
చేనేతకు మరింత ప్రాచుర్యం
పోచంపల్లికి రానున్న ప్రపంచ అందగత్తెలు
మోడళ్లతో నూతన డిజైన్ల ప్రదర్శన
చేనేత ఉత్పత్తుల పరిశీలనకు స్టాళ్లు
సాక్షి, యాదాద్రి: చేనేత వస్త్రాలను ప్రపంచ స్థాయికి పరిచయం చేయడమే ప్రథమ లక్ష్యంగా.. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందగత్తెల ముందు ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. మిస్ వరల్డ్ (Miss World 2025 ) పోటీలకు వచ్చే అందగత్తెలు ఈ నెల 15న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి రానున్నారు. పోచంపల్లిలోని రూరల్ టూరిజం రిసార్టుకు ప్రపంచ సుందరీమణులు 25 మంది రానున్నారు. వీరి రాక సందర్భంగా ఇక్కడి ఇక్కత్ చీరల ప్రాధాన్యాన్ని వారికి తెలియజేస్తారు. ఇందువల్ల స్థానిక చేనేత కళాకారులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో చేనేత ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ఇప్పటికే యునెస్కో గుర్తింపు పొందిన పోచంపల్లిని ప్రపంచ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నమిది. ఈ సందర్భంగా యాదగిరి గుట్టకు కూడా సుందరీమణులు రానున్నారు. కొండపైన స్వామి వారి దర్శనం అనంతరం.. కొండ కింద ఫొటో సెషన్ ఉంటుంది.

ఇదీ చదవండి: కేన్స్‌లో తళుక్కున మెరిసిన బ్యూటీ, చిలక రహస్యం ఏమిటో?
చేనేత కళాకారులతో మాటామంతీ
మిస్ వరల్డ్ పోటీదారులు స్థానికంగా చేనేత కళాకారులతో ముచ్చటిస్తారు. చీరల తయారీకి వాడే దారం పుట్టుక నుంచి.. వస్త్రం తయారీ వరకు.. పలు అంచెల్లో వస్త్రాల తయారీని ఎలా రూపొందిస్తారో వారు అడిగి తెలుసుకుంటారు.
యాంఫీ థియేటర్‌లో ప్రదర్శన
పోచంపల్లిలోని టూరిజం సెంటర్ యాంఫీ థియే టర్‌లో విభిన్నమైన చేనేత వస్త్రాల ప్రదర్శన ఉంటుంది. చేనేత ఇక్కత్, డబుల్ ఇక్కత్, తేలియా రుమాల్.. ఇలా పలు రకాల వస్త్రాల ప్రదర్శన ద్వారా సంప్ర దాయ, ఆధునికత కలిసిన నూతన ప్యాషన్ వస్త్రాలను ప్రదర్శిస్తారు. దీనిద్వారా సంప్రదాయం, ఆధునికత కలిసి నూతన ప్యాషన్ అనే మాటకు చిరునామా కాబోతున్నాయి. ఇందువల్ల దేశ విదేశాల యువతలో చేనేతకు గౌరవం లభిస్తుంది. ప్రముఖులు ఇప్పటికే పొచంపల్లి వస్త్రాలను ధరించడం ప్యాషన్‌గా మారింది.
స్టాళ్లలో ప్రదర్శనలు
పూర్తిగా గ్రామీణ వాతావరణం కల్పించేందుకు టూరిజం పార్క్‌ను సిద్ధం చేశారు. సిద్దిపేట గొల్లభామ చీరలు, నారాయణపేట, గద్వాల చీరలు, పోచంపల్లి, పుట్టపాక, సిరిపురాలలో తయారయ్యే వస్త్రాలను ప్రదర్శిస్తారు. వీటిని స్థానిక మహిళలు ధరిస్తారు. సంప్రదాయంగా వచ్చిన వస్త్రాలను ఆధునిక ప్యాషన్ డిజైనర్‌లతో కొత్త రకంగా వస్త్రాలను రూపొందించి అందగత్తెల ముందు ప్రదర్శిస్తారు. ఇక్కత్ డిజైన్లతో తయారవుతున్న తేలియా రుమాల్, సిల్క్, కాటన్, చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్‌షీట్స్, రజయ్ (క్విల్స్), స్టోల్స్, స్కాప్స్, దుప్పట్టా, డోర్, టేబుల్ కర్టన్స్, పిల్లో కవర్స్ తదితర వెరైటీలను ప్రదర్శించనున్నారు.