విటమిన్‌ డి లోపం... ఎన్నో ఆరోగ్య సమస్యలు | Vitamin D deficiency check these health problems | Sakshi
Sakshi News home page

Vitamin D deficiency ఎన్నో ఆరోగ్య సమస్యలు

Aug 26 2025 11:06 AM | Updated on Aug 26 2025 11:30 AM

Vitamin D deficiency check these health problems

స్వాభావికంగానే విటమిన్‌ ‘డి’ని పొందాలంటే... ముఖం, చేతులు, భుజాలు వంటి శరీర భాగాలను సాధ్యమైనంత వరకు  లేత ఎండకూ లేదా హాని చేయనంత సూర్యకాంతికి ఎక్స్‌΄ోజ్‌ అయ్యేలా సూర్యోదయ వేళల్లో ఆరుబయట నడవడం మేలు.  ఒకవేళ మాత్రలు సరిపడనివారు నేచురల్‌గానే విటమిన్‌–డి ని పొందాలని అనుకుంటే తీసుకోవాల్సిన ఆహారాలివి...

విటమిన్‌ ‘డి’లో అనేక రకాలు... 
‘విటమిన్‌ డి’లో విటమిన్‌ డి1, డి2, డి3...డి7... ఇలా చాలా రకాలు (దాదాపు పది వరకు) ఉన్నాయి. కానీ వాటిల్లో  విటమిన్‌ డి2 (ఎర్గో క్యాల్సిఫెరాల్‌), విటమిన్‌ డి3 (కోలీ క్యాల్సిఫెరాల్‌) చాలా ముఖ్యమైనవి, కీలక మైనవి. 

విటమిన్‌–డి లోపాలతో వచ్చే సమస్యలు... 
విటమిన్‌–డి లోపాలతో వచ్చే ఆరోగ్య సమస్యల జాబితా చాలా పెద్దదే. అందుకే ఇటీవల సాధారణ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వెళ్లే బాధితుల్లో విటమిన్‌‘డి’ లోపాన్ని డాక్టర్లు ఎక్కువగా కనుగొంటున్నారు.

  • శరీరంలో ఖనిజలవణాల అసమతౌల్యత (ముఖ్యంగా జింక్, ఐరన్, ఫాస్ఫరస్‌ వంటివి) 

  • హార్మోన్ల అసమతౌల్యత 

  • అత్యంత వేగంతో భావోద్వేగాలు మారిపోవడం (మూడ్స్‌ స్వింగింగ్‌) మానసిక ఆరోగ్యం దెబ్బతినడం 

  • గర్భవతుల్లో పిండం ఎదుగుదలలో లోపాలు ∙మెదడు కణాలైన న్యూరాన్లు (నరాల కనెక్షన్లలో) లోపాలు 

  • కండరాల కదలికల్లో సమన్వయ లోపాలు 

  • రక్తపోటు 

  • ధమనుల్లో రక్తప్రసరణ లోపాలు

  • చక్కెర నియంత్రణలో లోపాలు 

  • దంతసంబంధమైన సమస్యలు 

  • కణ విభజనలో లోపాలు 

  • ఎముకల బలం లోపించడం 

  • వ్యాధి నిరోధక శక్తి తగ్గడం 

  • రికెట్స్‌ వ్యాధి ఆస్టియో పోరోసిస్‌ ఆస్టియోమలేసియా 

  • ఒక్కోసారి ఫిట్స్‌ రావడం మొదలైనవి. 

     

వాస్తవానికి ఆహారపదార్థాల ద్వారా లభ్యమయ్యేదాని కంటే సూర్యరశ్మికి తాకినప్పుడు  చర్మం కింది  పొరలో దీని ఉత్పత్తి ఎక్కువ. అయినప్పటికీ కొద్ది మోతాదుల్లో కొన్ని రకాల ఆహారపదార్థాల నుంచి అది లభిస్తుంది. అవి... ఏయే పదార్థాలలో ఎంతెంత...?  
    ఆహార పదార్థం       పరిమాణం (మైక్రోగ్రాముల్లో) 
    కాడ్‌లివర్‌ ఆయిల్‌    175 
    షార్క్‌ లివర్‌ ఆయిల్‌    50 
    గుడ్లు (పచ్చసొనతో)    1.5
    నెయ్యి    2.5 
    వెన్న    1.0

(ఇవన్నీ 100 గ్రాముల ఎడిబుల్‌ పోర్షన్‌లో  లభించే మోతాదులు)

చేపల్లో... చేపల కాలేయాల్లో లభ్యమయ్యే నూనెల్లో విటమిన్‌ డి సమృద్ధిగా లభ్యమవుతుంది. మరీ ముఖ్యంగా కాడ్, మాక్‌రెల్, సొరచేప (షార్క్‌), సార్‌డైన్, ట్యూనా వంటి చేపల కాలేయాలలో విటమిన్‌–డి ఎక్కువ.  

మాంసాహారాల వంటి యానిమల్‌ సోర్స్‌ నుంచి... వేటమాసం, అందులోనూ ప్రత్యేకంగా కాలేయం మాంసంలో; అలాగే వెన్న, నెయ్యి, గుడ్డులోని పచ్చసొనలో ‘విటమిన్‌–డి’ ఎక్కువ. ఇటీవల చాలామంది పచ్చసొన ఆరోగ్యానికి మంచిది కాదంటూ దాన్ని తీసుకోవడం లేదు. కానీ గుడ్డు తాలూకు పచ్చసొనలో కొలెస్ట్రాల్‌తోపాటు క్యాల్సిటరాల్‌ అని పిలిచే విటమిన్‌–డి ఉంటుంది. కాబట్టి విటమిన్‌–డి పొందాలనుకునే వాళ్లు గుడ్డులోని పచ్చసొన తీసుకోవడం చాలా మంచిది. పచ్చసొన తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యానికి కలిగే మేలు కంటే క్యాల్సిటరాల్‌ వంటి ఎన్నో  పోషకాలను  పోగొట్టుకోవడం ద్వారా  పొందే నష్టమే ఎక్కువ. అందుకే పరిమిత స్థాయిలో పచ్చసొన తీసుకోవడం ఆరోగ్యానికి మంచి చేస్తుందని గుర్తించాలి.

మష్రూమ్స్‌లో... పుట్టగొడుగుల్లో (మష్రూమ్స్‌లో) విటమిన్‌–డి2 సమృద్ధిగా దొరుకుతుంది. విటమిన్‌–డి లోపం ఉన్నవారు పుట్టగొడుగులతో చేసిన రకరకాల ఆహార పదార్థాలు తీసుకోవడంతో  పాటు ఎండలో నడవటం వల్ల స్వాభావికంగానే విటమిన్‌–డి2 లభ్యమవుతుంది.

ఫోర్టిఫైడ్‌ ఆహారాల్లో... పాలు, జ్యూస్‌ వంటి కొన్ని రకాల ఆహారపదార్థాల్లో ఇతర పోషకాలతో మరింత సంతృప్తమయ్యేలా చేస్తారు. ఇలాంటి ఆహారాలను ఫోర్టిఫైడ్‌ ఆహారాలుగా పేర్కొంటారు. మామూలుగా అయితే పాలలో విటమిన్‌–డిపాళ్లు తక్కువే. కానీ ఫోర్టిఫైడ్‌ మిల్క్, ఫోర్టిఫైడ్‌ సోయామిల్క్, ఫోర్టిఫైడ్‌ ఆరెంజ్, ఫోర్టిఫైడ్‌ ఓట్‌మీల్, ఫోర్టిఫైడ్‌ సిరేల్స్‌ (తృణధాన్యాల) వంటి సంతృప్తం చేసిన ఆహార పదార్థాల్లో విటమిన్‌–డి మోతాదులు ఎక్కువ. 

విటమిన్‌ ‘డి’ తాలూకు కొన్ని విశేషాలు... 
ఎండవేళలోనే విటమిన్‌–డి తయారవుతుంది. పైగా చర్మాన్ని తాకాక అది కాలేయాన్ని చేరుతుంది. ఇలా విటమిన్‌–డి తయారీలోనూ, నిక్షిప్తం చేయడంలోనూ కాలేయం కీలక పాత్ర వహిస్తుంది కాబట్టి... ఎండ తక్కువగా ఉండే చలికాలం నాలుగు నెలల కోసం అవసరమైన విటమిన్‌–డిని కాలేయం నిల్వ చేసుకుని పెట్టుకుంటుంది. ( నీడ పట్టున వద్దండి. ఇది పెద్ద లోపమం‘డి’)

గర్భిణులకు తగినంత విటమిన్‌ –డి  ఇవ్వడం వల్ల వాళ్లకు పుట్టే పిల్లలు భవిష్యత్తులో ఆరోగ్యంగా ఎదుగుతారు. అన్ని రకాలుగా వాళ్ల వికాసానికి (మైల్‌ స్టోన్స్‌కు) విటమిన్‌–డి ఎంతగానో తోడ్పడుతుంది.
 

