
రేపు ఫాదర్స్ డే
నాటి రోజుల్లో నాన్న అంటే సం పాదించేవాడుగా, కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పించేవాడిగా మాత్రమే గుర్తింపు ఉండేది. నేటి సమాజంలో తండ్రి పాత్ర ఒక కొత్త మలుపు తీసుకుంది. కేవలం సంపాదనకే పరిమితం కాకుండా, పిల్లలతో కలిసి ఆడుతూ.. పాడుతూ.. అల్లరి చేస్తూ... వారి ఆలనా పాలనా చూసే మంచి తండ్రి. అభివృద్ధిలో, భావోద్వేగ బంధాలలో, నైతిక విలువల్లో భాగస్వామి అయ్యే లవ్లీ డాడీ!
ప్రస్తుత తల్లిదండ్రుల తరం ‘సమాన భాగస్వామ్యం‘ అనే సిద్ధాంతాన్ని అంగీకరిస్తోంది. తండ్రులు ఇప్పుడు పిల్లల ఆరోగ్యం, విద్య, ఆటలు, వారితో గడిపే సమయం – అన్నిట్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. పాలు పట్టడం నుంచి బడికి తీసుకెళ్లడం వరకు ప్రతి దైనందిన పనిలోనూ తండ్రి పాత్ర కనిపిస్తుంది.
భావోద్వేగాలకు ప్రాధాన్యం
ఈ తరానికి చెందిన తండ్రులు పిల్లలను ఆదేశించేవాళ్లుగా కాదు అన్ని విషయాలు వారితో చర్చించేవాళ్లుగా మారారు. వారి భయాలు, ఆశలు, ప్రశ్నలు, ఆనందాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బంధం పిల్లల మనోభావాలపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది.
వర్క్–లైఫ్ బ్యాలెన్స్
కుటుంబానికి సమయం కేటాయించడం కోసం నేటి తండ్రులు పని సమయంలో సర్దుబాటు చేసుకుంటున్నారు. ‘క్వాలిటీ టైమ్‘ అనే మాట ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. రోజూ కొంత సమయం పిల్లలతో గడపడం, స్కూల్ ఈవెంట్స్‌కు హాజరవడం, వారికి కథలు చెప్పడం వంటి పనులు ఈ తరం తండ్రుల ప్రత్యేకతగా చెప్పవచ్చు.
టెక్నాలజీతో అనుబంధం
ఈ డిజిటల్ యుగంలో తండ్రులు.. పిల్లల విద్య, ఆరోగ్యం, అభివృద్ధి, ఆన్ లైన్ యాప్స్, వీడియో కాల్స్, ఈ– లర్నింగ్ టూల్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. టెక్నాలజీ సహకారంతో పిల్లల ప్రపంచానికి దగ్గరగా ఉంటున్నారు.
ఆధునిక తండ్రి
మోడర్న్ ఫాదర్‌హుడ్ అనేది ప్రేమతో, సహనంతో, బాధ్యతతో కూడినదిగా మారింది. ఒక తండ్రి మోడర్న్‌గా, ప్రేమగా మారినప్పుడు కుటుంబం మారుతుంది. కుటుంబం మారినప్పుడు సమాజం మారుతుంది. ఈ మార్పు ఒక మంచి భవిష్యత్తుకు వేదికగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు.
ఉదాహరణగా తండ్రి
ఓ ఆధునిక తండ్రిగా, సింగిల్ ఫాదర్‌గా ఉండటం అనే అసాధ్యమైన పనిని కూడా నేటి తండ్రులు సుసాధ్యం చేస్తున్నారు. పిల్లల చదువు, భావోద్వేగాలు, వారి భవిష్యత్తునూ చూసుకోవడంపై దృష్టి పెడుతున్నారు. సెలబ్రిటీలు కూడా ఇందుకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నా తండ్రి తనంలో వారు చూపే నిబద్ధతా, ప్రేమా ప్రతి తండ్రికీ ఆదర్శ్ర పాయమే.
కరణ్ జోహర్ సరోగసీ ద్వారా జుహీ, యష్ అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. సింగిల్ డ్యాడ్‌గా ఆయన తన పిల్లలకు ఆదర్శంగా ఉండటమే కాక, తన అనుభవా లను పుస్తక రూపంలోనూ, ఇంటర్వ్యూలలోనూ పంచుకున్నారు.