ఇండియన్ గోల్డ్ ఉమైన్ | Major Gold Medals Won by Indian Womens in Asian Games 2026 | Sakshi
Sakshi News home page

ఇండియన్ గోల్డ్ ఉమైన్

Oct 8 2026 5:37 AM | Updated on Oct 8 2026 5:37 AM

 Major Gold Medals Won by Indian Womens in Asian Games 2026

బంగారు ఘనులు

ఒక పూట పని చేసుకుంటూ... మరో పూట ప్రాక్టీస్‌ చేసిన నేపథ్యం ఒకరిదైతే...వెదురు కర్రలనే హాకీ స్టిక్స్‌గా వినియోగించిన అనుభవం మరొకరిది! కలిసి ఆడేందుకు తోటి అమ్మాయిలు లేక... అబ్బాయిలతోనే ప్రాక్టీస్‌ చేసి రాటుదేలిన వాళ్లు ఒకరైతే...సాధన కోసం సరైన సదుపాయాలు లేక గడ్డివామిపైకే బాణాలు గురిపెట్టిన అనుభవం మరొకరిది! ఆడపిల్లకు ఆటలెందుకు అనే అవమానాలు ఒకవైపు... ఆమె సాధించేదేముందనే దెప్పిపొడుపులు మరోవైపు!

ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య నుంచి మన అమ్మాయిలు అదరగొట్టారు. జపాన్  వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో పతకాల మోత మోగించారు. నాలుగేళ్లకోసారి జరిగే ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో మన మహిళలు 38 పతకాలతో మెరిశారు. మిక్స్‌డ్‌ ఈవెంట్స్‌ కలుపుకుంటే ఆ సంఖ్య మరింత ఎక్కువే. దేశంలో క్రీడా సంస్కృతి వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో మహిళల భాగస్వామ్యం మరింత పెరుగుతుండటం ఆహ్వానించదగ్గ విషయం. ఒకప్పుడు ఆటలంటే ఆమడ దూరం వెళ్లే అమ్మాయిలు సైతం ఇప్పుడు... హర్మన్ ప్రీత్‌ కౌర్, స్మృతి మంధాన, సవితా పునియా, లవ్లీనా బొర్గోహైన్, మీరాబాయి చాను, నీరూ ధండాను రోల్‌ మోడల్స్‌గా తీసుకుంటున్నారు!!

సూపర్‌ సీనియర్‌ సవిత
భారత మహిళల హాకీ జట్టు నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ... ఆసియా క్రీడల్లో పసిడి పతకం సాధించడం వెనక గోల్‌ కీపర్‌ సవితా పూనియా కృషి ఎంతో ఉంది. 1982లో తొలిసారి ఏషియన్  గేమ్స్‌లో మహిళల హాకీ పోటీలు నిర్వహించినప్పుడు భారత జట్టు స్వర్ణం నెగ్గగా... మళ్లీ 44 సంవత్సరాల తర్వాత టీమిండియా పసిడి కాంతులు విరజిమ్మింది. గ్రూప్‌ దశ మొత్తం భారత జట్టు సంపూర్ణ ఆధిపత్యంతో ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగగా... ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్  చైనా నుంచి గట్టి పోటీ ఎదురైన దశలో సవితా తన అనుభవాన్నంతా రంగరించి ఆకట్టుకుంది. హోరాహోరీ పోరులో చైనా ప్లేయర్‌ కొట్టిన పెనాల్టీ స్ట్రోక్‌ను అద్భుతంగా అడ్డుకొని జట్టుకు బంగారు పతకాన్ని అందించడంతో పాటు... 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌ ఖరారు చేసింది. సుదీర్ఘ కెరీర్‌లో 321 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి రికార్డు సృష్టించిన సవిత... 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు నాలుగో స్థానంలో నిలవడంలోనూ కీలకపాత్ర పోషించింది. ఆమె సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ‘అర్జున’తో పాటు ‘పద్మశ్రీ’ అవార్డులు అందించింది.

బృంద స్ఫూర్తితో ముందుకు
వ్యక్తిగత విభాగాలతో పాటు... ఆసియా క్రీడల టీమ్‌ ఈవెంట్‌లలోనూ మన అమ్మాయిలు అద్భుత ప్రదర్శన కనబర్చారు. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన క్రికెట్, కబడ్డీ, హాకీలో పసిడి పతకాలతో సత్తాచాటారు. కబడ్డీలో డిఫెండింగ్‌ చాంపియన్ గా బరిలోకి దిగిన పుష్ప రాణా సారథ్యంలోని భారత మహిళల జట్టు... తిరుగులేని ప్రదర్శన కనబర్చింది. సోనాలి, నికిత, పూజ, రాజ్‌ రాణి, సంజూ దేవి, తీరు, మనీషా, భావన, పింకీ, రితూ, జ్యోతి ఠాకూర్‌తో కూడిన భారత జట్టు ఫైనల్‌ తప్ప మిగిలిన అన్నీ మ్యాచ్‌ల్లో ఏకపక్ష విజయాలు సాధించి... కబడ్డీలో మన ఆధిపత్యాన్ని చాటింది. 2010 ఆసియా క్రీడల్లో మహిళల కబడ్డీని ప్రవేశపెట్టగా... అప్పటి నుంచి భారత్‌కు ఇది నాలుగో స్వర్ణం కావడం విశేషం. మరో బృంద క్రీడ హాకీలో మన అమ్మాయిలు 44 ఏళ్ల తర్వాత పసిడి పతకం గెలవడంతో పాటు ఒలింపిక్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకోగా... ఆసియా క్రికెట్‌లో మనకు తిరుగులేదని హర్మన్ ప్రీత్‌ కౌర్‌ బందం నిరూపించింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ బ్యాట్‌తో విజృంభించడంతో భారత్‌ అలవోకగా టైటిల్‌ నిలబెట్టుకోగలిగింది. తాజా ఏషియన్  గేమ్స్‌లో భారత్‌ ఖాతాలో చేరిన తొలి పసిడి పతకం ఇదే కావడం విశేషం. ఇక మహిళల 4్ఠ400 మీటర్ల పరుగులో కిరణ్‌ పహల్, ఎంఆర్‌ పూవమ్మ, ప్రాచీ చౌధరీ, విత్య రామ్‌రాజ్‌తో కూడిన భారత జట్టు 3 నిమిషాల 29.69 సెకన్లలో లక్ష్యాన్ని చేరి బంగారు పతకం చిజిక్కించుకుంది. మూడు అంచెలు ముగిసే సరికి వెనుకబడి ఉన్న మన జట్టును విత్య అనూహ్య విజయం కట్టబెట్టింది. చివరి అంచెలో మెరుపు వేగంతో దూసుకెళ్లిన విత్య జట్టును అగ్రస్థానంలో నిలిపింది. ఇక మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో విత్య 54.75 సెకన్లలో పూర్తి చేసి... 42 ఏళ్ల క్రితం 1984 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో పరుగుల  రాణి పీటీ ఉష నెలకొల్పిన రికార్డు (55.42 సెకన్లు) ను బద్దలు కొట్టడం విశేషం.

తెలంగాణ తల్వార్‌
జట్టు క్రీడ కంటే వ్యక్తిగత ఈవెంట్‌లలో రాణించడమే సులభమని తండ్రి చెప్పిన మాటతో ఆర్చరీ వైపు అడుగులు వేసిన తెలంగాణ యువతరంగం... తానిపర్తి చికిత ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలతో అదరగొట్టింది. విలువిద్య సాధనకు సరైన వసతులు లేకపోవడంతో కెరీర్‌ ఆరంభంలో గడ్డివామును లక్ష్యంగా చేసుకొని బాణాలు సంధించిన చికిత ఇప్పుడు యావత్‌ దేశాన్ని గర్వపడేలా చేసింది. మహిళల కాంపౌండ్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ జ్యోతి సురేఖ, ప్రీతిక ప్రదీప్‌తో కలిసి బంగారు పతకం సొంతం చేసుకున్న చికిత... కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో సాహిల్‌ జాధవ్‌తో కలిసి స్వర్ణం నెగ్గింది. ఎన్ని అవరోధాలు ఎదురైనా సహజ ప్రతిభను అడ్డుకోలేవని నిరూపించిన చికిత 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌ సైతం ఖాయం చేసింది. అంతర్జాతీయ ఆర్చరీ పోటీల్లో కొరియా ప్లేయర్లను దాటి ముందుకు సాగడం దాదాపు అసాధ్యంలా మారిన తరుణంలో... చికిత కొరియా అడ్డుగోడను అలవోకగా ఛేదించడం విశేషం. మున్ముందు కూడా ఇదే జోరు కొనసాగిస్తే... పెద్దపల్లి అమ్మాయి అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించడం ఖాయమే. విజయవాడకు చెందిన వెన్నం జ్యోతిసురేఖ దశాబ్దన్నర కాలంగా భారత మహిళల కాంపౌండ్‌ ఆర్చరీకి పర్యాయపదంగా నిలుస్తూ వస్తోంది. మరే భారత ఆర్చర్‌కు సాధ్యంకాని రీతిలో ఇప్పటి వరకు 90కి పైగా అంతర్జాతీయ పతకాలు సాధించిన జ్యోతి సురేఖ... 2028 ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా సాధన సాగిస్తోంది.

