Guntur Man Receive PHD In South Korea: Pasupuleti Laxmi Narayana Story In Telugu - Sakshi
Sakshi News home page

సక్సెస్‌ స్టోరీ: ‘నాకోసం అమ్మ చెవికమ్మలు తీసిచ్చింది’

Jul 16 2021 12:10 PM | Updated on Jul 16 2021 1:37 PM

Pasupuleti laxmi Narayana From Guntur, Will Recieve PHD In South korea - Sakshi

ఆ కుర్రాడి పేరు పసుపులేటి లక్ష్మీ నారాయణ. గుంటూరు జిల్లా, పిడుగురాళ్ల మండలం, జానపాడు అతడి సొంతూరు. సౌత్‌ కొరియాలోని కొరియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెటీరియల్‌ సైన్స్‌ (కిమ్స్‌)లో ‘మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ఆగస్టు 25న పీహెచ్‌డీ పట్టా అందుకోనున్నాడు. జానపాడు ప్రభుత్వ పాఠశాలలో మొగ్గ తొడిగి సౌత్‌ కొరియాలోని జియోన్‌గ్సాంగ్‌ నేషనల్‌ యూనివర్సి టీలో వికసించిన ఓ విజయకథనం ఇది.

లక్ష్మీనారాయణ తల్లిదండ్రుల ఆకాంక్ష వారి ముగ్గురు పిల్లలనూ విద్యావంతులను చేసింది. ‘మా పిల్లల జీవితం మాలాగ సున్నపుబట్టీలో మగ్గిపోకూడదు’ అనుకున్నారు. పిల్లలను పనిలోకి పంపించకుండా బడిలోకి పంపించారు. ఆ నిర్ణయం ఈ రోజు దేశానికి ఒక విద్యావంతుడిని ఇచ్చింది. భావితరానికి ఒక ఆవిష్కర్తను తయారు చేసింది. ‘చదువుకి పేదరికం అడ్డు కాకూడదు’ అని స్వర్గీయ వైఎస్‌ఆర్‌ తలంపే తనకీ జీవితాన్ని ఇచ్చిందన్నాడు లక్ష్మీనారాయణ. పేదింట్లో పుట్టిన కారణంగా తెలివి ఉండి చదువుకు దూరం అయ్యే దుస్థితి ఎవరికీ రాకూడదని చెప్పడమే కాకుండా ఆయన ట్రిపుల్‌ ఐటీలను స్థాపించి, చురుకైన పిల్లలకు ఉచితంగా విద్యనందించే ఏర్పాటు చేశాడు. ఆ ట్రిపుల్‌ ఐటీలు పెట్టిన మరుసటి ఏడాది లక్ష్మీనారాయణ టెన్త్‌ పూర్తి చేయడం కాకతాళీయమే కావచ్చు. సీటు సంపాదించుకోగలిగిన మార్కులు తెచ్చుకున్నది మాత్రం చదువు పట్ల అతడి తృష్ణ, తల్లిదండ్రుల ఆకాంక్ష అతడి మనసులో వేసిన ముద్ర మాత్రమే.


జానపాడులో లక్ష్మీ నారాయణ చదువుకున్న ప్రభుత్వపాఠశాల 

ఆరేళ్లు అన్నీ ఉచితమే!
2019లో నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో చేరిన లక్ష్మీనారాయణ ఇంటర్, బీటెక్‌ పూర్తి చేశాడు. ఇంజినీరింగ్‌ పట్టా పుచ్చుకునే వరకు తల్లిదండ్రులకు రూపాయి ఖర్చులేకుండా చదువు పూర్తి చేసుకోగలిగానని చెప్పాడు. మెటలర్జీ సబ్జెక్టు ఇష్టం, పరిశోధన పట్ల అతడికి ఉన్న ఆసక్తికి అదే ఊరి నుంచి సౌత్‌ కొరియా వెళ్లి పరిశోధన చేస్తున్న హరిబాబు మార్గదర్శనం నారాయణ ప్రయాణానికి మంచి ఆసరా అయింది. సౌత్‌ కొరియాలోని యూనివర్సిటీలలో సీటు కోసం అప్లయ్‌ చేశాడు. స్కాలర్‌షిప్‌తో సీటు వచ్చింది. 

అమ్మ చెవికమ్మలు తీసిచ్చింది!
సౌత్‌ కొరియాకు ప్రయాణం కావాలి... యూనివర్సిటీకి వెళ్లే వరకైన ఖర్చులకు డబ్బు కావాలి. మరో దారి లేదు... తల్లి చెవికమ్మలు తీసి అమ్మింది. అవీ చాలలేదు. దొరికిన చోట అప్పు తెచ్చాడు తండ్రి. మొత్తం ముప్పై వేలు చేతిలో పెట్టారు. ‘‘చాలామందికి అది చాలా చిన్న మొత్తమే కావచ్చు. నాకది కోటానుకోట్ల కంటే ఎక్కువ. నా కోసం మా అమ్మ చెవి కమ్మలు తీస్తుంటే వద్దనాలనిపించింది. అయితే ఆ క్షణంలో అమ్మ మాత్రం ఏ మాత్రం బాధపడలేదు. నాకు విదేశంలో సీటు వచ్చినందుకు అమ్మానాన్న పడుతున్న ఆనందం నా బాధ్యతను మరింతగా పెంచింది. జీవితంలో తొలిసారి విమానం ఎక్కాను. మంచి స్కాలర్‌షిప్‌ రావడంతో అక్కడ ఖర్చులు పోను డబ్బు మిగిలేది. ఏడాదిన్నరలో అప్పులు తీర్చేసి, అమ్మకు కొత్త కమ్మలు కొనుక్కోవడానికి డబ్బు పంపాను. మా అమ్మకేమో నేను ట్రిపుల్‌ ఐటీలో సీటు తెచ్చుకున్న క్షణాలు ఆనందక్షణాలు, నేను మాత్రం అమ్మకు కమ్మల కోసం డబ్బు పంపినప్పుడు సంతోషంగా ఫీలయ్యాను.


అమ్మానాన్న అన్నలతోనారాయణ(కుడి చివర)

త్రీడీ శోధన
లక్ష్మీ నారాయణ ఆరేళ్లలో 23 పబ్లికేషన్‌ లు సమర్పించాడు. మెటలర్జీలో టైటానియం త్రీడీ ప్రింటింగ్‌లో సాగుతున్న అతడి పరిశోధనలు ఏరోస్పేస్‌ రంగంలోనూ, వైద్య విభాగంలోనూ మంచి ఆవిష్కరణలు కానున్నాయి. గుండె వాల్వులు, మోకాలు, బోన్‌ రీప్లేస్‌మెంట్‌ అమర్చే లోహపు పరికరాల తయారీలో మంచి ఫలితాలనిస్తాయి. ఏరో స్పేస్‌లో పెద్ద మెషినరీలో రిపేర్‌ వస్తే ఆ యంత్రాన్ని డిస్‌మాంటిల్‌ చేయాల్సిన పని లేకుండా పని చేయని భాగానికి మాత్రమే మరమ్మతు చేయడం సాధ్యమవుతుంది. 

ఒక్క ఫొటో ఉండేది!
టెన్త్‌ క్లాస్‌ పూర్తయ్యే నాటికి లక్ష్మీ నారాయణకు అమ్మానాన్నలతో తాను మాత్రమే ఉన్న ఫొటో ఒకే ఒక్కటి ఉండేది. టెన్త్‌లో టాపర్‌ అయిన సందర్భంగా స్థానిక వార్తా పత్రికల వాళ్లు పేపర్‌లో ప్రచురణ కోసం ఆ ఫొటో తీసుకువెళ్లారు. ఇప్పుడు ఆ ఫొటో కూడా వాళ్ల దగ్గర లేదు. పెద్దన్నయ్య పెళ్లి సమయానికి ట్రిపుల్‌ ఐటీలో ఉండడం, అక్కడ ఏడాదికి వారం రోజులు మాత్రమే సెలవులు ఉండడంతో పెళ్లికి రాలేకపో వడం, రెండవ అన్నయ్య పెళ్లికి కొరియా నుంచి రాలేకపోవడంతో ఇప్పటికీ అమ్మానాన్నలతో మరో ఫొటో తీసుకునే అవకాశం రాలేదని చెప్పాడు.డబ్బు లేకపోవడం కారణంగా దూరమయ్యేది సౌకర్యాలు, విలాసాలు మాత్రమే కాదు... అందమైన జ్ఞాపకాలు కూడా. లక్ష్మీ నారాయణ మాత్రం చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి దశలోనూ తనను ఎవరో ఒకరు నడిపించారని, ‘లక్ష్మీ నారాయణ రెజ్యూమ్‌ చూసి ఇంప్రెస్‌ అయ్యాను. ఒక పరిశోధకుడిని తయారు చేయగలననే నమ్మకం కలిగింది. అందుకే సీటుకు రికమండ్‌ చేశాను’ అని జింజు యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సుబ్బారెడ్డి అన్న మాటలను గుర్తు చేసుకున్నాడు. 
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి
 ఫొటోలు: వల్లెం మల్లికార్జునరెడ్డి, పిడుగురాళ్ల రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement