Russia-Ukraine war: ప్రేమ యుద్ధం

Russia-Ukraine war: Delhi Lawyer To Marry Ukrainian Girlfriend  - Sakshi

యుద్ధం దేశాలను ఓడించవచ్చు. ప్రేమను కాదు. ఆమె ఉక్రెయిన్‌లో ఉంది. అతడు ఇండియాలో ఉన్నాడు. ఆమె యుద్ధంలో ఉంది. అతడు ఎదురు చూస్తున్నాడు. ఉక్రెయిన్‌ జాతీయురాలు అన్నా హొరొడెట్స్‌కా ఢిల్లీలో ఉండే అనుభవ్‌ భాసిన్‌ కోసం ప్రాణాలకు తెగించి వచ్చింది. అతడు ఎయిర్‌పోర్ట్‌లోనే ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ తొడిగాడు. అత్తగారు పూలతో స్వాగతం చెప్పింది.
ప్రతీకారాలు యుద్ధాలు తెస్తాయి. ప్రేమలు ప్రపంచాన్ని నిర్మిస్తాయి ఈ ప్రేమకథ చెబుతున్నది అదే.

యుద్ధంలోనూ ప్రేమలోనూ ఉత్కంఠ తప్పదు. అనుభవ్, అన్నాలది కూడా ఉత్కంఠభరిత ప్రేమ కథే. 29 ఏళ్ల ఉక్రెనియన్‌ అన్నా హొరొడెట్స్‌కా తన ప్రేమను సఫలం చేసుకోవడానికి బాంబుల మోతల మధ్య నడిచి ఢిల్లీ చేరింది. ఢిల్లీ హైకోర్టులో లాయర్‌గా పని చేస్తున్న 33 ఏళ్ల  అనుభవ్‌ను కలసుకోగలిగింది. ఇక వాళ్ల పెళ్లి జరగడం ఒక లాంఛనం మాత్రమే.

ప్రయాణంలో కలిసిన ప్రేమకథ
ఉక్రెయిన్‌లో ఐటి ప్రొఫెషనల్‌గా, మేకప్‌ ఆర్టిస్ట్‌గా పని చేసే అన్నా 2019లో ఇండియా చూడటానికి వచ్చింది. ఆమె ట్రావెల్‌ చేస్తున్నప్పుడు తనూ ట్రావెల్‌ చేస్తున్న అనుభవ్‌ ఆమెకు పరిచయం అయ్యాడు. ఇద్దరూ ఫోన్‌ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆమె ఉక్రెయిన్‌ వెళ్లిపోయింది. అయితే వాట్సప్‌లో వీరి పలకరింపులు కొనసాగాయి. 2020లో ఆమె మళ్లీ ఇండియా వచ్చి రాజస్తాన్‌ రోడ్‌ ట్రిప్‌కు బయలుదేరింది. అనుభవ్‌ ఆమెతో టచ్‌లో ఉన్నాడు. ఇంతలో లాక్‌డౌన్‌ వచ్చింది. ఫ్లయిట్‌లు కేన్సిల్‌ అయిపోయాయి.

స్వదేశం వెళ్లే వీలు లేదు. ‘నువ్వు మా ఇంటికి వచ్చి ఉండు’ అని కోరాడు అనుభవ్‌. అతని తల్లి కూడా ఆమెను ఆదరించింది. అప్పుడే వాళ్ల మధ్య ప్రేమ చిగురించింది. లాక్‌డౌన్‌ ఎత్తేశాక సెకండ్‌ వేవ్‌ వచ్చింది. అది ముగుస్తూ ఉండగా అనుభవ్‌ ఉక్రెయిన్‌ వెళ్లి ఆమెను కలిశాడు. ఆ తర్వాత మొన్న డిసెంబర్‌లో దుబాయ్‌లో కలిసి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ మార్చిలోనే సౌత్‌ఢిల్లీలోని అనుభవ్‌ ఇంటిలో పెద్ద ఆర్భాటం లేకుండా చేసుకుందామనుకున్నారు. ఉక్రెయిన్‌లో ఉద్యోగం చేసుకుంటున్న అన్నా కావలసిన సమయానికి ఇండియా చేరుకుంటానులే అని నిశ్చింతగా ఉంది.

యుద్ధమలుపు
హటాత్తుగా ఫిబ్రవరిలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మార్చిలో పెళ్లి పెట్టుకున్న ఈ జంట ఇక ఎడతెగని ఫోను సంభాషణల్లోకి దిగింది. ‘మొదట అతను వెంటనే బయల్దేరి వచ్చేయమన్నాడు. కాని రష్యా అంతకు తెగించదు అని నేను నిరాకరించాను. అప్పుడు మా ఇద్దరికీ ఫైటింగ్‌ జరిగింది. ఆ తర్వాత ట్రైన్‌ పట్టుకుని పోలాండ్‌ వెళ్లిపోమన్నాడు. నేను ఆ పనీ చేయలేదు. ఫిబ్రవరి 24న బాంబుల మోత మొదలయ్యింది. బంకర్‌లో దాక్కున్నాను. అక్కడే ఉండు అన్నాడు అనుభవ్‌. కాని బయలుదేరి ఇండియా వస్తున్నాను అని చెప్పాను. హడలిపోయాడు. అస్సలు కదలొద్దు అన్నాడు. కాని నేను బయలుదేరాను’ అంది ఢిల్లీలో దిగిన అన్నా.

సాహసయాత్ర
అన్నా కీవ్‌ నగరానికి  దగ్గరిలోని ఊరిలో ఉంటుంది. కీవ్‌ నగరం మీద ఫిబ్రవరి 24న బాంబులు పడ్డాయి. వెంటనే ఆమె రెండు మూడు రోజులు తల్లితో పాటు షెల్టర్లలో ఉండిపోయింది. 27 వ తేదీ ఉదయం ఇక లాభం లేదని తల్లితో, తన కుక్కతో ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చింది. ఆమె దగ్గర ఉన్నది ఉన్నిబట్టలు మాత్రమే. అక్కడి నుంచి తల్లిని అమ్మమ్మ ఉంటున్న తమ సొంత ఊరు కమియంకాకు తీసుకెళ్లి వదిలింది. అమ్మమ్మా... పెళ్లి చేసుకోవడానికి ఇండియా వెళుతున్నా అంటే ఆమె కాఫీ మిషన్‌ను పెళ్లి కానుకగా ఇచ్చింది.

దానిని తీసుకుని కీవ్‌ నగరానికి అదే రోజు రాత్రి చేరుకుంది. ఎందుకంటే కీవ్‌ సరిహద్దు పశ్చిమ పోలాండ్‌ సరిహద్దుకు దగ్గర. కాని పోలాండ్‌కు వెళ్లడానికి వేలాది మంది రెండు రోజులుగా ఎదురు చూస్తున్నారని ఆమెకు తెలిసింది. దాంతో అన్నా ఆ రాత్రి ఇంకో బస్‌ పట్టుకుని స్లోవేకియా చేరుకుంది. అక్కడి పోలాండ్‌కు చేరుకుని క్రాకో అనే ఊళ్లో రెండు వారాలు ఉండిపోయింది. ఫ్రెండ్స్‌ ఆమెకు సాయం చేశారు. పోలాండ్‌లో ఉన్న భారత ఎంబసీలో వీసాకు అప్లై చేస్తే దొరికింది. అలా ఆమె బయలుదేరి మార్చి 25న ఢిల్లీ చేరుకుంది.

ఎయిర్‌పోర్ట్‌లో వరుడు
ఆమె వచ్చే సమయానికి ఎయిర్‌పోర్ట్‌లో అనుభవ్‌ బాజా భజంత్రీలతో స్వాగతం చెప్పాడు. అక్కడే మోకాళ్ల మీద కూలబడి ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ తొడిగాడు. ‘నేను చచ్చే అలసటలో ఉన్నాను. కాని అతను చేసిన పని బాగనే అనిపించింది’ అంది అన్నా. అనుభవ్‌ తల్లి పూలతో ఆమెకు స్వాగతం చెప్పింది. ‘మా పెళ్లికి పేపర్స్‌ రెడీ చేస్తున్నాం’ అన్నాడు అనుభవ్‌. ‘నా వీసా ఒక సంవత్సర కాలం ఉంది. ఈలోపు మా దేశం ఏమవుతుందో చూడాలి’ అంది అన్నా.

ఒక విధ్యంసం జరుగుతున్నప్పుడు మనుషుల మధ్య పొంగె ఇలాంటి ప్రేమే ఆశను కలిగిస్తుంది. యుద్ధం ఎప్పుడూ ఓడిపోతుంది. ప్రేమ గెలుస్తుంది.
                                         

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top