ఇదీ చదవండి: Yoga మైగ్రేన్‌తో భరించలేని బాధా? బెస్ట్‌ యోగాసనాలు

 జుట్టు ఒత్తుగా పెరగడం కోసంకూడా విటమిన్‌–డి సహాయపడుతుంది.

ప్రపంచంలోని చాలా పాశ్చాత్య దేశాలు ఉత్తరార్ధ గోళంలోని భూమధ్య రేఖ నుంచి దూరంగా ఉండే అక్షాంశాల్లో ఉండటంతో ఆయా దేశాల్లో సూర్యకాంతి అంతగా ప్రసరించదు. కాబట్టి... అలాంటి దేశాల్లో విటమిన్‌ ‘డి’ లోపం చాలా సాధారణం. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఒక బిలియన్‌ మంది అంటే నూరు కోట్ల మంది, (వారిలో  పాశ్చాత్యులే ఎక్కువ) విటమిన్‌–డి లోపంతో బాధపడుతున్నారని ఒక అంచనా. అందుకే వారు అక్కడి బీచ్‌లలో సన్‌బాత్‌ల వంటి ప్రక్రియలను ఆశ్రయిస్తూ సూర్యకాంతికి తమ దేహం ఎక్స్‌పోజ్‌ అయ్యేలా చేసుకుంటూ విటమిన్‌–డి పొందడానికి ప్రయత్నిస్తుంటారు.  అయితే ఇటీవల సూర్యకాంతి, ఎండ పుష్కలంగా ఉండే మన భారతదేశంలాంటి చోట్ల కూడా చాలామందిలో విటమిన్‌ ‘డి’ లోపం విస్తృతంగా కనిపిస్తోంది.  మన సమాజంలో చాలావేగంగా చోటు చేసుకున్న మార్పుల కారణంగా ఎండలోకి వెళ్లి చేసే పనుల కంటే నీడపట్టునే ఉండి చేసే పనులు పెరిగిపోవడం, ఎండకు ఎక్స్‌΄ోజ్‌ అయ్యే అవసరాలు తగ్గడం అన్న అంశమే విటమిన్‌–డి లోపం పెరగడానికి ప్రధాన కారణం.  దాంతో విటమిన్‌–డి లోపం వల్ల కనిపించే అనర్థాలు చాలామందిలో కనిపిస్తున్నాయి. అందుకే చాలామంది ఫిజీషియన్లు ఈ విటమిన్‌ను ప్రిస్క్రయిబ్‌ చేయడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నారు.

విటమిన్‌ డి లోపం నిర్ధారణ ఇలా... 
ఒక రకమైన రక్తపరీక్ష ద్వారా విటమిన్‌–డి ఉండాల్సిన మోతాదులో ఉన్నదా, లేదా అనే విషయాన్ని తెలుసుకుంటారు. ఇందుకోసం 25 (ఓహెచ్‌)డీ అనే పరీక్షనూ లేదా 1,25 (ఓహెచ్‌) డీ3 అనే పరీక్షను చేస్తారు. విటమిన్‌–డి ఉండాల్సిన మోతాదును  తెలుసుకునేందుకు పైన పేర్కొన్న మొదటి పరీక్ష అయిన 25 (ఓహెచ్‌)డీ బాగా ఉపయోగపడుతుంది. ఇక 25 (ఓహెచ్‌)డీ పరీక్షనే 25–హైడ్రాక్సీక్యాల్సిఫెరాల్‌ లేదా 25–హైడ్రాక్సీ విటమిన్‌– డి అనే మాటకు సంక్షిప్త రూపం. సాధారణంగా ఆరోగ్యవంతుడి రక్తంలో విటమిన్‌ డి మోతాదు 50–65 ఎన్‌జీ/ఎమ్‌ఎల్‌ ఉండాలి. దాని కంటే తక్కువగా ఉంటే డాక్టర్లు విటమిన్‌–డి టాబ్లెట్స్‌ ప్రిస్క్రయిబ్‌ చేస్తారు.

క్యాల్షియమ్‌ సక్రమంగా ఎముకల్లోకి ఇంకిపోవవడంతో పాటు ఎముకల్ని మరింత బలంగా, పటిష్టంగా రూ పొందేలా చేసేందుకు విటమిన్‌–డి చాలా అవసరం. ఆహారంలోని క్యాల్షియమ్‌ను శరీరం గ్రహించే ప్రక్రియ మన పేగుల్లోనే జరిగేందుకు  విటమిన్‌–డి సహాయపడుతుంది.  

-డాక్టర్‌ శ్రీకృష్ణ ఆర్‌. బొడ్డు
సీనియర్‌ కన్సల్టెంట్‌ఫిజీషియన్‌ 

నిర్వహణ: యాసీన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement