Shana Parmeshwar: అలాంటప్పుడు నాకు ఎదురయ్యే ప్రత్యేక సవాళ్లు ఏముంటాయి?

Professional racer Shana Parmeshwar sucessfull story - Sakshi

షనా పరమేశ్వర్‌... ఈ పేరు మనకు పెద్దగా పరిచయం లేదు. కానీ సాహసాల ప్రపంచంలో ఆమె ఓ వెలుగు వీచిక. ఆమె పైలట్, మోటార్‌ కార్‌ రేసర్, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌. ఇవన్నీ కాక సరదాగా డీజే పాత్రను కూడా పోషించింది. రెడ్‌క్రాస్‌లో స్వచ్ఛందంగా సేవ చేస్తుంది. ప్రస్తుతం ఆమె ‘ద మార్క్యూ వన్‌ మోటార్‌ క్లబ్‌’ డైరెక్టర్‌.

బెంగళూరులో పుట్టిన షనాకి చిన్నప్పటి నుంచి కార్‌ రేస్‌ అంటే ఇష్టం. తండ్రితోపాటు రేసింగ్‌కి వెళ్లేది. ఆమెతోపాటు ఆమె కార్‌ రేస్‌ ఇష్టం, సాహసాల మీద వ్యామోహం కూడా పెరిగి పెద్దయింది. ఏవియేషన్‌ కోర్సు కోసం మలేసియాకు వెళ్లింది షనా. అక్కడ మోటార్‌ స్పోర్ట్స్‌ పట్ల కూడా ఆసక్తి కలిగిందామెకి. 2005– 2009 మధ్య కాలంలో ఆమె ‘కెథౌజండ్‌ ర్యాలీ’ లో కీలక పాత్ర వహించింది. అక్కడి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా దూసుకుపోయింది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక మోటార్‌ స్పోర్ట్స్‌ పోటీల్లో పాల్గొన్నది. రకరకాల నేలల మీద వాహనాన్ని నడిపింది. ఆఖరుకు మంచు మీద కూడా వాహనాన్ని నడిపి విజయదరహాసంతో హెల్మెట్‌ తీసేది.

మలేసియా నుంచి స్వీడెన్‌ మీదుగా ఇంగ్లండ్‌ వరకు సాగిన సర్క్యూట్‌లో ఫోక్స్‌వ్యాగన్, పోర్షె, లామ్‌బోర్గిని వంటి అనేక రకాల వాహనాలను నడిపింది. అలా ఆమె మోటారు వాహనాల రంగంలో అందరికీ సుపరిచితమైంది. వైమానిక రంగం మీదున్న ఇష్టం ఆమెను న్యూజిలాండ్‌కు నడిపించింది. బోట్స్‌వానా లో ఆమె పూర్తి స్థాయిలో ఫ్లయింగ్‌ కెరీర్‌ మీదనే దృష్టి పెట్టింది.

‘‘నా కలలన్నింటినీ సాకారం చేసుకోవడానికి తగినట్లు చేతి నిండా వ్యాపకాలను పెట్టుకున్నాను. న్యూజిలాండ్‌ నుంచి లండన్‌ కి వెళ్లాను. అక్కడ ఆటోమొబైల్‌ పరిశ్రమలో ఎగుమతి–దిగుమతుల వ్యాపారం మొదలు పెట్టాను. అది గాడిలో పడిన తర్వాత నేను నా కోసం జీవించడానికి ఏం చేయాలా అని ఆలోచించాను. అప్పటి వరకు సరదాగా రేసింగ్‌ చేసిన నేను అప్పటి నుంచి ప్రొఫెషనల్‌ రేసర్‌గా మారిపోయాను’’ అని చెప్పింది షన.

ఒక మహిళ మోటార్‌ కార్‌రేస్‌లో నెగ్గుకు రావడం కష్టంగా అనిపించడం లేదా అని అడిగిన వాళ్లకు షన చురక లాంటి సమాధానం చెప్తుంది. ‘స్టీరింగ్‌ పట్టుకున్న వ్యక్తి మగా ఆడా అనే తేడా కారుకు తెలియదు. స్టీరింగ్‌కీ తెలియదు. అలాంటప్పుడు మహిళ అయిన కారణంగా నాకు ఎదురయ్యే ప్రత్యేక సవాళ్లు ఏముంటాయి’ అని తిరిగి ప్రశ్నిస్తుంటుంది షన. ‘వాహనం నడపడానికి శారీరక దారుఢ్యం ఎక్కువగా ఉండాలనేది కేవలం అపోహ మాత్రమే. నిజానికి డ్రైవింగ్‌లో ఉండాల్సింది వ్యూహాత్మకమైన నైపుణ్యం మాత్రమే.

అది మగవాళ్లలో కంటే ఆడవాళ్లలోనే ఎక్కువని నా నమ్మకం’ అని నవ్వుతుందామె. మోటార్‌ స్పోర్ట్స్‌ రంగంలో రాణిస్తున్న మహిళలు విదేశాల్లో మాత్రమే కాదు ఇండియాలో కూడా ఎక్కువగానే ఉన్నారని చెప్పింది షన. యూకేలో 2017లో జరిగిన మోడ్‌బాల్‌ ర్యాలీలో పాల్గొన్న తొలి ఇండియన్‌ షన. అప్పటివరకు ఆ ర్యాలీలో మన మగవాళ్లు కూడా పాల్గొన్నది లేదు. ‘‘ట్రాక్‌ మీద అబ్బాయిల కార్లను నా కారు ఓవర్‌టేక్‌ చేసినప్పుడు నాకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పైగా అబ్బాయిల కార్ల కంటే నా కారును ముందుకు తీసుకు వెళ్లే వరకు నా మనసు ఆగేది కాదు’’ అని నవ్వుతుంది షన.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top