న్యూయార్క్‌ సిటీకి లేడీ బాస్‌ 

New Patrolling Chief Juanita Holmes New York City Police Department - Sakshi

న్యూయార్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌! ఎన్‌.వై.పి.డి. నూటా డెబ్భై ఐదేళ్ల చరిత్ర. యాభై ఐదు వేల మంది సిబ్బంది. నలభై ఐదు వేల కోట్ల రూ. బడ్జెట్‌. పది వేల పోలీస్‌ కార్లు. పదకొండు పోలీస్‌ బోట్లు. ఎనిమిది పోలీస్‌ హెలీకాప్టర్‌లు. నలభై ఐదు గుర్రాలు. ముప్పై ఐదు జాగిలాలు! కొత్తగా ఇప్పుడు.. హ్వానీటా హోమ్‌! ఎన్‌.వై.పి.డి.కి తొలి మహిళా చీఫ్‌.

హ్వానీటా హోమ్స్‌ ఎన్‌.వై.పి.డి.కి చీఫ్‌ అవగానే న్యూయార్క్‌ సిటీ మేయర్‌ బిల్‌ డే బ్లాసియో.. ‘హ్వానీటా ఒక చరిత్రాత్మక ఎంపిక మాత్రమే కాదు. తగిన ఎంపిక కూడా’ అని మొన్న 29న ట్వీట్‌ పెట్టారు. ఇప్పటికి చార్జి తీసుకునే ఉంటారు హ్వానీటా. 175 ఏళ్ల చరిత్ర కలిగిన న్యూయార్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కి ఆమె తొలి మహిళా చీఫ్‌. అంతేకాదు. తొలి ఆఫ్రికన్‌–అమెరికన్‌ మహిళా చీఫ్‌. ‘చీఫ్‌ ఆఫ్‌ పెట్రోల్‌’ ఆమె ఈ కొత్త హోదా. హ్వానీటా ముప్పై ఏళ్లకు పైగా ఎన్‌.వై.పి.డి.లో ఉన్నారు. తొలి పోస్టింగ్‌ 1987లో ‘పెట్రోల్‌ ఆఫీసర్‌’గా. తర్వాత సార్జెంట్, లెఫ్ట్‌నెంట్, కెప్టెన్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్, డిప్యూటీ చీఫ్‌. 2016లో అసిస్టెంట్‌ పోలీస్‌ చీఫ్‌గా ‘బరో కమాండర్‌’! బరో అంటే సిటీ.

ఇప్పుడిక.. చీఫ్‌ ఆఫ్‌ పెట్రోల్‌. న్యూయార్క్‌ సిటీలో క్రైమ్‌ని తగ్గించడం ఆమె ముఖ్య విధి. అందుకోసం ఎన్‌.వై.పి.డి.కి ఎన్ని బలగాలు ఉన్నాయో, అన్నీ ఆమె అధీనంలోకి వచ్చేస్తాయి. ముప్పై ఐదు జాగిలాలు సహా. హ్వానీటా కుటుంబం నుంచే 16 మంది న్యూయార్క్‌ సిటీ పోలీసులు ఉన్నారు! ప్రజల రక్షణకు అంకితమైన పోలీస్‌ కుటుంబం. అమెరికాలోనే అత్యంత శక్తిమంతమైన పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ను హ్వానీటా ఇప్పుడు నడిపించబోతున్నారు. తర్వాతి పొజిషన్‌ పోలీస్‌ కమిషనర్‌. 

ఇప్పటి వరకు ఉన్న ‘పెట్రోల్‌ చీఫ్‌’ ఫాటో పిచార్డో ఈ నెలలో తన పదవీ విరమణ ప్రకటించడంతో ఆ స్థానంలోకి తగిన వ్యక్తిగా డిపార్ట్‌మెంట్‌ హ్వానీటాను ఎంపిక చేసింది. ఆమె ఆ స్థానంలోకి రాగానే.. ‘‘ఎ కంప్లీట్‌ ప్యాకేజ్‌’ అని ఇప్పుడున్న కమిషనర్‌ ఆమెను అభినందించారు. అన్ని విధాలా పర్‌ఫెక్ట్‌ ఆఫీసర్‌ అని. ఆయనే.. ‘‘వాక్డ్‌ ది వాక్‌ అండ్‌ టాక్డ్‌ ద టాక్‌’’ అని ఆమెను ప్రశంసించారు. మాటల్లోనే కాదు, చేతల్లోనూ చూపించే మనిషి అని. పోలీస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ప్యాట్రిక్‌ లించ్‌.. ‘‘మన ప్రొఫెషన్‌లో ఎలాంటి అనూహ్యమైన పరిస్థితులు ఉంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అన్నది హ్వానీటాకు మించి ఎవరికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆమె కుటుంబం మొత్తం డిపార్ట్‌మెంట్‌ కోసం పనిచేస్తోంది’’ అని పూలగుచ్ఛం అందించారు.

పదోన్నతి పొందిన ఒక అధికారికి మొక్కుబడిగా లభించే ప్రశంసలు కావివి. ఆమె కెరీర్‌లో ప్రతి దశ అత్యుత్తమ ప్రతిభ, సమర్థతలతో కూడి ఉంది. ఆమె ఎన్‌.వై.పి.డి. స్కూల్‌ సేఫ్టీ డివిజన్‌లో చేశారు. డొమెస్టిక్‌ వయెలెన్స్‌ యూనిట్‌లో చేశారు. ‘డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ ట్రైనింగ్‌’ విభాగంలోనూ చేశారు. ఖండితంగా ఉంటారు హ్వానీటా. ఏది జరగాలో దానినే జరగనిస్తారు. ఒత్తిళ్లకు లోనవరు. చీఫ్‌ పెట్రోల్‌ ఆఫీసర్‌కు కావలసినవి కూడా ఈ గుణాలే. నిజాయితీ, సమానత్వం, దాపరికాలు లేకుండా ఉండటం. ‘‘ప్రజలు మనకెంతో చెప్పాలని తాపత్రయ పడుతుంటారు. వాళ్లు చెప్పింది మనం వినాలని ఆశిస్తుంటారు. నేరాలను తగ్గించి, జీవితంలోని నాణ్యతను పెంచడంలో వారి తోడ్పాటు కూడా పోలీసులకు అత్యవసరమే’’ అంటారు హ్వానీటా. 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top