
ఇటీవల చాలామందిలో విటమిన్ – డి లోపం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి ధోరణి గతంలో అంతగా కనిపించేది కాదు. మన దేశం సూర్యరశ్మి సమృద్ధిగా లభ్యమయ్యే దేశమైనందువల్లా, అలాగే మూడు నాలుగు దశాబ్దాల కిందటి వరకూ మనలో చాలామంది వ్యవసాయ వృత్తుల్లో ఉండేవారు కావడంతో విటమిన్–డి లోపం చాలా అరుదుగానే కనిపించేది. కానీ ఈమధ్య మన వృత్తులు చాలావరకు మారిపోవడం, ఇన్‌డోర్స్‌లోనే ఉంటూ పనులు చేసుకునేవారి సంఖ్య పెరగడంతో విటమిన్–డి లోపం చాలామందిలోతరచూ కనిపిస్తూనే ఉంది. పైగా వ్యాధి నిరోధకతకు తోడ్పడటంతో పాటు అనేక జీవక్రియల్లో ఇదెంతో కీలకమైనందున... విటమిన్ డి నిర్వహించే వివిధ కార్యకలాపాలతోపాటు ఆ లోపం కలిగినప్పుడు దాన్ని ఎలా భర్తీ చేసుకోవాలి, తద్వారా వ్యాధి నిరోధక శక్తిని ఎలా పెంపొందించుకోవాలన్న అనేక అంశాల అవగాహన కోసం విపులమైన కథనం.
ప్రపంచంలోని చాలా పాశ్చాత్య దేశాలు ఉత్తరార్ధ గోళంలోని భూమధ్య రేఖ నుంచి దూరంగా ఉండే అక్షాంశాల్లో ఉండటంతో ఆయా దేశాల్లో సూర్యకాంతి అంతగా ప్రసరించదు. కాబట్టి... అలాంటి దేశాల్లో విటమిన్ ‘డి’ లోపం చాలా సాధారణం. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఒక బిలియన్ మంది అంటే నూరు కోట్ల మంది, (వారిలో పాశ్చాత్యులే ఎక్కువ) విటమిన్–డి లోపంతో బాధపడుతున్నారని ఒక అంచనా. అందుకే వారు అక్కడి బీచ్‌లలో సన్‌బాత్ వంటి ప్రక్రియలను ఆశ్రయిస్తూ సూర్యకాంతికి తమ దేహం ఎక్స్‌పోజ్ అయ్యేలా చేసుకుంటూ విటమిన్–డి పొందడానికి ప్రయత్నిస్తుంటారు.
అయితే ఇటీవల సూర్యకాంతి, ఎండ పుష్కలంగా ఉండే మన భారతదేశంలాంటి చోట్ల కూడా చాలామందిలో విటమిన్ ‘డి’ లోపం విస్తృతంగా కనిపిస్తోంది. మన సమాజంలో చాలావేగంగా చోటు చేసుకున్న మార్పుల కారణంగా ఎండలోకి వెళ్లి చేసే పనుల కంటే నీడపట్టునే ఉండి చేసే పనులు పెరిగిపోవడం, ఎండకు ఎక్స్‌పోజ్ అయ్యే అవసరాలు తగ్గడం అన్న అంశమే విటమిన్–డి లోపం పెరగడానికి ప్రధాన కారణం. దాంతో విటమిన్–డి లోపం వల్ల కనిపించే అనర్థాలు చాలామందిలో కనిపిస్తున్నాయి. అందుకే చాలామంది ఫిజీషియన్లు ఈ విటమిన్‌ను ప్రిస్క్రయిబ్ చేయడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నారు.
(Yoga మైగ్రేన్‌తో భరించలేని బాధా? బెస్ట్ యోగాసనాలు)
వాస్తవానికి ఏమిటీ విటమిన్ ‘డి’..?
ఎముకల బలం మొదలుకొని అనేక జబ్బుల నుంచి రక్షణ కల్పించే వ్యాధి నిరోధక శక్తి వరకు దేహానికి అవసరమైన పోషకాల్లో అతి ముఖ్యమైనది విటమిన్ డి. నిజానికి ఈ పోషకం ఆహారం కంటే సూర్మరశ్మి నుంచే ఎక్కువగా దొరుకుతుంది. వాస్తవానికి సూర్యకాంతి వల్ల దొరికేది 80 శాతమైతే... మిగతా 20 శాతం మాత్రమే ఆహార పదార్థాల నుంచి లభ్యమవుతుంటుంది. ఇది కొవ్వులో కరిగే (ఫ్యాట్ సొల్యుబుల్) విటమిన్. సాంకేతిక పరిభాషల చెప్పాలంటే దీన్ని ‘సెకో స్టెరాయిడ్’ అంటారు. అంటే దీని మాలెక్యూల్స్ నిర్మాణాన్ని పరిశీలిస్తే ఇందులో... పరమాణు వలయాలు తెగినట్లుగా ఉంటాయి. (సెకో అంటే బ్రోకెన్ అని అర్థం). పైగా స్టెరాయిడ్ వంటి పదార్థాల నుంచి ఆవిర్భవించిందనే మరో అర్థం కూడా ఉంది. కాబట్టి ఇది సహజ స్వాభావికమైన స్టెరాయిడ్ గుణాలతో పాటు విటమిన్ (వైటల్ ఎమైన్)గా కూడా పనిచేస్తుండటంతో దీంతో దేహానికి ఒనగూరే ఎన్నో ప్రయోజనాలెన్నో ఉన్నాయి.
