వీడని భయం.. ఊబకాయం  | Sakshi
Sakshi News home page

రేపు స్థూలకాయ వ్యతిరేక దినోత్సవం

Published Wed, Nov 25 2020 9:05 AM

Obesity Can Lead To Heart Disease And Certain Types Of Cancer - Sakshi

మితివీురిన ఆహారం, జంక్‌ ఫుడ్ల వల్ల శరీరంలో అవసరానికి మించి కొవ్వు చేరి ఆరోగ్యానికి హాని చేసే ఒక వ్యాధినే ఊబకాయంగా పిలుస్తారు. దీనినే స్థూలకాయం అని కూడా అంటారు. మోతాదుకు మించి ఆహారం తీసుకోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, ధూమపాన వ్యసనం, ఒత్తిళ్లు, కొన్నిసార్లు వారసత్వం వల్ల కూడా దీనిబారిన పడొచ్చు. అంటే ఒక వ్యక్తి తన ఎత్తు, వయస్సుకు తగ్గట్లుగా ఉండాల్సిన బరువుకు మించితే దీనిని అనారోగ్య సమస్యగా గుర్తించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఊబకాయం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, నిద్రలో సరిగా ఊపిరి తీసుకోలేకపోవడం (గురక), కీళ్లకు సంబంధించిన వ్యాధులు, కొన్ని రకాలైన కేన్సర్‌ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు పనిభారం అధికం కావడంతో ఒత్తిడికి గురవుతుంటారు. ఊబకాయానికి తోడు ఆర్థిక సమస్యలు, నిద్రలేమి, సామర్థ్యానికి మించి పనిచేయడం వలన పలువురు రక్తపోటు బారిన పడుతున్నారు. శరీరంలో అధిక కొవ్వు పెరగడం అంతిమంగా హృదయంపై ప్రభావం చూపనుంది. ఉదయం, సాయంత్రం వేళ కచ్చితంగా కొంత సమయం వ్యాయామం చేయాలని, చెమట పట్టేలా నడవడం, పరిగెత్తడం ద్వారా కొవ్వు కరిగించి బరువు తగ్గాలని వైద్యులు సూచిస్తున్నారు.

 జంక్‌ ఫుడ్‌ ప్రభావం
అధిక కేలరీలు కలిగి ఉండే ఆహారంగా చెప్పుకునే జంక్‌ఫుడ్‌ ప్రభావం పిల్లలపై తీవ్రంగా పడుతోంది. పెద్దల పరిస్థితీ అంతే. సాచ్యురేటెడ్‌ కొవ్వులు, ఉప్పు, పంచదార పాళ్లు మోతాదుకు మించి ఉండే చిరుతిళ్లు తినడం ప్రమాదకరం. అంటే బర్గర్, పిజా, ఫ్రెంచి ఫ్రైస్, కేకులు, నూడిల్స్, చిప్స్, తీపి ఉండలు, పంచదార పెట్టిన సీరల్స్, ఫ్రైడ్, ఫాస్ట్‌ ఫుడ్, కార్బొనేటెడ్‌ డ్రింక్స్, రెడిమేడ్‌ కూల్‌ డ్రింక్స్‌ లాంటివి జంక్‌ ఫుడ్‌గానే చెప్పొచ్చు. ఇంకా మసలా చాట్, పకోడీలు, బజ్జీలు, టమోటో కెచప్, వెన్నతో కూడిన కేకులు, చాక్లెట్‌ డింగ్‌–డాంగ్స్‌ లాంటివి కూడా ఎక్కువ తీసుకోవద్దు. 

మోతాదుకు మించి తినొద్దు
పిల్లలు టీవీ ముందు కూర్చొని చిరుతిళ్లు ఎక్కువగా తింటుంటారు. ఈ పద్ధతిని మాన్పించాలి. పెద్దలు వ్యాయామం చేయాలి. శారీరక శ్రమ కచ్చితంగా ఉండాలి. ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, ఫైబర్‌ ఉన్న పదార్థాలు తినాలి. మాంసాహారం, ధూమపానం, మద్యపానం అలవాట్లు మానాలి. – డాక్టర్‌ భూక్యా నాగమణి, సుజాతనగర్‌ పీహెచ్‌సీ 
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement