
ఆధునిక దేవాలయాలుగా భావించే గ్రంథాలయాలకు ఘన చరిత్రే ఉంది. స్వాతంత్య్రోద్యమ కాలంలో ప్రజలను విజ్ఞానవంతులను చేసి చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించాయి. అలాంటి వాటిలో విజ్ఞాన కాంతులు వెదజల్లే సరస్వతీ నిలయం– శత వసంతాల సారస్వత నికేతనం అతి పురాతనమైనది. ఇప్పటికీ ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో కొనసాగుతున్న ఈ పుస్తక భాండాగారానికి 1918 అక్టోబరు 15న విజయదశమి రోజున బీజం పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా వేటపాలెంలో కొంతమంది యువకులు హిందూ యువజన సంఘంగా ఏర్పడి గ్రంథాలయాన్ని నెలకొల్పారు.
రెండు దినపత్రికలు, మూడు వారపత్రికలు, వంద పుస్తకాలతో ప్రారంభించగా ఆదిలోనే హంసపాదు ఎదురైంది. నిర్వహణ వ్యయం భరించలేక నాలుగేళ్లకే తాళం వేశారు. అప్పట్లో సాహితీ ప్రియుడైన ఊటుకూరు వెంకట సుబ్బరాయ శ్రేష్ఠి సంస్థకున్న అప్పులు తీర్చి, రూ.3 వేలతో మూలనిధి ఏర్పాటు చేశారు. మరో రూ.2 వేలు విరాళంగా అందించారు. 1923లో వేటపాలెం నడిబొడ్డున పెంకుటిల్లు కొని 1924 సెప్టెంబర్‌లో తిరిగి ప్రారంభింపజేశారు.
దానికి ‘సుబ్బరాయ మహల్’గా నామకరణం చేశారు. 1929 ఏప్రిల్ 4న నూతన భవన నిర్మాణానికి మహాత్మాగాంధీ పునాది రాయి వేశారు. ఆ సందర్భంగా ఆయన తన చేతికర్రను జ్ఞాపకంగా ఇక్కడ వదిలివెళ్లారు. సందర్శకులు దాన్ని ఒకమారు తాకి బాపూజీని తాకిన అనుభూతికి గురవుతుండడం విశేషం. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, జమునాలాల్ బజాజ్ చేతుల మీదుగా ప్రారంభమైన నూతన గ్రంథాలయం సారస్వత నికేతనంగా పేరు మార్చుకుంది.
స్మారక మందిరాలు
1933లో బాబూ రాజేంద్రప్రసాద్ భవనం ఎదుట ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. తదుపరి కాలంలో మీనాక్షి కోటిలింగం స్మారక మందిరం, వెంకటేశ్వర విజ్ఞాన మందిరం, శారదాదేవి స్మారక మందిరం నిర్మించారు. శ్రేష్ఠి మరణానంతరం ఆయన సతీమణి కమలమాంబ గ్రంథాలయ బరువు బాధ్యతలు స్వీకరించారు. ఎం.కామయ్య, ఎం.ఆంజనేయశర్మ, కె.సుబ్రహ్మణ్యం గ్రంథ పాలకులుగా వ్యవహరించారు. మహిళలు, వయోజనులు, పాత్రికేయుల కోసం శిక్షణ తరగతులు నిర్వహించేవారు. ముద్రణ, సాహిత్య, సాంస్కృతిక, కళా రంగాల్లో ఆరితేరినవారితో ప్రసంగాలు, చర్చలు ఇక్కడే జరిగేవి.
వేల అక్షరాలు.. లక్ష పుస్తకాలు
వంద పుస్తకాలతో ప్రారంభమైన గ్రంథాలయంలో ఇప్పుడా సంఖ్య లక్షా ఇరవై వేలకు చేరింది. 1942 నుంచి 2025 వరకు అన్ని ప్రధాన తెలుగు దినపత్రికలు లభ్యమవుతాయి. పాత పత్రికలను బైండింగ్ చేసి మరీ భద్రపరచడం విశేషం. వార పత్రికలు, ప్రాచీన, ఆధునిక కవులు, రచయితల సాహిత్యం, గాంధీజీ రచనలు, తాళపత్ర గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి.
పింగళి వెంకయ్య, ఆచార్య ఎన్జీ రంగా, కొండా వెంకటప్పయ్య, దామోదరం సంజీవయ్య, పీవీ నరసింహారావు, బెజవాడ గోపాలరెడ్డి, ఉన్నవ లక్ష్మీనారాయణ, చిలకమర్తి లక్ష్మీనరసింహం, రావూరి భరద్వాజ, చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, ఊటుకూరి లక్ష్మీకాంతం, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, అడివి బాపిరాజు, త్రిపురనేని రామస్వామి చౌదరి, కట్టమంచి రామలింగారెడ్డి, అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరి నాగభూషణం, వావిలాల గోపాలకృష్ణయ్య, వెలగా వెంకటప్పయ్య. జానుమద్ది హనుమచ్ఛాస్త్రి, స్వామి విద్యాప్రకాశనందగిరి, సి.నారాయణరెడ్డి వంటి ప్రముఖులు సారస్వత నికేతనాన్ని సందర్శించారు. పాత్రికేయ సుప్రసిద్ధులు పొత్తూరి వెంకటేశ్వరరావు, నార్ల వెంకటేశ్వరరావు, తుర్లపాటి కుటుంబరావు, నండూరి రామ్మోహనరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ తదితరులు ఇక్కడి పుస్తకాలను పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు.
ఉద్యోగార్థులకు వరం
డిగ్రీ ఉత్తీర్ణులై ఉద్యోగాల వేటలో ఉన్న యువతకు వేటపాలెం గ్రంథాలయం ఒక వరమనే చెప్పాలి. అనేక రకాలైన పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు ప్రతిరోజూ ఇక్కడికొచ్చి పుస్తక పఠనంలో నిమగ్నమవుతారు. ప్రకాశం, గుంటూరు, బాపట్ల జిల్లాల నుంచి దాదాపు 50 మంది వరకు వస్తుంటారు.
పరిశోధనలు చేసే కొందరు విదేశీయులు కూడా అప్పుడప్పుడూ కనిపిస్తారు. మార్కెట్లో దొరకని ఎలాంటి పాత పుస్తకమైనా ఇక్కడ లభ్యం కావడం తథ్యం. ముగ్గురు సిబ్బంది సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సాహితీప్రియులు ఒక్కసారైనా ఈ గ్రంథాలయాన్ని సందర్శించి తీరాలి.
డిజిటలైజేషన్ దిశగా అడుగులు
మా గ్రంథాలయంలో తెలుగు, ఆంగ్లం, హిందీ, సంస్కృతం, ఇంకా ఇతర భాషలకు సంబంధించి లక్షా ఇరవై వేల పుస్తకాలున్నాయి. ప్రాధాన్యత క్రమంలో పుస్తకాలను డిజిటలైజ్ చేయనున్నాం. ఇందుకుగాను ఇండెక్స్ రూపొందించే పనిలో నిమగ్నమయ్యాం. ప్రధానంగా సివిల్స్, గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వే వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు నిత్యం చుట్టుపక్కల ఊళ్ల నుంచి వచ్చి పుస్తక పఠనం గావిస్తారు. పీహెచ్‌డీ పరిశోధక విద్యార్థులు కూడా అధ్యయనం సాగిస్తుంటారు. గ్రంథాలయం రోజూ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. శుక్రవారం సెలవు.
పి.శ్రీవల్లి, గ్రంథాలయాధికారి