సరికొత్త సంచలనం దీపికా సెహ్రావత్‌
భారత హాకీలో ఇటీవల బాగా వినిపిస్తున్న పేరు దీపికా సె్రçహావత్‌. ఫార్వర్డ్‌ ప్లేయర్‌గా, డ్రాగ్‌ ఫ్లిక్‌ స్పెషలిస్ట్‌గా ఆమె దూకుడు... జట్టుకు అదనపు బలాన్ని చేకూరుస్తోంది. తాజా ఆసియా క్రీడల్లో ఉజ్బెకిస్తాన్ పై 8 గోల్స్‌తో రికార్డు సష్టించిన దీపిక... వారం తిరగకముందే థాయ్‌లాండ్‌పై 9 గోల్స్‌తో తన పేరిటే ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. మొత్తంగా ఏషియన్  గేమ్స్‌లో 21 గోల్స్‌తో అత్యధిక గోల్‌ స్కోరర్‌గా నిలిచింది. జట్టుకు పెనాల్టీ కార్నర్‌ అవకాశం వస్తే చాలు గోల్‌ ఖాతాలో పడినట్లే అనేంతలా నమ్మకాన్ని సాధించిన దీపిక చిన్నతనంలో రెజ్లర్‌ కావాలనుకుంది. హర్యానాలోని భైంసరూ ఖుర్ద్‌ రెజ్లర్లకు పెట్టింది పేరు కాగా... అందరి లాగా తను కూడా మల్లయుద్ధంలో పట్టు సాధించాలనుకుంది. కానీ హాకీ ఆమెను బాగా ఆకర్శించగా... అందులోనే అంచెలంచెలుగా ఎదుగుతూ... గతేడాది ‘అప్‌కమింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు దక్కించుకుంది. భారత జట్టు ఆసియా క్రీడల్లో రెండో స్వర్ణం సాధించడంలో కీలకంగా వ్యవహరించిన దీపిక... 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లోనూ అదే జోరు కనబరిస్తే భారత జట్టు పతకం దక్కడం ఖాయమే.

కుంకుమ్‌ గురి అదుర్స్‌...
మహారాష్ట్రలోని అమరావతికి చెందిన కుంకుమ్‌ అనిల్‌ మొహొద్‌ కొత్త చరిత్ర సష్టించింది. ఆసియా క్రీడల్లో మహిళల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారత ఆర్చర్‌గా రికార్డు నెలకొల్పింది. ఫైనల్లో దక్షిణ కొరియా ఆర్చర్‌పై ‘షూటాఫ్‌’లో విజయం సాధించింది. క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ ను, సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ షిప్‌ రజత పతక విజేతను ఓడించి... తన గెలుపు గాలివాటం కాదని నిరూపించింది. చదువులోనూ చురుకుగా ఉండే 17 ఏళ్ల కుంకుమ్‌ ఏ పరీక్ష రాసినా 90 శాతం మార్కుల పైనే సాధించడం పరిపాటి. తొమ్మిదేళ్ల వయసులో ఆర్చరీలో అడుగుపెట్టిన ఈ టీనేజర్‌ చూస్తుండగానే ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు దేశానికి ఒలింపిక్‌ బెర్త్‌ అందించింది. పండగలు పబ్బాలకే కాక... సామాజిక మాధ్యమాలకు సైతం దూరంగా ఉండే కుంకుమ్‌ సంవత్సరంలో 365 రోజులు ప్రాక్టీస్‌ చేయడానికే ప్రాధాన్యతనిస్తుంది. తాజా ఏషియన్  గేమ్స్‌లో మూడు పతకాలతో మెరిసిన కుంకుమ్‌... భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో పసిడి పతకం సాధించడమే తన అత్యున్నత లక్ష్యమని స్పష్టం చేసింది.

ఉత్తుంగ తరంగంలా...
మనదేశంలో పెద్దగా ఆదరణ లేని గోల్ఫ్‌లో ప్రణవి శరత్‌ ఉర్స్‌ సంచలన ప్రదర్శన నమోదు చేసింది. ఆసియా క్రీడల్లో మేటి ప్లేయర్లను వెనక్కి నెడుతూ... మహిళల వ్యక్తిగత విభాగంలో పసిడి నెగ్గిన తొలి భారతీయ గోల్ఫర్‌గా చరిత్ర çసృష్టించింది. సింగపూర్, చైనా గోల్ఫర్లను దాటి మెరుగైన ప్రదర్శన కనబర్చిన మైసూరుకు చెందిన ప్రణవి భవిష్యత్తుపై భరోసా పెంచుతోంది. కేవలం వీళ్లే కాకుండా రజత పతకాలు నెగ్గిన వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను, షూటర్లు ఇషా సింగ్, ఇలవేనిల్‌ వలారివన్ , లాంగ్‌ జంపర్‌ అన్సీ సోజన్ , అథ్లెట్‌ పాయల్‌ చౌధరీ ఇలా పలువురు మహిళలు ఆసియా క్రీడల్లో మెరుగైన ఫలితాలు సాధించారు. కుటుంబ ప్రోత్సాహానికి ప్రభుత్వ సహకారం తోడైతే అద్భుతాలు సాధించగలమని నిరూపిస్తున్నారు.

తిరుగులేని నీరూ ధండా
కదిలే లక్ష్యాన్ని ఛేదించడంలో ఉండే ఆనందాన్ని ఆస్వాదించడం అలవాటుగా మార్చుకున్న నీరూ ధండా... ఆసియా క్రీడల మహిళల ట్రాప్‌ షూటింగ్‌లో పసిడి పతకంతో సత్తాచాటింది. హర్యానాలోని జింద్‌లో పుట్టి పెరిగిన నీరూ... షూటింగ్‌ శిక్షణ కోసం మధ్యప్రదేశ్‌కు మారింది. భారత సైన్యంలో నాయబ్‌ సుబేదార్‌ గా సేవలందిస్తూనే... తనకిష్టమైన షూటింగ్‌ను కొనసాగిస్తున్న నీరూ... తాజా ఏషియన్  గేమ్స్‌లో మూడు పతకాలతో మెరిసింది. ఆసియా క్రీడల చరిత్రలో మహిళల వ్యక్తిగత ట్రాప్‌ ఈవెంట్‌లో పసిడి గెలిచిన తొలి భారత షూటర్‌గా రికార్డుల నెలకొల్పిన నీరూ... హైదరాబాదీ షూటర్‌ కైనన్  చెనాయ్‌తో కలిసి మిక్స్‌డ్‌ ఈవెంట్‌లోనూ బంగారు కాంతులు విరజిమ్మింది. ఆమె అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా... ఆసియా క్రీడల ముగింపు వేడుకల్లో త్రివర్ణ పతాకధారిగా వ్యవహరించే అవకాశం వరించింది. ఈ ఏడాది ఇటలీలో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షాట్‌గన్  ప్రపంచకప్‌లో వ్యక్తిగత స్వర్ణం సాధించిన తొలి భారత షూటర్‌గా రికార్డు సృష్టించిన నీరూ... భవిష్యత్తులో దేశానికి మరిన్ని పతకాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో కమల్‌జీత్‌తో కలిసి సురుచి కూడా దేశానికి పసిడి పతకం అందించింది.

లవ్లీనా గోల్డెన్  పంచ్‌...
2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన లవ్లీనా బొర్గోహైన్‌ తాజా ఆసియా క్రీడల మహిళల 75 కేజీల విభాగంలో పసిడి పతకంతో మెరిసింది. ఏషియన్  గేమ్స్‌లో ఆమెకిది రెండో మెడల్‌. తద్వారా దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ తర్వాత ఆసియా క్రీడల్లో రెండు పతకాలు సాధించిన భారత బాక్సర్‌గా లవ్లీనా రికార్డుల్లోకెక్కింది. అస్సాంలోని గోలాఘాట్‌కు చెందిన 29 ఏళ్ల లవ్లీనా... చిన్నప్పుడు తన అక్కను చూసి మార్షల్‌ ఆర్ట్స్‌లో రాణించాలని భావించింది. ఆ తర్వాత బాక్సింగ్‌కు మారిన ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ స్థాయికి చేరింది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం నెగ్గడం ద్వారా మేరీకోమ్‌ తర్వాత విశ్వక్రీడల్లో పతకం గెలిచిన తొలి భారత మహిళా బాక్సర్‌గా నిలిచిన లవ్లీనా 2023 ప్రపంచ చాంపియన్ షిప్‌లో స్వర్ణం ఖాతాలో వేసుకుంది. రింగ్‌లో తన ఎత్తును వినియోగించుకుంటూ ప్రత్యర్థులపై పంచ్‌ల వర్షం కురిపించే లవ్లీనా... ఈశాన్య రాష్ట్రాల్లో క్రీడాభివృద్ధికి విశేష కృషి  చేస్తోంది. గువాహటిలో ఇటీవల బాక్సింగ్‌ అకాడమీ ప్రారంభించిన లవ్లీనా... అస్సాం పోలీస్‌ విభాగంలో డీఎస్పీగా సేవలు అందిస్తోంది. మహిళల 65 కేజీల విభాగంలో స్వర్ణం నెగ్గిన పర్వీన్  హూడా సైతం యువతరానికి ఆదర్శంగా నిలుస్తోంది.

– ఇంతియాజ్‌ మొహమ్మద్‌
సాక్షి స్పోర్ట్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement