పోషకాల పిండివంటలు | Sakshi
Sakshi News home page

పోషకాల పిండివంటలు

Published Sat, Jan 13 2024 12:43 AM

Sankranti festival: Pindi Vantalu Special Story In Family - Sakshi

సంక్రాంతికి మనం రకరకాల పిండివంటలు చేసుకుంటాం. అయితే అవన్నీ ఈ రుతువుకు తగినవనీ, శరీరానికి బలాన్నిస్తాయనే ఉద్దేశంతోనే మన పెద్దలు ఈ పండక్కి ఈ పిండివంటలను నిర్దేశించి ఉండచ్చని వీటిలోని పోషకాలను బట్టి తెలుస్తోంది. ఏయే పిండివంటల్లో ఏయే పోషకాలున్నాయో చూద్దాం. 

అరిసెలు 
సంక్రాంతి పండగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి అరిసెలు. వీటిని పంచదారతో, బెల్లంతో కూడా చేస్తారు కానీ, బెల్లంతో చేసిన అరిసెలు ఆరోగ్యానికి మంచిది. వీటి తయారీలో కొత్త బియ్యపు పిండి, నూనె, బెల్లం, నువ్వులు వాడతారు. ఇందులో వాడే బెల్లం రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. వీటిలో కార్బోహైడ్రేట్లు, ఐరన్ తో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. 

కొబ్బరి బూరెలు
అరిసెల తరవాత అంతటి ప్రధానమైన వంటకం కొబ్బరి బూరెలు. దీంట్లో కొత్త బియ్యపుపిండి, కొబ్బరి, యాలకుల పోడి, బెల్లం వాడతారు. అరిసెలలో ఉన్న పోషకాలతో పాటు కార్బోహైడ్రేట్లు కూడా పుష్కలంగా ఈ కొబ్బరి బూరెల్లో లభిస్తాయి.

నువ్వుల ఉండలు
పరస్పరం నువ్వుల ఉండలు పంచుకోవడం సంక్రాంతి సంప్రదాయాలలో ఒకటి. మంచి బలవర్థకమైన ఆహారం నువ్వుల ఉండలు. శీతాకాలంలో శరీరం పోడిబారిపోతూ ఉంటుంది. ఈ సమయంలో నువ్వులు ఆహారంగా తీసుకోవడం ద్వారా దానిలో ఉండే నూనె శరీరాన్ని కాంతిమంతంగా ఉండేలా దోహదం చేస్తుంది. టీనేజీ బాలికల్లో రక్తహీనతను నివారించడానికి ఉపకరిస్తుంది. శరీరంలో వేడి పుట్టించేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. విటమిన్  ఎ, డి, ఇ, కెలు లభిస్తాయి. దేహదారుఢ్యానికి నువ్వుండలను మించింది లేదు.

జంతికలు
తియ్యటి పదార్థాలు తిన్న జిహ్వ, ఆ వెంటనే కార కారంగా ఉండే వాటిని తినాలనుకోవడం సహజం. కారపు పిండివంటల్లో జంతికలు లేదా సకినాలు ప్రధానమైనవి. బియ్యపు పిండి, శనగపిండి, నువ్వులు, వాము ఇందులో వాడతారు. శనగపిండి, బియ్యపు పిండి కార్బోహైడ్రేట్లను, ప్రోటీన్లను అందిస్తే నువ్వులు చర్మాన్ని కాంతివంతం చేసేందుకు సహకరిస్తాయి. చిన్నపిల్లలు వీటిని ఎక్కువ తింటారు. వీటిలో వాడే వాము సుఖ విరోచనానికి తోడ్పడి.. జీర్ణప్రక్రియ చురుగ్గా ఉండేందుకు దోహదపడుతుంది.

సున్ని ఉండలు
బలవర్థకమైన ఆహారంలో సున్నిఉండలు మొదటిస్థానంలో ఉంటాయి. మినపపిండి, నెయ్యి, బెల్లం వాడతారు. బెల్లం రక్తాన్ని శుద్ధిచేస్తే, సున్ని, నెయ్యి ద్వారాప్రోటీన్లు, పలు రకాల పోషకాలను, శక్తిని అందిస్తాయి. కొత్త అల్లుళ్లకు సున్ని ఉండలు కొసరి కొసరి వడ్డిస్తారు. హోర్మోన్లను సమతుల్యంగా ఉంచడానికి సహకరిస్తుంది. విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగుపడేందుకు ఇవి ఎంతో తోడ్పడతాయి. అతి సర్వత్ర వర్జయేత్‌ అన్నారు. అంటే దేనిలోనూ అతి పనికి రాదు. వంటికి మంచిది కదా.. రుచిగా ఉన్నాయి కదా అని మధుమేహులు, శరీర తత్త్వానికి పడని వాళ్లు తగిన మోతాదులో తీసుకోవడమే ఆరోగ్యకరం అని గుర్తుంచుకోవడం మంచిది.

కజ్జికాయలు
అరిసెలు అంతగా పడని వారు, అంత శ్రమ తీసుకోలేనివారు కజ్జికాయలు చేసుకుంటారు. ఇవి కొంచెం ఎక్కువ కాలం నిల్వ ఉండటంతోపాటు పిల్లలు వీటిని ఇష్టంగా తింటారు. దీనిలో కొబ్బరి, రవ్వ, పంచదార లేదా పల్లీలు, పుట్నాలు, నువ్వులతో పాటు సుగంధ ద్రవ్యాలైన యాలకులు, జీడిపప్పు వంటివి కూడా వినియోగిస్తారు. కజ్జికాయల ద్వారా శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్, ఐరన్ , ఖనిజ లవణాలు అందుతాయి.

గారెలు
సంక్రాంతికి తప్పనిసరిగా వండుకునే వాటిల్లో గారెలు ఒకటి. కనుము నాడు మినుము తింటే మంచిదని పెద్దలు చెబుతారు. అలాగే మినుము తిన్నవాళ్లు ఇనుములా ఉంటారని మరో సామెత. పోట్టు తియ్యని మినుముల్లో పోషకాలు చాలానే ఉంటాయి. రాను రాను పోట్టు తీసిన మినప్పప్పు గారెలకు వాడుతున్నారు. కానీ మినప పోట్టుతో ఉన్న గారెలే ఆరోగ్యానికి శ్రేష్ఠం. మినుములో మాంసకృత్తులతోపాటు అనేక రకాలప్రోటీన్లు, పోషకాలు శరీరానికి లభిస్తాయి.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement