దురద మానవమాత్రులందరికీ తరచుగా ఎదురయ్యే అనాది అసౌకర్యం. దురదకు విరుగుడు గోకుడే! శరీరంలో చేతికందని వీపు మీద దురదపుడితే గోక్కోవడం ఎంతటి ‘నఖా’మణులకైనా దుస్సాధ్యమైన పని. అలాంటప్పుడు అందుబాటులో ఎవరైనా ఉండి, వీపు గోకుతుంటేనా! ‘ఇదే సౌఖ్యము... ఇదే భాగ్యము’ అని పాడుకోకుండా ఉండలేరు. అయినా, ఊరకే వీపు గోకేవారు అందుబాటులో ఉండే భాగ్యం ఈ ప్రపంచంలో ఎందరికి ఉంటుందని! దురద పుట్టినా గోకుడు భాగ్యానికి నోచుకోని వారు గోకుడు సేవల కోసం వెంపర్లాడుతుండటాన్ని గమనించాడు ఝాంగ్ జియావోచావో అనే చైనీస్ యువమేధావి.
వెంటనే గోకుడు సేవలు అందించడం కోసం రెండు ప్రత్యేకమైన సెలూన్లు ప్రారంభించాడు. మసాజ్ పార్లర్లలో ప్రత్యేకంగా మర్దన సేవలు అందిస్తున్న మాదిరిగానే, ఇతగాడు తన సెలూన్లలో ప్రత్యేకంగా గోకుడు సేవలను అందించడం మొదలుపెట్టాడు. ఈ వ్యాపారం ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే జోరందుకుంది. పెద్దసంఖ్యలో జనాలు గోకుడు సేవల కోసం ఎగబడటం మొదలైంది.
షెన్జెన్ డిస్ట్రిక్ట్ బావోఆన్లో ఈ ఏడాది మే నెలలో జియావోచావో తన తొలి సెలూన్ ప్రారంభించాడు. ఇందులో రద్దీ పెరగడంతో ఇదే ఊళ్లో వేరేచోట రెండో సెలూన్ను ప్రారంభించాడు. ఈ సెలూన్లలో గోకుడు సేవల కోసం ఒక్కొక్కరి వద్ద నుంచి 300 యువాన్లు వసూలు చేస్తున్నాడు. విజయవంతంగా నడుస్తున్న ఈ గోకుడు సెలూన్ల ద్వారా జియావోచావో ప్రతినెలా లక్ష యువాన్లకు పైగానే సంపాదిస్తున్నాడు.


