
భారతదేశంలో వినాయక చవితి (గణేష్ చతుర్థి 2025) వేడుకలను ఎంతో ఉత్సాహంగా, విశ్వాసంతో జరుపుకుంటారు. పది రోజుల పాటు, వాడవాడలా గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించి అత్యంత భక్తి శ్రద్దలతో పూజను నిర్వహించి నిమజ్జనంతో వీడ్కోలు పలుకుతారు. ఈ వేడుకల్లో అనేక మంటపాల్లో కొలువుదీరిన గణపతిలను సందర్శించుకోవడం ఆనవాయితీ. తమ కోర్కెలు తీర్చాలని మొక్కుకుంటారు. భక్తులు తమ కోరికలను రాసి, వినాయకుడికి పంపినా, ఎలుక చెవిలో చెప్పుకున్నా గణపయ్య కోరికలు తీరుస్తాడట. ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది.
గణేష్‌ను విఘ్నాలను హరించి, శుభాలను అందించే భావిస్తారు ఏ శుభ కార్యానికైనా తొలిపూజ ఆయనదే. మనదేశంలో ఒక్కో గణపతి ఆలయానికి ఒక్కో ప్రత్యేకత. అలాంటి వాటిలో ఒకటి రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఉన్న ఘర్ గణేష్ ఆలయం.
ఘర్ గణేష్ ప్రత్యేకత
ఘర్ గణేష్ ఆలయంలో వినాయకుడిని తొండం లేకుండా, పురుషాకృతి రూపంలో బాలగణపయ్యగా ప్రతిష్టించారు. గణపతి బప్పా ఈ ప్రత్యేక రూపమే భక్తుల ఆకర్షణకు, భక్తికి ప్రత్యేక కారణంగా నిలుస్తోంది.
300 ఏళ్ల చరిత్ర
ఆలయ చరిత్ర 300 సంవత్సరాల పురాతనమైనదని చెబుతారు. 18వ శతాబ్దంలో మహారాజా సవాయి జై సింగ్ II ఈ ఘర్ గణేష్ ఆలయాన్ని నిర్మించాడు. జైపూర్‌లో స్థిరపడటానికి ముందు అశ్వమేధ యాగం నిర్వహించినప్పుడు, ఈ ఆలయానికి పునాది వేశారని చెబుతారు. సిటీ ప్యాలెస్‌లోని చంద్ర మహల్ నుండి టెలిస్కోప్ సహాయంతో కూడా చూడగలిగే విధంగా ఆయన గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించారని ప్రతీతి.
భక్తులు తమ సమస్యలను ఎలుకల చెవుల్లో చెబుతారు.
ఘర్ గణేష్ ఆలయం దాని ప్రాచీనతకు మాత్రమే కాదు, ప్రత్యేకమైన పూజా పద్ధతికి కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గణేశుడితో పాటు, ప్రత్యేకంగా ఆలయ ప్రాంగణంలో రెండు భారీ గణేషుడి వాహనమైన మూషికాలు(ఎలుకలు) ఏర్పాటు చేశారు. భక్తులు తమ సమస్యలను, కోరికలను వీటి చెవుల్లో నెమ్మదిగా చెప్పుకుంటారు. ఆ మూషికా రాజాలు నేరుగా బప్పాకు తెలియజేస్తే, గణేశుడు వారి కష్టాలను తొలగిస్తాడని నమ్ముతారు.
చదవండి: దేశంలోనే రిచెస్ట్ గణపతిగా రికార్డు, భారీ బీమా
లేఖ రాయడం ద్వారా కూడా
ఘర్ గణేష్ ఆలయం గురించి అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భక్తులు లేఖ లేదా ఆహ్వాన పత్రిక రాయడం ద్వారా తమ కోరికలను పంపుతారు. ఇంట్లో పెళ్లి అయినా, బిడ్డ పుట్టినా, ఉద్యోగం వచ్చినా, ఇలా ఏ శుభకార్యమైనా దానికి సంబంధించిన ఆహ్వానాన్ని పంపుతారు. అలా ప్రతిరోజూ వందలాది ఉత్తరాలు ఈ ఆలయ చిరునామాకు వస్తాయి, వాటిని చదివి భగవంతుని పాదాల వద్ద ఉంచుతారు. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. గణేష్ జీ వారి ప్రతి పిలుపు విని, శుభాలనిస్తాడని భక్తుల విశ్వాసం. (పూజా కంకణం ప్రాశస్త్యం, వినాయక విగ్రహం చెప్పే నీతి)
365 మెట్లు ఎక్కాలి
ఆలయానికి చేరుకోవడానికి, భక్తులు 365 మెట్లు ఎక్కాలి, ఇది సంవత్సరంలో 365 రోజులకు ప్రతీక. ఇక్కడి నుంచి మొత్తం జైపూర్ నగరం విశాల దృశ్యం కనిపిస్తుంది, ముఖ్యంగా సూర్యాస్తమయం సమయంలో ఈ దృశ్యం కళ్ళారా చూడాల్సిందే. జైపూర్‌లో తప్పకుండా సందర్శించాల్సిన విశేషాల్లో ఇది కూడా ఒకటి.