బండ కింద బతుకులు

Singareni Workers Life Hurdles Etc In Mine  - Sakshi

తెలంగాణ అధికశాతం జీవితం ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ ముడిపడి ఉండేది రెండేరెండిటితో! ఒకటి దుబాయి.. రెండు బొగ్గు బాయి! గల్ఫ్‌ వలస జిందగీ తెలిసినంత వివరంగా బొగ్గుబాయి జీవనాలు తెలియవు. మసిబారిపోయిన ఆ కష్టాలు, కన్నీళ్లు ఒక్కసారిగా అందరి మనసులను కదిలించాయి.. ఈ మధ్య మంచిర్యాల జిల్లాలోని ఎస్‌ఆర్‌పీ 3 బొగ్గు గనిలో పైకప్పు కూలి నలుగురు  కార్మికులు మరణించారనే వారత్తో! బయటకు విద్యుత్‌ కాంతులు పంచుతూ అగాథంలో చీకటిని అనుభవిస్తున్న గనికి మల్లే దాన్ని తవ్విపోసే కార్మికుల బతుకులూ అంతే. బండ కిందకు వెళ్లిన వాళ్లు బయటకు వచ్చేదాకా ఒడ్డునున్న వారికి దడే. ప్రమాదాలతో సహవాసం చేస్తూ నల్లవజ్రాలను వెలికి తీస్తున్న ఆ జీవితాల మీద ఓ కథనం ఇది... 

గనిలో పనిచేసే కార్మికుల రోజు.. ఉదయం 7 గంటలకు మొదలవుతుంది తొలి షిఫ్ట్‌తో. ముందు అంతా మస్టర్‌ (హాజరు) వేయించుకుంటారు. తర్వాత తన పర్సనల్‌ బాక్సులో ఉండే టోపీ, బూట్లు, డ్రెస్సు ధరిస్తారు. అనంతరం గనిలోకి దిగాల్సిన కార్మికులు ల్యాంప్‌ రూములోకి వెళ్లి ల్యాంప్‌ తీసుకుంటారు. పనిని విభజించే డిస్ట్రిబ్యూషన్‌ పాయింట్‌ వద్దకు వెళ్తారు. అక్కడ కార్మికులంతా రక్షణ ప్రతిజ్ఞ చేస్తారు. అక్కడ ఓవర్‌మెన్‌ ఎవరెవరు ఏ పనికి వెళ్లాలో విధులు కేటాయిస్తారు. కేటాయించిన పనుల ఆధారంగా పనిముట్లు తీసుకెళ్తారు. పిట్‌ (గని) స్టోర్‌ రూములో గునపం, చెమ్మాస్, సుత్తి, రాడ్లు తీసుకుంటారు.

మైసమ్మ తల్లికి మొక్కి లైట్‌ ఆన్‌ చేసుకుని మ్యాన్‌రైడింగ్‌ సిస్టమ్‌ ద్వారా గనిలోకి వెళతారు. దాదాపు కిలోమీటరు నుంచి కిలోమీటరున్నర దూరం ప్రయాణించాక దిగుతారు.అక్కడ కొద్దిదూరం నడవాలి. దీని వెనుక శాస్త్రీయ కారణం.. ఉపరితలం నుంచి ఆకస్మికంగా భూగర్భంలోకి వెళ్లినపుడు శ్వాస సరిగా ఆడదు. అందుకే అలా కొద్ది దూరం నడుస్తారు. మ్యాన్‌ రైడింగ్‌ సిస్టమ్‌ నుంచి దిగిన తరువాత కొద్దిదూరం చైర్‌లిఫ్ట్‌ ద్వారా అర కిలోమీటరు నుంచి కిలోమీటరు పైగా వెళ్తారు. పని ఆధారంగా వివిధ లెవెల్స్‌ వద్ద దిగి, వివిధ సీమ్స్‌లోకి కాలినడకన వెళతారు.

 

తలవంచుకునే ఉండాలి..
గనిలో పనిచేయడం అంత సులభం కాదు. గనిని తొలుస్తూ పోయే క్రమంలో చాలాచోట్ల టన్నెల్‌ ఎత్తు 2 నుంచి 2.7 మీటర్లు మాత్రమే ఉంటుంది. మనవాళ్ల సగటు ఎత్తు 5.5 నుంచి 6 అడుగులు. దీంతో దాదాపుగా అందరూ తల వంచుకునే వెళ్లాలి. బరువైన పనిముట్లను భుజాన వేసుకుని వంగి అలా అరకిలోమీటరు నుంచి కిలోమీటరు వరకు నడుస్తూ వెళ్లాలి. లోపల తలపై ఏ రాళ్లు కూలినా టోపీ రక్షిస్తుంది. ఇక వీరికోసమే ప్రత్యేకమైన బూట్లు ఇస్తారు. అవి దాదాపుగా ఒక్కోటి కిలోపైనే బరువు ఉంటాయి. అంతటి బరువైన షూలు వేసుకుని తలవంచుకుని ముందుకు కదలాలి. తక్కువ ఎత్తులో బొగ్గును తవ్వి ఎత్తి పోయాలి. చాలాచోట్ల మెట్లు ఎక్కి దిగాలి. లోపల గ్రీజు, బురద, దుమ్ము – ధూళి రేగుతుంటాయి. తాగునీటికి ఏర్పాట్లు ఉంటాయి.

లైట్‌ చాలా ఇంపార్టెంట్‌
ప్రపంచంలో ఏ బొగ్గుగుని కార్మికుడికైనా లైట్‌ చాలా ఇంపార్టెంట్‌. అది లేకపోతే పని చేయలేరు. ప్రధాన టన్నెల్‌ వెంబడి , పని ప్రదేశాల్లో విద్యుత్‌ లైట్లు ఉంటాయి. మిగిలిన ఉత్పత్తి జరిగే ప్రాంతాల్లో చిమ్మచీకటే. తలపై ఉన్న లైట్‌ లేకపోతే ఎదురుగా ఎవరు ఉన్నారో గుర్తించలేరు. అంత చిమ్మచీకటిలో తలకు ఉన్న లైట్‌ వీరికి తొలిగుర్తింపు. అది బ్యాటరీ లైట్‌. పదేళ్ల కిందటి వరకు యాసిడ్‌ బ్యాటరీలు ఉండేవి. అది దాదాపు 600 గ్రాముల కంటే ఎక్కువ బరువు ఉండేది. దాని నిండా యాసిడ్‌ ఉండేది. లైట్‌ వెలుగుతున్నంత సేపు నడుముకు వేడి తగిలేది. ప్రతిరోజూ చర్మం కమిలిపోయేది. ఒక్కోసారి వేసుకున్న దుస్తులు, చర్మం కాలిపోయేవి. ఆ విషయం కార్మికులు బయటికి వచ్చేవరకు గుర్తించేవారు కాదు.

బొగ్గు ఇలా బయటికి తీస్తారు..
మనం చూసే బొగ్గు లోపల మరోలా ఉంటుంది. భారీ నల్లరాతి శిలలను బ్లాస్టింగ్‌ ద్వారా పేలుస్తారు. అందుకు, ప్రత్యేక శిక్షణ పొందిన కార్మికులు పనిచేస్తారు. మరికొన్నిచోట్ల ప్రత్యేక యంత్రాలతో ఈ బొగ్గు పొరలను తవ్వుతారు. ఆ తర్వాత ఈ బొగ్గును ఎస్‌డీఎల్, ఎల్‌హెచ్‌డీ యంత్రాల ద్వారా చిన్నరైలు టబ్బులు లేదా కన్వేయర్‌ బెల్టుపైకి ఎత్తిపోస్తారు. అలా ఆ బొగ్గు వెలుపలికి పంపుతారు. గనుల్లో ఉత్పత్తి డిమాండ్‌ అధికంగా ఉన్న చోట కన్వేయర్‌ బెల్ట్‌ విధానం, తక్కువగా ఉన్న చోట రైలు టబ్స్‌ను వినియోగిస్తారు. కన్వేయర్‌ బెల్టు అయినా, టబ్స్‌ విధానమైనా బొగ్గు నేరుగా వెళ్లి కోల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌ (సీహెచ్‌పీ)కి చేరుతుంది. అక్కడ నుంచి రైలు వ్యాగన్లను పవర్‌ స్టేషన్‌కు పంపుతారు విద్యుదుత్పత్తి కోసం.

శిలలు కూలడంతోనే సమస్య..
మనం ఇసుకలో పిచ్చుకగూళ్లు కడతాం కదా.. కాస్త తడి ఆరగానే అవి కూలిపోతాయి. అలాగే భూగర్భ గనుల్లోనూ పైకప్పులు కూలిపోతుంటాయి. భూమి పొరలు తొలుస్తూ లోపలికి దాదాపు 5 కిలోమీటర్ల లోతున ఏటవాలుగా ప్రధాన సొరంగం, దానికి ఉపసొరంగాలు ఉంటాయి. కిలోమీటర్ల కొద్దీ తవ్వడంతో అప్పుడప్పుడు లోపలిపొరలు.. సర్దుబాటులో భాగంగా సహజంగానే కదిలి కూలుతుంటాయి. ఆ సమయంలో కార్మికులు కింద ఉంటే సమాధి అవడమే. ఇటీవల శ్రీరాంపూర్‌ గనిలో జరిగింది అదే. అందుకే, రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు. సొరంగం తవ్విన తర్వాత వాటికి రూఫ్‌బోల్టులు బిగిస్తారు. ఇవి కనీసం పదిహేను టన్నుల వరకు బరువును మోయగలుగుతాయి. అంతకు మించితే విరిగిపోతాయి. అంటే పైకప్పుపై భారం పెరిగి కూలే ప్రమాదముందని సంకేతమన్న మాట. అందుకే  ప్రతిరోజూ వీటి సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ‘టెల్‌టేల్‌’ అనే యంత్రాన్ని జంక్షన్ల వద్ద బిగిస్తారు. ఇది పైకప్పు బలహీనంగా మారిన వెంటనే ఎర్రరంగు సూచిస్తుంది. వీటిని ముందుగా సేఫ్టీ ఆఫీసర్‌ తనిఖీ చేస్తారు. ఆయన అంతా బాగుందని అన్నాకే కార్మికులు గనిలోకి దిగుతారు. 

వందల టన్నుల శిలలు..
ఒక్కోసారి ఉదయం పూట తనిఖీ చేసినా.. అకస్మాత్తుగా కూడా పైకప్పులు కూలుతుంటాయి. వందల టన్నుల బరువు ఉన్న భారీ రాతి పెచ్చుల కింద కార్మికులు పడిపోతారు. కేవలం 60 నుంచి 80 కిలోల బరువున్న మానవశరీరం వందల టన్నుల బరువున్న రాతిపెచ్చు కింద పడ్డాక బతికే అవకాశాలు చాలా స్వల్పం. ఇక్కడే సింగరేణి రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగుతుంది. వీలైనంత మేరకు వీరు కార్మికులను కాపాడతారు.

ఫస్ట్‌ఎయిడ్‌ సెంటర్‌...
లోపల పని చేసేక్రమంలో కార్మికులు గాయపడుతుంటారు. గుండెపోటు, బీపీ, కళ్లు తిరగడం, స్పృహతప్పి పడిపోవడం తదితర అనారోగ్య సమస్యలు వెలుగుచూస్తాయి. అందుకే, గనిలో మ్యాన్‌ రైడింగ్‌ సిస్టం సమీపంలోనే ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ వీరికి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మ్యాన్‌రైడింగ్‌ సిస్టమ్‌ ద్వారా పైకి పంపిస్తారు. అక్కడ సిద్ధంగా ఉన్న అంబులెన్స్‌ ద్వారా ఆసుపత్రికి తరలిస్తారు.

రెస్క్యూ కీలకం..
గనిలో జరిగే రెస్క్యూనే కీలకంగా వ్యవహరిస్తారు. ఇందుకోసం ఫిట్‌నెస్‌ ఉన్న గని కార్మికులను ఎంపిక చేసుకుని వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. గనిలో నీటి ప్రమాదం జరిగినా, పైకప్పు కూలినా నిమిషాల్లో.. వీరు వచ్చి గంటల్లోనే శిథిలాలను తొలగించి కార్మికులను కాపాడతారు. వీరి పనితీరుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. పదేళ్ల కిందటి వరకు అంతగా యాంత్రీకరణ లేని సమయంలో గనిలో ప్రమాదాలు నిత్యకృత్యంగా ఉండేవి. కానీ ఇప్పుడు యాంత్రీకరణ, ఆధునిక టెక్నాలజీ ఉపయోగం వల్ల ప్రమాదాలు, ప్రాణనష్టం తగ్గుముఖం పట్టాయి.

సింగరేణి రెస్క్యూ టీం సింగరేణికి మాత్రమే పరిమితం కాదు దేశంలో ఎక్కడ విపత్తులు వచ్చినా వీరు ముందుంటారు. 2004లో జీడీకే –8ఏ గనిలో ప్రమాదం జరిగినప్పుడు  సింగరేణి రెస్క్యూ అందించిన సహకారం మాటల్లో చెప్పలేనిది. గనిపైకప్పు కూలి కార్మికులు అందులో చిక్కుకోవడంతో వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది పడిన కష్టం అంతా ఇంతా కాదు.  కేవలం ఐదు మీటర్ల ఎత్తులోనే ఉన్న గనిపైకప్పు కూలిపోవడంతో కూలిన బండను లేపేందుకు ఎలాంటి యంత్రాలు వినియోగించే అవకాశం ఉండదు. ఈక్రమంలో బండకింద నలిగిన కార్మికులను బయటకు తీయడం పెద్ద సాహసమే.

సింగరేణి యాజమాన్యం కొత్తగా సమకూర్చుకున్న టూల్స్‌ను వినియోగించుకుంటూ కూలిన బండకింద ఉన్న బొగ్గును సొరంగంలా తవ్వి.. దాన్ని తొలగించి శవాలను బయటకు తీయాల్సి వచ్చింది. సింగరేణి రెస్క్యూ ఆవశ్యకతను గుర్తించిన యాజమాన్యం గోదావరిఖనిలోని ౖయెటింక్లయిన్‌కాలనీలో సింగరేణి మెయిన్‌రెస్క్యూ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో 40 మంది బ్రిగేడియర్లు, నితంతర రెస్క్యూ శిక్షణ, ప్రత్యేకంగా జీఎం, సూపరింటెండెంట్‌తో పాటు రెస్క్యూ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. హైడ్రాలిక్‌టూల్స్, కట్టర్లు, స్పెడ్డర్లు, హైడ్రాలిక్‌ జాక్స్, అగ్నిప్రమాదాల నుంచి రక్షించేందుకు ఫైర్‌ఫైటింగ్‌ టూల్స్‌ కూడా ఈ స్టేషన్‌లో నిరంతరం అందుబాటులో ఉంటాయి. 

రక్షణే ప్రథమం.. రక్షణే చివరికి..
సింగరేణిలో రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. బొగ్గు ఉత్పత్తి, రక్షణ.. సంస్థకు రెండు కళ్లలాంటివి. వీటిని సమాంతరంగా చూసుకుంటూ బొగ్గు ఉత్పత్తిపై దృష్టిసారిస్తున్నాం. ఇటీవల శ్రీరాంపూర్‌ ఏరియాలో జరిగిన ప్రమాదంతో మరింత అప్రమత్తం అయ్యాం.  గనుల వారీగా రక్షణ సమావేశాలు నిర్వహిస్తూ అప్రమత్తం చేస్తున్నాం. రక్షణ కోసం గని స్థాయి నుంచి కార్పొరేట్‌ స్థాయివరకు ప్రత్యేక సేఫ్టీ విభాగం పనిచేస్తోంది. నిరంతం శిక్షణ, రక్షణపై సమీక్షలను ఈ విభాగం చూసుకుంటుంది. సేఫ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ను ఫాలో అవుతూ బొగ్గు ఉత్పత్తిపై దృష్టి సారిస్తున్నాం. – కె.నారాయణ, ఆర్జీ–1 జీఎం

ప్రమాదాలు ప్రతికూల వాతావరణం..
భూమి కంటే లోపల వాతావరణం భిన్నంగా ఉంటుంది. లోపలికి వెళ్లిన కొద్దీ ఆక్సిజన్‌ స్థాయి తగ్గిపోతూ ఉంటుంది. అందుకే, ప్రతి గనికి రెండు నుంచి మూడు భారీ ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌లు ఏర్పాటు చేస్తారు. వీటివల్ల లోపలికి– బయటికి నిరంతరంగా.. ధారళంగా గాలి ప్రసరిస్తుంది. అయినప్పటికీ, పలు ప్రాంతాల్లో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గడం సహజమే. అందుకే, ఆక్సిజన్‌తో వెలిగే ల్యాంపులను తీసుకెళ్తారు. ఈ దీపం తక్కువగా వెలిగినా, ఆరినా అక్కడ ఆక్సిజన్‌ స్థాయి పడిపోయిందని అర్థం. వెంటనే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తారు. భూమిలో కిలోమీటర్ల  లోపలి ప్రాంతం కనుక ఇక్కడ సెల్‌ఫోన్లు పనిచేయవు.

కమ్యూనికేషన్‌ కోసం ఇంటర్నల్‌ ల్యాండ్‌లైన్‌ టెలిఫోన్‌ సిస్టమ్, కొన్నిచోట్ల వాకీటాకీలు వాడుతారు. ఎండ తగలదు కాబట్టి ఉష్ణోగ్రత 20 డిగ్రీల లోపు ఉంటుంది. భూప్రకంపనలు, పొరల సర్దుబాటు, అకస్మాత్తుగా వచ్చే ఊట పైకప్పుకు ప్రమాదకరంగా మారుతుంటుంది. ఒక్కోసారి ఊట.. పక్క లెవెల్‌లో నిండిపోయి ఉంటుంది. గోడలు బలహీనమైనప్పుడు బద్దలు కొట్టుకుని వస్తుంది. 2003లో గోదావరిఖనిలోని 7ఎల్‌ఈపీ గనిలో జరిగిన ప్రమాదం ఇలాంటిదే. భారీ ఊట కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు.  ఏడాది తిరగకుండానే (2004లో) గని పై కప్పు కూలి జీడీకే–8ఏ గనిలో 10మంది కార్మికులు మృతి చెందారు.  

గడిచిన ఐదేళ్లలో సింగరేణి వ్యాప్తంగా జరిగిన ప్రమాదాలు

2016 2017 2018 2019 2020 2021
మృతిచెందిన కార్మికులు   12 12 07 08 12 06
తీవ్రంగా గాయపడ్డవారు 218 219 191 138 102 102
 గాయపడ్డ కార్మికులు 429 357 347 217 108 87

మైనింగ్‌ అంటే...
భూమిలోపలి ఖనిజ నిల్వలను పెద్ద ఎత్తున తవ్వి తీయడమే మైనింగ్‌. ఇది సాధారణంగా రెండు రకాలు. 1. ఉపరితల మైనింగ్‌ (ఓసీపీ), 2. భూగర్భ మైనింగ్‌ (అండర్‌గ్రౌండ్‌), గ్రానైట్, ఐరన్, తదితర ఖనిజాలను ఉపరితల మైనింగ్‌ ద్వారా తీస్తారు. రాగి, బంగారం, బొగ్గు తదితర ఖనిజాలను భూగర్భ గనుల నుంచి వెలికి తీస్తుంటారు. ఇప్పుడు సింగరేణిలోనూ ఉపరితల మైనింగ్‌ (ఓపెన్‌కాస్ట్‌ విధానం) అమలవుతోంది. ఇప్పటి వరకు సింగరేణి ప్రాంతంలో ఇంక్లైన్‌ మైనింగ్‌ విధానం అధికం. అంటే ఏటవాలుగా భూమి పైభాగం మూడు నుంచి అయిదు కిలోమీటర్ల లోతువరకు తవ్వుతారు. అంతకు ముందు కిలోమీటర్ల వరకు బోరు వేస్తారు.

బోర్‌వెల్స్‌ ద్వారా బొగ్గు నిల్వలను గుర్తిస్తారు. ఆ శాంపిల్స్‌ ఆధారంగా భూమిలోపల ఎంత లోతులో, ఎంత పరిమాణంలో బొగ్గు, రాతి ఇసుక విస్తరించి ఉన్నాయో గుర్తిస్తారు. వాటిని చేరుకునేందుకు ఏటవాలుగా భూగర్భ గనిని తవ్వుతారు. గరిష్ఠంగా 2.7 మీటర్ల ఎత్తులో ఓ భారీ సొరంగాన్ని భూమి పొరలను బొగ్గు నిక్షేపాలు విస్తరించిన ప్రాంతానికి చివరి వరకు సమాంతరంగా తవ్వుతారు. ఇది గనికి ప్రధాన రహదారిలా ఉంటుంది. దీనికి పైనా.. కిందా అంతస్తుల్లా విభాగాలు ఉంటాయి. వాటిని సీమ్‌–1, సీమ్‌–2, సీమ్‌–3, గరిష్ఠంగా సీమ్‌–4గా విభజిస్తారు. సీమ్‌లో మళ్లీ లెవెల్స్‌ ఉంటాయి. మొదటిది రెయిజింగ్‌ అంటే గనిలో ఎగువ ప్రాంతాన్ని , డీప్‌ అంటే దిగువ ప్రాంతాన్ని సూచిస్తాయి. ఇవి భూగర్భగనిలోని ఒక ప్రాంతానికి పోస్టల్‌ చిరునామాలాంటివి అన్న మాట.

ఈ లెవెల్స్‌లో బొగ్గు నిల్వలను బ్లాకులుగా విభజించి లక్ష్యం ప్రకారం తవ్వి.. బొగ్గు నిల్వలు అయిపోయాక ఆ బ్లాకును ఇసుకతో మూసేస్తారు. లక్షల ఏళ్ల క్రితం గోదావరి లోయలో భారీ భూకంపాలకు ఇక్కడ ఉన్న దండకారణ్యంలోని వృక్షాలు, చెట్లు భూమిలో కలిసిపోయాయి. భూగర్భంలోని వేడికి రసాయనిక చర్యకు గురై బొగ్గుగా రూపాంతరం చెందాయి. ఇది పలుమార్లు జరగడం వల్ల ఒకే చోట పేరుకుపోకుండా రాతి శిలలు, బొగ్గుపొరలు దొంతరల మాదిరిగా ఏర్పడ్డాయి. అందుకే ఈ సీమ్స్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం సింగరేణి యాజమాన్యం ఓపెన్‌కాస్ట్‌లకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ విధానంలో పర్యావరణపరంగా నష్టాలు అధికంగా ఉన్నప్పటికీ.. ఎక్కువ యాంత్రీకరణ, అధిక ఉత్పత్తి, తక్కువ కార్మికులు అవసరమవుతారు. 

అనుక్షణం అప్రమత్తంగా..
సింగరేణిలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరిగినా క్షణాల్లో అక్కడకు చేరేలా రెస్క్యూ బ్రిగేడియర్లు అప్రమత్తంగా ఉంటారు. రెస్క్యూ స్టేషన్‌లో అన్ని ఎక్విప్‌మెంట్స్‌తో పాటు  రెస్క్యూ బ్రిగేడియర్లకు నిరంతర కఠోర సాధన ఉంటుంది. ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండి ఆపదలో ఉన్న ఉద్యోగులను రక్షించడమే ధ్యేయంగా ముందు కెళ్తాం. సింగరేణి వ్యాప్తంగా మూడు రెస్క్యూ రిప్రెషర్‌ ట్రైనింగ్‌ సెంటర్లు, ఒక రెస్క్యూ స్టేషన్‌ ఉన్నాయి. 42 మంది రెస్క్యూ బ్రిగేడియర్లు, ఆరుగురు అధికారులు, 500 రెస్క్యూ ట్రైయినీ పర్సన్లు ఉన్నారు. ఆపదకాలంలో రక్షించేందుకు సుమారు రూ.20కోట్లతో ప్రత్యేక రెస్క్యూ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. – బి.మాధవరావు, రెస్క్యూ సూపరింటెండెంట్‌
-భాషబోయిన అనిల్‌కుమార్‌
ఫొటోలు: సతీశ్‌రెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top