Pink Cafe: చాయ్‌తోపాటు.. మీ సమస్యలకు పరిష్కారం కూడా..

Rohtak Pink Cafe Only For Women Customers - Sakshi

‘చాయ్‌ చాయ్‌ కోసమే కాదు...సామాజిక విశ్లేషణకు కూడా’ అనడానికి సజీవ సాక్ష్యం ఈ పింక్‌ కేఫ్‌. హరియాణాలోని రోహ్‌తక్‌ నగరానికి చెందిన కాలేజీ అమ్మాయిలు, గృహిణులు ‘పింక్‌ కేఫ్‌’ ప్రారంభించారు. దీని వెనుక ‘పథ్‌ సొసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థ చొరవ ఉంది. స్థూలంగా చెప్పాలంటే...ఇది మహిళల కోసం మహిళల చేత ఏర్పడిన కేఫ్‌. ఈ కేఫ్‌లో వేడి వేడి చాయ్‌ తాగుతూ హాట్‌ టాపిక్‌ల గురించి చర్చించుకోవచ్చు. భావాలను పరస్పరం పంచుకోవచ్చు. తమ బాధలకు పరిష్కార మార్గం వెదుక్కోవచ్చు.

‘గతంలో ఏదైనా సమస్య వస్తే నాలో నేను కుమిలిపోయేదాన్ని. దీంతో బాధ మరింత పెరిగేది. పింక్‌కేఫ్‌ పరిచయమయ్యాక వయసుతో నిమిత్తం లేకుండా ఎంతోమంది పరిచయమయ్యారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా పింక్‌కేఫ్‌కు వస్తేచాలు ఆ సమస్యకు అద్భుతమైన పరిష్కారం దొరికుతుంది’ అంటుంది నీలిమ అనే అమ్మాయి.

చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్‌ ఐలాండ్‌.. లక్షల కోట్ల సంపద!

ఒకే కేఫ్‌ ఒక్కోరోజు ఒక్కో వేదికలా మారుతుంది. ఒకరోజు మహిళా రచయిత్రులు, కవయిత్రులు, సంగీతకారులు తమలోని సృజనను ఆవిష్కరించుకునే వేదిక అవుతుంది. ఒక రోజు ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు చూపే కౌన్సెలింగ్‌ సెంటర్‌ అవుతుంది. ఒకరోజు...పేద మహిళలకు ఉపాధి మార్గాలను సూచించే వేదిక అవుతుంది. హక్కులు, ఆరోగ్యం, అనుభవాలు, పరిష్కారాలు... ఒక్క మాటలో చెప్పాలంటే మహిళలకు ఈ పింక్‌కేఫ్‌ ఒక చుక్కాని. ఔత్సాహిక కళాకారులకు భుజం తట్టే వేదిక. 

ఉదా: రంజనికి కవిత్వమంటే ఇష్టం. తాను రాసిన కవిత్వాన్ని పుస్తకంగా వేసుకోవాలనేది ఆమె కల. అయితే తనకు అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో కల కలగానే ఉండిపోయింది. ‘పింక్‌ కేఫ్‌’ పరిచయమ య్యాక... ఒకరోజు తన కవితలను అక్కడ వినిపించింది. అవి నచ్చిన ముగ్గురు కలిసి కవిత్వాన్ని ప్రచురించారు. ఆ పుస్తకం చూసి రంజని ఎంతగానో మురిసిపోయింది.

‘ఈ కేఫ్‌ మొదలు పెట్టినప్పుడు కాలక్షేపం కబుర్లకు తప్ప ఎందుకు అన్నవాళ్లు... ఇప్పుడు తమ అభిప్రాయాన్ని మార్చుకొని వేనోళ్ల పొగుడుతున్నారు. ఇది చాలు పింక్‌కేఫ్‌ విజయం గురించి చెప్పడానికి’ అంటుంది పింక్‌ కేఫ్‌ మొదలు కావడానికి కష్టపడిన మహిళల్లో ఒకరైన సునీత.

చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top