సృష్టి స్థితి లయలకు మూలం ఆదిపరాశక్తి. ఆమె జగజ్జనని. ఆమె సమస్త భువనాలకు అధినాయిక; సమస్త ప్రాణికోటికి అభయప్రదాత. జగన్మాత ఆరాధన అనాదిగా ఉంది. రాతియుగం నాటి ఆధారాలు ఇందుకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. సింధులోయ నాగరికత కాలంలో ‘లోకమాత’ ఆరాధన ఉండేది. వేదకాలంలో ఈ ఆరాధన మరికొంత వ్యాపించింది. ఋగ్వేదంలోని ‘దేవీసూక్తం’ జగన్మాత స్తోత్రమే! శరదృతు ప్రారంభంలో వచ్చే ఆశ్వయుజ శుక్లపక్ష పాడ్యమి నుంచి దశమి వరకు జగన్మాతను ఆరాధిస్తూ శరన్నవరాత్రులను జరుపుకొంటారు. చివరిరోజైన దశమినాడు దసరా పండుగ జరుపుకొంటారు.
అందుకే వీటిని దసరా నవరాత్రులని కూడా అంటారు. భారత ఉపఖండంలో పలు శక్తిపీఠాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా పద్దెనిమిది శక్తిపీఠాలు ఉన్నాయి. ఇవి అత్యంత ప్రసిద్ధమైనవి. ‘తంత్ర చూడామణి’, ‘పీఠనిర్ణయ’ వంటి శాక్తేయ తంత్రశాస్త్ర గ్రంథాల ప్రకారం యాభైఒక్క శక్తిపీఠాలు ఉన్నాయి. ‘దేవీ భాగవతం’ ప్రకారం నూట ఎనిమిది శక్తిపీఠాలు ఉన్నాయి.
నవరాత్రుల సందర్భంగా కొన్ని అరుదైన శక్తిపీఠాల గురించి, అరుదైన ఆచారాల గురించి తెలుసుకుందాం...
శక్తిపీఠాల ఆవిర్భావం
శక్తిపీఠాల ఆవిర్భావానికి మూలం పురాణాల్లోని ‘దక్షయజ్ఞం’ కథనంలో ఉంది. దక్షప్రజాపతి గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడు. ఆ యజ్ఞానికి ముక్కోటి దేవతలను, ఋషులను ఆహ్వానించాడు కాని, తన అల్లుడైన శివుడిని, కూతురైన సతీదేవిని ఆహ్వానించలేదు. పుట్టింటి మీద మమకారంతో పిలవకపోయినా యజ్ఞానికి వెళతానని సతీదేవి పట్టుబట్టింది. శివుడు వారిస్తున్నా, వినకుండా ఆమె ఒంటరిగా తండ్రి తలపెట్టిన యజ్ఞానికి వెళ్లింది. యజ్ఞానికి వచ్చిన కన్నకూతురిని దక్షుడు కనీసం పలకరించలేదు. దక్షుడికి భయపడి తల్లి కూడా ఆమెను దగ్గరకు తీసుకోలేదు.
యజ్ఞంలో దక్షుడు దేవతలందరికీ హవిర్భాగాలు ఇచ్చి, శివుడికి మాత్రం ఇవ్వలేదు. శివుడికి హవిర్భాగం ఎందుకు ఇవ్వలేదని సతీదేవి నిలదీసింది. కూతురు తనను ప్రశ్నించడంతో దక్షుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. శివుడు శ్మశానవాసి, దిగంబరుడు, మెడలో కపాలమాల ధరిస్తాడు. భూతప్రేత పిశాచాలకు నాయకుడు. అలాంటివాడికి కూతురును ఇచ్చి తప్పు చేశానని, అమంగళుడైన శివుడికి యజ్ఞంలో హవిర్భాగం ఇచ్చి, మరో తప్పు చేయనని నిందించాడు. దక్షుడు శివుడిని దూషిస్తున్నా, దేవతలు, ఋషులు ఎవరూ అతడిని వారించలేదు.
