
తన ఇంద్రజాల ప్రతిభతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన మెజీషియన్, మెంటలిస్ట్ సుహాని షా ప్రతిష్ఠాత్మకమైన ‘బెస్ట్ మ్యాజిక్ క్రియేటర్–2025’ అవార్డు గెలుచుకుంది. ఇంద్రజాల రంగంలో ఈ పురస్కారాన్ని ఆస్కార్‌తో సమానంగా భావిస్తారు. అవార్డ్ గెలుచుకున్న సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది సుహాని షా.
‘ఒక కల కంటే ఆ కలను నెరవేర్చుకోవడానికి గట్టిగా నిలబడాలి. కల నెరవేర్చుకోవడం అసాధ్యంగా అనపించవచ్చు. నీ వల్ల కాదు అని ఎంతో మంది అనవచ్చు. అయినా సరే పట్టుదల వీడొద్దు. పట్టుదలగా ముందుకు సాగినప్పుడే అద్భుతం జరుగుతుంది. కల నెరవేరుతుంది’ అని రాసింది సుహాని.
బాల్యంలో టీవీలో వచ్చే మ్యాజిక్ షోలను కన్నార్పకుండా చూసిన సుహాని తాను కూడా మెజిషియన్ కావడానికి ఎంతో కాలం పట్టలేదు. గత పాతిక సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా 5,000 ప్రదర్శనలు ఇచ్చింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన సుహాని షా మెషిజియన్, మెంటలిస్ట్ మాత్రమే కాదు మోటివేషనల్ స్పీకర్ కూడా. ఎంతోమందిని తన ఉపన్యాసాలతో దిశానిర్దేశం చేసింది.