‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ
పొదుపు మొత్తాలు మార్కెట్లలోకి మళ్లితే సామాన్యులకూ మేలు
ఎందుకంటే ఎఫ్‌డీలు, బాండ్లపై వస్తున్న వడ్డీలు చాలా తక్కువ
ప్రస్తుతం ధనికులే స్టాక్ మార్కెట్లతో లాభం ఆర్జిస్తున్నారు
సామాన్యులూ అటు మళ్లితే ఆర్జనలో అసమానత తగ్గుతుంది
దేశంలో వరి సేద్యం తగ్గి.. చిరుధాన్యాలు పెరగాలి
సరైన మద్దతు లేదు కనక మిల్లెట్ల ధరలు ఇప్పుడు ప్రియమే
భారతీయుల ఆహారంలో ప్రొటీన్ తక్కువ.. పెరగాలి
ఉచిత విద్యుత్ వల్లే పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అధిక వరి సేద్యం
దాన్ని తొలగిస్తే రైతులు గట్టిగా వ్యతిరేకిస్తారు
పోటీ పరీక్షల కోసం ఐదారేళ్లు కష్టపడ్డాకే యువత ఉద్యోగాల్లోకి ఆలస్యంగా జాబ్ మార్కెట్లోకి రావటంతో దేశం వెనకబాటు
ప్రభుత్వోద్యోగాలు సాధించటమే విజయంగా భావించొద్దు
ఇప్పటిదాకా మనది పొదుపు ఆధారిత ఆర్థిక వ్యవస్థ. ఇటీవల కేంద్రం తీసుకుంటున్న పలు చర్యలు ఈ పొదుపు మొత్తాలన్నిటినీ స్టాక్ మార్కెట్ల దిశగా మళ్లించేలా ఉంటున్నాయి? భారత్ లాంటి దేశానికిది కరెక్టేనా?
మన బ్యాంకులన్నీ అద్భుతమైన నియంత్రణ వ్యవస్థలో ఉన్నాయి. కాకపోతే వాస్తవ వడ్డీరేట్లు ఎప్పుడూ ప్రతికూలంగానే ఉంటున్నాయి. కాస్త ఉన్నతస్థాయి వర్గాలకు స్టాక్ మార్కెట్లతో అనుబంధం ఉంది. మిగిలిన వాళ్లంతా వడ్డీ రేట్లపైనే ఆధారపడుతున్నారు. వాస్తవంగా చూస్తే ఈ వడ్డీరేట్లు ప్రతికూల రాబడులే ఇస్తున్నాయి. మరి కొంత బ్యాలెన్స్ అవసరం కదా? సగటు మనుషులు కూడా మెరుగైన రాబడులు పొందాలి కదా? అందుకే స్టాక్ మార్కెట్లలోకి మళ్లించటమనేది మంచిదనిపిస్తుంది.
ఇలా చేయటం ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకుని, దాన్ని పౌరులమీదికి నెట్టేయటం కాదా?
అలాగని చెప్పలేం. ఎందుకంటే జనం ఎలాగూ కొంత పొదుపు చేస్తున్నారు. ఆ పొదుపు వల్ల ప్రభుత్వం లాభపడుతోంది. ఉదాహరణకు ప్రభుత్వ బాండ్లలో జనం పొదుపు చేయటం వల్ల వాళ్లకు తక్కువ వడ్డీ ఇచ్చి ప్రభుత్వం లాభపడుతోంది. వాస్తవంగా చూస్తే మధ్య తరగతి జనం ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేసి తక్కువ రాబడికే పరిమితమవుతున్నారు. శ్రీమంతులు మాత్రం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లకు సైతం విస్తరించి అధిక రాబడులు ఆర్జిస్తున్నారు. ఇదైతే నాకు కరెక్టనిపించటం లేదు.
ఎం.రమణమూర్తి
ప్రభుత్వ బాండ్లు, బ్యాంకు డిపాజిట్ల వంటి సంప్రదాయ సాధ నా లు ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే స్థాయిలో రాబడులివ్వటం లేదని, వాస్తవ వడ్డీరేట్లు చూస్తే తరచూ నెగెటివ్ స్థాయిలోనే ఉంటున్నాయని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ అభిప్రాయపడ్డా రు. ధనికులు గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసి లాభాలు పొందుతుంటే మధ్యతరగతి మాత్రం బాండ్లలో ఇన్వెస్ట్ చేసి ఒకరకంగా నెగెటివ్ వడ్డీని అందుకుంటోందని తనకిది సముచితంగా కనిపించ ట్లేదని చెప్పారు. ఈ దశలో స్టాక్ మార్కెట్ల దిశగా జనాన్ని నడిపించే లా కేంద్రం తీసుకుంటున్న చర్యలను ఆయన సమర్థించారు. సామా న్యులు సైతం మెరుగైన రాబడులు సాధించడానికిది ఉపయోగపడు తుందన్నారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో పాల్గొన్న సందర్భంగా సోమవారం ఆయన సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎకానమీ, ఆహార భద్రత, యువత ఆలోచనలు సహా పలు అంశాల పై తన అభిప్రాయాలు వెల్లడించారు.
