పొలాల్లో ప్లాస్టిక్‌ భూతం! బయోపాస్టిక్‌లూ విషపూరితమే! | sagubadi Plastics are widely used in agriculture check these effects | Sakshi
Sakshi News home page

పొలాల్లో ప్లాస్టిక్‌ భూతం! బయోపాస్టిక్‌లూ విషపూరితమే!

Aug 26 2025 11:42 AM | Updated on Aug 26 2025 11:53 AM

sagubadi Plastics are widely used in agriculture check these effects

వ్యవసాయంలో ప్లాస్టిక్‌ వస్తువుల వాడకం విపరీతంగా పెరుగుతోంది. మల్చింగ్‌ షీట్లు, మొలక ట్రేలు, డ్రిప్‌ లైన్లు, చెరువు లైనర్‌ షీట్లు, పాలీహౌస్‌ల నిర్మాణంతో పాటు ఆహార పదార్థాల నిల్వ, ప్యాకేజింగ్, రవాణా క్రమంలోనూ విరివిగా ప్లాస్టిక్‌ వాడుతున్నారు. పంట భూముల్లో మిగిలిపోయే పాలిథిన్‌ అవశేషాలు ఇప్పుడు హెక్టారుకు 300 కిలోలకన్నా ఎక్కువట. ప్లాస్టిక్‌ వస్తువుల్లో 16 వేల రకాల రసాయనాలు ఉంటాయి. వీటిలో 4,200 రసాయనాలు అత్యంత విషపూరితమైనవి. ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ఇవి తీవ్ర హాని చేస్తున్నాయని ప్లాస్ట్‌కెమ్‌ ప్రాజెక్టు శాస్త్రవేత్తల బృందం గతేడాది గుర్తించింది. కాబట్టి, ప్లాస్టిక్‌ వాడకంలోను, వాడిన వాటిని పారేయటంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ప్లాస్టిక్‌ వస్తువులు మానవ సమాజానికి తిరుగులేని ప్రయోజనాలను అందిస్తున్నాయి. కానీ ఇప్పుడు ప్లాస్టిక్‌ ‘అరికట్టలేని సంక్షోభం’గా మారిపోయింది. కృత్రిమ రసాయనాలతో సింథటిక్‌ ప్లాస్టిక్‌ వస్తువులను 1907లో మొట్టమొదట తయారు చేశారు. 

1950 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా 2 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ వస్తువులు ఉత్పత్తి అయ్యేవి. ఇప్పుడు ఏటా 45 కోట్ల మెట్రిక్‌ టన్నులకు మించిపోయింది. ఇందులో, వాడేసిన ప్లాస్టిక్‌ వస్తువుల్లో కేవలం 9 శాతాన్ని మాత్రమే సేకరించి, తిరిగిఉపయోగించుకుంటున్నాం.91% శాతం ప్లాస్టిక్‌ వస్తువులు మట్టిలోనో, నీటిలో కలిసిపోతున్నాయి. 

ప్రతి సంవత్సరం 1.9 కోట్ల నుంచి 2.3 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు నీటి ద్వారా సరస్సులు, నదులు, సముద్రాలను కలుషితం చేస్తున్నాయి. 1.3 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు మట్టిలో పేరుకుపోతున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలు కనపడని చోటేదీ ఇప్పుడు మిగల్లేదు. మన అడవులు, నేల, నీరు, గాలిని కూడా ప్లాస్టిక్‌ వ్యర్థాలు కలుషితం చేస్తున్నాయి. కంటికి కనిపించనంత చిన్న ప్లాస్టిక్‌ ముక్కలు (మైక్రోప్లాస్టిక్‌లు) జంతువులు, మొక్కలు, పండ్లు, మానవ శరీరాల్లోకి కూడా ప్రవేశించాయి. ఒక లీటరు మంచినీటి సీసాలో దాదాపు 2,40,000 చిన్న ప్లాస్టిక్‌ ముక్కలు ఉన్నాయని ఇటీవలి అధ్యయనంలో తేలింది.

చదవండి: Vitamin D deficiency ఎన్నో ఆరోగ్య సమస్యలు

ప్లాస్టిక్‌ పదార్థాలు ప్రపంచంలోని ప్రతి మూలలోకి చొరబడ్డాయి. మనం తాగే నీరు, తినే ఆహారం, పీల్చే గాలిని కూడా కలుషితం చేశాయి. వీటిని బాధ్యతతో వాడుకోవటం, వాడిన ప్లాస్టిక్‌ను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా పద్ధతి ప్రకారం సేకరించి తిరిగి ప్లాస్టిక్‌ ఉత్పత్తుల తయారీలో వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనలో ప్రతి ఒక్కరూ సమష్టిగా చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. 

