సూపర్‌ హిట్స్‌.. స్విస్‌ టూర్‌ యాడ్స్‌..

Roger Federer and Anne Hathaway travel in Switzerland - Sakshi

యూరప్‌ దేశాల్లోని ప్లే గ్రౌండ్‌గా తరచుగా పిలవబడే స్విట్జర్లాండ్‌కు పర్యాటకం అత్యంత ప్రధానమైన ఆర్ధిక వనరు. అయితే యూరప్‌లోని మిగతా ప్రాంతాల్లానే... కరోనా ఆంక్షలు ఆ దేశపు ఆర్ధిక మూలాలపై దాడి చేశాయి. అంతర్జాతీయ పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయంలో దాదాపుగా 50శాతం పడిపోయింది. ఈ నేపధ్యంలో తమ పర్యాటకానికి పునర్వైభవం తెచ్చేందుకు స్విట్జర్లాండ్‌ టూరిజం సరికొత్త పంథాలో దూసుకెళుతోంది. స్విస్‌ టూరిజమ్‌ లాగే ఆ దేశపు పర్యాటక శాఖ ప్రచార చిత్రాలు కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తుండడం విశేషం. 

డీనీరో...ఫెదరర్‌
గత ఏడాది ఒక వినూత్న శైలి వీడియో రూపొందించింది. ఈ ఒకటిన్నర నిమిషాల వీడియోలో స్విట్జర్లాండ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్, టాప్‌ టెన్నిస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్, ఆస్కార్‌ అవార్డ్‌ విజేత రాబర్ట్‌ డీనీరోలు నటించారు. ఈ వీడియో లో ఉన్నది ఏమిటంటే.. స్విట్జర్లాండ్‌ గురించి ఒక ఫీచర్‌ ఫిల్మ్‌ రూపొందించమని ఫెదరర్‌ డీ నీరోని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే నువు పేర్కొంటున్న డెస్టినేషన్‌ మరీ పర్ఫెక్ట్‌గా ఉందనీ, అందులో ఏమీ డ్రామా లేదంటూ డీనీరో తిరస్కరిస్తాడు. ఈ పరోక్ష  ప్రచారపు వీడియో చిత్రం 100 మిలియన్ల సార్లు వీక్షించబడి అత్యంత విజయవంతమైన కమర్షియల్‌ చిత్రంగా నిలిచింది. దాదాపు 13 మిలియన్ల  మంది ట్విట్టర్‌ ఫాలోయర్స్‌ ఉన్న ఫెదరర్‌ పాప్యులారిటీ కూడా ఈ చిత్ర విజయానికి తోడ్పడింది.

హాత్‌వే...ఫెదరర్‌...
అదే విధంగా ఈ ఏడాది ప్రచారం కోసం ఫెదరర్‌తో పాటు అకాడమీ అవార్డ్, గోల్డెన్‌ గ్లోబ్‌ విజేత అన్నే హాత్‌వేని జత కలిపారు.. గ్రాండ్‌ టూర్‌ ఆఫ్‌ స్విట్జర్లాండ్‌ పేరుతో వీరి ప్రచార చిత్రం సాగుతుంది. ఈ ప్రచార చిత్రంలో నటించిన అన్నా హాత్‌వే స్వయంగా స్విట్జర్లాండ్‌కు అభిమాని కావడం విశేషం. ఆ దేశానికే కాకుండా ఫెదరర్‌కి కూడా తాను ఫ్యాన్‌ని అని ఆమె చెప్పారు.  ఇది 2 నిమిషాల ప్రచార చిత్రం. ఏప్రిల్‌ 12న యూ ట్యూబ్‌లో విడుదలయ్యి ఒక్కరోజులోనే 3.5 మిలియన్ల వ్యూస్‌ని అందుకుంది. గత ఏడాది ప్రచార చిత్రంలాగే దీన్ని కూడా అత్యంత వినోదాత్మకంగా చిత్రీకరించారు. 

రోడ్‌ ట్రిప్‌...సాగేదిలా...
గ్రాండ్‌ టూర్‌ ఆఫ్‌ స్విట్జర్లాండ్‌ పేరిట సాగే  9రోజుల 8రాత్రుల రోడ్‌ ట్రిప్‌... జ్యురిచ్‌లో ప్రారంభమై అక్కడే ముగుస్తుంది. ఆ దేశపు అత్యంత ఆసక్తికరమైన విశేషాలను ప్రకృతి సౌందర్యాలను ఈ టూర్‌ అందిస్తుంది. దీనిలో భాగంగా 45 ఆకర్షణీయమైన ప్రాంతాలను పర్యాటకులు సందర్శిస్తారు. మొత్తం 22 సరస్సులు, 5 అల్పైన్‌ పాసెస్, 13 యునెస్కో చారిత్రక కట్టడాలు ఇందులో ఉన్నాయి.   మొత్తం టూర్‌ 1000 మైళ్ల వరకూ కవర్‌ చేస్తుంది.   

ఈ టూర్‌ ఆద్యంతం తమకు తామే గైడ్‌ చేసుకునేలా పర్యాటకుల ఆసక్తి, ఇష్టాన్ని బట్టి  బైక్‌ మీద గానీ, కార్‌ లో గానీ ప్రయాణించవచ్చు. పర్యాటక హితంగా ఈ టూర్‌ని రూపొందించారు. కాలుష్యరహితంగా ఎలక్ట్రిక్‌ వాహనాల్లో పయనించేందుకు వీలుగా టూర్‌ సాగే ప్రాంతాలన్నింటా ఎలక్ట్రిక్‌ వెహికల్‌ చార్జింగ్‌ సదుపాయం కల్పించారు. అంతేకాకుండా రైలులో కూడా టూర్‌ని ఎంజాయ్‌ చేసే వీలుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top