మీరు కాసేపటికి ముందు మాట్లాడిన సెషన్లో కూడా ఫుడ్ ఎకనమిక్స్‌ను ప్రస్తావించారు. ఆహార భద్రతకు ప్రభుత్వాలు చేయాల్సిందేమైనా ఉందా?
ఆహార ధాన్యాలను దృష్టిలో పెట్టుకుని ఆహార భద్రత గురించి మాట్లాడితే... ఇపుడు చాలామందికి ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా అవి అందుతున్నాయి. కానీ నా దృష్టిలో ప్రొటీన్ కూడా ఆహార భద్రత పరిధిలోకి రావాలి. భారతీయ ఆహార పద్ధతులు చాలావరకూ ప్రొటీన్‌కు దూరంగా... కార్బోహైడ్రేట్లు, పిండి పదార్థాలతో నిండిపోయాయి. ఆ పరిస్థితి మారాలి.
మీరు వరి పంటను కూడా ఒకరకంగా వ్యతిరేకిస్తున్నారు. ఉచిత విద్యుత్ వల్లే వరి సేద్యం పెరిగిందని, ఆ పరిస్థితి మారాలని చెబుతున్నారు. కానీ ప్రత్యామ్నాయ ఆహార పదార్థాలు పేదలకు అందుబాటులో లేవు కదా?
ఇప్పుడు చిరుధాన్యాలు (మిల్లెట్స్) కాస్త ప్రియమే. కానీ ముందు నుంచీ ఆ పరిస్థితి లేదు. వాటికి గనక సరైన మద్దతిస్తే తగిన ధరల వ్యవస్థతో అవి అందుబాటులోకి రావటం కష్టమేం కాదు. ఆ రకమైన కరెక్షన్‌కు అవకాశమైతే ఉంది. అసాధ్యమేమీ కాదు. కావాల్సిందల్లా మిల్లెట్స్‌పై అందరికీ అవగాహన పెరగటం. అంతే!.
పెరుగుతున్న అసమానతలు, నిరుద్యోగం యువతలో ఆందోళన పెంచుతున్నాయి. ఆర్థికాంశాలపై వాళ్ల ఆలోచనల్లో ఏమైనా తప్పుందా?
పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకోవటమే విజయం సాధించటమన్న నమ్మకం చాలా మందిలో ఉంది. ప్రభుత్వ ఉద్యోగా లు ఆకర్షణీయమే... కాదనను. కానీ కొన్నాళ్లుగా అవి తగ్గుతూ వస్తున్నాయి. చాలామంది యువత ఐదారేళ్లు పోటీ పరీక్షలకోసం కష్టపడి ఆ తరవాత ఆలస్యంగా ఉద్యోగాల్లోకి అడుగుపెడుతున్నారు. ఇది దేశ ఉద్యోగ మార్కెట్‌ని దెబ్బతీసి... దేశాన్ని వెనక్కి నెడుతోంది.
దేశంలో లక్షల మంది జీవితాల్ని మార్చి కూడా ఫెయిలైన నిర్ణయమేదైనా ఉందని భావిస్తున్నారా?
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అనేది ఒక చిక్కు ముడి. ఆ చిక్కు ముడిలోంచి భారత్ బయటపడాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే ఉచిత విద్యుత్ వల్ల నీటి వినియోగం బాగా పెరుగుతోంది. అంతిమంగా పంజాబ్ వంటి చోట్ల వరి పండించటం విపరీతంగా పెరిగింది. అలాగని వరి వద్దంటే రైతులు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ప్రభుత్వం తమకు సరైన రీతిలో పరిహారమిస్తుందన్న నమ్మకం వారికి లేదు. కానీ జాతీయ స్థాయిలో ఈ విధానమైతే సరికాదు. దీన్ని ఎక్కువకాలం కొనసాగించటం సాధ్యం కాదు. కాబట్టి తక్షణం దీనిపై దృష్టిపెట్టాలి.
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ వంటి వేదికలు జనంలో ఆర్థిక వ్యవస్థపై అవగాహన కలిగించడానికి ఏ మేరకు పనికొస్తాయనుకుంటున్నారు?
ఎకనమిక్స్‌ను ఎకనమిస్ట్‌లకే వదిలేద్దాం. కాకపోతే ఆర్థిక ఆలోచనలనేవి మనం ఎలా ఉండాలనేదానికి పునాది వేస్తాయి. ఆర్థిక వేదికలపైకి సామాన్యుల్ని ఆహ్వానించరు కాబట్టే చాలా విధానాలు ఎలాంటి సవాళ్లూ లేకుండా అమల్లోకి వచ్చేస్తున్నాయి. ఆర్థికాంశాలపై ప్రజల్లో చర్చ జరగటమనేది ముఖ్యం.


