Rukhsar Saeed: టేస్ట్‌ ఆఫ్‌ కశ్మీర్‌ | Sakshi
Sakshi News home page

Rukhsar Saeed: టేస్ట్‌ ఆఫ్‌ కశ్మీర్‌

Published Sat, Oct 21 2023 12:40 AM

Master Chef India: Rukhsar Saeed Advances to Final 12 in MasterChef India - Sakshi

కశ్మీర్‌ పేరు చెప్తే అందమైన ప్రదేశాలే గుర్తొస్తాయి. కాని ఆ లోయలో దాగిన రుచులు అన్వేషిస్తే తప్ప తెలియదు. శాకాహారమైనా మాంసాహారమైనా స్వచ్ఛమైన దినుసులతో గుమ్మెత్తిస్తారు. ‘మేము ఎలా వండుతామో నా వంట చూసి తెలుసుకోండి’ అని కశ్మీర్‌ వంట చేసి చూపుతోంది రుక్సార్‌ సయీద్‌. కశ్మీర్‌ మహిళలు పెద్దగా పాల్గొనని ‘మాస్టర్‌ షెఫ్‌ ఆఫ్‌ ఇండియా’ తాజా సిరీస్‌కు రుక్సార్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌ అయ్యింది. పోటీని తట్టుకుని టాప్‌ 12లో నిలిచిన ఆమెను చూసి కశ్మీర్‌లో ఆడవాళ్లు గర్విస్తున్నారు.

సోనీ లివ్‌లో ప్రసారమవుతున్న తాజా సీజన్‌ ‘మాస్టర్‌ షెఫ్‌ ఆఫ్‌ ఇండియా’ కోసం రుక్సార్‌ సయీద్‌ (33) ‘షబ్‌ దేక్‌’ అనే కశ్మీరీ వంట చేసింది. ‘ఇది మా అమ్మమ్మ నుంచి మా అమ్మకు, మా అమ్మ నుంచి నాకు అందిన వంట. ముదురు గుమ్మడికాయ, నాటుకోడి, ఆల్‌బకారా ఎండుగుజ్జు వేసి చేస్తాం. చాలా బాగుంటుంది’ అంది. జడ్జీలుగా ఉన్న ప్రముఖ షెఫ్‌లు వికాస్‌ ఖన్నా, రణ్‌వీర్‌ బ్రార్, పూజా ధింగ్రా... కొద్దిగా రుచి చూసి ‘అద్భుతం’ అన్నారు.

ఆమె ఇంకో ఎపిసోడ్‌లో ‘షికారా రైడ్‌’ అనే అల్పాహారం చేసింది. మటన్‌ కోఫ్తాను, పుదీనా మసాలాతో రంగరించి చేసింది. టేస్ట్‌ అదిరిందని వేరే చె΄్పాలా?
‘కశ్మీర్‌ లోయంతా రకరకాల మసాలా దినుసులు, మేం మాత్రమే తినే ఆకుకూరలు, కాయగూరలు ఉన్నాయి. వాటిని వండే పద్ధతి అందరికీ తెలియదు. మాస్టర్‌ షెఫ్‌ ద్వారా దేశమంతటికీ ఆ రుచులను తెలియజేయాలనుకుంటున్నాను’ అంటుంది రుక్సార్‌ సయీద్‌.

ఆమె సంకల్పం గట్టిదిలాగుంది. తాజా సీజన్‌లో మహా మహా వంటగాళ్లు, వంటగత్తెలు పోటీ పడితే తుది జాబితాలో 22 మంది ఉంటే, వారిలో చాలామందిని అధిగ‘మించి’ టాప్‌ 12కు చేరింది రుక్సార్‌. దాంతో కశ్మీర్‌లో ఇప్పుడు ఈ షోను అక్కడి స్త్రీలు చూస్తున్నారు. రుక్సార్‌ను తమ ప్రతినిధిగా, తమ సామర్థ్యాలకు కొలమానంగా చూస్తున్నారు. ‘ఆ సంతోషం చాలు నాకు. నన్ను స్ఫూర్తిగా తీసుకుని స్త్రీలు ముందుకు రావాలి’ అంటుంది రుక్సార్‌.

ఫుడ్‌ టెక్నాలజీలో డాక్టరేట్‌
రుక్సార్‌ సయీద్‌ది పుల్వామా జిల్లాలోని పామ్‌పోర్‌ అనే ్రపాంతం. నిత్యం మంచు కురిసే ఈ ్రపాంతంలో కవులు ఎక్కువ. ‘నేను కవిత్వం రాయను. కాని ప్లేట్‌లో పదార్థమే ఒక కవిత్వమంత అందంగా అమర్చగలను’ అంటుంది రుక్సార్‌. ఫుడ్‌ టెక్నాలజీలో పీహెచ్‌డీ చేసిన రుక్సార్‌ అందరిలా ఏ లెక్చరర్‌ పోస్ట్‌కో వెళ్లలేదు. ‘నాకు ఆహారం మీద సంపూర్ణ అవగాహన ఉంది. ముఖ్యంగా ఫ్రోజెన్‌ ఫుడ్‌ను సరిగా అమ్మగలిగితే తక్షణం వేడి చేసుకుని తినాలనుకునేవారికి మేలు జరుగుతుంది. కాని ఆహారంలో కల్తీ ఎక్కువ.

ఈ కల్తీ విషంతో సమానం. అందుకే నేను ఏ కల్తీ లేని ఫ్రోజెన్‌ ఫుడ్‌ను అమ్మాలని ఖాలిస్‌ ఫుడ్స్‌ పేరుతో చిన్న సంస్థను మొదలుపెట్టాను. చికెన్‌ ఉత్పత్తులను కశ్మీర్‌లో అమ్ముతున్నాను. కశ్మీర్‌లో ఉద్యోగం చేయడం కన్నా ఉద్యోగాలు కల్పించడమే ఎక్కువ అవసరం అని నేను భావిస్తాను. నిరుద్యోగం పోవాలంటే ఇలాగే చేయాలి. నా సంస్థ బాగా నడుస్తోంది. కాని దేశవ్యాప్తంగా పంపాలంటే కొన్ని చిక్కులు ఉన్నాయి. ఈ లోపు నేను, నా బ్రాండ్‌ తెలియడానికి మాస్టర్‌ షెఫ్‌ ్రపోగ్రామ్‌కు వచ్చాను’ అని తెలిపింది రుక్సార్‌.

అంతే తేడా
‘వంట అందరు ఆడవాళ్లూ చేస్తారు. కాని ఫుడ్‌ షోలలో ఆ వంటను శాస్త్రీయంగా చేయాలి. అంతే తేడా. కశ్మీర్‌లో వంట తెలిసిన యువతీ యువకులు బాగానే ఉన్నారు. నేను ఈ షో ద్వారా గడించిన అనుభవంతో వారికి సాయం చేయాలనుకుంటున్నాను. ఆహారం తయారు చేయడంలో మెళకువలు తెలిపి వారు ఫుడ్‌ జాయింట్‌లు ఏర్పాటు చేసుకుని తమ కాళ్ల మీద తాము నిలబడేలా చూడాలనుకుంటున్నాను. ఇందుకు కావాల్సిన సామాగ్రి నేనే సమకూరుస్తాను’ అంది. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్న రుక్సార్‌ తన భర్త సాదిక్‌ అహ్మద్‌ సహకారం వల్లే ఇలా షోకు వచ్చినట్టుగా తెలిపింది. ‘ఆడవాళ్లూ.. ప్రయత్నించండి. ఓడిపోవద్దు’ అనేది రుక్సార్‌ సందేశం.

Advertisement
 
Advertisement
 
Advertisement