Miss World 2025 నమస్తే నేర్చుకున్నాను : లెబనాన్ బ్యూటీ నద
May 15 2025 11:34 AM | Updated on May 15 2025 1:25 PM
శాంతే సౌందర్యం
నద... అంటే అరబిక్ భాషలో పిల్లల స్వచ్ఛమైన మనసు, ఉషోదయపు మంచు బిందువులు అని అర్థం. మిస్ వరల్డ్ లెబనాన్2025 పేరు నద (Nada Koussa). మిస్ వరల్డ్ 2025 (Miss World 2025) పోటీల కోసం హైదరాబాద్‌కి వచ్చిన నద తన పేరుకు అర్థం చెప్పుకుంటూ తమ దేశంలో పిల్లల బాల్యం, యువత భావోద్వేగాలు అంత స్వచ్ఛంగా ఏమీ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యూటీ పాజంట్ కావాలనే కోరిక కలగడానికి కారణం తెలియదు కానీ బాల్యం నుంచి తనతోపాటు పెరిగి పెద్దయిందన్నారామె.
నద... అంటే అరబిక్ భాషలో పిల్లల స్వచ్ఛమైన మనసు, ఉషోదయపు మంచు బిందువులు అని అర్థం. మిస్ వరల్డ్ లెబనాన్2025 పేరు నద (Nada Koussa). మిస్ వరల్డ్ 2025 (Miss World 2025) పోటీల కోసం హైదరాబాద్‌కి వచ్చిన నద తన పేరుకు అర్థం చెప్పుకుంటూ తమ దేశంలో పిల్లల బాల్యం, యువత భావోద్వేగాలు అంత స్వచ్ఛంగా ఏమీ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యూటీ పాజంట్ కావాలనే కోరిక కలగడానికి కారణం తెలియదు కానీ బాల్యం నుంచి తనతోపాటు పెరిగి పెద్దయిందన్నారామె.
ఈ అవకాశం కోసం ఎదురు చూశాను! ‘‘ఎనిమిదేళ్ల వయసు నుంచి నాకు జ్ఞాపకం ఉంది. నా ఆకాంక్ష తీరడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ బ్యాచులర్స్ పూర్తయింది. మాస్టర్స్ ఇన్ సైకాలజీ కూడా పూర్తయింది. క్లినికల్ సైకాలజిస్టుగా స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలను సందర్శిస్తూ పిల్లలకు, యువతకు మనోధైర్యాన్నిస్తున్నాను. అంతర్యుద్ధంతో అట్టుడిగిన దేశం మాది. అలాగే ఇరుగు పొరుగు యుద్ధాల తాకిడి కూడా దేశాన్ని కుదిపేసింది. అలాంటి దేశంలో మానసిక స్థైర్యం కల్పించడం చాలా అవసరం. ఇందుకోసం నేను ఐదు ఎన్జీవోలతో కలిసి పని చేస్తున్నాను.
మహిళలు నలిగిపోతున్నారు! మా దేశంలో సగటు మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒక దేశం ద్రవ్యోల్బణం, ఆర్థిక ఒడిదొడుకులను ఎదుర్కొంటోందీ అంటే ఆ పరిణామాలకు క్షేత్రస్థాయిలో నేరుగా బాధితులయ్యేది మహిళలే. విద్య, ఉద్యోగం, పిల్లలను చక్కబెట్టుకుంటూ, ఆర్థికపరమైన సర్దుబాట్లు చేసుకుంటూ కుటుంబాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను తమ భుజాల మీద మోస్తున్నారు మా దేశంలో మహిళలు.ఎక్కడో ఒకరిద్దరు కాదు, దాదాపుగా ప్రతి మహిళా వీటన్నింటినీ భరిస్తోంది. వీటికితోడు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోజులు గడపడం అనేది ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి. ఎయిర్ క్రాఫ్ట్‌లు మన తల మీద నుంచి వెళ్తున్నట్లే ఉంటాయి. రోజూ ఒకదాని తర్వాత ఒకటిగా యుద్ధవిమానాలు ఇళ్ల మీద నుంచి వెళ్తుంటే వచ్చే ‘ఉమ్మ్మ్’ అనే శబ్దం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఎంత చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కి పడుతుంటారు.
రాత్రిళ్లయితే టేబుల్ మీద నుంచి పుస్తకం కింద పడిన శబ్దం వచ్చినా సరే గుండె వేగం పెరిగిపోతుంటుంది. ఇంట్లో అందరినీ ఒకసారి కలయచూసుకుని ‘హమ్మయ్య ఏమీ కాలేదు, అందరూ క్షేమం’ అని ఊపిరి పీల్చుకోవాల్సిన దుస్థితి. ఈ పరిస్థితుల్లో జీవించడం వల్ల వారిని మెంటల్ ట్రామా పీడిస్తోంది. ఇది ఏ ఒకరిద్దరిదో, ఒకటి-రెండు ప్రదేశాలదో కాదు. దేశమంతటా ఇదే పరిస్థితి. వారిలో మానసికాందోళనలు పోగొట్టి ధైర్యం, మానసిక ప్రశాంతత నెలకొల్పడానికి పని చేయాల్సిన అవసరం ఉంది. ఈ కలెక్టివ్ ట్రామాను తొలగించడానికి కార్యక్రమాలను రూపొందించుకుంటున్నాను. ఇన్నింటి మధ్య కొనసాగుతూ కూడా బ్యూటీ పాజంట్ కావాలనే కోరికను మాత్రం పక్కన పెట్టలేదు. సమాజం కోసం చేయాల్సిన కర్తవ్యాలను నిర్వర్తిస్తూనే బ్యూటీ కాంటెస్ట్ విజేతనయ్యాను. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీ కోసం మీ ముందుకు వచ్చాను. బ్యూటీ విత్ పర్పస్ థీమ్‌లో భాగంగా... నా విజయంతో నా దేశంలో ప్రశాంత వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. శాంతి కోసం పని చేయడానికి బ్యూటీ పాజంట్ గుర్తింపు ఉపయోగపడుతుంది.
నమస్తే నేర్చుకున్నాను! బ్యూటీ పాజంట్ పోటీల కోసం వచ్చేటప్పుడు ఇండియన్ కల్చర్ గురించి తెలుసుకున్నాను. నమస్తే చెప్పడం నేర్చుకున్నాను. హైదరాబాద్ నగరం చాలా నచ్చింది. కలర్ఫుల్గా, వైబ్రెంట్‌గా ఉంది. ఇక్కడి ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉన్నారు. చౌమొహల్లా ప్యాలెస్ ఒక అద్భుతం. నిర్మాణంలో సునిశితమైన క్రాఫ్ట్మన్షిప్కి ఫిదా అయ్యాను. ప్రతి అంగుళాన్ని వదలకుండా ఫొటోలు తీసుకున్నాను. ఆ కట్టడం గొప్ప చారిత్రక వారసత్వం, అలాగే హైదరాబాద్ మెహందీ కూడా’’ అంటూ మంగళవారం నాడు చార్మినార్, చౌమొహల్లా ప్యాలెస్ సందర్శన సమయంలో పెట్టించుకున్న మెహందీని చూపించారు నద కౌస్సా.