ఈ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి యాగాగ్నిలో ప్రాణత్యాగం చేసింది. సతీదేవి మరణవార్త విని శివుడు దుఃఖావేశాలతో ఊగిపోయాడు. తన జటాజూటం నుంచి ఒక జటను తీసి నేలకేసి కొట్టాడు. దాని నుంచి వీరభద్రుడు, భద్రకాళి ఉద్భవించారు. శివుడి ఆజ్ఞతో వీరభద్రుడు ప్రమధగణాలను వెంటబెట్టుకుని వెళ్లి, దక్షయజ్ఞంపై ఉప్పెనలా విరుచుకు పడ్డాడు. యజ్ఞవాటికలో పెను బీభత్సం సృష్టించి, దక్షుడి తలనరికేశాడు. దక్షుడి తల ఎగిరివెళ్లి యజ్ఞకుండంలో పడి దగ్ధమైపోయింది. ఈ బీభత్సానికి దేవతలు, ఋషులు హాహాకారాలు చేశారు.
బ్రహ్మాది దేవతలు శివుడి వద్దకు వెళ్లి, ప్రార్థించారు. శివుడు శాంతించాడు. దేవతల కోరికపై దక్షుడిని పునర్జీవితుణ్ణి చేశాడు. అప్పటికే అతడి తల కాలిపోవడంతో దేవతలు అతడికి మేకతలను అమర్చారు. సతీవియోగ దుఃఖాన్ని భరించలేని శివుడు, ఆమె మృతదేహాన్ని తన భుజాలపై వేసుకుని, విశ్వమంతటా సంచరిస్తూ రుద్రతాండవం చేయడం ప్రారంభించాడు. శివుడి రౌద్రానికి సృష్టి అంతమయ్యే పరిస్థితి ఏర్పడింది. దేవతలు ఆందోళన చెందారు. వారంతా వెంటనే విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. సతీదేవి శరీరం ఉన్నంత వరకు శివుడు సాధారణ స్థితిలోకి రాడని భావించిన విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి, సతీదేవి శరీరాన్ని ఖండించాడు. సతీదేవి శరీర భాగాలు చెల్లాచెదురుగా నేల మీద పడ్డాయి. అవి పడిన ప్రదేశాల్లో శక్తిపీఠాలు వెలిశాయి.
అరుదైన శక్తిపీఠాలు
వేదకాలంలో వ్యాప్తి మొదలైన శాక్తేయం పురాణయుగం నాటికి పూర్తిస్థాయి తాత్త్విక మార్గంగా రూపాంతరం చెందింది. ఆదిశంకరుల కాలానికి శాక్తేయం దక్షిణాచార, వామాచార మార్గాలుగా విభజన పొందింది. ఆదిశంకరాచార్యులు కొన్ని శక్తిపీఠాలలో శ్రీచక్ర స్థాపన చేయడం ద్వారా తాంత్రిక రూపంగా ఉన్న శాక్తేయానికి సాత్విక రూపాన్ని కల్పించారు. ఆదిశంకర విరచిత స్తోత్రం ప్రకారం అష్టాదశ శక్తిపీఠాలను అత్యంత ప్రధానమైనవిగా పరిగణిస్తారు. ఇవి మాత్రమే కాకుండా, కొన్ని అరుదైన శక్తిపీఠాలు కూడా ఉన్నాయి. వాటిలో విలక్షణమైన ఆచార సంప్రదాయాలు నేటికీ కొనసాగుతున్నాయి. అలాంటి కొన్ని అరుదైన శక్తిపీఠాల విశేషాలు...
విమలా పీఠం
విమలాదేవి శక్తిపీఠం ఒడిశాలోని పూరీ క్షేత్రంలో ఉంది. పూరీలోని జగన్నాథ ఆలయ ప్రాంగణంలోనే నైరుతి దిశలో రోహిణీ కుండానికి సమీపంలో విమలాదేవి ఆలయం ఉంది. సతీదేవి నాభి భాగం ఇక్కడ పడిందని దేవీభాగవత కథనం. పూరీ జగన్నాథుడిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ముందుగా విమాలాదేవిని దర్శించుకోవడం ఇక్కడి ఆచారం. అంతేకాదు, ప్రతిరోజూ జగన్నాథుడికి సమర్పించే ఛప్పన్న నైవేద్యాలను ముందుగా విమలాదేవికి నివేదిస్తారు. విమలాదేవికి నివేదించిన తర్వాతే ఈ నైవేద్యం ‘మహాప్రసాదం’గా మారుతుందని నమ్ముతారు.
