సాకులు వెతుక్కోకండి : విధి కూడా వంగి సలాం చేసే సంకల్పంతో.. | Meet who defeated fate with determination | Sakshi
Sakshi News home page

సాకులు వెతుక్కోకండి : విధి కూడా వంగి సలాం చేసే సంకల్పంతో..

May 19 2025 9:38 AM | Updated on May 19 2025 10:21 AM

Meet who defeated fate with determination

ఓటమిని ఒప్పుకోని.. మధుర సంకల్పం

చిన్నప్పుడే విద్యుత్‌ ప్రమాదంలో కాళ్లూ చేతులు పోగొట్టుకున్నాడు మునిపల్లి మండలం కంకోల్‌ గ్రామానికి చెందిన మధుకుమార్‌. అయితేనేం విధివక్రీకరించినా ఓటమిని ఒప్పుకోని సంకల్ప బలంతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 

దేహముంది, ప్రాణముంది.. నెత్తురుంది.. సత్తువుంది ఇంతకంటే సైన్యముండునా అనుకున్నాడు. విశ్రమించక శ్రమించాడు. ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కదను తొక్కి అవధులన్నీ అధిగమించాడు. వైకల్యం శరీరానికే కాని మనసుకు కాదనుకుని నిరాశకే నిరాశ పుట్టించి ముందుకెళ్తున్న మధుకుమార్‌ జీవితంపై  స్పెషల్‌  స్టోరీ.– బి. రాజశేఖర్, సంగారెడ్డి జోన్‌

సంకల్పం ఉంటే వైకల్యం అడ్డు కాదని నిరూపించాడు. నోటితోనే పెయింటింగ్‌ వేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా లక్ష్యసాధన వైపు ముందడుగు వేశాడు. ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 86% మార్కులు సాధించి, ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలిచాడు. విద్యుదాఘాతం తగిలి రెండు కాళ్లు, రెండు చేతులు కోల్పోయినా మనోధైర్యం కోల్పోలేదు. ఐఏఎస్‌ అయి ప్రజలకు సేవ చేయాలన్నదే తన కోరిక అని మునిపల్లి మండలం కంకోల్‌ గ్రామానికి చెందిన మధు కుమార్‌ ‘సాక్షి’తో చెప్పాడు.

 స్ఫూర్తిగా నిలిచి.. 
విధి వెక్కిరించినా అందరితో పాటు చదువులో ముందుకు సాగుతున్నాడు. ప్రతిరోజు తల్లిదండ్రులు, స్నేహితుల సహకారంతో వీల్‌ చైర్‌పై పాఠశాలకు వెళ్లేవాడు. తనకు ఉన్న వైకల్యాన్ని మరిచిపోయి అందరితో కలిసి, మెలిసి చదువుకున్నాడు. పరీక్షల సమయంలో ప్రణాళికాబద్ధంగా సమయం కేటాయించి చదువుకున్నాడు. పుస్తకాల్లోని పేజీలను తన నాలుకతో పాటు కోల్పోయిన కాలు చివరి భాగంతో మార్చుకుంటున్నాడు. ఈ విధంగా బాగా చదువుకుని స్నేహితుడి సహకారంతో పరీక్షలు రాశాడు. దివ్యాంగులకు ఒక సబ్జెక్టును మినహాయిస్తారు. దీంతో 500 మార్కులకు గాను 430 మార్కులు సాధించి అందరి నోట శభాష్‌ మధు అనిపించుకున్నాడు.  

ఇదీ చదవండి: ఫోర్బ్స్‌లో అనన్య పాండే, బాయ్‌ ఫ్రెండ్‌ రియాక్షన్‌ వైరల్‌

ఉత్తమ ప్రతిభ కనబరిచిన మధు కుమార్‌ను కలెక్టర్‌ వల్లూరు క్రాంతి సన్మానించి అభినందించి, ల్యాప్‌ టాప్‌ను అందజేశారు. భవిష్యత్తులో చదువుకునేందుకు తమ వంతుగా పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. పాఠశాల తనిఖీ సమయంలో మధును గమనించిన కలెక్టర్‌ బాగా చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రోత్సహించారు.  

చిరునవ్వుతో ముందడుగు
మునిపల్లి మండల పరిధిలోని కంకోల్‌ గ్రామానికి చెందిన మధు కుమార్‌ అదే గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నాడు. అందరితో కలిసి మెలిసి ఉంటూ చదువుతో పాటు పాఠశాలలో నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనేవాడు. 2019 సెపె్టంబర్‌ 15న తోటి స్నేహితులతో సరదాగా ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్‌ తీగలను గమనించకపోవడంతో రెండు చేతులు తీగలకు తగిలాయి. రెండు కాళ్లకు ఎర్తింగ్‌ వచ్చి షాక్‌ తగిలి కింద పడిపోయాడు. వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు రెండు కాళ్లు, రెండు చేతులు తీసేయాలని, అప్పటికీ మధు బతుకుతాడో లేదోనని చెప్పారు. మరణం అంచు వరకు వెళ్లిన కుర్రాడు ప్రాణాలతో బయటపడ్డాడు. తోటి వారి సహాయం లేకుండా కదలలేని స్థితిలో ఉన్నా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సంకల్ప బలంతో ముందడుగు వేస్తూ జీవిస్తున్నాడు.

నోటితో పెయింటింగ్‌..
నోటితోనే పెయింటింగ్‌ వేసి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ప్రముఖ సినీ నటి సమంత నిర్వహించే సామ్‌ జామ్‌ షోకు హాజరై అక్కడ మెగాస్టార్‌ చిరంజీవి చిత్రపటాన్ని నోటితో గీసి ప్రశంసలు పొందాడు. అంతేకాకుండా ప్రముఖ స్టార్‌లు ప్రభాస్, వెంకటేష్‌  పవన్‌ కల్యాణ్, అల్లు అర్జున్‌లతో పాటు వివిధ రకాల చిత్రాలు వేసి అందరితో ప్రశంసలు అందుకున్నాడు.

ఐఏఎస్‌ అవ్వడమే లక్ష్యం..
కాళ్లు, చేతులు లేకపోయినా నా తల్లిదండ్రులు, గురువులు, స్నేహితుల సహకారంతో చదువుకోవటంతో పాటు అన్ని పనులు చేసుకోగలుగుతున్నా. ఉపాధ్యాయుల సూచనల మేరకు ప్రణాళికాబద్ధంగా చదువుకొని మంచి ఫలితాలు సాధించాను. అప్పటి సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు పాఠశాలకు తనిఖీకి వచి్చన సమయంలో నిరుపేద విద్యార్థులకు, తనలాంటి వారిని పలకరించే విధానం, చేసే సహాయ గుణాలకు ఆకర్షితుడినయ్యాను. అలాగే ప్రస్తుత కలెక్టర్‌ వల్లూరు క్రాంతి సైతం విద్యార్థులను ప్రోత్సహించడం చూసి స్ఫూర్తి పొందాను. నేను కూడా ప్రతి ఒక్కరికీ సహాయపడాలని ఐఏఎస్‌ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా.– మధు కుమార్, విద్యార్థికంకోల్‌ గ్రామం, మునిపల్లి మండలం

Advertisement
 
Advertisement
Advertisement