Prerna Verma: 3 వేలతో వ్యాపారం ప్రారంభించి.. ఇప్పుడు కోట్లలో టర్నోవర్‌

Prerna Verma: Uttar Pradesh Leather Business Export Turnover In Crores - Sakshi

వ్యాపారానికి సరైన ప్రేరణ

Prerna Verma: Kanpur Based Entrepreneur Inspiring Story In Telugu: రోజువారీ అవసరాలకు కూడా వెతుక్కునే కుటుంబంలో పుట్టి పెరిగింది ప్రేరణ వర్మ. రోజువారీ ఖర్చుల కోసం అని ఉంచిన మూడు వేల రూపాయలతో కాన్పూర్‌లో మొదలు పెట్టిన లెదర్‌ వ్యాపారంతో నేడు విదేశాలకు ఎక్స్‌పోర్ట్‌ చేసే దిశగా ఎదిగింది. నేడు రోజూ రెండు కోట్ల రూపాయల టర్నోవర్‌తో లెదర్‌ కంపెనీని నడుపుతుంది. తన కుటుంబానికి అండగా ఉండటంతో పాటు, మరికొందరికి ఉపాధి కల్పిస్తోంది. ఎన్నో అవార్డులనూ సొంతం చేసుకుంది. 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూరు నివాసి అయిన 38 ఏళ్ల ప్రేరణ వర్మ టెన్త్‌ క్లాస్‌ నుంచే ట్యూషన్లు చెప్పేది. ఆ తర్వాత కాలేజీ, ఉద్యోగం ఏ పనులు చేస్తున్నా ట్యూషన్లు ఆపలేదు. ‘‘ఏ పనులు మానేసినా ఆ నెల గడవదు అనే భయం వెంటాడేది. ఇంట్లో అమ్మ, తమ్ముడు, నేను. కొన్ని కారణాల రీత్యా మా నాన్నకు దూరమయ్యాం. ఇంటి బాధ్యత నా మీదనే ఉండటంతో సంపాదన గురించి ఎప్పుడూ ఆలోచించేదాన్ని. 2004లో మార్కెటింగ్‌ విభాగంలో ఓ సైబర్‌ కేఫ్‌లో పనిచేసేదాన్ని. ఓ అమ్మాయి అలా బయటకు వెళ్లి పనిచేయడమే మా చుట్టుపక్కల పెద్ద విషయంగా భావించేవారు’’ అని తన జీవితం తొలినాళ్లను గుర్తుచేసుకుంటుంది ప్రేరణ. 

వ్యాపారంలో మోసం
ఆ తర్వాత వచ్చిన గడ్డు పరిస్థితులు, దాటిన విధానాల గురించి చెబుతూ... ‘‘సైబర్‌ కేఫ్‌లో ఓ పెద్దాయన కలిశాడు. తనతో పాటు మార్కెటింగ్‌ పనులు చేయమని సూచించాడు. దీంతో నేనూ వారి కంపెనీలో భాగస్వామినయ్యాను. ఎలాంటి ఒప్పంద పత్రాలు లేకపోవడంతో నెలన్నరలోనే అక్కణ్ణుంచి బయటకు రావాల్సి వచ్చింది. అది నాకు అనుభవాన్ని నేర్పింది.

కానీ, ఇంటిని నిలబెట్టుకోవడానికి ఉద్యోగం తప్పనిసరి. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యింది. ‘ఇప్పుడేం చేయాలి?’ అనేది పెద్ద సందిగ్ధం. ఉద్యోగం లేకుండా జీవించే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు ఎవరికోసమో మార్కెటింగ్‌ పనులు చేశాను. ఇప్పుడు నాకోసం నేనే ఎందుకు వ్యాపారం ప్రారంభించకూడదు అనుకున్నాను. కానీ, నా దగ్గర మూడు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. సాయం పొందేందుకు డబ్బు ఇచ్చేవారు ఎవరూ లేరు.

ఆ డబ్బుతోనే ఇంట్లో ఒక గదిలో లెదర్‌ నుంచి తాళ్లు తీసే పనిని మొదలుపెట్టాను. అవకాశం ఉన్న చోట, పరిశ్రమలకు వెళ్లి కొనుగోలుదారులను వెతికేదాన్ని. సరఫరా చేసే విధానం గురించి అడిగేదాన్ని. కొన్ని రోజుల తర్వాత ఒక ఆర్డర్‌ వచ్చింది. అనుకున్న సమయానికి డెలివరీ చేశాను. ఆ విధంగా వ్యాపారానికి పునాది పడింది. వినియోగదారులను సంపాదించడం ద్వారా మాత్రమే ఈ పరిశ్రమలో ఉండగలను అని తెలుసుకున్నాను. 

సొంతంగా కంపెనీ.. 
‘క్రియేటివ్‌ ఇండియా’ అనే పేరుతో సంస్థ ప్రారంభించి నేటికి 15 ఏళ్లు.  లెదర్‌ తాళ్లు తయారీనే కాదు, ఎగుమతి కూడా చేస్తాను. ఈ పనిని మొదలుపెట్టినప్పుడు ఎవరూ దీనిని ఒక పనిగా గుర్తించలేదు. ప్రాక్టీస్‌ మీద సాధించాను. నేను ఇక్కడికి చేరుకోవడం అంత సులభం కాలేదు. నేటికీ వ్యాపారంలో ఆడపిల్లలు చాలా తక్కువ. చాలా మంది నన్ను చూసి హేళనగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఆడపిల్లలు ఇలాంటి వ్యాపారాలు ఎలా చేస్తారు, అసాధ్యం అన్నారు. కానీ, నేను ఈ లెదర్‌ వ్యాపారంలో విజయం సాధించాలని నిర్ణయించుకున్నాను. అనుకున్నది సాధించాను. రోజుకు రెండు కోట్ల టర్నోవర్‌తో కంపెనీని నడుపుతున్నాను. ఎక్కడకు వెళ్లినా వెళ్లినా అక్కడ కనీసం రెండు, మూడు వాహనాలైనా నా కోసం ఎదురుచూస్తుంటాయి. 

ప్రోత్సాహక అవార్డులు
ఒక అమ్మాయి ఇంటి గుమ్మం బయట నుంచి పని చేస్తే ఆ కుటుంబసభ్యులే అనుమానంగా చూస్తారు. కానీ, 2010లో నాకు ఎక్స్‌పోర్ట్‌ బిజినెస్‌ అవార్డు వచ్చినప్పుడు నేను సరైన సమాధానం చెప్పాను అనిపించింది. ఆ తర్వాత 2015లో హస్తకళల కోసం ఎగుమతి ప్రోత్సాహక మండలి, 2016లో జాతీయ ఉత్పాదక మండలి, 2017లో మళ్లీ హస్తకళల కోసం ఎగుమతి ప్రోత్సాహక మండలి అవార్డులు వరుసగా వరించాయి’’ అని ప్రేరణ తన విజయం గురించి, అనుభవించిన గడ్డు స్థితి గురించి వివరిస్తారు. 

ఎవరైనా ఏదైనా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు ప్రేరణ స్ఫూర్తి కథనాన్ని చదివితే చాలు, తప్పక ప్రేరణ పొందుతారు. ‘విజయం ఒక్కరోజులో సాధ్యం కాదు, అందుకోసం ఓ తపస్సు చేయాలని చెబుతున్న ప్రేరణ వర్మ నేడు ఎంతోమంది మగువలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. 

నా దగ్గర మూడు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. సాయం పొందేందుకు డబ్బు ఇచ్చేవారు ఎవరూ లేరు. ఆ మూడు వేల రూపాయలతో ఇంట్లోనే ఒక గదిలో లెదర్‌ నుంచి తాళ్లు తీసే పనిని మొదలుపెట్టాను.
– ప్రేరణ 

చదవండి: Pink Cafe: చాయ్‌తోపాటు.. మీ సమస్యలకు పరిష్కారం కూడా..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top