విటమిన్ డి ఎలా తయారవుతుందంటే..?
సూర్యరశ్మిలోని అల్ట్రావయొలెట్ కిరణాలు చర్మాన్ని తాకినప్పుడు కొన్ని రకాల జీవరసాయనాలూ ఉత్పత్తి అవుతాయి. వాటిని ‘క్యాల్సిఫెరాల్స్’ అంటారు. ఒకరకంగా ఈ క్యాల్సిఫెరాల్స్ విటమిన్ డి తయారీకి కారణమవుతాయని చెప్పవచ్చు. కాల్సిఫెరాల్... రక్తంలో కలిసి ఎట్టకేలకు కాలేయాన్ని చేరుతుంది. కాలేయంలో అది ‘క్యాల్సీడియల్’ అనే ఒక పూర్తిస్థాయి హార్మోన్ తాలూకు తొలిరూపాన్ని తీసుకుంటుంది. మళ్లీ అది రక్తప్రవాహంలో కలిసి ‘క్యాల్సీడియల్’ నుంచి ‘క్యాల్సిట్రియల్’గా మారుతుంది. ఈ క్యాల్సిట్రియాల్‌నే దాదాపుగా ‘విటమిన్–డి’ అనుకోవచ్చు. రక్తప్రవాహం ద్వారా ఇది మూత్రపిండాల్లోకి చేరినప్పుడు పూర్తిస్థాయి ‘విటమిన్–డి’గా రూపొందుతుంది. అంతేకాదు... వ్యాధి నిరోధకత కలిగించే కణాల్లోనూ ఈ విటమిన్ తయారవుతుంటుంది. అందుకే ఈ విటమిన్ అంతటి ప్రభావవంతమైన ‘సహజమైన వ్యాధినిరోధత కల్పించే కీలక జీవరసాయనం’గా పనిచేస్తుంది.
ఇదీ చదవండి: Vinayaka Chavithi 2025 : ప్రపంచంలో కొలువైన ఈ గణపయ్యల గురించి తెలుసా?
కనుగొన్న తీరు ఆద్యంతం ఆసక్తికరం...
విటమిన్–డి ని కనుగొన్న తీరు ఒక థ్రిల్లర్‌ను తలపింపజేస్తుంది. కొన్ని శతాబ్దాల కిందట... ముఖ్యంగా నావికులు (సెయిలర్స్) ప్రపంచం (గ్లోబు)లోని కొత్త కొత్త ప్రాంతాలను కనుగొనడానికి నావికా ప్రయాణాలు చేసే రోజుల్లో రికెట్స్ అనే ఎముకల వ్యాధి చాలా ఎక్కువగా ఉండేది. మామూలు ప్రజల్లోనూ కనిపించే ఈ రికెట్స్ వ్యాధి నిల్వ ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకునే నావికుల్లో మరింత ఎక్కువగా కనిపిస్తుండేది.
రికెట్స్ వ్యాధి వచ్చిన వాళ్లలో ఎముకలు తమ సహజ ఆకృతిని కోల్పోయి వంకర తిరగడం, కాళ్లు దొడ్డికాళ్లలా మారడం వంటి పరిణామాలు చోటుచేసుకునేవి. పిల్లల్లో వచ్చే రికెట్స్‌ను ‘ఆస్టోమలేసియా’ అనేవారు. దాదాపు వంద ఏళ్ల కిందట హాలెండ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో ఈ రికెట్స్‌కు విరుగుడుగా వైద్యులు ‘కాడ్ లివర్ ఆయిల్’ అనే నూనెను ఉపయోగించేవారు. దీన్ని కాడ్ అనే రకం చేప కాలేయం నుంచి తయారు చేయడం వల్ల దాన్ని ‘కాడ్ లివర్ ఆయిల్’ అనే పిలిచేవారు.
