అలసిపోయిన ప్రాణం: పాడె మోసిన గ్రామస్తులు | Odisha FM college student passed away over inaction on harassment complaint | Sakshi
Sakshi News home page

Soumyashree అలసిపోయిన ప్రాణం: పాడె మోసిన గ్రామస్తులు

Jul 16 2025 9:47 AM | Updated on Jul 16 2025 5:24 PM

Odisha FM college student passed away over inaction on harassment complaint

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థిని మృతి

రాష్ట్రమంతటా విషాద ఛాయలు

గ్రామస్తుల భుజాలపై  సౌమ్యశ్రీ అంతిమ యాత్ర 

గ్రామ జనం మధ్య సౌమ్యశ్రీ అంత్యక్రియలు 

భువనేశ్వర్‌: ఒడిశారాష్ట్రం అంతటా విషాదం అలముకుంది. అధ్యాపకుని వేధింపులు తాళలేక ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విద్యార్థిని సౌమ్య శ్రీ  (Soumyashree) ఆస్పత్రిలో చావుతో పోరాటం చేసి సోమవారం అర్ధరాత్రి తనువు చాలించింది. బాలాసోర్‌ ఫకీర్‌ మోహన్‌ అటానమస్‌ కాలేజీలో చోటు చేసుకున్న విషాద సంఘటన ఇది. భోరుమన్న తల్లిదండ్రుల రోదనతో  పలాసియా గ్రామం మారు మోగింది. ఊరంతా ఏకమై భుజాలు మార్చుకుంటూ గ్రామం ముద్దు బిడ్డ సౌమ్యశ్రీకి బరువైన గుండెతో తుది వీడ్కోలు పలికారు. 

బాధ్యులకు రాజీ లేని శిక్ష: గవర్నరు 
బాలాసోర్‌ ఫకీర్‌ మోహన్‌ కళాశాల విద్యార్థిని అకాల మరణం బాధాకరమని, ఆమె మరణం విషాదం మాత్రమే కాదని, నేటి విద్యాబోధన ప్రాంగణాల్లో యువతులను కాపాడుకోవాల్సిన తక్షణ అవసరాన్ని గుర్తు చేస్తుందని రాష్ట్ర గవర్నర్‌ డాక్టరు హరి బాబు కంభంపాటి ఆవేదన వ్యక్తం చేశారు.  చట్టం తన కఠినమైన మార్గాన్ని అనుసరిస్తుందని, బాధ్యులు రాజీలేని శిక్షను ఎదుర్కొంటారని ఆయన ఉద్ఘాటించారు.  

దోషులకు శిక్ష తప్పదు: ముఖ్యమంత్రి 
ఫకీర్‌ మోహన్‌ అటానమస్‌ కళాశాల విద్యార్థిని విషాదకరమైన ఆత్మాహుతి సంఘటనను ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి తీవ్రంగా పరిగణించి దోషుల్ని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. చట్టం ప్రకారం ఆదర్శప్రాయమైన శిక్ష పడేలా చూడాలని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 20 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.  

వ్యవస్థాపరమైన వైఫల్యం: నవీన్‌ పట్నాయక్‌ 
‘చాలా విచారకరమైన సంఘటన. అందరూ షాక్‌ అయ్యారు. రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింది.  ఫకీర్‌ మోహన్‌ కళాశాల విద్యార్థిని విషాద మరణం ఉదాసీన వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమ’ని విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ పటా్నయక్‌ విచారం వ్యక్తం చేశారు. విద్యార్థిని మరణానికి దారితీసిన సంఘటనల క్రమం సంస్థాగత ద్రోహం తప్ప మరేమీ కాదు అని ఆందోళన చెందారు. న్యాయం కోసం దివంగత విద్యార్థిని చేసిన విజ్ఞప్తిని విస్మరించిన కళాశాల అధికారులు, అధికారంలో ఉన్నవారు ఉభయ వర్గాల్ని జవాబుదారీగా పరిగణించి చర్యలు చేపట్టాలని రాష్ట్ర గవర్నర్‌ను కోరారు. 

పర్లాకిమిడిలో.. 
పర్లాకిమిడి: బాలేశ్వర్‌లో ఫకీర్‌ మోహన్‌ స్వయం ప్రతిపత్తి కళాశాలలో సౌమ్య శ్రీ మృతిపై పర్లాకిమిడి ప్యాలెస్‌ రోడ్డులో పలువురు మహిళలు నిరసన తెలిపారు. కళాశాలలో ఆమెను వేధించిన హెచ్‌ఓడీని అరెస్టు చేయాలని, ఆమెకు న్యాయం జరిగేలా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మఝి చూడాలని సామాజిక సేవకురాలు జాస్మిన్‌ షేక్‌ డిమాండ్‌ చేశారు. సాయంత్రం ప్యాలెస్‌ నుంచి కొవ్వొత్తులతో పలువురు మహిళలు శాంతియుత ర్యాలీ జరిపారు.   

రాయగడ: బాలేశ్వర్‌లోని ఫకీర్‌ మోహన్‌ సేనాపతి కళాశాల విద్యా‍ర్థిని సౌమ్యశ్రీ ఆత్మాహుతికి నిరసనగా ప్రతిపక్షపారీ్టలైన బీజేడీ, కాంగ్రెస్‌లు మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. స్థానిక కపిలాస్‌ కూడలిలో బీజేడీ శ్రేణులు రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి, ఉన్నత విద్యాశాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్‌ దిష్టి బొమ్మలను తగుల బెట్టాయి. బీజేపీ అధికారంలొకి వచ్చిన ఏడాదిలోనే మహిళలకు రక్షణ కరువైందని, ఎక్కడ చూసినా అత్యాచారాలు పెరిగిపోయాయని దుమ్మెత్తిపోశారు. కల్యాణసింగుపూర్‌ లొ మంగళవారం నాడు కాంగ్రేస్‌ నాయకులు ఆందోళన చేపట్టారు.  

 భగ్గుమన్న బీజేడీ శ్రేణులు
జయపురం: బాలాసోర్‌ జిల్లాలో ఫకీర్‌ మోహన యూనివర్సిటీలో సౌమ్యశ్రీ మృతిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఆమె మృతిపై జయపురం బీజేడి శ్రేణులు భగ్గు మన్నాయి. మంగళవారం జయపురం బీజేడీ శ్రేణులు 26 వ జాతీయ రహదారిని స్తంభింపజేసి ఆందోళనలు చేపట్టారు. ప్లకార్డులు చేత పట్టి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనలో విక్రమ విశ్వ విద్యాలయ విద్యార్థులు పాల్గొన్నారు.   

నేడు, రేపు బంద్‌ 
భువనేశ్వర్‌: ఫకీర్‌ మోహన్‌ కళాశాల విద్యా‍ర్థిని సౌమ్యశ్రీ ఆత్మాహుతిపై నిరసనలతో రాష్ట్రంలో పరిస్థితి అట్టుడికి పోతుంది. ప్రధానంగా విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం విద్యా‍ర్థిని ప్రాణాలు బలిగొందని నిందిస్తున్నాయి. విషాదకర సంఘటనని రాజకీయం చేయొద్దని అధికార పక్షం భారతీయ జనతా పార్టీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్, రాష్ట్ర కాంగ్రెస్‌ వరుసగా రెండు రోజులు బంద్‌కు పిలుపునిచ్చాయి. తొలుత బిజూ జనతా దళ్‌ బుధవారం బాలాసోర్‌ బంద్‌ నిర్వహిస్తుందని ప్రకటించింది. విద్యా‍ర్థిని మృతిపై ప్రభుత్వ వైఫల్యం కారణంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ బిజూ జనతా దళ్‌ బాలసోర్‌లో ఆరు గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బంద్‌ జరుగుతుందని ప్రకటించింది. ఈ వ్యవధిలో ముఖ్యమైన సేవలు కొనసాగుతాయి. బంద్‌ సమయంలో దుకాణాలు, మార్కెటు సముదాయాలు, మోటారు వాహనాల రవాణా, బస్సులు, రైళ్లు రాకపోకలు, పాఠశాలలు మరియు కళాశాలలు మూసివేయాలని అభ్యర్థించారు. 

రేపు రాష్ట్ర బంద్‌ 
రాష్ట్ర కాంగ్రెస్‌ ఈ నెల 17 గురువారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. వామపక్షాలు, 8 ఇతర రాజకీయ పార్టీలతో ఉమ్మడిగా ఒడిశా బంద్‌ నిర్వహిస్తున్నట్లు ఒడిశా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్‌ దాస్‌ విలేకర్లకు వివరించారు. బాలాసోర్‌ సంఘటనకు నిరసనగా ఒడిశా బంద్‌కు పిలుపునిచ్చిన కాంగ్రెస్‌తో భారత కమ్యునిస్టు పార్టీ (సీపీఐ), సీపీఐ(ఎం సహా 8 ఇతర రాజకీయ పార్టీలు మంగళ వారం సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఒడిశా బంద్‌ ప్రకటన చేశాయి.   

ఎయిమ్స్‌ ఆవరణలో ఆందోళన,ఉద్రిక్తత
సౌమ్యశ్రీ మరణం తర్వాత శవ పరీక్షలు రాత్రికి రాత్రి ముగించి అడ్డగోలుగా తరలిస్తున్నారని దుమారం రేగింది. సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత ఆస్పత్రుల్లో శవ పరీక్షలు నిర్వహించడం జరగదు. సౌమ్యశ్రీ విషయంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఎదురు కావడంతో యువజన, విద్యార్థి కాంగ్రెస్‌ వర్గాలు ఆకస్మిక ఆందోళనకు దిగాయి. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌ ఆవరణలో ఆచార విరుద్ధ చర్యల్ని ఖండించారు. ఈ సందర్భంగా పోలీసులతో ఘర్షణకు దిగడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement