Parenting Tips In Telugu: How To Do Digital Detox Without Unplugging Completely - Sakshi
Sakshi News home page

Digital Detox: డిజిటల్‌ సర్పం.. విషానికి విరుగుడు

Published Mon, Jan 23 2023 11:57 AM

Parenting Tips: How to Do Digital Detox Without Unplugging Completely - Sakshi

పదిమంది గుమిగూడే స్థలం... అంటే బస్టాప్, రైల్వేస్టేషన్, ఆఖరికి పార్కులకు వచ్చేవారిలో కూడా చాలామంది మొబైల్‌లోనో, ట్యాబ్‌లోనో తలలు దూర్చి కనిపిస్తారు. అవసరం మేరకు ఉపయోగించడానికి బదులుగా, అంతకంటే ఎక్కువగా ఎప్పుడూ స్క్రీన్‌కు అతుక్కుపోవడాన్ని ‘డిజిటల్‌ అడిక్షన్‌’గా మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇది విషపదార్థాలను మెదడులోకి నింపుకోవడమేననీ, చిన్న చిన్న టెక్నిక్స్‌ ఉపయోగించి వాటిని శుభ్రం చేయవచ్చని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఆ వివరాలివి... 

పిల్లలతో పాటు పెద్దలు సైతం మొబైల్స్‌నూ, ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్‌ వంటి వాటిని వాడుతుంటారు. అయితే వారు పెద్దవాళ్లు కావడంతో కుటుంబ బాధ్యతలకూ, ఆఫీసు పనుల కోసం స్క్రీన్‌ నుంచి ముఖం తప్పించడం తప్పదు. 

స్క్రీన్‌కు అతుక్కుపోవడం టీన్స్‌లో ఎక్కువ... 
పిల్లల్లో అందునా టీనేజీ పిల్లల్లో ‘స్క్రీన్‌’ పట్ల అడిక్షన్‌ ఎక్కువ. తమ చదువుల కోసం, కాలేజీల్లో ఇచ్చే టాస్కులు, ప్రాజెక్టుల కంటే ఎక్కువగా సరదా అంశాలూ, సినిమాలు, గాసిప్స్‌ కోసమే స్క్రీన్‌ టైమ్‌ను వెచ్చిస్తుంటారు. 

అంతకంటే చిన్న పిల్లల్లోనూ... 
ఇక టీన్స్‌లోకి రాని ఎనిమిది, తొమ్మిది నుంచి పన్నెండేళ్ల పిల్లలు సైతం డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ల్లో తలను ముంచేస్తారు. ఆఖరికి బయటికి వచ్చినప్పుడు కూడా మొబైల్‌లో ఎన్నో రకాల గేమ్స్‌ ఆడుతూ ఉంటారు. ఒక్కోసారి పిల్లల్ని బయటకు తీసుకొచ్చినప్పుడు వాళ్లు అల్లరి చేయకుండా ఉండేందుకు తల్లిదండ్రులే ‘మొబైల్స్‌’ను వాళ్ల చేతికి అందిస్తుంటారు. అదే అలవాటు వాళ్లు టీన్స్‌లోకి వచ్చాక మరీ ముదిరిపోతుంది. ఓ వయసుకు చేరేనాటికి అది ‘డిజిటల్‌ అడిక్షన్‌’గా   మారిపోతుంది. దీని వల్ల వచ్చే మానసిక సమస్యల విశ్వరూపాల్ని మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. మొబైల్‌లో గేమ్స్‌ ఆడవద్దన్నందుకు తల్లిదండ్రులతో పోట్లాటలు దగ్గర్నుంచి ఆత్మహత్యల వరకు ఈ దుష్పరిణామాలెన్నో. 

డిజిటల్‌ అడిక్షన్‌ను గుర్తించడమెలా? 
స్క్రీన్‌ ముందు చాలాసేపు గడపడం: సోషల్‌ మీడియాలో బ్రౌజింగ్‌ చేస్తూ, గేమ్స్‌ ఆడుతూ, సినిమాలు చూస్తే చాలాసేపు గడపడం. దాంతో చదువూ, హోమ్‌వర్క్, వ్యాయామం, ఫ్రెండ్స్‌తో కలవడం వంటి కార్యకలాపాలకు దూరమవుతుంటారు. 
     
స్క్రీన్‌ ముందు నుంచి తప్పించడం చాలా కష్టం కావడం: పిల్లల చేతుల్లోంచి స్మార్ట్‌ఫోన్‌ లాగేసుకున్నా లేదా కంప్యూటర్‌ ఆఫ్‌ చేయమన్నా వాళ్లకు ఇరిటేషన్‌ వచ్చేస్తుంది. బలవంతంగా మొబైల్‌ లాగేసినా లేదా కంప్యూటర్‌ ఆఫ్‌ చేసినా కోపం రగిలిపోవడంతో పాటు చేతుల్లో ఉన్న వస్తువుల్ని విసిరేసి, వైల్డ్‌గా ప్రవర్తిస్తుంటారు. 

రోజువారీ పనుల్ని పూర్తి చేయకపోవడం: తాము రోజూ చేయాల్సిన క్లాస్‌వర్క్‌గానీ లేదా హోమ్‌వర్క్‌గానీ చేయకుండా వదిలేస్తారు. ఈ పెండింగ్‌వర్క్‌ను తప్పనిసరిగా చేయాల్సి వచ్చినప్పుడు అతిగా ఆందోళనపడుతుంటారు. 

ఒంటరిగా ఉండటం: వీరు స్మార్ట్‌ఫోన్‌లోని యాప్స్‌తో తప్ప ఇతరులతో కమ్యూనికేషన్‌లో ఉండరు. ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దేనిపట్లా ఆసక్తితో ఉండరు సరికదా... గతంలో వారికి ఇష్టమైన పెయింటింగ్‌ లాంటి అభిరుచులకు దూరంగానూ, అనాసక్తితో ఉంటారు. 

మూడ్‌ స్వింగ్స్‌ : తాము చేసే పని పట్ల ఏకాగ్రత కోల్పోతుండటం, దేని పట్లా దృష్టి కేంద్రీకరించలేకపోవడంతో పాటు త్వరత్వరగా వారి మూడ్స్‌మారిపోతుండటం చాలా సాధారణంగా జరుగుతుంటుంది. అంతేకాదు... వారి ప్రవర్తన గమనించి పెద్దవాళ్లు ఫోన్‌ తీసుకోబోతుంటే దాన్ని దాచుకోవడం, అబద్ధాలు చెప్పడం వంటివీ చేస్తారు. 

చక్కదిద్దడానికి చిట్కాలివి... 
పిల్లలు అవసరానికి మించి ‘స్క్రీన్‌’ను వాడటాన్ని తగ్గించేలా చేయడం ఎలాగో మానసిక నిపుణులు అందిస్తున్న కొన్ని సూచనలివి... 
     
ముందు మారాల్సింది పేరెంట్సే: చాలామంది తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్‌తో చాలా సేపు గడుపుతూ... తమ పిల్లలు మాత్రం వాటికి దూరంగా, క్రమశిక్షణతో ఉండాలనుకుంటారు. ఈ విషయంలో ముందుగా మారాల్సిందీ, పిల్లలకు ఆదర్శంగా ఉండాల్సిందే తల్లిదండ్రులే. 
     
ఒకేసారి లాగేయకండి: అడిక్షన్‌కు లోనైన పిల్లల నుంచి స్మార్ట్‌ఫోన్‌ /ల్యాప్‌టాప్‌ను ఒకేసారి లాగేయకండి. స్విచ్‌నొక్కినట్టుగా పిల్లలు మారిపోరు. వారు రోజూ డిజిటల్‌ డివైజ్‌తో ఎంత టైమ్‌ను గడపదలచుకున్నారో వారినే నిర్ణయించుకొమ్మని సూచించండి. నిర్దిష్టంగా ఆ టైమ్‌లో వాళ్లను స్మార్ట్‌ఫోన్‌ లేదా కంప్యూటర్‌తో ఆడుకోనివ్వండి. క్రమంగా ఆ టైమ్‌ను తగ్గిస్తూ రావాలి తప్ప ఠక్కున మారిపోవడం అంటూ జరగదు. పైగా అలా చేయడం ఇంకా మరికొన్ని దుష్పరిణామాలు దారితీస్తుంది. 
     
స్నేహితుల్ని వ్యక్తిగతంగా కలవమనడం: స్నేహితుల్ని ఫోన్‌లో లేదా వాట్సాప్‌లో పలకరించడానికి బదులు వ్యక్తిగతంగా కలిసి రమ్మనీ, కలిసి ఆడుకొమ్మని ప్రోత్సహించాలి. అంతేకాదు... పెళ్లిళ్లు, పండుగల వంటి సమయాల్లో వ్యక్తుల్ని, బంధువుల్ని ప్రత్యక్షంగా కలవమని, సామాజిక బంధాల్ని బలోపేతం చేసుకోవడం ఎంత అవసరమో చెప్పాలి. 

వారీ అలవాటు నుంచి బయటకు వచ్చాక... డిజిటల్‌ ఉపకరణాలవల్ల వారు కోల్పోబోయిన అంశాలు, వాటి వల్ల కలిగిన నష్టాలతో పాటు... డీ–టాక్సికేషన్‌ తర్వాత ఇప్పుడు వారికి ఒనగూరిన/ఒనగూరుతున్న ప్రయోజనాలను వివరించవచ్చు. అప్పుడు వారు డిజిటల్‌ ఉపకరణాలను మరింత సమర్థంగా ఎలా వాడాలో తెలుసు కుంటారు. అనవసరమైన వాటికి దూరంగా ఉంటూ స్వీయనియంత్రణ పాటిస్తారు. (క్లిక్ చేయండి: సోషల్‌ మీడియా పోస్ట్‌ వాల్యూకి ఇవే కొలమానం! ఈ చిట్కాలు పాటిస్తే..)
 

డిజిటల్‌ ఉపకరణాల దుష్ప్రభావాలు

నిద్రలేమి, తరచు నిద్రాభంగం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం (లో సెల్ఫ్‌ ఎస్టీమ్‌), తరచు తలనొప్పులు, ఒకేచోట కూర్చుని అదేపనిగా గేమ్స్‌ ఆడుతుండటం వల్ల ఒబేసిటీ, కీళ్లనొప్పులు వంటి అనేక రూపాల్లో కనిపిస్తాయి. అందుకే వీటిని మనకు ఉపయోగపడే మేరకే విచక్షణతో, తెలివిగా వాడుతూ... వీటికి అడిక్ట్‌ కావడం నుంచి క్రమంగా బయటపడాలి. 
- డాక్టర్‌ చరణ్‌తేజ కోగంటి
సీనియర్‌ సైకియాట్రిస్ట్‌

Advertisement
 
Advertisement
 
Advertisement