వ్యవసాయంలో ప్లాస్టిక్‌తో ముప్పు
వ్యవసాయంలో ప్లాస్టిక్‌ వస్తువుల వాడకం గత కొన్ని దశాబ్దాలుగా అలవాటైంది. ఆధునిక కాలంలో వాణిజ్య పద్ధతుల్లో వ్యవసాయం తీవ్రతరం కావటంతో దీని వాడకం మరింత పెరుగుతోంది. నేల ఉష్ణోగ్రతను విజయవంతంగా నియంత్రించడం, కలుపు పెరుగుదలను చాలా వరకు అరికట్టడం, నేలలో తేమ నష్టాన్ని నిరోధించడం కోసం వ్యవసాయ భూముల్లో మల్చింగ్‌ షీట్‌(పాలిథిన్‌ ఫిల్మ్‌)ను విస్తృతంగా వాడటం మన దేశంలో మొదలుపెట్టింది కొద్ది సంవత్సరాల క్రితమే.  అయితే, అభివృద్ధి చెందిన దేశాల్లో 1950లలోనే ప్రారంభమైంది. ఈ పద్ధతి పత్తి, మొక్కజొన్న తదితర పంటల సాగు ఖర్చును తగ్గించటంతో పాటు దిగుబడిని సగటున 30 శాతం పెంచుతోంది. ప్లాస్టిక్‌ను ఇప్పుడు మల్చింగ్‌ షీట్, మొలక ట్రేలు, డ్రిప్‌ లైన్లు, చెరువు లైనర్‌ షీట్లు, పాలీహౌస్‌లు, ఆహార నిల్వ, ప్యాకేజింగ్, రవాణాలో విరివిగా ఉపయోగిస్తున్నారు. పంట భూముల్లో మిగిలిపోయే పాలిథిన్‌ అవశేషాలు ఇప్పుడు హెక్టారుకు 300 కిలోలకన్నా ఎక్కువగానే ఉన్నాయని ఒక అధ్యయనం చెబుతోంది.

ఇదీ చదవండి: నటి పరిణీతి ప్రెగ్నెన్సీ.. నో కోల్డ్‌వార్‌..పెద్దమ్మ ఫుల్‌ హ్యాపీ

ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) వ్యవసాయంలో ప్లాస్టిక్‌ల వినియోగాన్ని అంచనా వేసే ఒక కీలక నివేదికను విడుదల చేసింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా పంటలు, పశువుల ఆహారోత్పత్తుల సాగు నుంచి విక్రయం వలకు వివిధ దశల్లోని విలువ గొలుసులో 1.2 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తులు వాడారు. ఆహార ప్యాకేజింగ్‌లో 3.73 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తులను ఉపయోగించారని ఎఫ్‌ఏవో లెక్క తేల్చింది. 

ప్లాస్టిక్‌ వాడకంపై నియంత్రణ అవసరమనే విషయమై 3 దశాబ్దాలుగా చర్చలు జరుగుతున్నాయి. పది రోజుల శిఖరాగ్రసభ జెనీవాలో ఈ నెల 15న ముగిసింది. భారత్‌ సహా 184 దేశాలకు చెందిన 3,700 మంది ప్రతినిధులు ఏకాభిప్రాయానికి రాలేక ఎటువంటి ఒడంబడికా చేసుకోలేదు. ముప్పయ్యేళ్లుగా ఇదే తంతు. 

మన దేశంలో పరిస్థితేంటి?
వ్యవసాయంలోప్రపంచవ్యాప్తంగా వాడుతున్న ప్లాస్టిక్‌ ఉత్పత్తుల్లో సగం ఆసియా దేశాల్లోనే వినియోగిస్తు న్నారు. వాడేసిన ప్లాస్టిక్‌ను తగులబెట్టడం, పూడ్చిపెట్టటం లేదా చెత్తకుప్పల్లో పోయటం మనకు తెలిసిందే. అయితే, దీనికి సంబంధించిన ఏ లెక్కలూ దొరకవు. ఎందుకంటే, వ్యవసాయ ప్లాస్టిక్‌ కాలుష్యం గురించి ఆలోచించేవారే కరువు. మన దేశంలో 90 శాతం గ్రామాల్లో చెత్త యాజమాన్య వ్యవస్థలే లేవు. ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్లు ఎక్కడపడితే అక్కడ పారెయ్యటమే. 67 శాతం మంది మామూలు చెత్తతో పాటు ప్లాస్టిక్‌ చెత్తను కూడా కాల్చేస్తున్నారని ఒక అధ్యయనం చెబుతోంది. 

దేశంలోని 6.65 లక్షల గ్రామాలు, 2.68 లక్షల పంచాయతీల్లో ప్రతి ఏటా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తుంటాయి. వీటిలో క్లైమేట్‌ ఛేంజ్‌ యాక్షన్‌ ప్లాన్‌ను చేర్చాలి.  అందులో వ్యవసాయ, వ్యవసాయేతర ప్లాస్టిక్‌ నిర్వహణను కూడా జోడించాలి. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ప్లాస్టిక్‌కు బదులు పంట వ్యర్థాలతో, వత్తుగా పంటలతోనే సజీవ ఆచ్ఛాదన చేస్తూ ఉంటారు. ఆ పద్ధతులపై అవగాహన కలిగించి, ప్రోత్సహించే పథకాలను తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. 

పాలిథిన్‌ మల్చింగ్‌ షీట్లతో ఇదీ ముప్పు 

వ్యవసాయ భూముల్లో వేసిన ప్లాస్టిక్‌ మల్చింగ్‌ షీట్‌ వ్యర్థాలు మిగిలిపోతాయి. 
వేసిన నెలల్లోనే చిరిగి పోతుంది. కాబట్టి దాని ముక్కలన్నిటినీ మట్టిలో నుంచి ఏరెయ్యటం సాధ్యపడదు.
నేల ఆరోగ్యాన్ని, పర్యావరణ వ్యవస్థలను దెబ్బతీస్తుంది. 
వ్యవసాయ భూముల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు నేల సారాన్ని తగ్గిస్తుంది. 
పంట భూమి లోపలికి గాలి ప్రసరించటం కూడా అవసరం. ప్లాస్టిక్‌ షీట్‌ కింద మట్టిలో గాలి ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. 
 నేల ఆరోగ్యంగా ఉండాలంటే అందులో సూక్ష్మజీవులు ఆరోగ్యంగా ఉండాలి. మల్చింగ్‌ షీట్‌ వీటికి ప్రతికూలంగా పనిచేస్తుంది. 
 వేర్లు, మొత్తంగా మొక్కల పెరుగుదలపై ప్లాస్టిక్‌ ప్రతికూలంగా పని చేస్తుంది. 
మట్టిలోని వానపాములు వంటి మేలు చేసే జీవరాశికి హాని కలుగుతుంది. వాటి పోషణ దెబ్బతింటుంది.
వానపాములు బొరియలు చేసుకుంటూ మట్టిపైకి వచ్చి వదిలే విసర్జితాలే నేలను సారవంతం చేస్తాయి. ఆ ప్రక్రియ ప్లాస్టిక్‌ మల్చింగ్‌ వల్ల దెబ్బతింటుంది. 
ప్లాస్టిక్‌ సూక్ష్మ ముక్కల (మైక్రోప్లాస్టిక్‌ల)ను మొక్కలు వేర్ల ద్వారా గ్రహించి, ఆకుల్లో, పువ్వుల్లో, కాయల్లో, గింజల్లోకి చేర్చుతాయి. 
 ఆ భూమిలో పండే ఆహారోత్పత్తుల ద్వారా మైక్రోప్లాస్టిక్స్‌ ఆహారంలోకి, మానవ శరీరాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. 
వ్యవసాయంలో ప్లాస్టిక్‌ కాలుష్యంపై పాలకులు పట్టించుకోవటం లేదు. అధ్యయనాలూ జరగక పోవటం దురదృష్టకరం. ఈ నిర్లక్ష్యం వ్యవసాయాన్ని, యావత్‌ పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోంది.
పంట పొలాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలను జాగ్రత్తగా సేకరించి, రీసైకిల్‌ చేసే వారికి పంపటం ద్వారా ఈ ముప్పును కొంత తగ్గించవచ్చు. అయితే, దీని గురించి రైతులకు చైతన్యం కలిగించే వారు కరువయ్యారు. 
అర్బన్‌ ప్రాంతాల్లోని ఇళ్లలో ప్రజలు వాడిన ప్లాస్టిక్‌ సేకరణ, రీసైక్లింగ్‌పై కార్యాచరణ ప్రణాళికల్లోనూ వ్యవసాయ ప్లాస్టిక్‌ వ్యర్థాల ఊసే లేదు. అగ్రి ప్లాస్టిక్‌ సమస్యపై అవగాహన ఇటీవలే ముందుకు వస్తుండటం దీనికి కారణం. ఈ నేపథ్యంలో వ్యవసాయ ప్లాస్టిక్‌ వస్తువుల సుస్థిర వినియోగం, నిర్వహణపై ఎఫ్‌ఏవో గత అక్టోబర్‌లో వాలంటరీ గైడ్‌లైన్స్‌ను ప్రకటించింది. 

మల్చింగ్‌ షీట్లతో ముప్పేమిటో తెలుసా?
ఆధునిక పంట పొలాల్లో ప్లాస్టిక్‌ షీట్లు విస్తారంగా కనిపిస్తుంటాయి. ఇవి చాలా పల్చటి ప్లాస్టిక్‌తో తయా­రు చేసినవి. పొలంలో పరచిన ఒక సంవత్సరంలో చిరిగిపోతాయి. అవి ఎంత పలచనంటే.. ఒక కిలో మల్చింగ్‌ షీట్‌ కట్టను 700 చదరపు అడుగుల వ్యవసాయ భూమిపై పరచడానికి సరిపోతుంది. దాని వల్ల ఉపయోగాలున్నాయి. అయితే, అంత భూమిని అనేక విధాలుగా నాశనం చేస్తోందన్నది కూడా వాస్తవం.

బయోపాస్టిక్‌లూ విషపూరితమే! 

పెట్రోలియం ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా మొక్కల ఆధారంగా బయోప్లాస్టిక్‌ వస్తువులు తయారు చేస్తున్నారు. మొక్కజొన్న, బంగాళదుంపలు, చెరకు, సుగర్‌బీట్‌ అనే దుంపల ద్వారా బయోప్లాస్టిక్‌లను తయారు చేస్తారు.  అయితే, ఇవి కూడా పూర్తిగా మేలైనవనుకోవటానికి లేదు. బయోప్లాస్టిక్‌ వస్తువుల తయారీలో వాడే ముడి పదార్థాలను ఈ మొక్కలనుంచి తీసుకుంటు న్నప్పటికీ.. బయోప్లాస్టిక్‌ను తయారు చేసే క్రమంలో గట్టితనం, రంగు తదితర గుణాల కోసం రసాయనిక ప్రక్రియల్లో వాడే వేలకొద్దీ సింథటిక్‌ రసాయనాలు చాలా విషపూరితమైనవని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 

స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయంలో ఎకోటాక్సికాలజీ–పర్యావరణ శాస్త్ర ప్రొఫెసర్‌ బెథానీ అల్‌మ్రోత్‌ ఇలా స్పందించారు: ‘చాలా మందికి ప్లాస్టిక్‌లోని విషతుల్య పదార్థాల గురించి తెలియదు. ప్లాస్టిక్‌లతో పనిచేసే వ్యక్తులకు కూడా బయోప్లాస్టిక్‌లలోని టాక్సిన్స్‌ గురించి సరైన సమాచారం లేదు. అందుకని, ప్లాస్టిక్‌లు పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ముప్పుగా మారకుండా ఉండాలంటే, మొదట వాటి వాడకం తగ్గించాలి. వాడేసిన ప్లాస్టిక్‌ వస్తువుల్ని పారేసే అలవాట్లను మనందరం పనిగట్టుకొని మార్చుకోవాలి’ అంటున్నారామె. కాబట్టి, ప్రజల్లో ప్లాస్టిక్‌ చైతన్యం పెరగాలి. బయోప్లాస్టిక్‌ తయారీని పాతికేళ్ల క్రితమే కనుగొన్నప్పటికీ ప్రస్తుతం వీటి ఉత్పత్తి మొత్తం ప్లాస్టిక్‌ వాడకంలో ఒక్క శాతానికే పరిమితమైంది.

4,200 ప్లాస్టిక్‌ రసాయనాల్లో విషం! 
మనం దైనందిన జీవితంలో వాడే ప్లాస్టిక్‌ వస్తువులు పెట్రోకెమికల్స్‌తోనే తయారవుతున్నాయి. ఈ ప్లాస్టిక్‌ వస్తువుల్లో 16 వేల రకాల రసాయనాలు ఉంటాయి. ఇవన్నీ హాని చేసేవి కాదు. వీటిలో 4,200 రసాయనాలు మాత్రం అత్యంత విషపూరితమైనవి. ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ఇవి తీవ్ర హాని చేస్తున్నాయని ప్లాస్ట్‌కెమ్‌ ప్రాజెక్టు శాస్త్రవేత్తల  బృందం గతేడాది గుర్తించింది. మరో 10 వేల ప్లాస్టిక్‌ రసాయనాల విషతుల్యత ఎంత అనేదానిపై ఇప్పటికీ తగినంత సమాచారం లేదని బృందం తెలిపింది. ప్లాస్టిక్‌ వస్తువుల్లోని రసాయనాలు 70 శాతం అసాంక్రమిక వ్యాధుల(ఎన్‌సీడీలు) వ్యాప్తికి ఒకానొక ముఖ్యకారణమని అంచనా.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement