మకర సంక్రాంతి పర్వదినాన ఏం చేస్తే మంచిదా... అని చాలామందికి సందేహం ఉంటుంది. సాధ్యం అయినవాటిని కానీ ఆచరించడం మంచిది. ఈ కింద చెప్పినవి అన్నీ చేస్తే మరీ మంచిది. అవేమిటో తెలుసుకుందాం.
మకర సంక్రాంతి నాడు నువ్వుల పిండిని నలుగు పెట్టుకుని ఒంటికి రాసుకుని స్నానం చేసి ఆ తర్వాత పితృదేవతలకు తర్పణాలు వదలడం వల్ల పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది.
కూష్మాండదానం
సంక్రాంతి, ఉత్తరాయణపుణ్యకాలం ప్రారంభమయ్యే పవిత్రమైన రోజు. ఈ పర్వదినాన గుమ్మడికాయను దానం చేస్తే దేవతలు సంతోషిస్తారు. పితృదేవతల అనుగ్రహంతో వంశాభివృద్ధి జరుగుతుందని పెద్దలంటారు.
గోపూజ
సంక్రాంతినాడు గోపూజ చేసినవారినీ, గోక్షీరంతో పాయసాన్నం వండి తనకు నివేదించి, ఆ ప్రసాదాన్ని స్వీకరించిన వారినీ, ఆవుపేడతో ఇంటిముందు కళ్ళాపుచల్లి ముగ్గులు పెట్టినవారినీ సర్వసంపన్నులను చేస్తానని సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మీదేవే చెప్పినట్లుగా మహాభారతంలోని ఆనుశాసనిక పర్వంలోగల ఓ కథ చెబుతోంది.
పుష్పాలతో పూజ
అదేవిధంగా సంక్రాంతినాడు సువాసన గల పూలతో ఇష్టదేవతాపూజ చేయాలనీ, అలా చేస్తే సకలసుఖాలూ కలుగుతాయనీ మంత్రశాస్త్రం చెబుతోంది. అందుకే పుష్యమాసంలో ఇంటి నిండా పూలు ఉంచాలనీ, పూలవాసనతో, సురలు సంతోషిస్తారనీ, పూలదర్శనంతో యక్షులు తృప్తి పొందుతారనీ, పూలను అనుభవించి నాగదేవతలు ప్రసన్నులౌతారనీ, దేవతలు వరాలనూ, యక్షులు సంపదలనూ, నాగదేవతలు వంశాభివృద్ధినీ, ఆరోగ్యాన్నీ ప్రసాదిస్తారనీ పురాణాలు చెపుతున్నాయి. వాటితో పాటు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం, కలిగినంతలో దానధర్మాలు చేయడం చాలా మంచిదని పెద్దలు చెబుతారు.
– డి.వి.ఆర్.


