breaking news
Kashmiri Women
-
Rukhsar Saeed: టేస్ట్ ఆఫ్ కశ్మీర్
కశ్మీర్ పేరు చెప్తే అందమైన ప్రదేశాలే గుర్తొస్తాయి. కాని ఆ లోయలో దాగిన రుచులు అన్వేషిస్తే తప్ప తెలియదు. శాకాహారమైనా మాంసాహారమైనా స్వచ్ఛమైన దినుసులతో గుమ్మెత్తిస్తారు. ‘మేము ఎలా వండుతామో నా వంట చూసి తెలుసుకోండి’ అని కశ్మీర్ వంట చేసి చూపుతోంది రుక్సార్ సయీద్. కశ్మీర్ మహిళలు పెద్దగా పాల్గొనని ‘మాస్టర్ షెఫ్ ఆఫ్ ఇండియా’ తాజా సిరీస్‌కు రుక్సార్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. పోటీని తట్టుకుని టాప్ 12లో నిలిచిన ఆమెను చూసి కశ్మీర్లో ఆడవాళ్లు గర్విస్తున్నారు. సోనీ లివ్‌లో ప్రసారమవుతున్న తాజా సీజన్ ‘మాస్టర్ షెఫ్ ఆఫ్ ఇండియా’ కోసం రుక్సార్ సయీద్ (33) ‘షబ్ దేక్’ అనే కశ్మీరీ వంట చేసింది. ‘ఇది మా అమ్మమ్మ నుంచి మా అమ్మకు, మా అమ్మ నుంచి నాకు అందిన వంట. ముదురు గుమ్మడికాయ, నాటుకోడి, ఆల్‌బకారా ఎండుగుజ్జు వేసి చేస్తాం. చాలా బాగుంటుంది’ అంది. జడ్జీలుగా ఉన్న ప్రముఖ షెఫ్‌లు వికాస్ ఖన్నా, రణ్వీర్ బ్రార్, పూజా ధింగ్రా... కొద్దిగా రుచి చూసి ‘అద్భుతం’ అన్నారు. ఆమె ఇంకో ఎపిసోడ్లో ‘షికారా రైడ్’ అనే అల్పాహారం చేసింది. మటన్ కోఫ్తాను, పుదీనా మసాలాతో రంగరించి చేసింది. టేస్ట్ అదిరిందని వేరే చె΄్పాలా? ‘కశ్మీర్ లోయంతా రకరకాల మసాలా దినుసులు, మేం మాత్రమే తినే ఆకుకూరలు, కాయగూరలు ఉన్నాయి. వాటిని వండే పద్ధతి అందరికీ తెలియదు. మాస్టర్ షెఫ్ ద్వారా దేశమంతటికీ ఆ రుచులను తెలియజేయాలనుకుంటున్నాను’ అంటుంది రుక్సార్ సయీద్. ఆమె సంకల్పం గట్టిదిలాగుంది. తాజా సీజన్లో మహా మహా వంటగాళ్లు, వంటగత్తెలు పోటీ పడితే తుది జాబితాలో 22 మంది ఉంటే, వారిలో చాలామందిని అధిగ‘మించి’ టాప్ 12కు చేరింది రుక్సార్. దాంతో కశ్మీర్లో ఇప్పుడు ఈ షోను అక్కడి స్త్రీలు చూస్తున్నారు. రుక్సార్‌ను తమ ప్రతినిధిగా, తమ సామర్థ్యాలకు కొలమానంగా చూస్తున్నారు. ‘ఆ సంతోషం చాలు నాకు. నన్ను స్ఫూర్తిగా తీసుకుని స్త్రీలు ముందుకు రావాలి’ అంటుంది రుక్సార్. ఫుడ్ టెక్నాలజీలో డాక్టరేట్ రుక్సార్ సయీద్‌ది పుల్వామా జిల్లాలోని పామ్పోర్ అనే ్రపాంతం. నిత్యం మంచు కురిసే ఈ ్రపాంతంలో కవులు ఎక్కువ. ‘నేను కవిత్వం రాయను. కాని ప్లేట్లో పదార్థమే ఒక కవిత్వమంత అందంగా అమర్చగలను’ అంటుంది రుక్సార్. ఫుడ్ టెక్నాలజీలో పీహెచ్డీ చేసిన రుక్సార్ అందరిలా ఏ లెక్చరర్ పోస్ట్‌కో వెళ్లలేదు. ‘నాకు ఆహారం మీద సంపూర్ణ అవగాహన ఉంది. ముఖ్యంగా ఫ్రోజెన్ ఫుడ్‌ను సరిగా అమ్మగలిగితే తక్షణం వేడి చేసుకుని తినాలనుకునేవారికి మేలు జరుగుతుంది. కాని ఆహారంలో కల్తీ ఎక్కువ. ఈ కల్తీ విషంతో సమానం. అందుకే నేను ఏ కల్తీ లేని ఫ్రోజెన్ ఫుడ్‌ను అమ్మాలని ఖాలిస్ ఫుడ్స్ పేరుతో చిన్న సంస్థను మొదలుపెట్టాను. చికెన్ ఉత్పత్తులను కశ్మీర్లో అమ్ముతున్నాను. కశ్మీర్లో ఉద్యోగం చేయడం కన్నా ఉద్యోగాలు కల్పించడమే ఎక్కువ అవసరం అని నేను భావిస్తాను. నిరుద్యోగం పోవాలంటే ఇలాగే చేయాలి. నా సంస్థ బాగా నడుస్తోంది. కాని దేశవ్యాప్తంగా పంపాలంటే కొన్ని చిక్కులు ఉన్నాయి. ఈ లోపు నేను, నా బ్రాండ్ తెలియడానికి మాస్టర్ షెఫ్ ్రపోగ్రామ్‌కు వచ్చాను’ అని తెలిపింది రుక్సార్. అంతే తేడా ‘వంట అందరు ఆడవాళ్లూ చేస్తారు. కాని ఫుడ్ షోలలో ఆ వంటను శాస్త్రీయంగా చేయాలి. అంతే తేడా. కశ్మీర్లో వంట తెలిసిన యువతీ యువకులు బాగానే ఉన్నారు. నేను ఈ షో ద్వారా గడించిన అనుభవంతో వారికి సాయం చేయాలనుకుంటున్నాను. ఆహారం తయారు చేయడంలో మెళకువలు తెలిపి వారు ఫుడ్ జాయింట్లు ఏర్పాటు చేసుకుని తమ కాళ్ల మీద తాము నిలబడేలా చూడాలనుకుంటున్నాను. ఇందుకు కావాల్సిన సామాగ్రి నేనే సమకూరుస్తాను’ అంది. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్న రుక్సార్ తన భర్త సాదిక్ అహ్మద్ సహకారం వల్లే ఇలా షోకు వచ్చినట్టుగా తెలిపింది. ‘ఆడవాళ్లూ.. ప్రయత్నించండి. ఓడిపోవద్దు’ అనేది రుక్సార్ సందేశం. -
కశ్మీరీ యువతులను వివాహం చేసుకున్నందుకు
పట్నా: ఆర్టికల్ 370 రద్దు విభజన అనంతరం చాలా మంది రాజకీయ నాయకులు ఇక అందమైన కశ్మీరీ యువతులను వివాహం చేసుకోవచ్చు అంటూ చౌకబారు వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వారి వ్యాఖ్యలు ఏమో కానీ ఆర్టికల్ 370 రద్దు ముందు వరకు కశ్మీరీ యువతులు వేరే రాష్ట్రాల యువకులను వివాహం చేసుకుంటే.. వారికి ఉండే కొన్ని ప్రత్యేక హక్కులను కోల్పోయేవారు. కానీ మోదీ ప్రభుత్వ నిర్ణయంతో ఈ అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో బిహార్‌కు చెందిన ఇద్దరు సోదరులు.. కశ్మీరీ యువతులను వివాహం చేసుకున్నారు. వారిద్దరు కూడా అక్కాచెల్లెళ్లు కావడం విశేషం. గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న వీరు ఆర్టికల్ 370 రద్దు తర్వాత వివాహం చేసుకున్నారు. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. కశ్మీరీ యువతులను పెళ్లి చేసుకున్నందుకు ప్రస్తుతం ఈ సోదరులిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు.. సుపాల్‌లోని రామ్‌విష్ణుపూర్ గ్రామానికి చెందిన పర్వేజ్, తవ్రేజ్‌లు ఇద్దరు సోదరులు. రాంబన్‌లో వడ్రంగి పని చేస్తున్న వీరు ఇద్దరు కశ్మీరీ యువతులను ప్రేమించారు. వీరిద్దరు కూడా అక్కాచెల్లెళ్లు కావడం విశేషం. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఈ రెండు జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. అనంతరం పర్వేజ్, తవ్రేజ్‌లు తమ భార్యలను తీసుకుని స్వగ్రామానికి వచ్చారు. కానీ యువతుల తండ్రి మాత్రం పర్వేజ్ సోదరులు తన కుమార్తెలను కిడ్నాప్ చేశారని వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో జమ్మూకశ్మీర్ పోలీసులు, బిహార్ అధికారుల సాయంతో పర్వేజ్ సోదరులను అరెస్ట్ చేశారు. అయితే నిందితులు మాత్రం యువతుల ఇష్టం మేరకే తాము వారిని వివాహం చేసుకున్నామని..ఇందులో ఎవరి బలవంతం లేదని తెలిపారు. -
భర్తలను వదిలేస్తున్నారు!
శ్రీనగర్: చెడు వ్యసనాలకు బానిసలైన భర్తలను వదులుకునేందుకు కశ్మీర్ మహిళలు సందేహించడం లేదు. మత్తుపదార్థాలకు బానిసలైన భర్తలతో తెగతెంపులు చేసుకుంటున్న మహిళల సంఖ్య కశ్మీర్ లో పెరుగుతోంది. సామాజిక కట్టుబాట్లను అధిగమించి భర్తలకు విడాకులు ఇచ్చేస్తున్నారు. మాదకద్రవ్యాలకు అలవాటుపడి తనను చిత్రహింసలకు గురిస్తున్న భర్తకు 27 ఏళ్ల రిఫాత్ విడాకులు ఇచ్చేసింది. స్థానిక షరియా కోర్టు సాయంతో ఇటీవల భర్తలకు విడాకులు ఇచ్చేసిన 40 మందిలో ఆమె ఒకరు. భర్త నుంచి విడిపోయేందుకు తన తల్లిదండ్రులను ఒప్పించడానికి ఆమె కష్టపడింది. 'మహిళ తన భర్తకు విడాకులు ఇవ్వరాదని పురుషులు ఎందుకు భావిస్తారో నాకు అర్థం కాదు. పురుషుడికి మాత్రమే విడాకులు ఇచ్చే హక్కు ఉందని వారు అనుకుంటారు' అని రిఫాత్ పేర్కొంది. భర్తకు విడాకులు ఇచ్చిన ఉత్తర కశ్మీర్ కు చెందిన షజియా సమాజం నుంచి సూటిపోటి మాటలు ఎదుర్కొంది. అయితే తాను సరైన నిర్ణయం తీసుకున్నానని, ఎవరేమన్నా పట్టించుకోబోనని షజియా స్పష్టం చేసింది. డ్రగ్స్ కు అలవాటు పడిన భర్తలు పెట్టే చిత్రహింసలు భరించలేక బాధిత మహిళలు విడాకులు కోరుతున్నారని కశ్మీర్ గ్రాండ్ ముప్తీ నసీరుల్ ఇస్లాం తెలిపారు. గత నెల రోజుల కాలంలో షరియా కోర్టు 40 విడాకులు కేసులను మెడికల్ బోర్డుకు పంపిన తర్వాత నిర్ణయం తీసుకుంది. మత్తు పదార్థాలకు బానిసలైన భర్తలతో తెగతెంపులు చేసుకునే మహిళల సంఖ్య పెరుగుతుండడంతో ఈ అంశం పతాక శీర్షికలకు ఎక్కింది.