జగిత్యాలరూరల్: పెళ్లి చేయాలంటే.. ఆకాశమంతా పందిరి.. భూదేవి అంతా పీట.. పురోహితులు.. బంధువులు.. బలగం తరలిరావాలంటారు. కానీ ఈ పెళ్లి వేడుకకు తోటి ఉపాధిహామీ కూలీలే పెళ్లి పెద్దలుగా మారారు. తట్ట.. పార పట్టిన వారే పురోహితులుగా అవతారం ఎత్తి పెళ్లి తంతు నిర్వహించారు.
జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ వినూత్న పెళ్లి వేడుక సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల, బాలపల్లి గ్రామాలకు చెందిన 225 మంది శుక్రవారం ఉపాధిహామీ పనులకు హాజరయ్యారు. పనులు ముగిసిన తర్వాత పని స్థలంలో రెండు గ్రామాల కూలీలు ఒక్కచోట చేరారు. ఈ సమయంలోనే పొరండ్ల గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి–సత్తమ్మ దంపతుల 41వ పెళ్లి రోజు అని చర్చకు వచ్చింది.
వెంటనే తోటి కూలీలు ఘనంగా వేడుకలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మామిడితోటనే పెళ్లి వేదికగా మార్చుకున్నారు. మామిడి ఆకులతో బాసింగాలు తయారు చేసి వారిద్దరికి కట్టి పెళ్లి జరిపించారు. నిజమైన వివాహ వేడుకలను మైమరిపించేలా తలంబ్రాలు, అరుంధతి నక్షత్ర దర్శనం, అప్పగింతలు నిర్వహించారు. అక్కడే ఉన్న వారందరికీ కూరగాయలు, మటన్, బగార అన్నం, మక్కగుడాలతో విందు ఏర్పాటు చేశారు. పెళ్లికి హాజరైన కూలీలందరూ కట్నకానుకలు సమర్పించారు. ఈ పెళ్లి తతంగం అంతా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.


