్రయాణం నాపాటది. ‘జెండలు జత కట్టడమే నీ అజెండా... ’ అంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సార్‌తోపాటు దక్షిణ భారతదేశంలోని రాజకీయ నాయకుల కోసంపాటలుపాడాను. ‘రంగు రంగులద్దిన సేతితోని మూడు రంగుల జెండ ఎగిరేసి..’ సాంగ్ గొప్ప పేరుతెచ్చింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర అయినా, బీఆర్ అంబెద్కర్, చాకలి ఐలమ్మ... వంటి బహుజనుల గొంతుక అయ్యింది.
పురిటి నొప్పులపాట
ఒక రచయిత కలం నుంచి సాహిత్యం పుట్టాలంటే పురిటి నొప్పులను అనుభవిస్తాడు. అలాగే, గొంతు నుంచి ఆ సాహిత్యంపాట రూపంలో బయటకు రప్పించాలన్నా అంతే కష్టపడాలి. ఈ మధ్యనే ఓ కొత్తపాట రాత్రి సమయంలో రికార్డు మొదలు పెట్టినం. పూర్తయ్యేసరికి తెల్లారింది. ఒక్కోపాట వెనకాల ఎంతో కష్టం ఉంటది. సాధారణంగా తెలంగాణ రచయితలు ట్యూన్ అనుకొనిపాటల రాస్తారు. కానీ, వాళ్లు నన్ను దృష్టిలో పెట్టుకొనిపాటలు రాస్తున్నారు. ప్రతిది టీమ్ సమష్టి విజయమే.
గద్దరన్న అడిగి మరీపాడించుకున్నడు
తెలంగాణ నాటి తరం గాయకులు నాలాంటి వాళ్లను తయారు చేశారు. ఒక్కొక్కరి గొంతు ఒక్కోలా వచ్చింది. నాకు గద్దరన్న గొంతుక వచ్చింది. గద్దరన్న నా చేతపాటలుపాడించుకొని, కోరి మరీ నాతో కలిసిపాడాడు. 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రికార్డింగ్‌లోపాటలుపాడాను. నల్గొండలో రాజకీయ సభ జరిగితే వై.ఎస్. రాజశేఖరరెడ్డి సార్‌తో సహా నట్వర్‌సింగ్, గీతారెడ్డి, జైపాల్ రెడ్డి.. వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఆ వేదికమీదపాడినపాటకు వేదికమీద ఉన్నవాళ్లతో సహా అందరూ డ్యాన్సులు చేశారు. అక్కడే జర్నలిస్టులతో సహా జనమంతా ‘నల్గొండ గద్దర్’ అనే పేరుతో పిలవడం, రాయడం చేశారు. ఆ రోజు నుంచి అదే నా ఇంటి పేరుగా మారిపోయింది.
శివయ్యకు స్వరాభిషేకం..
ఐదేళ్లక్రితం కందికొండన్న శివుడికోసం రాసిన ‘కైలాస దేశం.. కంఠాన విషం... ఎవరమ్మ ఈ జంగమ.. కథలెన్నో రాస్తాడంట...’అనేపాట. మాట్ల తిరుపతి రాసిన, మ్యూజిక్ డైరెక్టర్ రవికళ్యాన్ చేసిన ‘శ్రీశైల శిఖరాన సిరిగల్ల దేవుడా.. అన్నీ నువ్వేనట శివుడో.. మూడు జన్మాల శివుడో .. వచ్చిపోయేటోల్ల సుట్టమయినవంట..’ అంటూపాడినపాటలన్నీ బాగా పేరొందాయి. అందరితోనూ ఆ΄్యాయంగా నర్సన్న అని పిలిపించుకునే అదృష్టాన్ని నాపాట అందించింది. అమ్మ భద్రమ్మ, నాయిన ఆశిరెడ్డి, నా శ్రీమతి లక్ష్మి, పిల్లలు శ్రీహిత, స్నేహిత నన్ను మెచ్చుకునేవాళ్లలో ముందుంటారు’ అంటూ వివరించారు నల్గొండ గద్దర్.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఫొటో: నోముల రాజేశ్‌రెడ్డి