పూరీలోని జగన్నాథ ఆలయంలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం శాకాహార నైవేద్యాలను సమర్పిస్తారు. దసరా నవరాత్రులలోని సప్తమి, అష్టమి, నవమి రోజుల్లో మాత్రం వేకువ జామున విమలాదేవికి మత్స్య మాంస నైవేద్యాలను రహస్యంగా సమర్పిస్తారు. జగన్నాథ ఆలయం తెరిచి, ప్రాతః హారతి ఇచ్చేలోపునే ఈ తతంగాన్ని ముగిస్తారు. దసరా నవరాత్రుల సమయంలో విమలాదేవి ఉగ్రరూపంలో ఉంటుందని చెబుతారు. అందువల్ల ఈ రోజుల్లో అమ్మవారి దర్శనానికి మహిళలను అనుమతించరు.
తారా పీఠం
తారాదేవి శక్తిపీఠం పశ్చిమబెంగాల్లోని బీర్భూమ్ జిల్లా రాంపుర్హాట్ సమీపంలో ద్వారకానది ఒడ్డున ఉంది. తారాదేవి ఆలయంలో అత్యంత అరుదైన తాంత్రిక ఆచారాలు ఉన్నాయి. మహాశ్మశాన తంత్ర సాధనకు ఈ శక్తిపీఠం ప్రసిద్ధి పొందింది. సతీదేవి మూడో కన్ను ఇక్కడ పడిందని పురాణాల కథనం. ఆధునిక కాలంలో బామఖ్యాపగా పేరుపొందిన బామచరణ ఛటోపాధ్యాయ అనే సాధువు ఇక్కడ తారాదేవి సాధన చేసి, సిద్ధి పొందినట్లు ప్రతీతి.
తారాపీఠం గర్భగుడిలో రెండు విగ్రహాలు ఉంటాయి. ఒకటి భక్తులకు నేరుగా కనిపించే శిలా విగ్రహం. ఇది శివుడికి పాలిస్తున్న తల్లిగా కనిస్తుంది. దీని వెనుకనే మూడడుగుల లోహ విగ్రహం తారాదేవి ఉగ్రరూపంలో ఉంటుంది. లోహవిగ్రహంపై నిత్యం ఎర్రని సిందూరాన్ని పూసి ఉంచుతారు. ఈ శక్తిపీఠంలో కొబ్బరికాయలు, పండ్లు వంటి వాటితో పాటు మద్య, మాంస నైవేద్యాలను నిత్యం సమర్పిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో యాభైఒక్క శక్తిపీఠాల ప్రతిరూపాలు కూడా ఉన్నాయి.
దక్షిణకాళీ పీఠం
దక్షిణకాళీ శక్తిపీఠం పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని కాళీఘాట్ ప్రాంతంలో ఉంది. హుగ్లీ నదీతీరంలో వెలసిన ఈ శక్తిపీఠంలో దక్షిణకాళిని భక్తులు ‘భవతారిణి’గా– అంటే, భవసాగరాన్ని దాటించే దేవతగా కొలుస్తారు. సతీదేవి కుడికాలి వేళ్లు ఈ ప్రదేశంలో పడ్డాయని పురాణ కథనం. ఈ ఆలయంలో కాళికాదేవి నల్లరాతి విగ్రహం ఉగ్రరూపంలో పెద్ద కళ్లతో, బయటకు చాపిన బంగారు నాలుకతో దర్శనమిస్తుంది.
ఈ ఆలయంలో అరుదైన ఆచారాలు అమలులో ఉన్నాయి. ప్రతినెలా అమావాస్య రోజున ఈ ఆలయంలో ప్రత్యేక హోమాలు, రహస్య పూజలు చేస్తారు. అమ్మవారికి ఎరుపురంగు వస్త్రాలు, గాజులు సమర్పిస్తారు. ప్రతిరోజూ మధ్యాహ్న వేళ మాంస నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈ నైవేద్యం కోసం ప్రత్యేకంగా ఉల్లి, వెల్లుల్లి ఉపయోగించకుండా, అల్లం దట్టించి నేతితో వండిన మేకమాంసం వంటకాలను అమ్మవారికి నివేదిస్తారు. దసరా నవరాత్రి వేడుకలు, కాళికాపూజ పర్వదినం సందర్భంగా ఈ శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు, హోమాలు జరుపుతారు.
త్రిపురసుందరీ పీఠం
త్రిపురసుందరీ శక్తిపీఠం త్రిపురలోని ఉదయపూర్‌లో ఉంది. ఈ శక్తిపీఠంలో అమ్మవారి విగ్రహం కూర్మపీఠంపై కనిపిస్తుంది. ఈ ఆలయం వెనుక ‘కల్యాణసాగర్’ అనే పెద్దచెరువు ఉంటుంది. అందులో వందలాది ఏళ్లనాటి తాబేళ్లు పెద్ద సంఖ్యలో ఉంటాయి. సతీదేవి ఎడమకాలి చిటికెన వేలు ఇక్కడ పడిందని పురాణ కథనం. త్రిపురసుందరీ దేవిని ఇక్కడి స్థానికులు త్రిపురేశ్వరిగా, మాతాబరిగా కొలుస్తారు. ఇక్కడ అమ్మవారికి దూద్పెడా వంటి సాత్విక నైవేద్యాలతో పాటు నిత్యం మాంస నైవేద్యాలను కూడా సమర్పిస్తారు. ఇక్కడ గర్భగుడిలో రెండు విగ్రహాలు ఉంటాయి.
ఒకటి త్రిపురసుందరీ దేవి పెద్ద రాత్రి విగ్రహం, మరొకటి చిన్నరాతి విగ్రహం. చిన్నరాతి విగ్రహాన్ని భక్తులు ‘ఛొటొ మా’– అంటే, చిన్నతల్లిగా పూజిస్తారు. ఇక్కడ అమ్మవారిని షోడశి రూపంలో ఆరాధిస్తారు. ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజూ మధ్యాహ్న నైవేద్యం కోసం జంతుబలులు జరుగుతాయి. భక్తులు ఈ ఆలయంలో పూజలు జరిపాక ఆలయం వెనుకనే ఉన్న కల్యాణసాగర్ చెరువులోని తాబేళ్లకు పేలాలు తినిపించడం ఆచారంగా వస్తోంది. స్థానిక జమాతియా తెగకు చెందిన గిరిజనులు ఏటా తమ గరియా పూజ వేడుకకు ముందుగా ఇక్కడి అమ్మవారిని దర్శించుకోవడం ఆచారంగా కొనసాగుతోంది. దసరా నవరాత్రులతో పాటు దీపావళి రోజున ఇక్కడ కాళీపూజ సందర్భంగా ప్రత్యేక హోమాలు, పూజలు జరుపుతారు.
జ్వాలాముఖి పీఠం
జ్వాలముఖి శక్తిపీఠం హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా జిల్లాలోని శివాలిక్ పర్వతశ్రేణులపై ఉంది. జ్వాలాముఖి ఆలయంలో అమ్మవారి విగ్రహం ఉండదు. ఆలయం లోపలి రాతిపగుళ్ల నుంచి నిత్యం ఆరని తొమ్మిది జ్వాలలు మండుతూ ఉంటాయి. వీటినే అమ్మవారి ప్రతిరూపంగా భావించి పూజిస్తుంటారు. ఈ ప్రదేశంలో సతీదేవి నాలుక పడినట్లు పురాణాల కథనం. భక్తులు ఇక్కడి అమ్మవారికి రబ్డీ, ఇతర మిఠాయిలు, పటికబెల్లం, ఒకరకం ధాన్యపు పొడితో తయారుచేసే ‘సతోజా’ అనే నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఎర్రని వస్త్రాలు, గాజులు కానుకలుగా సమర్పిస్తారు. మొక్కుకున్నవారు కొబ్బరికాయలు కొడతారు. చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రుల్లోను, ఆశ్వయుజమాసంలో వచ్చే దసరా నవరాత్రుల్లోను ఈ శక్తిపీఠంలో ప్రత్యేక తాంత్రిక పూజలు, బలులు జరుపుతారు.
బగళాముఖి పీఠం
బగళాముఖి శక్తిపీఠం మధ్యప్రదేశ్‌లోని మాల్వా జిల్లా నల్ఖేడాలో లఖుందర్ నది ఒడ్డున శ్మశాన వాటిక నడిబొడ్డున ఉంది. పురాణాల్లో ఈ నదిని లక్ష్మణా నదిగా పేర్కొన్నారు. ఇక్కడి అమ్మవారు స్వయంభువుగా వెలసినట్లు భక్తులు విశ్వసిస్తారు. శ్రీకృష్ణుడి ఆదేశంపై ధర్మరాజు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ శక్తిపీఠంలో అమ్మవారు త్రిశక్తి రూపంలో వెలసింది. ఇక్కడ బగళాముఖి విగ్రహానికి కుడివైపున మహాలక్ష్మి, ఎడమవైపున సరస్వతి విగ్రహాలు కనిపిస్తాయి. బగళాముఖిని పీతాంబరీదేవిగా కొలుస్తారు.
ఈ ఆలయంలో అమ్మవారికి పసుపురంగు వస్త్రాలను, గాజులను, పువ్వులను, నైవేద్యాలను సమర్పిస్తారు. బగళాముఖిని స్తంభనశక్తికి అధిదేవతగా ఆరాధిస్తారు. కోర్టు వివాదాల్లో ఉన్నవారు, రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై గెలుపు కోసం బగళాముఖికి ప్రత్యేక పూజలు జరుపుతారు. శత్రు నివారణ కోసం ఎండు మిరపకాయలతో హోమం జరుపుతారు. ఈ ఆలయం శ్మశాన వాటిక నడిబొడ్డున ఉండటం వల్ల ఇక్కడ తాంత్రిక పూజలు జరుపుతారు. ఈ ఆలయ ప్రాంగణంలో శతాబ్దాలుగా వెలుగుతున్న అఖండజ్యోతి ఉంది. ఈ అఖండజ్యోతిని దర్శించుకుంటే కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. దసరా నవరాత్రులు, బగళాముఖి జయంతి రోజుల్లో ఇక్కడ విశేషంగా తాంత్రిక పూజలు జరుపుతారు.
అష్టాదశ శక్తిపీఠాలు
లంకాయాం శాంకరీ దేవీ కామాక్షీ కంచికాపురే
ప్రద్యుమ్నే శృంఖలాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబా శ్రీశైలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాధుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహంకాళీ పీఠికాయాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవీ మాణిక్యా దక్షవాటికే.
హరిక్షేత్రే కామరూపా ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీ దేవీ, గయా మాంగల్యగౌరికా
వారాణస్యాం విశాలాక్షీ కాశ్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినా మపి దుర్లభమ్.
ఆదిశంకర విరచితమైన ఈ స్తోత్రం అష్టాదశ శక్తిపీఠాలను ప్రస్తావిస్తోంది. వీటిలో శాంకరీ పీఠం శ్రీలంకలోని త్రింకోమలిలో ఉంది. కామాక్షీ పీఠం తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. శృంఖలాపీఠం పశ్చిమబెంగాల్లోని హుగ్లీలో ఉంది. చాముండీ పీఠం కర్ణాటకలోని మైసూరులో ఉంది. జోగులాంబ తెలంగాణలోని ఆలంపురంలో ఉంది. భ్రమరాంబికా పీఠం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలంలో ఉంది.
మహాలక్ష్మీ పీఠం మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉంది. ఏకవీరికా పీఠం మహారాష్ట్రలోని మాహూర్‌లో ఉంది. మహాకాళీ పీఠం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది. పురుహూతికా పీఠం ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురంలో ఉంది. గిరిజా పీఠం ఒడిశాలోని జాజ్పూర్లో ఉంది. మాణిక్యాంబ పీఠం ఆంధ్రప్రదేశ్‌లోని ద్రాక్షారామంలో ఉంది. మాధవేశ్వరీ పీఠం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉంది. వైష్ణవీపీఠం హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రాలో ఉంది. మంగళగౌరీ పీఠం బిహార్‌లోని గయలో ఉంది. సరస్వతీ పీఠం పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో ఉంది.
అరుదైన దసరా ఆచారాలు
కొన్ని శక్తిపీఠాల్లో దసరా నవరాత్రుల సందర్భంగా అరుదైన ఆచారాలను పాటిస్తారు. దసరా సందర్భంగా వివిధ ప్రాంతాల్లో కొన్ని విలక్షణమైన ఆచారాలను పాటిస్తారు. అలాంటి కొన్ని అరుదైన దసరా ఆచారాలు...
అన్ని ప్రాంతాల్లోనూ దసరా వేడుకలను పదిరోజులు జరుపుకొంటారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో మాత్రం దసరా వేడుకలను ఏకంగా డెబ్బయి ఐదు రోజుల పాటు జరుపుకొంటారు. ‘బస్తర్ దసరా’ అత్యంత సుదీర్ఘ దసరా వేడుకగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆచారం పదిహేనో శతాబ్ది తొలినాళ్ల నుంచి ఇక్కడ కొనసాగుతోంది. కాకతీయ వంశానికి చెందిన పురుషోత్తమ దేవుడి కాలంలో 1408 నుంచి ఇక్కడ డెబ్బయి ఐదు రోజుల దసరా వేడుకలు మొదలయ్యాయని చెబుతారు.
ఈ రోజుల్లో ఇక్కడ ఉన్న దంతేశ్వరీ ఆలయం వద్దకు చుట్టుపక్కల ఉన్న గ్రామదేవతలను ఊరేగింపుగా తీసుకువస్తారు. ఈ సందర్భంగా స్థానిక రాజవంశీకులతో గిరిజన నాయకులు, స్థానిక ప్రజలు సమావేశమవుతారు. ఈ సమావేశాన్ని ‘మురియా దర్బార్’ అంటారు. నవరాత్రుల చివరి రోజుల్లో భారీ కలపతో తయారుచేసిన రథాన్ని అడవిలో ఊరేగించడం ఇక్కడి ప్రత్యేకత. తమిళనాడు కులశేఖరపట్నంలో ఉన్న ముత్తారమ్మ ఆలయంలో దసరా నవరాత్రులలో ప్రత్యేక పూజలు జరపడమే కాకుండా, భక్తులు రకరకాల వేషాలు ధరిస్తారు. వేషాలతో వీథుల్లో సంచరిస్తూ భిక్షాటన చేసి, వచ్చిన డబ్బును అమ్మవారికి సమర్పిస్తారు.
ఒడిశాలోని పూరీలో దసరా నవరాత్రుల సందర్భంగా ‘గొసాని’ జాతర జరుపుతారు. ఈ జాతరలో భాగంగా వీథుల్లో మహిషాసురమర్దని రూపంలో అమ్మవారి భారీ విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. ముగింపు రోజున ఈ విగ్రహాలను జగన్నాథ ఆలయ సింహద్వారం వద్దకు తీసుకువచ్చి, పూజలు జరిపిన తర్వాత సముద్రంలో నిమజ్జనం చేస్తారు. కోల్‌కతాలో నవరాత్రి వేడుకలు ముగిశాక అమ్మవారి విగ్రహాలను నిమజ్జనానికి తరలించే ఊరేగింపులో మహిళలు ‘సిందూర్ ఖెళా’ ఆడతారు. ఈ వేడుక హోలీ పండుగను తలపిస్తుంది.
ఊరేగింపులో పాల్గొనే మహిళలు ఒకరికొకరు ముఖాలకు సిందూరం పూసుకుంటారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులులో దసరా వేడుకలు విభిన్నంగా జరుగుతాయి. మిగిలిన ప్రాంతాల్లో దసరా వేడుకలు విజయదశమితో ముగుస్తాయి. ఇక్కడ మాత్రం విజయదశమి రోజు నుంచే అసలు వేడుకలు మొదలవుతాయి. ఈ వేడుకలు ‘కులు దసరా’గా పేరు పొందాయి. కులు ప్రజలు ‘రఘునాథ్ జీ’గా శ్రీరాముడిని ప్రధానదైవంగా ఆరాధిస్తారు. దసరా రోజు నుంచి వారం రోజుల పాటు స్థానిక దేవతలను కులుమైదానంలో కొలువుదీర్చిన రఘునాథ్జీ వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చి జాతర జరుపుతారు.
భారత ఉపఖండ ప్రాంతంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా దసరా వేడుకలను హిందువులు ఘనంగా జరుపుకొంటారు. ఒక్కో ప్రాంతంలో వేడుకలు ఒక్కో తీరులో జరుగుతాయి. ఒక్కో ఆలయంలో ఒక్కోరకమైన వేడుకలు నిర్వహిస్తారు. ఒక్కో శక్తిపీఠంలో ఒక్కో రకమైన విలక్షణ ఆచారాలను పాటిస్తారు. ఆచార భేదాలు ఎన్ని ఉన్నా, అందరూ జగన్మాతను శక్తి స్వరూపంగానే ఆరాధిస్తారు. దసరావేడుకల్లో సర్వం శక్తిమయంగా కనిపిస్తుంది.


