
నిజంగా కాదు లేండి. ఓటీటీ తెర మీద. రాజీవ్‌గాంధీ దారుణ హత్య తర్వాత దేశంలో మార్మోగిపోయిన పేరు ఒంటికన్ను శివరాసన్. పిల్లల్ని భయపెట్టాలంటే శివరాసన్ పేరు చెప్పేవారు తల్లులు. రాజీవ్ గాంధీని మానవ బాంబుతో హత్య చేసే ప్లాను రచించిన ఈ వ్యక్తి 35 ఏళ్ల తర్వాత తిరిగి ఇంటింటా భయపెడుతున్నాడు. నగేష్ కుకునూర్ తీసిన ‘ది హంట్’ వెబ్ సిరీస్‌లో రాజీవ్ హంతకునిగా గతాన్ని గుర్తు చేస్తున్నాడు.
తెల్లలాల్చీ, పైజామాలో ఉన్న శివరాసన్, పక్కనే చందన దండ పట్టుకు నిల్చున్న మానవ బాంబు థాను... వీరి ఫొటోను 1990ల కాలం నాటి భారతీయ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. మే 21, 1991 రాత్రి తమిళనాడు శ్రీపెరంబుదూర్‌లో రాజీవ్‌గాంధీ హత్య జరిగాక మానవబాంబు అనే మాట, ఎల్‌టీటీఈ అనే పేరు జనసామాన్యానికి తెలిసింది. ఈ ప్లాన్ వేసిన వాడు శివరాసన్ అనే ఒంటికన్ను వ్యక్తి అని, అతను ఇంకా దేశంలోనే ఉన్నాడనే ప్రచారంతో భయపడని వారు లేరు.
ఏ ఊరిలో ఏ టీ బంకు దగ్గరైనా శివరాసన్ కబుర్లే. ఆడవారు అతని పేరు తలుచుకుని ఒణికేవారు. అలాంటి శివరాసన్ ఆ ప్లానంతా ఎలా వేశాడో, ప్లాన్ ఎగ్జిక్యూట్ అయ్యాక ఎలా తప్పించుకున్నాడో, ఆ తర్వాత ఎలా పోలీసుల చేతికి చిక్కబోయి మరణించాడో సవివరంగా, ఉత్కంఠగా చూపిస్తూ ‘సోనీ లైవ్’లో ‘ది హంట్– రాజీవ్‌గాంధీ అసాసినేషన్ కేస్’ వెబ్ సిరీస్‌లో చూస్తాం. తెలుగువాడైన ప్రసిద్ధ దర్శకుడు నాగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఆనాటి రోజులతోపాటు, శివరాసన్‌ను కూడా తిరిగి ఇంటింటిలో చూపి భయపెడుతోంది.
జాఫ్నాకు చెందిన శివరాసన్ ఎల్‌టీటీఈలో చేరి, దాని చీఫ్ ప్రభాకరన్‌కు నమ్మకస్తుడుగా మారి రాజీవ్‌గాంధీ హత్యను అమలుపరిచే టీమ్‌కు నాయకుడిగా చెన్నై చేరుకున్నాడు. అతనితో పాటు నళని, థాను, మురుగన్ తదితరులు మరో ఎనిమిది మంది వచ్చారు. వీరంతా కలిసి ప్లాన్ చేసి మానవబాంబుగా థానును తయారు చేసి రాజీవ్‌గాంధీ హత్యకు పాల్పడ్డారు. హత్య జరిగాక దేశం మొత్తం ఒక అంధకారంలో ఉండిపోయింది... హంతకులు ఎవరై ఉంటారనే విషయం తెలియక. ఆ సమయంలో సిట్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న సీబీఐ ఆఫీసర్ కార్తికేయన్ తన టీమ్‌తో సాగించిన నేర పరిశోధనే ‘ది హంట్’ వెబ్ సిరీస్.
దాదాపుగా అంతగా తెలియని నటులతో ఈ సిరీస్ రూపుదిద్దుకున్నా వీరందరిలో శివరాసన్‌గా చేసిన వ్యక్తి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అచ్చు శివరాసన్‌లా కనిపిస్తూ నాటి రూపానికి అతడు జీవంపోశాడు. ఆ నటుడి పేరు షఫీక్ ముస్తఫా. మలయాళం ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే గుర్తింపుపొందిన పాత్రలు వేస్తున్న షఫీక్ శివరాసన్ పాత్ర అవకాశం రావడంతోటే వెంటనే అంగీకరించాడు. ‘ఇలాంటి పాత్రను పోషించడానికి చాలా పరిశోధన చేశాను. శివరాసన్ చాలా తెలివైన వ్యక్తి.
అలాంటివారు ఎక్కువగా మాట్లాడరు. నేను సిరీస్‌లో ఆ నియమాన్ని పాటించాను’ అంటాడు షఫీక్. నాటక రంగం నుంచి వచ్చిన షఫీక్ ఇప్పుడు ఆ పాత్రకు వచ్చిన గుర్తింపుతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ‘శివరాసన్‌లా గాజుకన్ను పెట్టుకుని నటించడం కష్టమైంది’ అని చెప్పాడు. ఎప్పుడూ పెన్ను, పేపర్ పట్టుకుని కనిపించే శివరాసన్ ఈ వెబ్ సిరీస్‌లో మరణించే ముందు కవిత రాసి మరణిస్తాడు. ఈ సన్నివేశాల్లో షఫీక్ నటన ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది.
‘కత్తి పట్టినవాడు కత్తితోనేపోతాడు’ అన్నాడు జీసస్. అహింసతో ఎంత గొప్ప విజయం సాధించవచ్చో నిరూపించారు గాంధీజీ. అసహనం, ఆగ్రహం... కారణాలు ఏవైనా హింసాత్మక వైఖరి పనికి రాదని, ఆయుధం వినాశనానికే కారణమవుతుందని నేటి యువత తెలుసుకోవడానికి ఇలాంటి పాత్రలు, వెంటాడే గతాలు తప్పక ఉపయోగపడతాయి.
(చదవండి: 'నేరమే'.. అయినా! సుప్రీంకోర్టు సైతం..)