
అక్కినేని నాగార్జున నటించిన చిత్రాల్లో 'శివ' చాలా ప్రత్యేకం. ఈ చిత్రం రీరిలీజ్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సినిమాతో రామ్‌గోపాల్ వర్మ దర్శకునిగా పరిచయమయ్యారు. అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇళయరాజా సంగీతంలో ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గానూ నిలిచింది. ఈ సినిమాని ‘శివ’ (1990) పేరుతోనే హిందీలో రీమేక్ చేసిన రామ్‌గోపాల్ వర్మ అక్కడ కూడా హిట్ అందుకున్నారు. ఇప్పుడు తెలుగులో మరోసారి వెండితెరపైకి రానుంది.

35 ఏళ్ల తర్వాత ‘శివ’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయింది. నేడు (సెప్టెంబర్ 20) అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి సందర్భంగా శివ రీరిలీజ్ విడుదలను నాగార్జున ప్రకటించారు. నవంబర్ 14న శివ వస్తున్నాడంటూ నాగ్ ఒక పోస్టర్‌తో ప్రకటించారు. మరోసారి సైకిల్ చైన్ చేతికి చుట్టి బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధించేందుకు శివ రానున్నాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సైకిల్ చైన్ చేతికి చుట్టి విలన్లను రఫ్ఫాడించే ట్రెండ్ సెట్ చేసిన చిత్రం ‘శివ’.
నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో అమల హీరోయిన్‌గా నటించారు. కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవలు, గ్యాంగ్‌లు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం స్టూడెంట్స్‌ని ఎలా ఉపయోగించుకుంటారు? విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవలు సృష్టిస్తారు? ఇలాంటి సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించి సరికొత్త ట్రెండ్‌ని సృష్టించారు వర్మ.