శతక నీతి
‘విద్వాన్ సర్వత్రే పూజతే’
విదురనీతిలో విద్యయే మనిషికి నిజమైన అందం, దాచి పెట్టిన ధనం, దొంగిలించడానికి వీలులేని సంపద అని చెప్తారు. భీష్ముడు ‘నాస్తి విద్యాసమం చక్షు:’ అంటాడు. అంటే విద్యతో సమానమైన కన్ను మరొకటి లేదని. అమరకోశ వాక్యం ప్రకారం పండితులు శ్రేష్తులు.. ‘విద్వాన్ సర్వత్రే పూజతే’ అన్నది సంస్కృత సుభాషితం.
మన జీవితంలో అనునిత్యం ముడి పడే ప్రతి అంశానికి, సందర్భానికి సముచితంగా బోధించే శతకాలు చాలా ఉన్నాయి.. ఒక్కొక సందేశం విలువైన మాట, జీవితాన్ని శాసించే మాట, నిలబెట్టే మాట, సక్రమ మార్గంలో పెట్టే మాట... విద్య విషయంలో శతక నీతులు ఏమని అంటాయంటే..
‘సకల కళా విభూషితులు.... విత్తము లేకయు వారు పూజ్యులే’ అంటారు భర్తృహరి.
‘ప్రభువులు పండితులగువారివలన గర్వకలన మా నుడు వారు మీ కలిమి తృణము లీల బోలింపలేమి మృణాళ గుణము భూరిమదవారణంబె’ అంటే పాండిత్యం ముందు రాజుల సంపద గడ్డిపోచ అని అంటాడు.
‘కేయూరాణి న భూషయన్తి... వాగ్భూషణం భూషణమే’.. ఒకప్పుడు ఆకాశవాణి కేంద్రం ద్వారా ఉదయం వార్తలు తరువాత వినేవాళ్ళం.. దీనర్థం విద్యయే అలంకారం అని.
‘విద్య నిగూఢగుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్
విద్య యశస్సుభోగకరి విద్య గురుండు విదేశబంధుడన్
విద్య విశిష్టదైవతము విద్యకు సాటి ధనంబు లే దిలన్
విద్య నృపాలపూజితము విద్య నెఱుంగనివాడు మర్త్యుడే..'
భావం: విద్యయే సర్వోత్తమం. విద్య ఉంటే అన్ని ఉన్నట్టే. విద్వాంసుల వలనే లోకం నిలుస్తుంది. మహా కవులు, పండితులు మరణించినా కీర్తితో బతికే ఉంటారు.
భర్తృహరి సంస్కృత శతకానికి ఏనుగు లక్ష్మణ కవి చేసిన అనువాదంలో బయటపడ్డ ఆణిముత్యాల సారాంశం ఇదంతా అయితే, వేమన శతకాల్లో .విద్య లేని వాడు వింత పశువులన్నారు. చదువు రాని వాని బ్రతుకంత శూన్యం అన్నాడు..‘చదివినంతనే పండితుండగునే మనుజుడు ‘ అని అన్నాడు..
బద్దెన సుమతీ శతకం లో ‘విద్య నిగూఢగుప్త మగు విత్తం’ అని అన్నారు..
భాస్కర శతకంలో భాస్కరుడు పేరుకు తగ్గట్టు నిత్యం ప్రకాశించే మాట చె΄్పారు..‘విద్యయే భూషణము నరునకు ‘... ఇది ‘కేయూరాణి’కి... దగ్గరలో ఉంది.‘విద్య లేని వాడు వింత మృగంబు రా’ అంటూ వేమన భావాన్నీ వెలిబుచ్చాడు.
రామదాసు శతకంలో రామునే స్మరించినా రామదాసు ‘చదువు రాని వాడు జగములోనూ దద్దమ్మ అని తేల్చేశాడు.
కాళీదాసు మూడు ముఖ్య విషయాలు చె΄్పాడు..‘విద్య వినయ సహితం’ అని,
‘శైశమేభ్యస్త విద్యానం యువనే విషయైషిణామ్’ అంటే
బాల్యంలోనే నేర్చుకోవాలని, ధర్మంగా బతకడం కోసం విద్య అని.
విద్య ద్వారా ఉత్తమ గుణాలను వెలికితీయాలని సెలవిచ్చారు.
విద్య విషయంలో తగిన శ్రద్ధ వహించి, కాలానికి తగ్గట్టుగా చదివి, విషయాలుని సంగ్రహించి, వినయంతో ఉండి, విజ్ఞానాన్ని సంపాదించి, నైతిక విలువలను, మానవ విలువలను పాటిస్తూ, రక్షిస్తూ ధార్మిక జీవితం గడపాలి. – డా. కందాళ సత్యనారాయణ మూర్తి