1918లో ఎడ్వర్డ్ మెలాన్‌బీ అనే శాస్త్రవేత్త – కాడ్‌లివర్ ఆయిల్‌లోని కొవ్వులో కరిగే ఒకానొక పోషకం రికెట్స్ వ్యాధికి మంచి విరుగుడు అని తెలుసుకున్నాడు. ఆ తర్వాత 1924లో హెచ్. స్టీన్‌బాక్, ఆల్ఫ్రెడ్ ఫేబియన్ హెస్ అనే శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఓ కొత్త విషయం తెలిసింది. అదేమిటంటే... సూర్యరశ్మిలోని అల్ట్రా వయొలెట్ కిరణాలు కొన్ని జీవులను తాకినప్పుడు... ఆ జీవుల్లో కొవ్వులాంటి ఓ పోషకం ఉత్పత్తి అవుతోందని కనుగొన్నారు. ఆ పోషకాన్ని తొలుత వాళ్లు ‘వయొస్టెరాల్’ అని పిలిచేవారు. ఇక 1935లో దీన్ని ల్యాబ్‌లో ఐసోలేట్ చేసి, దానికి ‘క్యాల్సిఫెరాల్’ అని పేరుపెట్టారు. ఆ తర్వాత అందులో కొద్దికొద్ది నిర్మాణపరమైన మార్పులతో ఉండే... అనేక రకాల విటమిన్ డి (డి1, డి2, డి3, డి4, డి5, డి6, డి7, డి8)లను కనుగొన్నారు
ఇతరత్రా అనేక ఆరోగ్య సమస్యల్లోనూ చికిత్స కోసం...
ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికీ విటమిన్ ‘డి’ని వైద్యులు ప్రిస్క్రయిబ్ చేస్తారు. హై కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి, డయాబెటిస్, స్థూలకాయం ఉన్నవారికి, మల్టిపుల్ స్క్లెరోసిస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ) ఉన్నవారికి, ఆస్తమా, బ్రాంకైటిస్ బాధితులకు, మహిళల్లో ప్రీ–మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్‌తో బాధపడేవారికి, పంటి, చిగుళ్ల వ్యాధుల నివారణకు, అనేక రకాల చర్మం వ్యాధుల చికిత్సలో అంటే ఉదాహరణకు... విటిలిగో (బొల్లి), స్కిరోడెర్మా, సోరియాసిస్ వంటి చర్మరోగాలు ఉన్నవారికి డాక్టర్లు విటమిన్–డిని సూచిస్తారు. సోరియాసిస్ చికిత్సలో ‘క్యాల్సిట్రియల్’ లేదా ‘క్యాల్సిపోట్రియాల్ / క్యాల్సి ప్రొట్రిన్’ అనే రూపంలో విటమిన్–డిని పైపూతమందుగా పూస్తారు. ఇక విటమిన్–డి ఎన్నో రకాల క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. అందుకే అనేక రకాల క్యాన్సర్ల చికిత్సల్లో ‘విటమిన్–డి’ని ఒక మందులా డాక్టర్లు తమ ప్రిస్క్రిప్షన్‌లో సూచిస్తారు.
విటమిన్ డి టాక్సిసిటీ అంటే....
ఇంతటి ఉపయోగకరమైన విటమిన్–డి ఉండాల్సిన మోతాదు కంటే మించితే... అది ప్రతికూల ఫలితాలకు దారి తీస్తుంది. ఉదాహరణకు సొంతంగా విటమిన్–డి మాత్రలు వాడటం, కాడ్‌లివర్ ఆయిల్ క్యాప్సూల్స్ తీసుకోవడం వల్ల రోజుకు 125 మైక్రో గ్రాముల మోతాదు దాటితే ఒక్కోసారి విపరీతంగా దాహం, కంట్లో కురుపులు, చర్మంపై దురదలు రావడం సాధారణం. దాంతోపాటు వాంతులు, నీళ్లవిరేచనాలు వంటివి కూడా కనిపించవచ్చు. ఒక్కోసారి రక్తనాళాల్లోని గోడలపైనా, మూత్రపిండాలలో క్యాల్షియమ్ పెచ్చులు (క్యాల్సిఫికేషన్) రావచ్చు. రక్తనాళాలతో పాటు కాలేయంలో, ఊపిరితిత్తుల్లో, మూత్రపిండాల్లో, కడుపులో క్యాల్షియమ్ మోతాదులు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎండలో తిరగడం లేదా స్వాభావికమైన ఆహారం ద్వారా కాకుండా... ఇతరత్రా రూపాల్లో విటమిన్–డి తీసుకోవాల్సి వచ్చినప్పుడు కేవలం నిపుణుల సూచనల మేరకే, దేహానికి అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
-డాక్టర్ శ్రీకృష్ణ ఆర్. బొడ్డు
సీనియర్ కన్సల్టెంట్, ఫిజీషియన్
-నిర్వహణ: యాసీన్