‘‘యా దేవీ సర్వభూతేషు..’’: అమ్మవారి తత్వం అంటే | Devotion: Navratri 2026: Understanding Goddess Devi | Sakshi
Sakshi News home page

‘‘యా దేవీ సర్వభూతేషు ..’’

Oct 15 2026 8:21 AM | Updated on Oct 15 2026 8:21 AM

Devotion: Navratri 2026: Understanding Goddess Devi

సమస్త ప్రాణుల్లో శక్తి రూపంలో ఉన్న దేవికి నమస్కారం అని అర్థం. ఈ ఒక్క΄పాదమే అమ్మవారి విశ్వరూపాన్ని మనకు తెలియజేస్తుంది. మనిషిలో ఆలోచించే శక్తి, పనిచేసే శక్తి, ప్రేమించే శక్తి, సృష్టించే శక్తి– ఇవన్నీ దైవశక్తి స్వరూపాలుగానే చూడవచ్చు. అందుకే ప్రతి జీవిని గౌరవించడం, ప్రకృతిని కాపాడటం, ఇతరుల పట్ల కరుణతో వ్యవహరించడం కూడా ఒక విధమైన అమ్మవారి ఆరాధనే.

దుర్గాదేవి మనకు ధైర్యాన్ని ప్రసాదించే తల్లిగా, లక్ష్మీదేవి సంపదను, సౌభాగ్యాన్ని ప్రసాదించే తల్లిగా, సరస్వతీదేవి విద్య, జ్ఞానాలకు ప్రతీకగా కొలువబడతారు. మనిషి జీవితానికి ధైర్యం, సంపద, జ్ఞానం– మూడూ అవసరమే. అయితే సంపదకు జ్ఞానం తోడైతేనే అది సద్వినియోగమవుతుంది. జ్ఞానానికి ధైర్యం తోడైతేనే అది ఆచరణలోకి వస్తుంది. అందుకే అమ్మవారి ఆరాధన మనిషి జీవితాన్ని సమగ్రంగా తీర్చిదిద్దే ఒక ఆధ్యాత్మిక మార్గంగా భావించవచ్చు.

‘‘సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే’’
అమ్మవారు సర్వమంగళకరమైన తల్లి. మన జీవితంలోని శుభాన్ని, ధర్మాన్ని, మంగళాన్ని ప్రసాదించే శక్తి ఆమెదే అనే విశ్వాసం ఇందులో కనిపిస్తుంది.

స్త్రీలోని శక్తి
మన సంప్రదాయంలో తల్లిని, భార్యను, కుమార్తెను, గురుపత్నిని గౌరవించే ఆచారం ఉంది. ‘‘మాతృదేవోభవ’’ అని చెప్పిన సంస్కృతి మనది. ఒక కుటుంబాన్ని ప్రేమతో నడిపించడమే కాకుండా, కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలిచే స్త్రీలో కూడా అమ్మవారి శక్తిని దర్శించవచ్చు. 

స్త్రీ అంటే బలహీనత కాదని, అవసరమైనప్పుడు ఆమె ధైర్యానికి, త్యాగానికి, సహనానికి, పోరాట స్ఫూర్తికి ప్రతిరూపం కాగలదని నవరాత్రి ఉత్సవం గుర్తుచేస్తుంది. అయితే స్త్రీని గౌరవించడం కేవలం నవరాత్రుల్లో కన్యాపూజ చేయడంతో పూర్తికాదు. ఆమెకు విద్య, స్వేచ్ఛ, భద్రత, గౌరవం కల్పించినప్పుడే అమ్మవారి తత్వాన్ని ఆచరించినట్లవుతుంది.

బొమ్మల కొలువు – అంతరార్థం
నవరాత్రుల్లో కొన్ని ప్రాంతాల్లో బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. చిన్నారులు, పెద్దలు కలిసి బొమ్మలను అలంకరించి, పూజలు చేసి, స్నేహితులను ఆహ్వానిస్తారు. ఇది కేవలం వినోదం కాదు. తరతరాలుగా వస్తున్న సంస్కృతి, కళ, కుటుంబ బంధాలను తరువాతి తరానికి అందించే ఒక అందమైన మార్గం. అలాగే బతుకమ్మ వంటి పుష్పోత్సవ సంప్రదాయాలు కూడా ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తాయి. పూలను పూజించడం ద్వారా ప్రకృతిలోని అందాన్ని, జీవశక్తిని గౌరవించే భావన మనలో పెరుగుతుంది.

అమ్మవారి చేతిలోని త్రిశూలం మన దుర్గుణాలను ఛేదించాలి. ఆమె అభయహస్తం మనకు ధైర్యాన్ని ఇవ్వాలి. ఆమె కరుణ మన హృదయాలను మృదువుగా చేయాలి. ఆమె జ్ఞానం మన జీవితాలకు వెలుగునివ్వాలి. అమ్మవారిని ఆలయం లో మాత్రమే దర్శించకుండా, ప్రతి తల్లిలో, ప్రతి స్త్రీలో, ప్రతి జీవిలో ఉన్న శక్తిని గౌరవించగలిగినప్పుడే నవరాత్రి ఉత్సవానికి సార్థకత లభిస్తుంది.

‘‘శక్తిని ఆరాధించడం అంటే మనలోని శక్తిని మేల్కొల్పుకోవడం; అమ్మను పూజించడం అంటే సృష్టిని, స్త్రీని, ప్రకృతిని గౌరవించడం.’’ అదే నవరాత్రుల అసలైన వైభవం. అదే అమ్మ తత్వం.
– టి. వి.ఎల్‌. గాయత్రి

అమ్మవారి తత్వం అంటే శక్తి తత్వం. ఈ సృష్టిలో కదలికకు, జీవనానికి, వికాసానికి కారణమైన శక్తినే భారతీయ ఋషులు ‘శక్తి’గా దర్శించారు. పరబ్రహ్మ స్వరూపమైన శివుడు శక్తి లేకుండా నిశ్చలుడని, శక్తితోనే సృష్టి, స్థితి, లయలు జరుగుతాయని మన పురాణాలు వివరిస్తాయి. 

అందుకే అమ్మవారిని కేవలం ఒక దేవతగా మాత్రమే కాకుండా సమస్త సృష్టికి మూలమైన ఆదిశక్తిగా భారతీయ సంప్రదాయం భావిస్తుంది. అమ్మలో తల్లితనం ఉంది. కరుణ ఉంది. అవసరమైనప్పుడు అదే తల్లి ఉగ్రరూపం దాల్చి దుష్టశక్తులను సంహరిస్తుంది. ఒక చేతిలో అభయాన్ని, మరొక చేతిలో ఆయుధాన్ని ధరించిన అమ్మవారి రూపం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. కరుణతో రక్షించడం ఎంత అవసరమో, అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యం కూడా అంతే అవసరం. 

‘‘యా దేవీ సర్వ భూతేషు శాంతి రూపేణ సంస్థితాం’’ అని చెప్పింది దేవీ సూక్తం. అంటే మన లోపలనే దేవి శాంతి రూపంలో ఉంటుందని. ఇలా దేవీసూక్తంలో చెప్పబడిన శక్తులన్నీ మనలో వున్నాయా లేవా అని మనం అంతర్ముఖ పరిశీలన చేసుకోవాలి. వాటిని సుగుణాలు అని అనవచ్చు. ఇవి శక్తుల రూపంలో వుంటాయి. మీ అంతట మీరే నాశనం చేసుకుంటే తప్ప వాటినెవ్వరూ నాశనం చేయలేరు. వీటిని ఆత్మసాక్షాత్కారం పొందిన వారు కుండలినీ జాగృతి ద్వారా మాత్రమే స్థిరపరచుకోగలరు. 

ఈ ప్రపంచం కలియుగ ప్రభావం నుండి రక్షింపబడాలంటే మీలో ఈ అధ్యాత్మిక ఉత్థానం ప్రధానం. ఈ అధ్యాత్మిక ఉత్థానం జరిగినప్పుడు అన్నిటికన్న ముందు ముఖ్యంగా ఆమె చేసే పని మనందరినీ రక్షించడం. మీరు ఎటువంటి ఆపదలో చిక్కుకున్నా, జీవితంలో ఎటువంటి అపాయకర పరిస్థితులను ఎదుర్కొంటున్నా, మిమ్మల్ని ఆమె రక్షిస్తుంది. మీ ప్రాణాలను కాపాడుతుంది. మీ శరీరాన్ని, అందులోని అన్ని అవయవాలను రక్షిస్తూ, మీ జీవితానికి కావలసిన సంపూర్ణ రక్షణ కల్పిస్తుంది. ఆమె సామ్రాజ్యంలో మీరు పూర్తి రక్షణ పొంది, దేనికీ వెరువరు.

బ్రహ్మదేవుడు శ్రీ మార్కెండేయ మహర్షికి ఉపదేశించిన దేవికవచం అత్యంత శక్తి కలది. దీనిని నవరాత్రి పర్వ దినాలలోనే కాదు, ఎన్నో కష్టాలు, బాధలు, సమస్యల నివారణకు, ఉపశమనానికి పఠించవచ్చు. సూక్ష్మంగా  చెప్పాలంటే మన శరీరంలోపల, బాహ్యపరంగా వున్న అన్ని అంగాంగాలను, మన చుట్టూ వున్న దిక్కులను, దిశలను ఒక్కొక్క దేవీ దేవతలు రక్షిస్తూ వుంటారు. మన మీద, లోపల, బాహ్యపరంగా దాడి చేస్తున్న ఈ దుష్టశక్తుల ప్రభావాల నుండి బయట పడడానికి సహజయోగులు దేవీ కవచం చదువుతూ తమ ధ్యానం ద్వారా ఆయా సంబంధిత దేవీ దేవతలను తమలోని కుండలినీ జాగృతి ద్వారా ప్రసన్నం చేసుకుని స్వాంతన పొందుతారు లేదా తత్‌ సంబంధమైన ‘బంధన్‌’ ప్రక్రియను ఉపయోగించుకుంటారు.   

వాస్తవానికి దేవి పూజలు కావాలని కోరుకోలేదు. కానీ దేవికి పూజలు చేయాల్సిన అవసరం భక్తులకు వుంది. అది ఒక విధంగా మనకు ఈ జన్మనిచ్చినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకోవటం వంటిది. తన భక్తులలో కొంతమందికి దేవి మీద నమ్మకం వుంటుంది కానీ చిత్తశుద్ధి వుండదు. కొందరికి పూర్తి విశ్వాసం ఉన్నా కానీ భగవంతుని యెడల తప్పులు చేస్తూనే వుంటారు. కొందరయితే దేవిపై చాలా భక్తితో వున్నట్లు ప్రవర్తిస్తారు.  కానీ వారికి అంతర్గతంగా ఏమాత్రం ఆమె పైన నమ్మకం వుండదు. 

ఇటువంటి వారు దేవి అనుగ్రహానికి ఏమాత్రం పాత్రులు కాలేరు. అందుచేత ఆమె భక్తులు సద్గుణ సంపన్నులై ఉండాలి. మనం భక్తి ప్రపత్తులతో కొలిచే మన తల్లి సాక్షాత్తూ దుర్గా దేవి అనే విషయం నిస్సంశయంగా మన హృదయాంతరాళాలలో సంపూర్ణంగా స్థిరపడి వుండాలి. అప్పుడే మనిషిలోని దుష్ట లక్షణాలన్నీ నాశనం చేయబడి అతను ఆత్మ వికాసం పొంది మోక్ష్రప్రాప్తికి అర్హుడవుతాడు. అందుకనే శ్రీ ఆదిశంకరులు ఆదిశక్తిని ఆరాధించేవాడు. 

దుష్ట శక్తులను, రాక్షసశక్తులను సంహరించే శక్తియే నవరాత్రులలో మన పూజలందుకుంటున్న దుర్గాదేవి లేక కాళికాదేవి. మన అంతర్గత సూక్ష్మ శరీర వ్యవస్థలోని హృదయ చక్రంలో దుర్గాదేవి అధిస్థానదేవతగా నెలవై వుంటుంది. అమెయే జగన్మాత, జగదాంబ. ఈ  సమస్త విశ్వం, సృష్టి ఆమెదే. మానవులు, దేవతలు లాగే, దానవులూ ఆమె సంతానమే. తనను నమ్ముకున్న భక్తులను, మానవులను రక్షించడం కోసం ఆమె తన మాతృప్రేమ వలన సంతానమయిన రాక్షసులతో పోరాడి వారిని వినాశనం చేయవలసి వచ్చింది. కానీ ఈ కలియుగంలో మీరు దుర్గాదేవి కానక్కరలేదు. మీరు ప్రశాంతచిత్తులై వుంటే చాలు. సహజయోగుల వలె పరివర్తన చెంది మీలో మీరు అంతర్ముఖంగా ప్రశాంతంగా వుంటే చాలు.

ఎప్పుడైనా మన శరీరం వైరస్‌ లాంటి అనారోగ్య కారకులైన శక్తుల దాడికి గురైనప్పుడు మనలోని దుర్గా మాత తత్వం జాగృతమై తద్వారా ఈ రోగ నిరోధక శక్తులు వాటిని నిలువరిస్తాయి. ఈ కణాలే గణములుగా పేర్కొనబడ్డాయి. సహజయోగ ధ్యానసాధన ద్వారా మన అనాహత చక్రంలో నిద్రాణ స్థితిలో వున్న జగదాంబ శక్తి తత్వాన్ని ఎల్లప్పుడు చేతనా స్థితిలో వుంచుకోగలుగుతాము.

వృక్షం ప్రాణ శక్తి, ప్రతికొమ్మకు, రెమ్మకు చేరి తిరిగి వెనుకకు చేరుతుంది. అదే రీతిగా ఇప్పుడు మీలో ఉన్న ఈ శక్తులు ఏవైతే మీకు సహాయకరిగా వున్నాయో, అవన్నీ కూడా  పరాశక్తి అంతర్భాగాలే. మీరు కేవలం ఆ శక్తుల పనిముట్టు మాత్రమే అని గ్రహిస్తారు. అప్పుడు మీలో వున్న శక్తులు ఎన్నటికీ క్షీణించక సజీవంగా వుంటాయి. 
– డాక్టర్‌ ప్రతాని రాకేశ్, సహజ యోగ సాధకులు
(దేశ విదేశాల నవరాత్రి పూజా సందర్భాలలోని పరమపూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా) 

ఇదీ చదవండి: ఇది కదా మహిళా శక్తి! 350 మంది మహిళల వీర గర్బా..వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement